Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోని ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాల వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. నేడు లక్షల కోట్ల ప్రజాధనం (ప్రజల కష్టార్జితం) పెద్దఎత్తున చేతులుమారు తోంది. 75సంవత్సరాల కాలంలో ఎన్నడూలేని విధంగా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి పెట్రోలియం, జాతీయ రహదారులు, టెలికాం, బొగ్గుగనులు, రైల్వేలు, ఎయిర్పోర్టులు, ఇన్సూరెన్స్, విద్యుత్, బ్యాంకులు ఇలా అనేక ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మివేయటానికీ, లీజు పేరుతో అప్పనంగా అప్పగించటానికి బహిరంగంగానే ప్రయత్నిస్తున్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న సౌకర్యాలను, ఉద్యోగ, కార్మిక చట్టాలన్నింటినీ, కార్పొరేట్ అవినీతి పరులు కోరుకున్నట్టుగా ప్రభుత్వం మార్పుచేస్తున్నది.
దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు కృశించి పోతున్నాయి. గత రెండు సంవత్సరాలలో ఐదు లక్షల పరిశ్రమలు మూసివేయబడినట్లుగా పార్లమెంటులో స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. దేశ ఆర్థికరంగాన్ని బలహీనపరచి బహుళజాతి సంస్థలకు ప్రభుత్వం దోచిపెడుతున్నది. వారికి ఊడిగం చేస్తున్నది. నాటి మోడరన్ ఫుడ్స్ కంపెనీ నుంచి వరుసగా బాల్కో, నాల్కో, ఎయిర్ ఇండియా, ఆయిల్ కంపెనీలు, బొగ్గు బావులు మొదలుగాగల అన్నిరకాల ప్రజా సర్వీసులు అందచేసే సంస్థలన్నింటినీ అమ్మివేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కంకణం కట్టుకొని ఆత్మనిర్భర్ భారత్, జాతీయ నగదీకరణ పైప్లైన్ అనే ముద్దుపేర్లతో రంగం సిద్ధంచేసింది.
ఈ ప్రయివేటీకరణ విధానాలవలన లక్షలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారితే, సంభవించే సామాజిక సమస్యలకు, అశాంతికి ప్రభుత్వం వద్ద ఎలాంటి విరుగుడు విధానం లేదు. చివరకు, రక్షణ రంగంలో కూడా ప్రయివేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచే స్థాయికి ప్రభుత్వం దిగజారింది. అప్పటి డిజిన్వెస్ట్మెంటు కమిషన్ మాజీ ఛైర్మెన్ జి.వి. రామకృష్ణ గతంలో జరిగిన అమ్మకాలలో పారదర్శకతలేదని, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులకు వాస్తవ విలువ ఆధారంగా వెలకట్టటంలేదని, టెండర్లు వేయటంలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేవిధంగా బాహాటంగా ముందుకెళ్ళుతోంది. డిజిన్వెస్ట్మెంట్ పేరుకాకుండా, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే ముద్దుపేరుతో అన్ని ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు దోచిపెడు తున్నారు. కొన్ని లక్షల కోట్లు ఆస్తులుగల కేంద్ర ప్రభుత్వ సంస్థలను నగరీకరణ పేరుతో బహుళ జాతి సంస్థలకు ఉదారంగా, అప్పనంగా ధారాదత్తం చేస్తోంది. ఇంతకన్నా పెద్ద అవినీతి ఏముంటుంది.
మన ఆస్తినికాని, ఇంటినికాని ఎవరైనా వచ్చి వాస్తవ విలువ ఆధారంగా కాకుండా కొంటామంటే మనం ఊరుకుంటామా! ఊరుకోంకదా! కాని మనం దేశ ప్రజలంగా 75సంవత్సరాలుగా పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బుతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మివేస్తుంటే, చూస్తూ ఊరుకుందామా!
కేంద్ర ప్రభుత్వ నూతన ఆర్థిక, సరళీకరణ, పారిశ్రామిక విధానాలవలన పెట్టుబడి అంతా ఒకేచోట కేంద్రీకృతమవుతున్నది. ఈ రకమైన పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు, చట్టాలు ఉండరాదని కోరుకుంటారు. షరతులు విధిస్తూ వివిధ దేశాల మధ్య పెట్టుబడుల రాకపోకలకు ప్రభుత్వాలు అడ్డుచెప్పే హక్కు ఉండరాదని కోరుతుంటారు.
