Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
'దొంగ డబ్బు' గురించి తెలిస్తే, తర్వాత 'మంచి డబ్బు' కూడా తెలుస్తుంది!
ప్రభుత్వం ద్వారా కాకుండా, ఇతరుల ద్వారా రహస్యంగా అచ్చయినదీ, చట్టబద్ధం కానిదీ అయిన డబ్బు చలామణిలో తిరుగుతూ వుంటే అది 'దొంగ డబ్బు'!
అటువంటి డబ్బు (అటు వంటి కాయితం నోట్లు) అసలు చలామణీలోకి ఎలా వస్తాయి? వస్తాయి మరి! దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళు అనేక మంది వుంటే, వాళ్ళల్లో ఈ డబ్బు వ్యాపారాన్ని ఎంచుకున్న వాళ్ళు కూడా ఉండరా? ఈ వ్యాపారులు, ఈ కాయితం డబ్బుని రహస్యంగా అచ్చు వేయించి, ఈ నోట్లని జనాలకు మోసాల ద్వారా అంటగట్టే పని చేస్తారు. ఇది కూడా ఒక 'వృత్తి'గా నడుస్తూ వుంటుంది.
ఈ 'చట్ట బద్ధతలేని' కాయితం నోట్లు కూడా రహస్య ప్రెస్సులలో తయారవుతాయి. ఇవి, అనేక జాగ్రత్తల తోనే ప్రింటు అయినా, ప్రభుత్వపు డబ్బు నోట్ల గురించి తెలిసిన వాళ్ళు ఈ దొంగ నోట్లని గుర్తించడం అతి తేలికే అవుతుంది. తేలిక అయినా, ఆ విషయాన్ని ఆ వ్యక్తులు పోలీస్‌కి చెప్పకపోవడం జరిగితే జరగవచ్చు.
ఒక వ్యక్తి, ఈ దొంగనోట్ల వృత్తిలోకి దిగేముందు 'ఎందరెందరో తప్పుడు వ్యాపారాలు చేస్తూనే వున్నారు. పోలీసు అధికారులే, ప్రభుత్వంలో మంత్రులే, లంచాలు తింటూ ఎన్నెన్నో దగాలు చేస్తూ వుండరా? ఇదేనా పెద్ద తప్పు?' అనే స్వంత తర్కంతో ఈ దొంగ డబ్బు వృత్తిలోకి దిగుతాడు. ఈ అచ్చు పనిలో రహస్యంగా సహకరించే వాళ్ళు ఉండబట్టే ఈ వ్యవహారం జరుగుతుంది. దీనికి అవసరమైన చిన్న మిషన్లు తయారై, రహస్యంగా కాయితం రూపాయి నోట్లు తయారవుతూ వుంటాయి. ఈ నోట్లు ప్రభుత్వపు నోట్లుగా కొంత వరకూ ఉంటాయి గానీ, నూటికి నూరు పాళ్ళూ వుండవు. తప్పని సరిగా ఈ నోట్లలో కొన్ని లోపాలు ఉంటాయి. అయినా, చూడగానే అందరికీ ఆ లోపాలు తెలియక ఈ నోటుని చూస్తే 'ఇది తప్పుడు డబ్బు (ఫేక్ కరెన్సీ)' అని తెలియదు.
ఈ నోట్ల వ్యక్తి ఒక రైతు నించీ బియ్యాలూ, పప్పులూ, నూనెలూ, పళ్ళూ, పాలూ, వంటి వన్నీ తీసుకుంటా డనుకుందాం. ఆ వ్యక్తి రైతు మీద దయతో కొన్ని నోట్లు ఎక్కువగా ఇస్తున్నట్టు కొన్ని దొంగ నోట్లు కొంత ఎక్కువగా ఇచ్చి, ఆ రైతు అన్ని బేరాలు కొంత ఎక్కువ ధరలతో చెయ్యగలిగి నందుకు సంతోషిస్తాడు. ఆ నోట్లతో వ్యవసాయ కార్మికులకు జీతాలు చకచకా ఇవ్వ గలుగుతాడు.
ఆ కార్మికులు కూడా ఆ నోట్లతో తమకు అత్యవసరమైన సరుకుల్ని కొనగలుగుతారు. ఇలా జరిగిపోతూ వుంటే, దొంగ డబ్బు కూడా చలామణీలో చట్ట బద్ధ డబ్బు లాగే తిరిగి పోతోందని అర్ధం!
