Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణకు సింగరేణి బొగ్గు గనులు తరగని సిరులు. సింగరేణి బొగ్గు అనేక పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగపడుతున్నది. తద్వారా జాతీయ ఉత్పాదకతకు ఎనలేని దోహదం చేస్తున్నది. ఈ సింగరేణిని బొగ్గు గనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంయుక్తంగా 51:49 నిష్పత్తిలో నడుపబడుతున్నవి. ప్రాణహిత, గోదావరి నదుల వ్యాలీ ప్రాంతంలో 350 కిలోమీటర్ల వ్యాప్తంగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 8791 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని ఒక అంచనా. ప్రస్తుతం ఆరు జిల్లాలైన కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో 20 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు, 25 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు నడుస్తున్నవి.
నల్ల బంగారంగా పిలువబడే బొగ్గు ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి విరివిగా ఉపయోగపడుతున్నది. అందువల్లనే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా నిరాటంకంగా నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్నది అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా సిమెంట్, ఉక్కు పరిశ్రమలు, ఇతరత్రా అనేక పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి నుండే బొగ్గు సరఫరా జరుగుతున్నది. సింగరేణి గనులు తెలంగాణ యువతకు భవితకు బాతులాంటివి. సింగరేణి గనుల వలన అందులో పనిచేసే ఉద్యోగులకే కాక ఇతరత్రా స్థానికులకు ఎనలేని ఉపాధి అవకాశాలు కలుగుతున్నవి. హౌటల్స్, ఛారు దుకాణాలు, ఇస్త్రీ, సెలూన్లు ఒకదానిపై ఒకటి ఆధారపడి అనేకమందికి విస్తృతంగా ఉపాధి లభిస్తున్నది. ప్రయివేటు రవాణా వ్యవస్థ, కిరాణా, ఔషధ మందుల దుకాణాలు, సినిమా హాల్లు, ఇతర వ్యాపారస్తుల జీవన గమనానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సింగరేణి సంస్థ దోహదపడుతున్నది.
సింగరేణి సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం వల్ల లాభాలు పొందడం, కార్మికులకూ లాభాల వాటా పంచి పెట్టడంతో పాటు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కార్మికులకు, వారి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తుంది. వారి పిల్లల చదువుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు, ఉన్నతమైన చదువులకు స్కాలర్షిప్పులు అందిస్తున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ నడుస్తున్నందున అందులో పనిచేసే ఉద్యోగులకే కాక ప్రజలందరికి కూడా అనేక రకాల మేలు జరుగుతున్నది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణిపై డేగ కన్నువేసి ప్రయివేటు పరం చేయుటకు అంతా సిద్ధం చేస్తున్నది. దీని వలన ఒక్క తెలంగాణకే కాక దేశ మొత్తానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇటీవలనే జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 4 బ్లాకులు జెబిఆర్ఓసి-3, కేకే-6, శ్రవణ్ పల్లిఓసి, కోయగూడెం గనుల ప్రయివేటు వేలానికి వ్యతిరేకంగా సింగరేణిలో సమ్మె చేసింది. సింగరేణి ప్రయివేటికరించడమేంటే అపారమైన ప్రజా సంపదను ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టడమే. ఉద్యోగుల హక్కులను బలితీసుకోవడమే. వారి ఉద్యోగ భద్రతకు చెల్లుచీటి రాయడమే. సింగరేణిని ప్రయివేటుపరం చేయకుండా నిరోధించడానికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఏకతాటిపై కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. తెలంగాణ యావత్తు ఒక్కటై కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి.
- దండంరాజు రాంచందర్రావు
సెల్:9849592958