ఈ విధానంలో లాభాలే అంతిమ లక్ష్యం. తన లాభానికి అడ్డువస్తే, కన్నతల్లిని కూడా అంతం చేస్తుంది ఈ పెట్టుబడిదారీ విధానం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ప్రపంచీకరణ అనేది ఆర్థిక బానిసత్వానికి, వలసవాదానికి బ్లూ ప్రింట్ లాంటిది. బహుళజాతి సంస్థల ఆదాయం, కొన్ని దేశాల స్థూల జాతీయోత్పత్తి కన్నా ఎక్కువగా ఉంటుందంటే అతిశయోక్తికాదు. ప్రపంచంలో నాల్గింట ఒకవంతు సంపదను 87శాతం మంది ప్రజలు అనుభవిస్తుండగా, మిగిలిన సంపదనంతా కేవలం 13శాతం మంది మాత్రమే అనుభవిస్తున్నారు. దేశ ప్రజల సొమ్మును, వారి కష్టార్జితాన్ని కొద్దిమంది బడా పెట్టుబడిదారులకు దోచుకుంటున్నారు. ఇందుకు వీలుగా ప్రపంచీకరణ అన్ని ఆంక్షలను, నియంత్రణలు ఎత్తివేయాలని నిర్దేశిస్తుంది.
అందుకే కార్మికులు, ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను నాలుగు లేబర్ కోడ్సుగా మార్పుచేసి వారి హక్కులను కాలరాయడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. తమకు మరణ శాసనంలాంటి ఈ బిల్లును రద్దుచేయాలని కార్మికులు పోరాటం చేస్తున్నారు. కానీ, ''పబ్లిక్ సెక్టార్ సంస్థలు పుట్టిందే చావడానికి, కొన్ని ముందుచస్తాయి, కొన్ని తరువాత చస్తాయి.. చావు మాత్రం తప్పదు'' ప్రధానమంత్రి అంటున్నారు.
దానిననుసరించి ఆత్మనిర్భర్ భారత్ కింద 2021 ఫిబ్రవరిలో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిలో వ్యూహాత్మక రంగాలు, వ్యూహాత్మకంకాని రంగాలన్నింటిని ప్రయివేటైజేషన్కాని, ఇతర యూనిట్స్లో మెర్జర్గానీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు అనుబంధ సంస్థలుగానీ మార్పుచేయాలని స్పష్టంగా పేర్కొనటం జరిగింది. తిరిగి 2021 డిసెంబరు 13న రిలీజ్ చేసిన ఆదేశాలలో 45 సంస్థల షేర్లు ప్రకటించి, వీటన్నింటిని పై విధానం ప్రకారం వేగవంతంగా ప్రయివేటీకరణ చేసి ముగించాలని పేర్కొంది.
ఆ సంస్థలలో పనిచేసే ఉద్యోగులను, కార్మికులను స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి పంపివేయాలని సూచించింది. వీటన్నింటిని ఒక కాలపరిమితిలో పూర్తిచేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం చూస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ పట్ల ఎంత ఆతృతతో ఉందో అర్థమవుతుంది. అందుకే ప్రభుత్వరంగాన్ని సంస్థలను సంరక్షించడానికి, దేశ సమగ్రాభివృద్ధిని పెంపొందించడానికి వాటిని మరింత విస్తరించాలనే, కాపాడుకోవాలనే దీక్షతో దేశ కార్మికవర్గం పోరాటానికి సన్నద్ధమవు తున్నది. అన్నిరంగాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు వాటి పరిరక్షణ కోసం అనివార్యమైన పరిస్థితులలో మార్చిలో రెండు రోజులపాటు దేశవ్యాపిత సమ్మెకు దిగుతున్నారు.
మన దేశంలో ఒకవైపున అపారమైన ఆహార నిల్వలుండగా మరోవైపు ఆకలిచావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రాను రాను ఆర్థిక, సామాజిక బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నది. ప్రపంచీకరణవలన కార్పొరేట్ సంస్థలు వినియోగదారులను ఉత్పత్తి చేస్తున్నవి. అవినీతి విపరీతంగా పెరగటమే కాకుండా, రాజకీయ విలువలు దిగజారిపోయి, అవకాశవాదం అతిగా పెరిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో దేశ ప్రజలు ఐక్య ఉద్యమాలకు, సమరశీల పోరాటాలకు సిద్ధంకావాలి.
కేంద్ర ట్రేడ్ యూనియన్లు, ఆల్ ఇండియా ఫెడరేషన్లు, ఆసోసియేషన్లు, ఉమ్మడి వేదికగా ఏర్పడి సమావేశమై 2022 మార్చి 28-29 రెండు రోజుల దేశవ్యాపిత సమ్మె చేయాలని పిలుపునివ్వటం జరిగింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ దేశవ్యాపిత సమ్మెను విజయవంతం చేయడం మన కర్తవ్యం.
-ఎస్జెపి, సెల్:9133499320