Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(క్రితం సంచిక తరువాయి)
ఏ వ్యాపారీ, తన మిగులు డబ్బుని అంతా బ్యాంకుల్లో పెట్టడు! ఎక్కడెక్కడో దాస్తాడు. ఆఖరికి పాయిభానా దొడ్లలో, బంగారాలతో అక్కడ ఏర్పాట్లు చేయిస్తాడు!
ఆదాయం పన్ను ఉద్యోగులు ఒక్కోసారి వాటినీ పట్టుకుంటారు. కానీ లంచాలతో, అధికార పార్టీల సిఫార్సులతో, అవీ ఆగుతాయి.
'నల్ల డబ్బు' అంటే, ప్రభుత్వానికి లెక్కల్లో దొరకనిది - అంటే సరి పోతుంది.
పెట్టుబడిదారీ కంపెనీల గ్రూపులు, ప్రభుత్వాన్ని 'గొప్పగా' నడిపే హక్కుని ఎవరికి వారు సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ వుంటారు. ఒక ప్రయత్నం, అధికారంలో వున్న ప్రభుత్వాధికార్లకి లంచాలు గుప్పించి, వాళ్ళ ద్వారా ఏవేవో రహస్యాలు సేకరించడం! అసలు, రెగ్యులర్గా, ప్రభుత్వానికి (పోలీసూ, సైన్యమూ వంటి ప్రభుత్వ సంస్థలకూ, ప్రభుత్వపు ఇతర ఆఫీసులకూ) కావలిసిన సరుకుల తయారీల కోసం, (ఆఖరికి పోలీసుల బూట్లకి వేసుకునే లేసుల కోసం కూడా) ప్రభుత్వాధికారుల నుంచి కాంట్రాక్టులు సంపాదించాలి. దాని కోసం లంచాలు గుప్పించడం, ఎప్పుడూ సాగుతూనే వుంటుంది.
పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని 'పెట్టుబడిదారుల ఉమ్మడి వ్యవహారాలను చూసే కమిటి' అన్నాడు మార్క్సు! ఈ కమిటీ తన వర్గ ప్రయోజనాలు తను చూసుకుంటుంది.
ఇక, 'నల్ల డబ్బు' సంగతికి వెళ్దాం. ఏ పెట్టుబడిదారుడైనా తన ఆదాయానికి తప్పుడు లెక్కలు చూపించడం తేలిగ్గానే చేయిస్తాడు. అంటే, పన్నులు కట్టడాన్ని తక్కువగా చేసి, వడ్డీ లాభాల్ని ఎక్కువగా నిలుపు కుంటారు.
50లక్షల ఆదాయంలో 10 లక్షలకు పన్నులు కట్టలేదంటే, ఆ పెట్టుబడిదారుడు మొత్తం 50 లక్షల్నీ తన ఆదాయంగా లెక్కల్లో చూపించ లేడు. 10లక్షలకు ఏ లెక్కలూ వుండవు. ఆ డబ్బు అయితే వుంటుంది. డబ్బుతో ఏదో ఒక పని జరుగుతూనే వుండాలి. అలాగే, ఉంటుంది కూడా! ప్రభుత్వపు లెక్కల్లో వుండే డబ్బు 40 లక్షలు! లెక్కలు లేకుండానే చలామణీలో తిరిగే డబ్బు 10 లక్షలు! చలామణీలో అమ్ముడయ్యే సరుకుల ద్వారా వచ్చే డబ్బు 50 లక్షలు గానూ వుంటుంది! ఇదంతా ఒక్క పెట్టుబడిదారుడి సరుకుల సంగతి!
100 మంది పెట్టుబడిదారుల్లో 60 మందిని అయినా ఈ రకంగా జిత్తులతో చూస్తే, సమాజంలో తయారయ్యే సరుకుల మొత్తానికీ, దాని కోసం చలామణీలో తిరగ వలిసిన డబ్బు లెక్కకీ ఎక్కడా పొంతన కుదరదు!
పన్నుల్ని కట్టకుండా తిప్పే డబ్బు వల్ల, పెట్టుబడిదారులు తాము కొనే సరుకుల కోసం ఎక్కువ ధరలు కూడా పెట్ట గలుగుతారు. సరుకుల ధరలు పెరగడం అంటే వీటి లెక్కలకు వరసా వాయీ వుండవు. నిజంగా జరిగే ధరలు ఒకటైతే లెక్కల్లో ధరలు వేరేగా వుంటాయి.
