Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏటా ప్రపంచంలో అత్యధిక జనాభా మరణానికి కారణమవుతున్న వ్యాధుల్లో కిడ్నీ జబ్బులు ప్రధానమయినవి. అనేక దేశాల్లో ఆరోగ్య వ్యయంలో అధిక మొత్తం కిడ్నీవ్యాధి చికిత్సకే కేటాయిస్తున్నారు. అవగాహన మాత్రమే అసలైన నివారణోపాయమని ఏటా మార్చి 2వ గురువారం ప్రపంచ కిడ్నీ దినంగా జరుపుతున్నారు. కిడ్నీ వ్యాధులపై ఒక సమగ్ర అవగాహన ఆయా రోగులకు, వారి సహాయకులకు అత్యావశ్యకం. నాలుగైదు అంగుళాల పొడవు, పిడికిలి పరిమాణంలో వెన్నెముకకు ఇరువైపులా, పక్కటెముకల క్రింద ఉండే ఈ చిక్కుడు గింజ ఆకారపు కిడ్నీలు మనిషి శరీరంలోని అత్యంత ప్రధానమైన అవయవాలు. అవి వ్యర్థాలను తొలగిస్తాయి, తద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరం యొక్క ద్రవ సమతుల్యతను నియంత్రిస్తాయి. లవణాలను సరైన స్థాయిలో ఉంచుతాయి. శరీరంలోని రక్తం మొత్తం రోజుకు 40సార్లు వాటి గుండా వెళుతుంది. ఇవి రోజూ 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించడం మూత్రపిండాల ప్రధాన విధి. ఇది శరీరంలో ఉన్న అనేక రసాయనాల సంతులనాన్ని స్థిరపరచడానికి, శరీరాన్ని ఒక సమతా స్థితిలో ఉంచడానికి తొడ్పడుతుంది. అందుకే మూత్రపిండాలు శక్తివంతమైన రసాయన కర్మాగారాలు. ఇవి ఇతర అవయవాల పనితీరును ప్రభావితం చేసే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి.
ప్రధానమైన కిడ్నీ వ్యాధులు
పయలోనెఫ్రైటిస్: బాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకు సోకినప్పుడు పయలోనెఫ్రైటిస్ అంటారు. ఎక్కువగా స్త్రీలలో ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారిలో కిడ్నీలో రాళ్లు ఉన్నావారిలో ఎక్కువగా వస్తుంది. సాధారణంగా వెన్నునొప్పి, చలి జ్వరంతో మొదలు అవుతుంది. సరిపడా ఆంటిబయోటిక్ని సరైన మోతాదులో సరైనాన్ని రోజులు తీసుకోవాలి. కిడ్నీలో కొన్ని మచ్చలు మిగిలిపోతే అవి పెరిగి కాలక్రమేణా కిడ్నీ పనితనం క్షీణించే అవకాశం ఉంటుంది.
గ్లోమెరులోనెఫ్రిటిస్: చిన్న పిల్లల్లో ఒక్కసారిగా వాళ్లంతా వాచిపోయి, బీపీ బాగా పెరిగి ఆ తర్వాత కొన్ని రోజులకు త్వరితగతిన తనంతట తానుగా తగ్గిపోతుంది. వీరిలో కొందరికి కాలక్రమేణా నెమ్మదిగా కిడ్నీ పనితనం తగ్గిపోతుంది. జన్యు పరమైన కారణాల చేత, అంతుచిక్కని అనేక కారణాల చేత కిడ్నీలో ఉండే ఫిల్టర్లను ప్రధానంగా దెబ్బతీసే వ్యాధులు, కొన్ని సార్లు రోగనిరోధక వ్యవస్థలో జరిగిన మార్పులు గ్లోమెరులోనెఫ్రిటిస్కి కారణమవుతాయి. కిడ్నీ బయాప్సీ ద్వారా మాత్రమే ఈ వ్యాధి నిర్థారణ చేసి, సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారి తీస్తుంది.
