Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎక్కడ మహిళలు పూజింపబడతారో, అక్కడ దేవతలు పూజింపబడతారు...' ఎన్నో ఏండ్ల నుంచి అనేక కావ్యాలు, నవలల్లో వాడుతున్న మాటిది. అనేక తెలుగు సినిమాల్లో ఈ డైలాగ్ లెక్కకు మిక్కిలిగా రిపీటైంది. దీన్ని ఒంటబట్టించుకున్న తెలంగాణ ప్రభుత్వం... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈనెల ఎనిమిదో తేదీ ఒక్కరోజే గాకుండా మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆదివారం నుంచి మంగళవారం వరకూ పల్లె నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ తరపున ఆటలు, పాటల పోటీలతో హోరెత్తించేందుకు రంగం సిద్ధం చేసింది. మహిళా సంక్షేమం, వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు అందించారనీ, అందువల్ల ఆయన ఫ్లెక్సీలు, ఫొటోలకు రాఖీలు కట్టాలంటూ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న మహిళా పథకాలను వారు ఇటీవల నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఏకరువు పెట్టారు. కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ తదితరాల గురించి వివరించారు. షీ టీమ్‌ల గొప్పతనాన్ని విశ్లేషించారు. స్థానిక సంస్థల పదవులతోపాటు పోలీస్ రిక్రూట్‌మెంట్‌లోనూ మహిళలకు ఎక్కువ రిజర్వేషన్ కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ను 'మహిళా బంధు...' అంటూ కీర్తించారు. ఇవన్నీ చెప్పటం పూర్తయి, ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత... పాత్రికేయులతో కలిసి సరదాగా టీ తాగుతూ ఓ అరగంట సేపు మంత్రులు ముచ్చటించారు. ఆ సందర్భంగా ఓ జర్నలిస్టు... 'మేడమ్, మహిళా సాధికారత గురించి బాగా చెప్పారు. కానీ అదే మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు (సోమవారం) ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ప్రథమ పౌరురాలు, ఒక మహిళైన గవర్నర్‌ను ఆహ్వానించకుండా మీ ప్రభుత్వం అవమానిస్తున్నది కదా..?' అంటూ ప్రశ్నను సంధించాడు. దానికి అక్కడే ఉన్న ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ స్పందిస్తూ... 'గత అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ప్రొరోగ్ చేయలేదు కదా... అందుకే ఇప్పుడు నియమ నిబంధనల ప్రకారం ఉభయసభల సమావేశం ఉండదు, అందువల్ల గవర్నర్ స్పీచ్ అవసరం ఉండదు...' అని సమాధానమిచ్చేందుకు ప్రయత్నించారు. ఆ వెంటనే సీనియర్ మంత్రి అయిన సత్యవతి రాథోడ్ కలుగు జేసుకుని... 'ఆ విషయాలన్నీ ఈ విలేకర్లకు తెలియదనుకున్నరా...? మనల్ని మాటల్లోపెట్టి ఏదో రకంగా ఏదో విషయాన్ని లాగుతారు. తర్వాత మనకు ఇబ్బంది అవుద్ది...' అంటూ మందలించేసరికి, అక్కడున్న సబితా ఇంద్రారెడ్డితోపాటు పాత్రికేయులందరూ ఘొల్లుమన్నారు.
-బి.వి.యన్.పద్మరాజు