పెట్టుబడిదార్ల గ్రూపుల వల్ల జరిగే అతి ముఖ్యమైన ఒక పని ఉంటుంది. అదేమిటంటే, ఈ దేశంలో 5 యేళ్ళకి ఒక సారి ఎన్నికలు వస్తూ వుంటాయి. రాజకీయ పార్టీలు ఎక్కువే వుంటాయి. పార్టీల మధ్య మెజారిటీ ఓట్లు సంపాదించాలనే పోటీలు కదా? ఈ పోటీల వల్ల ఓటర్లకి డబ్బు పడేసి ఓట్లు సంపాదించే పద్ధతి ఉంటుంది. దానికి కోట్ల కోట్ల డబ్బు కావాలి. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ఖర్చు కోసం డబ్బుని ఆ పార్టీ వాళ్ళు 'పార్టీ ఫండ్'గా పెడతారు. అంత డబ్బుని ఎలా తెచ్చి పెడతారు? ప్రతీ రాజకీయ పార్టీ, పెట్టుబడిదారీ గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపు తోనో, ఒకటి రెండు గ్రూపుల తోనో భారీ అనుకూలతలతో వుంటుంది. ఆ గ్రూపుల్లో సరుకుల వాళ్ళకు, తమ సరుకుల అమ్మకాల కోసం, అంటే ఆ వ్యాపారాల కోసం ప్రభుత్వపు అమోదాలు కావలసి వుంటుంది. రాజకీయ పార్టీగా నడిచే పెట్టుబడిదారీ పార్టీ ఏదైనా, ఆ పెట్టుబడిదారీ అధికార గ్రూపుల ప్రయోజనాల కోసం నడిచే పార్టీ గానే వుంటుంది. కాబట్టి, ఎన్నికల్లో డబ్బు బాధ్యతని అంతా ఆ పార్టీని పెట్టిన పెట్టుబడిదారీ గ్రూపులు తీసుకోవలిసిందే!
ఎన్నికల ఖర్చుని భరించాలంటే ఏ పెట్టుబడిదారీ కంపెనీ అయినా తన సరుకుల మీద పన్నులన్నీ కట్టేస్తే, ఎన్నికల కోసం రాజకీయ పార్టీలకు డబ్బు ఎలా ఇస్తుంది? అందుకే పన్నుల్లో దగాలు! పన్నులు ఎగ్గొట్టి, డబ్బుని మిగిల్చితే దాన్ని ఎన్నికల్లో ఓటర్లకి రహస్యంగా ఇవ్వడం కోసం పార్టీలకు ఇవ్వగలదు. అంతా రహస్యమే!
ఇంకా, ఎన్ని చెప్పు కోవాలి?
ఏ పెట్టుబడిదారీ కంపెనీలో అయినా పన్నులు కట్టని డబ్బుని మాత్రమే నల్ల డబ్బుగా చూస్తారు. కానీ, అలా చూడడమే కాదు. పెట్టుబడిదారీ కంపెనీకి వచ్చే రాబడిలో నిజమైన ఆదాయం ఏదైనా వుంటే అది పెట్టుబడి దారుడి 'స్వంత శ్రమ విలువ' ఒక్కటే! అది ఆ పెట్టుబడిదారుడు ఆ సరుకు తయారీకి అవసరమైన శ్రమ ఏదైనా చేసి వుంటేనే! సాధనాల్ని కొన్న 'పెట్టుబడి డబ్బు' అయినా, పెట్టుబడిదారుడి స్వంత శ్రమ విలువ కాదు! తర్వాత వచ్చే వడ్డీ లాభాలు కూడా స్వంత శ్రమలు కావు.
ఒక పెట్టుబడిదారుడు సరుకుని అమ్మించగా వచ్చిన 40 లక్షలకే పన్నులు కడితే, ఆ 40 లక్షలైనా అతడి స్వంత శ్రమ విలువ కాదు.
