Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నల్ల డబ్బు, బ్లాక్ మనీ' అనే మాటలు తరుచుగానే వింటూ వుంటాం. అలాగే, 'దొంగ డబ్బు' అనే మాటని కూడా!
'నల్ల డబ్బు' వుందంటే, 'తెల్ల డబ్బు' కూడా వుండాలి. అసలు మొదట్లో, తెల్ల డబ్బు మాత్రమే వుంది. తర్వాత కాలంలోనే నల్ల డబ్బు కూడా మొదలయింది. 'దొంగ డబ్బు' అంటే, నకిలీ డబ్బు. ఇది వుందంటే, 'మంచి డబ్బు' కూడా వుందని అర్ధమే!
అసలు, 'డబ్బు' అంటే, 'రూపాయి నోట్లు' అని తెలిసినదే. ఆ కాయితం ముక్కలు ఇస్తే, షాపుల్లో నించి, ఏ సరుకుని అయినా తీసుకోవచ్చు! కాయితం ముక్కలకే పెద్ద పెద్ద సామాన్లు కూడా ఎలా వచ్చేస్తాయి? ఈ ప్రశ్న ఎప్పుడైనా మనకి వస్తుందా? ఎప్పుడూ రాదు. ప్రశ్నే లేదంటే, 'జవాబు' అంతా తెలిసి పోయి వుండడం వల్లనా? కాదు. జవాబులు తెలియని వాటికే ప్రశ్నలు రావు! ప్రశ్నలూ, జవాబులూ లేని విషయాలు, ''అవి అంతే! అవి సహజం!'' అన్నట్టు వుండి పోతాయి.
'ఆర్ధిక శాస్త్రం' అనేది తెలిసిన వాళ్ళకి, 'డబ్బు' గురించి అన్ని విషయాలూ తెలిసి వుంటాయా? ఇది, ఒక సందేహం!
'తెల్ల డబ్బు' ఎవరిది? 'నల్ల డబ్బు' ఎవరిది?
'జీతాలు' తీసుకుంటూ యజమానుల దగ్గిర శ్రమలు చేసే వారిని 'కార్మికులు' అంటాం. వీరే శ్రామికులు! వీరిలో, మేధో శ్రమలు చేసే వారు పెద్ద జీతాల తోటీ; శారీరక శ్రమలు చేసే వారు చిన్న జీతాల తోటీ వుంటారు.
మేధో శ్రమలు చెయ్యడం అయినా, శరీరం తోటే జరగాలి. కాకపోతే, భూమిని దున్నడం, గోడలు కట్టడం - వంటి పనులకు శరీరాలు అతలాకుతలం అవుతాయి. చదువులు చెప్పడం, రాతలు రాయడం - లాంటి పనులకు శరీరాలు అంత అతలాకుతలం కానక్కర లేదు. పనులు చేసేటప్పుడు, ఆ శ్రమల్లో, చిన్నా పెద్దా తేడాలు వుంటాయి.
ఈ శ్రమల విలువల గురించి తెలుసుకుంటేనే, 'డబ్బు' గురించి స్పష్టంగా, వివరంగా, తెలుసుకోగలుగుతాం.
అందరమూ బ్రతుకుతూ వున్న సమాజంలో, అందరి కళ్ళ ముందూ జరుగుతూ వున్న శ్రమలు ఏమిటి? యజమానులు గానూ, వారు చెప్పే శ్రమలు చేసే శ్రామికులు గానూ, మానవులు ఉంటారు. సమాజంలో జరిగే రక రకాల శ్రమలతో, మానవులు జీవించడానికి అత్యవసరం అయిన వస్తువులన్నీ తయారవుతూ ఉంటాయి.
ఆ వస్తువులన్నీ, యజమానులు అమ్ముకునే సరుకులే అవుతాయి. వాటికి యజమానులు, ధరలు నిర్ణయించేసి అమ్మించేస్తూ వుంటారు. అమ్మకాలు జరిగి, 'డబ్బు' వస్తుంది. ఆ డబ్బు లోనించే శ్రామికులకు యజమానులు జీతాలు ఇస్తారు. సరుకుల్ని అమ్మగా వచ్చిన డబ్బు లోనించి జీతాలు పోగా, ఇంకా మిగిలే డబ్బు సరుకుల యజమానులకే!
ఏ సరుకు తయారవడానికైనా, ఆ సరుకు కోసం అవసరమైన ముడి పదార్ధాలూ, పని ముట్లూ వంటి 'సాధనాలు' ఆ పని స్తలం లోకి వచ్చి వుండాలి. ఆ సాధనాలు, వేరే వేరే పని స్తలాల్లో తయారైతే, ఈ కొత్త సరుకు కోసం, ఈ యజమాని, కొంత డబ్బుని 'పెట్టుబడి'గా పెట్టి, ఆ సాధనాల్ని కొని, తన పని స్తలం లోకి తెప్పించి పెట్టిస్తాడు.
