Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో ఇప్పటికీ అనేక రూపాల్లో మూఢ నమ్మకాలు ప్రబలుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. వీటి తీవ్రత రోజు రోజుకు అధికమవుతున్నది. ఇటీవల జగిత్యాల పట్టణంలోని టిఆర్ నగర్లో క్షూద్ర పూజలు, మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు, రాంబాబు, రమేష్ అనే ముగ్గురు వ్యక్తులను కుల సంఘ సభ్యులే దారుణంగా హత్య చేసిన ఘటన, నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, విరాట్ నగర్ ప్రాంతంలోని మహంకాళి విగ్రహం వద్ద నరబలి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మూఢత్వంతో కన్న తల్లిదండ్రులే తమ ఇద్దరు కూతుళ్లను స్వహస్తాలతో చంపేసిన సంఘటన అందరినీ కలిచివేసింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా బల్వంతపూర్ గ్రామంలో చేతబడి చేయించాడనీ అనుమానంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని బంధువులే సజీవ దహనం చేయడం సంచలనం రేపింది. మూఢత్వానికి పరాకాష్టగా నిలిచే ఈ ఉదంతాలు తెలుగు రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో అనేక రూపాలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూ, ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. మనుషుల్లోని నమ్మకాలు మూడనమ్మకాలుగా మారితే ఎంత అనర్థం జరుగుతుందో అనడానికి ఈ ఘటనలే సజీవ సాక్ష్యం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ కాలంలో భూతశక్తిని నమ్మే జనాలు పెరిగిపోతున్నారు. బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, మంత్రాలు వంటి అంధవిశ్వాసాలు నమ్ముతూ క్షుద్రపూజలు జరపడమే దీనికి నిదర్శనం. నరబలులకు కూడా వెనకాడడం లేదు. కరోనా సమయంలో వీటి తీవ్రత మరింత పెరిగింది. మెజారిటీ గ్రామీణ, పట్టణ పేద కుటుంబాలతో పాటు విద్యావంతులు సైతం వీటి బారిన పడి మోసపోతున్నారు. భారతదేశంలో రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా ప్రబలుతున్న అనేక మూఢ విశ్వాసాలు నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వాళ్లలోనే మరింత ఎక్కువగా ఉన్నాయని క్షేత్రస్థాయి నిజాలు పేర్కొంటున్నాయి. మరోవైపు కొందరు వ్యక్తులు తమ ఉనికిని చాటుకునే క్రమంలో తమకు అతీత శక్తులున్నాయని ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తద్వారా కక్షలు పెరిగిపోయి ఘోరమైన ఘాతుకాలకు బలవుతున్నారు. దీంతో సమాజంలో అసాంఘిక చర్యలు పెచ్చరిల్లి శాంతిభద్రతల సమస్యగా మారుతున్నది.
ప్రస్తుత సమాజంలో సైన్స్ ఫలాలను అనుభవిస్తూనే మూఢనమ్మకాలను విశ్వసించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ విశ్వాసాలకు ప్రధాన కారణాలు పరిశీలిస్తే... విద్యావంతులలో శాస్త్రీయ వైఖరి లోపించడం, మితిమీరిన మత విశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు, ప్రభుత్వాల పరిపాలనా విధానాలు, పద్ధతులు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మూఢత్వం దిశగా ప్రేరేపిస్తున్నాయి. దీంతో రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకోనేవారి సంఖ్య పెరిగింది. తాయత్తు మెడకు చుట్టుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని, మంత్రించిన అష్టలక్ష్మి యంత్రాలతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ అమాయక ప్రజలను దోచుకోవడానికి, మోసగించడానికి, ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచి పోషించడానికి కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ప్రసారం చేసే టీవీలు, సెలబ్రిటీల పైన, వస్తువులను అమ్మేవారి పైన మూఢనమ్మకాలు నిర్మూలన చట్టం కింద కేసు నమోదు చేయమని మహారాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించడం గొప్ప ముందడుగు. నేడు పేద మధ్య తరగతి జీవితాల్లో పెరుగుతున్న ఆభద్రతా భావం కూడా నకిలీ బాబాలు, స్వామిజీలు, మాంత్రికుల వలలో పడేటట్టు చేస్తూ అజ్ఞానం వైపు నెడుతున్నది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మూఢ విశ్వాసాల తీవ్రత పెరుగుతున్న కొద్దీ మంత్రగాళ్ల నెపంతో అనుమానితులను వేధించడం, క్రూరంగా చంపడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తి గత కక్ష్యలను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇవి శాంతి భద్రతలకు, ప్రజారోగ్యానికి పెను సవాలుగా నిలుస్తున్నాయి. విద్యాసంస్థలు సైతం మూఢత్వంలోకి నెట్టబడుతున్నాయి. ఇటీవల బెనారస్ హిందూ యూనివర్సిటీలో భూత వైద్యం సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టడమే దీనికి నిదర్శనం. ఈ క్రమంలో ఐ.ఐ.టి మండి ప్రొఫెసర్ దయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. కేంద్ర విద్యాశాఖ కూడా ఇలాంటి అశాస్త్రీయ పోకడలపై స్పందించకపోవడం గమనార్హం.
నేడు సామాజిక రుగ్మతగా పరిగణించబడుతున్న అంధ విశ్వాసాలను అరికట్టకపోతే దేశాభివృద్ధికి ఇవి అవరోధంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వాటి నిర్మూలనకు అవగాహనతోపాటు విధాన పరమైన చర్యలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. పౌరులు శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక ఆలోచనలను పెంపొందించుకొని జ్ఞానాభివృద్ధికి కృషి చేయాలని - భారత రాజ్యాంగం, అధికరణం-51ఏ(హెచ్) పేర్కొంటుంది. దీనికై ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధితో పాటు వైజ్ఞానిక దృక్పథానికి పెద్ద పీట వేసే కార్యక్రమాలను చేపట్టాలి. ప్రస్తుత సమాజం సైన్స్ ఫలాలను అనుభవిస్తూనే సమాజంలో సైన్సు దారి సైన్స్ దే మూఢనమ్మకాల దారి మూఢనమ్మకాలదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. వీటి మధ్య అసలు పొంతన ఉండటం లేదు. ఇలాంటి చదువులు చదివిన విద్యార్థులు భౌతిక వాస్తవికతను వదిలి మూఢనమ్మకాల బారిన పడుతున్నారు. కావున పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించి, వైజ్ఞానిక ఆలోచనలకు పునాది వేసే కరికులంను చేర్చాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, హేతువాదులు, యువత, మీడియా సమాజంలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలి. దేశంలోని ప్రజా ప్రతినిధుల పరిపాలన విధానాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఈ చర్యలు మూఢత్వానికి చోటివ్వని సమర్థ మానవ వనరులను నిర్మిస్తూ, వైజ్ఞానిక భారతానికి పునాది వేస్తాయి.
- ఎస్. రమేష్, 7989579428