పన్నులు కట్టిన డబ్బు 40 లక్షలు అయినా, పన్నులు కట్టనిది 10 లక్షలు అయినా పెట్టుబడిదారుడి స్వంత విలువ కానప్పుడు ఆ 50 లక్షల డబ్బులో ఏ భాగం అయినా నల్ల డబ్బే కాదా? ఒక్క పైసా అయినా తెల్ల డబ్బు అవుతుందా?
పన్నులు కట్టని డబ్బు ప్రభుత్వపు లెక్కల్లోకి రాదు కాబట్టి, అది ప్రభుత్వపు రూల్సు ప్రకారం నడవకుండా చలామణీలో తిరుగుతుంది. దీన్నే 'నల్ల డబ్బు' అనడం వుంది.
పన్నులు కట్టిన డబ్బా, కట్టని డబ్బా - అని చూస్తే అది ఒక కోణంలో చూడడం! పన్నులు కట్టిన డబ్బుకి ప్రభుత్వంలో లెక్కలు ఉంటాయి. కట్టని డబ్బుకి లెక్కలు ఉండవు. లెక్కలు వుంటేనే ప్రభుత్వం 'కాయితం డబ్బు'ని ఎంత వుంచాలో లెక్క కట్టి అచ్చు వేయించ గలుగుతుంది. డబ్బు లెక్కలు సరిగా లేక పోవడం, అనేక మోసాలకు దారి తీసే పెట్టుబడిదారీ శ్రమ దోపిడీ విధానపు తప్పే. ఏ దోపిడీ విధానంలో అయినా, శ్రమల లెక్కలూ, డబ్బు లెక్కలూ సరిగా ఎప్పుడూ వుండడం సాధ్యం అవదు.
పన్నులు కట్టడం సంగతి కాకుండా చూస్తే, '120 సరుకుని అమ్మడం వల్ల వచ్చిన డబ్బు ఎవరి శ్రమతో వచ్చినది?' అనే కోణంలో చూడడం!
మొదట, 'సాధనాల్ని' కొనడానికి, 'పెట్టుబడి'గా వున్న 80 డబ్బు గానీ, వడ్డీ లాభాలుగా వుండే 30 డబ్బు గానీ, పెట్టుబడిదారుడి శ్రమలతో ఏర్పడినది కాదు. అది, సాధనాల్ని చేసిన పాత కార్మికుల, కుట్టు పని చేసిన కొత్త కార్మికుల శ్రమలతో ఏర్పడినదే.
పెట్టుబడిదారుడు, తన స్వంత శ్రమ విలువ కాని డబ్బుని, అంటే ఇతరుల శ్రమ విలువ అయిన డబ్బుని, యజమానితనం పేరుతో పొందడం, 'శ్రమ దోపిడీ' అవుతుందని మార్క్సు కనిపెట్టాడు! దాన్ని తెలుసుకుంటే కార్మిక వర్గం కూడా కళ్ళు తెరిచినట్టు! నేను మార్క్సుని చదివాకే, ముఖ్యంగా అతని 'కాపిటల్'ని చదివాకే 'శ్రమ దోపిడీ' గురించి తెలుసుకోగలిగాను. అలా గ్రహించకపోతే ఈ వర్గం, తన సమస్యల్లోనే తను వుండి పోతుంది.
మళ్ళీ చివరగా 'నల్ల డబ్బు' అంటే, 'శ్రమ దోపిడీ'తో సంపాదించే దాన్నంతా నల్ల డబ్బే - అనకూడదా? అనవచ్చు. కానీ, ఈ నాటికి వున్న అర్ధం పన్నులు కట్టని దానినే 'నల్ల డబ్బు' అంటాం! దాని లెక్కలు తెలియకుండానే అది చలామణీలో వుంటూ, ఇతర ధరలన్నీ పెరగడానికి కారణం అవుతూ వుంటుంది.
ఈ 'నల్ల డబ్బు' అంతా, మొదట అచ్చు అయినప్పుడు, ప్రభుత్వపు రిజర్వ్ బ్యాంకు లెక్కలలో తేలి, అక్కడ ప్రెస్లో అచ్చు అయ్యి, రూపాయి నోట్లుగా వచ్చినదే!
(మిగతా తరువాయి వచ్చేసంచికలో)
- రంగనాయకమ్మ