ఈ పని స్తలంలో కొత్త సరుకు తయారవుతుంది. తయారైన ఈ సరుకుకి కొంత 'మారకం విలువ' వుంటుంది. ఈ సరుకుని అమ్మి, డబ్బుని తీసుకున్నప్పుడు, ఈ సరుకుకి వున్న విలువ ప్రకారం, దానికి డబ్బు వస్తుంది.
అసలు, ఏ సరుకుకి అయినా, 'విలువ' ఎలా ఏర్పడుతుంది? ఆ సరుకు తయారీ కోసం కొన్ని ఉత్పత్తి సాధనాలు ఖర్చవుతాయి కదా? ఆ సాధనాలన్నీ కొత్త సరుకు కన్నా ముందే తయారై వుండాలి కాబట్టి, వాటిని చేసిన శ్రమ అంతా 'పాత శ్రమ'. ఆ సాధనాల తోటే, కొత్త సరుకు తయారవుతుంది. కొత్త సరుకు కోసం జరిగే శ్రమ, 'కొత్త శ్రమ'. పాతా - కొత్తా శ్రమల విలువలు రెండూ కలిసి, సరుకుకి విలువ అవుతుంది.
'విలువ' అంటే, కొంత శ్రమ పరిమాణం. సరుకుకీ, డబ్బుకీ, మారకం జరిగితే, ఇటు శ్రమకీ, అటు శ్రమకీ, మారకం జరిగినట్టు!
డబ్బుగా వున్న కొంత 'బంగారం' కూడా, పాతా కొత్తా శ్రమలు జరిగి తయారయ్యే సరుకే. ఒక సరుకుని అమ్మి, డబ్బు తీసుకోవడం అంటే, కొంత శ్రమని ఇచ్చి, కొంత శ్రమని తీసుకోవడమే!
'మారకం విలువ' అనేది, ఏ భౌతిక పదార్ధమూ కాదు. మన కళ్ళకు సరుకు కనపడినట్టుగా, దాని విలువ కనపడదు. అంతా, పాతా కొత్తా శ్రమ కాలాల లెక్కల్ని బట్టే, సరుకు విలువని తెలుసు కోవలిసిందే. ఆ విలువని బట్టి, 'ధర' నిర్ణయం జరిగి, దానికి డబ్బు వస్తుంది. ఆ డబ్బు, కాయితం నోట్లుగా కనపడుతోన్నా, నిజమైన డబ్బుగా వుండేది, కొంత బంగారమే. ఆ కాయితం డబ్బు నోట్లతో, బంగారాన్ని అమ్మే షాపు లోకి వెళ్ళి బంగారాన్ని కొంటే, ఆ విలువకి తగ్గ బంగారం వొస్తుంది!
సరుకూ, డబ్బూ, కార్మికుడికి జీతమూ - అనే ఈ మొత్తం వ్యవహారంలో, 2 మారకాలు జరగడం అవుతుంది. (1) అమ్మిన సరుకుకీ, దాన్ని కొన్న డబ్బుకీ (బంగారానికీ) జరిగినది ఒక మారకం. (2) చొక్కా అనే సరుకు కోసం, కొంత కొత్త శ్రమ చేసిన శ్రామికుడి 'శ్రమ శక్తి'కీ, ఆ శ్రామికుడికి యజమాని ఇచ్చిన 'జీతానికీ', జరిగినది ఇంకో మారకం. ఈ 2 మారకాలలో, సరుకుకీ, డబ్బుకీ జరిగే మొదటి మారకం 'సమాన విలువల' మధ్య జరిగే మారకమే. 2వ మారకం, సమాన విలువల మధ్య జరిగే మారకం అవదు.
దీని కోసం ఒక ఉదాహరణ చూడాలి. ఒక సరుకు కోసం సాధనాల పాత శ్రమ విలువని 80 అనీ, వాటి మీద జరిగిన కొత్త శ్రమ విలువని 40 అనీ - అనుకుందాం. ఈ 2 విలువలూ కలిసి, 80 + 40 = 120. ఈ సరుకుని అమ్మితే, 120 డబ్బు వస్తుంది. సాధనాల 80 అయితే, సరుకు యజమానికే వెళ్ళాలి. అది, ఆ యజమాని మొదట పెట్టిన పెట్టుబడి. అది, తర్వాత జరగవలిసిన రెండో సరుకు తయారీ కోసం అవసరమవుతుంది. అందులో నించి యజమాని తినేదేమీ ఉండదు. సరుకు విలువగా వచ్చిన 120 లోనించి, కొత్త శ్రమ విలువనే చూడాలి. ఇది 40. ఇది, కొత్త శ్రమ చేసిన శ్రామికుడిది! అతడికి, ఈ 40 అంతా వెళ్ళ వలిసిందే.