అయితే, ఆ రహస్యం ఎప్పుడూ బైట పడదా? - పడుతుంది, అప్పుడప్పుడూ! కానీ, ప్రతీసారీ కాదు. ఎవరో కని పెట్టగలిగిన వాళ్ళే, తమ చేతుల్లోకి వచ్చిన దొంగ నోట్ల గురించి పోలీస్‌కి ఫిర్యాదు చేస్తారు. కానీ, తన సరుకుల్ని అక్కడక్కడా అమ్మినప్పుడు, ఆ నోట్లని తను ఎక్కడ తీసుకున్నాడో, ఎప్పుడు తీసుకున్నాడో చెప్ప లేకపోతాడు.
దొంగ డబ్బు మేధావులు, కొన్ని చోట్ల దొరుకుతారు గానీ, ప్రతీ చోటా ప్రతీ సారీ దొరకరు!
ఒక సారి, ఒక చిన్న వయసు పాఠకురాలు నాతో డబ్బు సంగతులు మాట్లాడుతూ.. ''మా తాత దగ్గిర చాలా నోట్లు వుంటాయండీ. 'ఫేక్ మనీ' అంటాడు. ఎవ్వరికీ చెప్ప కూడదంటాడు. నాకు సినిమాలకు డబ్బు ఇస్తాడు. సినిమాల టిక్కట్లిచ్చే వాళ్ళు, ఆ హడావిడిలో ఏమీ చూడరు. తప్పు కాదంటాడు మా తాత. తను ఊళ్ళోంచి వెళ్ళాలంటే ఎప్పుడూ పేద వాళ్ళ ఇళ్ళ సందుల్లో నుంచే వెళ్తాడంట! ఎందుకో తెలవదు'' అంటూ చెప్పింది. ఆ అమ్మాయి ఎవరో, ఏం పేరో కూడా ఇప్పుడు గుర్తులేదు నాకు. ఈ వ్యాసం రాయడానికి కొన్ని విషయాల్ని చూస్తూ వుంటేనే, ఆ మాటలు గుర్తొచ్చాయి.
ఈ దొంగ డబ్బు గురించి అక్కడక్కడా చదివిన విషయాల్లో ఒక వింత కనపడింది! కాయితం నోట్లు రాక ముందు కాలంలో కూడా బంగారం డబ్బు నాణాలే వుండే కాలంలో కూడా దొంగ నాణాలు వుండేవట! బంగారంలో కల్తీ లోహాలతో తయారయే నాణాలు అట అవి!
బంగారం నాణాల్నే కల్తీ చేయగలిగే వృత్తి వుంటే, ఈ కాయితం నోట్లని కల్తీ చేయడం ఎంత తేలిక! నిజానికి, ఇది ప్రభుత్వపు బ్యాంకు నోటులాగే వుండాలి కాబట్టి ఈ నోట్ల పని, కల్తీ బంగారం బిళ్ళలంత తేలిక కాదేమో!
ఇప్పుడు, చలామణీలో దొంగ నోట్లు తిరుగుతూనే వుంటాయన్న మాట! ఈ కల్తీ నోట్లు, ఎన్ని వేలో, లక్షలో తిరుగుతూ వుంటాయో ప్రభుత్వానికి తెలీదు.
ఈ కల్తీ నోట్ల గాళ్ళు ఏ శ్రమా చెయ్యకుండా; ఏ సరుకుల్నీ తయారు చేసి, వాటిని అమ్మి, డబ్బు సంపాదించడం కాకుండా; ఈ కల్తీ నోట్ల తోటే, తమ జీవితాలూ గడుపుతారు. పైగా కొంత చట్ట బద్ధ నోట్లనీ సంపాదిస్తారు కూడా! ఎలాగంటే, మోసాల ద్వారానూ, మోసాలు లేకుండానూ కూడా! వంద రూపాయల ప్రభుత్వపు డబ్బు కోసం, రెండొందలో, ఇంకా ఎక్కువో దొంగ డబ్బుని ఇస్తారు వీళ్ళు. తీసుకునే వాళ్ళు, ఆ దొంగ వ్యాపారం కోసమే వాటిని తీసుకుంటారు.