కిడ్నీ స్టోన్స్ (నెఫ్రోలిథియాసిస్): మూత్రం లోని ఖనిజాలు స్ఫటికాలుగా (రాళ్ళు) ఏర్పడతాయి, ఇవి మూత్ర ప్రవాహాన్ని అడ్డగించేంత పెద్దవిగా పెరుగుతాయి. విపరీతమైన కడుపునొప్పితో పాటు మూత్రంలో కొద్దిగా రక్తం పోవడం దీని లక్షణాలు. ఉల్టార్సౌండ్ స్కాన్ ద్వారా కానీ సీట్ స్కాన్ ద్వారా కానీ కిడ్నీలో ఉన్న రాళ్లను నిర్ధారించి మందులు ఇస్తారు. చాలా కిడ్నీ స్టోన్స్ వాటంతట అవే వెళ్లిపోతాయి, కానీ కొన్ని చాలా పెద్దవి, వాటికి చికిత్స చేయవలసి ఉంటుంది.
నెఫ్రోటిక్ సిండ్రోమ్: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల పెద్ద మొత్తంలో ప్రోటీన్ మూత్రంలోకి స్రవించబడుతుంది. ఏంసిడి, ఎఫ్ఎస్జీఎస్, మెంబ్రేనెస్ నెఫ్రోపతే కూడా ఈ కోవకి చెందినవే. వీటిలో ప్రాధానమైన ఐజిఏ నెఫ్రోపతి, ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీవ్యాధులకు అత్యధికంగా కారణభూతమవుతుంది. వొళ్ళంతా వాచిపోతుంది. బీపీ బాగా పెరగదు. ప్రధానంగా కేవలం మూత్రంలో ప్రోటీన్ పోతుంది. స్టెరాయిడ్లతో బాటు కొన్ని రోగ నిరోధకశక్తిని తగ్గించే అనేక మందులు వాడి మూత్రంలో పోర్టేమిన్ జారిపోకుండా చేసే ప్రయత్నాలు కొన్ని సార్లు ఫలించవు. నెమ్మదిగా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి: రెండు కిడ్నీలలో పెద్ద తిత్తులు ఏర్పడి వాటి పనిని అడ్డుకునే జన్యుపరమైన పరిస్థితి. రెండు కిడ్నీలు ఒక ద్రాక్ష గుత్తిలాగా మారిపోతాయి. వంశ పారంపర్యంగా కుటుంబం లోని అందరికీ వచ్చే వ్యాధి. కానీ వీరిలో కొందరికి మాత్రమే కిడ్నీలు వైఫల్యం చెందుతాయి.
డయాబెటిక్ నెఫ్రోపతీ: మధుమేహం నుండి అధిక రక్త చక్కెర క్రమంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది, చివరికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి కారణమవుతుంది. మూత్రంలో ప్రోటీన్ (నెఫ్రోటిక్ సిండ్రోమ్) కూడా సంభవించవచ్చు.
హైపర్టెన్సివ్ నెఫ్రోపతీ: అధిక రక్తపోటు వల్ల కిడ్నీ దెబ్బతింటుంది. చివరికి దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం సంభవించవచ్చు.
క్రోనిక్ ఇంటర్‌స్టీషియల్ నెఫ్రిటిస్: మూత్ర పిండము లోపల ఫిల్టర్ల మధ్య ప్రదేశంలో, మూత్ర నాళికలు దెబ్బ తినడం వాళ్ళ కలిగే జబ్బు. అనేక విధాలైన మందులు, ఇన్ఫెక్షన్లు, వాతావరణ కాలుష్యం, అధిక ఉష్ణోగ్రత వీటికి ప్రధాన కారణాలు. కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ వ్యాధులు వస్తాయి. వీరు అత్యంత సాధారణంగా కనిపిస్తూ ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటారు. కాకతాళీయంగా ఈ వ్యాధిని గుర్తిస్తారు. బీపీ ఉండదు. కాళ్ళు వాపులు కూడా ఉండవు. బంధన కణజాలం యొక్క వాపు, తరచుగా తీవ్రమైన మూత్రపిండ వైఫల్యానికి కారణమవుతుంది. అలెర్జీ ప్రతిచర్యలు, ఔషధ దుష్ప్రభావాలు సాధారణ కారణాలు.