ఈ సరుకు తయారీలో, యజమాని కూడా ఏదైనా శ్రమ చేసి వుంటే, కొత్త శ్రమ విలువ అయిన 40 లోనించి, యజమానికి కూడా కొంత జీతం వెళ్ళాలి, యజమాని, ఆ శ్రమ చేసి వుంటేనే!
కానీ, సాధారణంగా పెద్ద పెట్టుబడుల్ని పెట్టే యజమానులెవ్వరూ, సరుకుల తయారీల కోసం పని స్తలాల్లో, శ్రామికుల సరసన నిలబడి శ్రమ చెయ్యరు. కాబట్టి, సరుకుని అమ్మగా వచ్చే డబ్బులో నించి, యజమానికి వెళ్ళవలిసిన భాగం ఏదీ వుండదు. కాబట్టి, కొత్త శ్రమ విలువ అయిన 40 డబ్బు కొత్త శ్రమ చేసిన శ్రామికుడిదే అవుతుంది. కానీ, యజమాని దగ్గిర అలా జరగదు! అలా జరిగితే, యజమానికి అందవలిసిన వడ్డీ, లాభాలేవీ వుండవు.
ఇంత వరకూ తెలిసిన తర్వాతే, తెల్ల డబ్బూ, నల్ల డబ్బూ, దొంగ డబ్బూ - వంటి వాటిని అర్ధం చేసుకోగలం. అది తేలికే.
'తెల్ల డబ్బు' అంటే?
ఈ డబ్బు ఎవరి దగ్గిర వుంటుంది? ఎంత వుంటుంది? వారికి అది ఎందుకు వస్తుంది? దాని మీద కట్ట వలిసిన పన్నుల్ని ఆ వ్యక్తులు కట్టేస్తారా? ఈ విషయాలన్నీ తెలిస్తే, తెల్ల డబ్బు తెలుస్తుంది.
ఈ డబ్బు, 'జీతాలు'గా వచ్చే వారికి సంబంధించిందే. జీతాలు ఎంతగా వుంటే, ఈ డబ్బు అంతగా వుంటుంది. ప్రభుత్వ చట్టాల ప్రకారం, ఈ జీతాల డబ్బు ఫలానా హద్దుని దాటి ఇంకా కొంత ఎక్కువ గానో, తక్కువ గానో వుంటే, పన్నులు కట్టవలిసిన శాతాలు కొంత ఇటో అటో మారతాయి. ప్రభుత్వ సంస్తల్లో పని చేసే శ్రామికులు కట్ట వలిసిన పన్నుల్ని జీతాలు ఇచ్చే అధికారులే ఆ జీతాల్లోంచి ఆ పన్నుల్ని మినహాయించిన తర్వాతే, ఆ జీతాలు ఇస్తారు.
ఇది ప్రభుత్వ సంస్థలో మాత్రమే కాదు, ప్రైవేటు సంస్థల్లో కూడా జరుగుతుంది. 'ఆదాయాన్ని బట్టి పన్నులు' (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) అంటారు దీన్ని.
ప్రైవేటు సంస్తల్లో పని చేసే ఉద్యోగులందరూ కూడా 'శ్రామికుల వర్గం లోకే' వస్తారు.
సమాజంలో, ఈ జీతాలన్నిటి లెక్కలూ, వివరంగా తెలుస్తూనే వుంటాయి.
కేవలం శారీరక శ్రమల జీతాల వారికి పన్నులు కట్టే సమస్య ఉండదు. అయినా, వీరు వైద్యం కోసం, పిల్లల చదువుల కోసం, రవాణాల కోసం, పెట్టే ఖర్చులన్నీ స్పష్టంగా తెలుస్తూనే వుంటాయి.
జీతాలన్నిటినీ కలిపితే, మొత్తం ఎంతో, ఆ జీతాలు కట్టే పన్నులు ఎంతో, ఈ విషయాలని లెక్క కట్టడం అతి తేలిక! అందుకే ఇది, ఏ మరకలూ ఉండని డబ్బు లెక్కలు దొరికే డబ్బు! ఈ జీతాల డబ్బే, తమ ఆదాయాలుగా వుండే శ్రామికుల్ని, 'కార్మికులు' అంటాం.
కార్మిక వర్గపు ఆదాయాలుగా వుండే డబ్బు, ప్రభుత్వం ద్వారా అచ్చయిన కాయితం నోట్ల డబ్బే. ఇది, శ్రమలు చేస్తే వచ్చే డబ్బే.
పన్నులు కట్ట వలిసిన సమస్య, పెద్ద జీతాల వారికే వుండి, చిన్న జీతాల వారికి లేక పోయినా, ఈ వర్గపు డబ్బు లెక్కలన్నీ దాపరికాలు లేకుండా తెలిసేవే!
ఈ జీతాల వర్గం విషయంలో ప్రధానంగా చెప్పగలిగే విషయం, 'ఈ జీతాల డబ్బే, సమాజంలో వుండే తెల్ల డబ్బు' - అనే!
(తరువాయి వచ్చేవారం)