ఒక రైతు తోనో, మరో పేద తోనో ఈ నోట్ల వాడు తనకు చిల్లర నోట్లు కావాలని, ఒక 100 రూపాయల ఫేక్ నోటు ఇస్తాడనుకుందాం. రైతు సహాయం గానే తన మామూలు నోట్లని ఇస్తాడు. అలా ఇచ్చే చిల్లర నోట్లన్నీ ప్రభుత్వపు నోట్లే. ఆ నోట్లు తీసుకుంటూ ఈ దొంగ వృత్తి వాడు 80 రూపాయలు మాత్రమే తీసుకుని.. 'నువ్వు చక్కగా చిల్లర ఇచ్చావు. నా 100కి బదులుగా నువ్వు వందా ఇవ్వక్కర లేదులే. 20ని నువ్వే ఉంచుకో!'' అంటాడు. అంటే, ఏ శ్రమా లేని ఈ దొంగకి 100 ఫేక్ డబ్బుకి బదులు 80 చట్ట బద్ధ డబ్బు తేలిగ్గా వచ్చేసినట్టే! ఈ చిల్లర జిత్తులతో 10 చోట్ల తిరిగితే చాలు, దొంగ నోట్లని ప్రభుత్వపు నోట్లుగా చాలా వరకూ మార్చుకో గలడు.
ఇప్పటికీ ఇది సాగుతోందంటే ఈ ప్రభుత్వం, ఈ పోలీసూ, ఈ పత్రికలూ, ఈ మేధావులూ, అంతా ఏమై పోయారు?
ఒక పేద రైతో, ఇంకో అమాయకుడో, తన చేతిల్లోకి దొంగ డబ్బు తీసుకుని తన స్వంత డబ్బుని పోగొట్టు కుంటాడు!
'మంచి డబ్బు' అంటే ఏమిటి?
రైతు పోగొట్టు కున్నాడే 80 డబ్బుని! అదే మంచి డబ్బు! అంటే, పెట్టుబడిదారీ ప్రభుత్వపు చట్ట బద్ధ డబ్బు! ఇప్పుడు ఇదే 'మంచి డబ్బు' మరి!
'స్వతంత్ర ఉత్పత్తి దారుల' డబ్బు ఏమిటి?
ఈ ఉత్పత్తిదారులు ఎవరు? వీరు యజమానుల దగ్గిర పని చేసే జీతాల శ్రామికులు కారు. స్వంత శ్రమలతో సరుకుల్ని చేసి, వాటిని అమ్ముకుని డబ్బు తెచ్చుకుంటారు.
కూరగాయలు కొని, అమ్మే వారు నాలుగు గేదెల్ని పెట్టుకుని పాలు అమ్మేవారు, ఇంట్లోనే కుట్టు పనులు చేసి ఛార్జీలు తీసుకునే వారు - ఇటువంటి సరుకుల వారందరూ స్వతంత్ర ఉత్పత్తి దారులే. ఈ జనాల ఆదాయాలు 'జీతాల' లెక్కల్లో వుండవు.
ఈ జనాల కోసం చలామణీలో ఎంత డబ్బు అవసరం అవుతుందో, డబ్బు లెక్కలు చూసే ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? - ఇదో ప్రశ్న!
ఈ స్వతంత్ర ఉత్పత్తిదారుల జనాభా సమాజంలో ఎంత శాతంగా వుంటుందో ప్రభుత్వంలో ఎంతో కొంత లెక్క ఉంటుంది.
ఈ జనాభా కూడా తమ సరుకుల్ని అమ్మడాలూ, కొనడాలూ కూడా చేస్తూ వుంటారు కదా? ఈ రెండూ జరిగేది కేవలం ఈ స్థాయి వారి మధ్యనే జరగడం కాదు. పెట్టుబడిదారీ షాపుల్నించీ కూడా వీరు తమకు అవసరమైనవి కొన్ని కొంటారు, తమ సరుకుల్ని జీతాల వారికీ అమ్ముతారు.
ఈ స్వతంత్ర ఉత్పత్తిదారులందరికీ బ్యాంకు ఎకౌంట్లు లేకపోయినా, ఆ ఇతర సరుకుల వారికి అయినా ఎకౌంట్లు వుంటాయి. ఆ ఎకౌంట్లలో ప్రతీ పేరునీ ప్రభుత్వం వివరంగా చూస్తుందని కాదు. ఈ ఎక్కౌంట్లలో కొంత శాతం స్వతంత్ర ఉత్పత్తి దారుల నించి కొనేవే అవుతాయి.
స్వతంత్ర ఉత్పత్తిదారులకు ఇతర సరుకుల వారితో సంబంధాలు ఉంటాయి. కాబట్టి, ఆ ఇతరులు కొనే, అమ్మే ఖర్చుల్ని బట్టి అయినా ఈ ఉత్పత్తిదారుల జీవితాల కోసం అవసరం అయ్యే డబ్బు శాతాన్ని తెలుసు కోవడం ప్రభుత్వానికి సరైన లెక్కలు వుంటే అసాధ్యమైన విషయం అవదు.
