Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య తలెత్తిన యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కి పాటుకు గురిచేస్తున్నది. ఆయా దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు, వాణిజ్య వ్యాపార వ్యవహారాల మర్మమేమిటోగానీ ఈ యుద్ధం ప్రపంచ వ్యాపితంగా ప్రజలను కలవరపెడు తోంది. ఆయుధాలులేని ప్రపంచాన్ని, యుద్ధాలులేని సమాజాన్ని, ప్రపంచ శాంతిని కాంక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. అయితే శాంతిసందేశాల అమలును, ఆచరణను అగ్రరాజ్యాలు ఎప్పుడో వదిలేసాయి. ఇప్పుడు వాటికి కావాల్సింది కేవలం ప్రపంచ వనరులపై ఆధిపత్యమే.
ఒకవైపు శాంతి సందేశాలు వళ్లిస్తూనే, మరోవైపు ఆయుధాల సరఫరా, ఉత్పత్తి, నిల్వ, పరిశోధన లాంటివి అమలు చేస్తూ ఉన్నాయంటే ఏమను కోవాలి..? ఆయుధాలను సమకూర్చుకునే తీరిక ఉంది తప్ప శాంతిని పాటించే తీరిక లేదన్నట్టే కదా..? అయితే ప్రపంచ చరిత్రలో అనేక శాంతి ఒప్పందాలు కుదుర్చుకోబడ్డప్పటికి, ఆ కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా ఉల్లంఘించబడ్డాయనేది గమనార్హం. ఎందుకంటే, తరచూ ప్రపంచ నాయకులు శాంతి లేదా ఐక్యత తీసుకురావడం కన్నా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఒక దేశంవైపు ఇంకోదేశం తుపాకులను గురిపెట్టుకొని ఉంటే శాంతిని ఆశించడం సాధ్యమవుతుందా..? అలా గురిపెట్టుకొని ఉన్న ఆయుధాలను పేల్చనంత మాత్రాన వారిరువురు శాంతిగా ఉన్నారను కోగలమా..? అనేక దేశాల్లో నేడు ఇలాంటి పరిస్థితే ఉందంటే కాదనలేం. ఆ ఆయుధాలు పేలవని అనుకోలేము కదా..? ఆయుధాలు అమ్ముకొని జీవించవచ్చని, యుద్ధాలు చేసి ఆధిపత్యం చెలాయించ వచ్చని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ప్రకృతి కోపం చూపించిందంటే ఒక్క దేశం కూడా ఈ భూమ్మీద మిగలదనే నగసత్యాన్ని ఎరుగకుండా దుశ్చర్యలకు పాల్పడటం ప్రపంచ శాంతికి విఘాతమే. ప్రపంచదేశాలలో పెరిగే పేదరికాన్ని, అసమానతలను, నిరుద్యోగాన్ని, అనారోగ్యాన్ని పట్టించు కోకుండా, ఇంకా సూటిగా చెప్పాలంటే కావాలనే వాటిని అలా ఉంచేసి, ఉగ్రభూతాలను తయారుచేస్తుంది ఈ ఆయుధాల ప్రపంచం. ఆయుధాలతో పాలించాలనే వారిని, ఆయుధాలను తయారుచేయడం, నిల్వ చేయడం, అమ్ముకోవడం లాంటివి చేసే దేశాలను మెరుగైన దేశాలని ఎలా అనుకోవాలి..? ఆయుధాలతో హింస రాక్షసత్వం కాక ఇంకేమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశమేమిటంటే ప్రపంచం మొత్తంగా నేడు మిలటరీ రంగానికి ఒక నెలకు ఖర్చు పెడుతున్న డబ్బును ప్రజావసరాలకు ఉపయోగిస్తే అద్భుతమైన ప్రపంచాన్ని చూడొచ్చు. లక్షల సంఖ్యలో నాణ్యమైన స్కూళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడానికి, వేల యూనివర్సిటీలు, కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుంటుంది. వేల సాగునీటి ప్రాజెక్టులు, ఉక్కు, విద్యుత్ లాంటి అనేక రకాల పరిశ్రమలు స్థాపించడానికి ఆస్కారం ఉంటుంది. కోట్లాది మందికి ఉపాధి కల్పించవచ్చు. ప్రపంచ ప్రజలందరికీ పోషకాహారం అందించే ఏర్పాట్లు చేయవచ్చు. ఆకలి, దారిద్య్రాలను ప్రపంచం నుంచి తరిమివేయవచ్చు. ఒక ఏడాదిలో రక్షణ రంగానికి అయ్యే ఖర్చును మంచి పనుల కోసం దారి మళ్ళిస్తే ఈ ప్రపంచం రూపురేఖలే అద్భుతంగా మార్చవచ్చు. కానీ ప్రపంచం ఇందుకు విరుద్ధంగా ముందుకు సాగుతున్న పరిస్థితే కండ్లముందు కనిపిస్తున్నది. ఈనేపథ్యంలో శాంతియుత ప్రపంచం కోసం ప్రజలంతా చైతన్యవంతులు కావాలి. యుద్ధాలు, ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం లేని ప్రపంచాన్ని నిర్మితం చేయాడానికి ఆయా దేశాధినేతలూ ఆచరణాత్మకంగా సిద్ధం కావాలి. ఆయుధాలను నిర్మూలించి, ఆయుధాలు లేని ప్రపంచాన్ని నిర్మాణం చేయాలి. ప్రపంచ ప్రజానీకం అలాంటి ప్రపంచం కోసం పోరాడి సాధించాలి.
- రాజేందర్ దామెర