కిడ్నీ వ్యాధి యొక్క సంకేతాలు ఏమిటి?
రక్తాన్ని ఫిల్టర్ చేసే మూత్రపిండాల సామర్థ్యం వ్యాధి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లయితే, శరీరంలో వ్యర్థాలు, అదనపు నీరు పేరుకుపోతుంది. ప్రాధమిక దశల్లో ఎటువంటి శారీరక మార్పులు కనిపించకపోయినా వ్యాధి తీవ్రతరమయ్యే దశల్లో కొన్ని లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని కాకతాళీయంగా చేసిన రక్త మూత్ర పరీక్షల ద్వారా బయటపడతాయి. అధిక రక్తపోటు, మూత్రంలో రక్తం లేదా ప్రోటీన్, రక్త పరీక్షల్లో క్రియేటినిన్, బ్లడ్ యూరియా నైట్రోజన్ వంటి పాదార్థాల శాతం అధికం ఉండటం వీటిలో కొన్ని.
రక్త పరీక్ష, సాధారణ పరిధికి వెలుపల: తరచుగా మూత్రవిసర్జన, (ముఖ్యంగా రాత్రి వేళ), కళ్ల చుట్టూ ఉబ్బడం, చేతులు, కాళ్ల వాపు, ఆయాసం, ఆకలి, నిద్రలేమి, విపరీతమైన నిస్సత్తువ మొదలైనవై కిడ్నీ వ్యాధి క్రమంలో కనిపించే లక్షణాలు.
అనేక కిడ్నీ వ్యాధులను విజయవంతంగా నయం చేయవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులను జాగ్రత్తగా నియంత్రించడం వలన కిడ్నీ వ్యాధిని నివారించవచ్చు లేదా మరింత తీవ్రం కాకుండా ఉంచవచ్చు. కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను సాధారణంగా మందులతో కూడా నయం చేయవచ్చు. దురదష్టవశాత్తు, కొన్ని మూత్రపిండ వ్యాధుల యొక్క ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. వాటికి నిర్దిష్ట చికిత్సలు ఇంకా అందుబాటులో లేవు. కొన్నిసార్లు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి మూత్రపిండ వైఫల్యానికి చేరుకుంటుంది. డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరమవుతుంది. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (Aజజు) ఇన్హిబిటర్స్ అని పిలిచే ప్రత్యేక మందులతో అధిక రక్తపోటు నియంత్రించి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి యొక్క పురోగతిని నెమ్మదించేలా చేయవచ్చు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి కారణమయ్యే అన్ని పరిస్థితులను, ప్రభావవంతమైన చికిత్సను కనుగొనడానికి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.
కిడ్నీ ఫెయిల్యూర్‌ను హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడితో చికిత్స చేయవచ్చు. హీమోడయాలసిస్తో చికిత్స డయాలసిస్ యూనిట్లో లేదా ఇంటి వద్ద నిర్వహించబడుతుంది. హెమోడయాలసిస్ చికిత్సలు సాధారణంగా వారానికి మూడు సార్లు నిర్వహిస్తారు. పెరిటోనియల్ డయాలసిస్ ప్రతిరోజూ ఇంట్లోనే జరుగుతుంది. పెరిటోనియల్ డయాలసిస్‌కు యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా కూడా చేయవచ్చు. కిడ్నీ మార్పిడి అద్భుతమైన ప్రక్రియ. కిడ్నీ మరణించిన వారి నుండి లేదా జీవించి ఉన్న దాత నుండి రావచ్చు. కేవలం తల్లితండ్రులు, సహజాతులు, పిల్లలు, భార్య లేదా భర్త మాత్రమే చట్ట రీత్యా కిడ్నీ దానం చేయవచ్చు.
(ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా)
- డాక్టర్ శ్రీభూషణ రాజు
సెల్: 9030292929