ప్రభుత్వం యేటా చూపించే బడ్జెట్లో స్వతంత్ర ఉత్పత్తిదారుల స్తాయిని కూడా తమ డబ్బు సప్లై లెక్కల్లోకి తీసుకున్నట్టు ఉంటుంది.
మనం జీతాల వర్గాన్నీ, యజమానుల వర్గాన్నీ ఈ రెంటినీ మాత్రమే చూసినా సమాజంలో వున్న ఇతర సంబంధాల్ని అర్ధం చేసుకోలేక పోవడం ఉండదు. కుటుంబ స్త్రీలైతే భర్తల వర్గం లోకీ, పిల్లలైతే తల్లిదండ్రుల వర్గంలోకీ వస్తారు.
ఇంత వరకూ ఈ చాప్టర్లో 'నల్ల డబ్బూ', 'దొంగ డబ్బూ' - అనే వాటిని కొంత వివరంగా చూశాం. పన్నులు కట్టని డబ్బుని నల్ల డబ్బు - అనీ, చట్ట బద్దం కాని రహస్యపు డబ్బుని 'దొంగ డబ్బు' అనీ చూశాం.
శ్రమ చెయ్యకుండానే యజమానికి వచ్చే డబ్బు అంతా 'దొంగ డబ్బు' అవదా? అది పన్నులు కట్టినదే కావచ్చు. అది పన్నులు కట్టినదే అయినా యజమాని కట్టే పన్నులు గానీ, అతనికి మిగిలిన డబ్బు గానీ, అతని స్వంత శ్రమ లేకుండా దోచినదే కదా? అంటే, దోపిడీ జరిగే సంబంధాల్లో చూస్తే, పన్నులు కట్టనిదీ, కట్టేదీ కూడా దొంగ డబ్బే అవదా?
మానవ సమాజానికి అసలు 'డబ్బు' అనేది అవసరమా?
వస్తువుల మధ్యనే 'మారకాలు' జరిగే ఆదిమ కాలంలో ఏదో ఒక వస్తువు 'డబ్బు'గా ఏర్పడడం అవసరమే అయింది. 'డబ్బు' అనేదే ఏర్పడక పోతే, 'శ్రమ దోపిడీ' అనే నిజాన్ని గ్రహించడానికి మార్గమే దొరికేది కాదు.
ఇక తర్వాత, అన్నీ శ్రమ దోపిడీ సమాజాలే! బానిస యజమానులవీ, భూస్వాములవీ, పెట్టుబడి దారులవీ. అన్నీ శ్రమ దోపిడీ సమాజాలే కదా? ఈ శ్రమ దోపిడీ సమాజాల కైతే, డబ్బు మరింత అవసరం.
ఇప్పటికీ మార్పులు లేకపోయినా శ్రమ దోపిడీ జరుగుతోందని తెలుసుకున్న ఉత్తమ సిద్ధాంతమైన 'మార్క్సిజం' అయితే వచ్చేసింది!
ఆ సిద్ధాంతం ప్రకారం అయితే మానవ సమాజంలో వర్గాలూ - వైరుధ్యాలూ లేకుండా ఏర్పడే సమానత్వ సంబధాలతో అందరూ తక్కువ కాలపు స్వంత శ్రమలతో జీవించే సమాజంలో 'డబ్బుతో అవసరం ఉండదు' అని!
'డబ్బు' అంటే, 'శ్రమ విలువ'ని కొలిచేదే.
సమాజంలో, చిన్న పిల్లలూ, వృద్ధులూ, రోగులూ తప్ప, ఆరోగ్యవంతులందరూ శ్రమలు చేసుకుంటూ, కార్మిక - యజమాని సంబంధాలు లేకుండా బ్రతికే సమాజంలో, డబ్బుతో అవసరం ఏమిటి? దీన్ని గురించి ఈ మాటలు చాలవు. డబ్బు పుటకతో అవసరాన్ని చెప్పిన మార్క్సిజం, 'డబ్బు రద్దు' గురించి కూడా చెప్పింది. ఇప్పటికైతే, మొదట 'శ్రమ దోపిడీ'ని తెలుసుకోవడం జరగాలి. అది అత్యవసరం! దాన్ని బట్టి, 'డబ్బు' గురించి అన్ని వివరాలూ తెలుస్తాయి!
- రంగనాయకమ్మ