Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో అత్యంత బలమైన, విస్తృతమైన భావన దేవుడు. అతిపెద్ద అబద్ధం కూడా దేవుడే! మానవావతరణం జరిగిన అనేక వేల సంవత్సరాల కాలంలో ఎప్పుడూ, ఎక్కడా, ఎవరిచేతా దేవుడి ఉనికి రుజువు చేయబడలేదు.. కనుక దేవుడు లేడని చెప్పటం అతి సాధారణ స్వల్ప తార్కికం. నిజానికి ఉన్నాడని రుజువు చేయటం ఆస్తికుల బాధ్యత. ఆ ప్రయత్నంలో భాగంగా దేవుడు కేంద్రకంగా అనేక వేల ఆధ్యాత్మిక గ్రంథాలు అనేక భాషల్లో, అనేక మతాల వారు సృష్టించారు. వారెవరూ దేవుడి ఉనికిని నిరూపించలేదు. నిరూపించి ఉన్నట్లయితే అసలు నాస్తికులనే వాళ్ళే ఉండరు.
అభద్రతా భావం నుంచే దేవుడు పుట్టాడు
సాధారణంగా అభద్రతా భావం మూడు రకాలు ఉంటుంది. 1. ప్రకృతి సిద్ధమైనది. 2. కొన్ని స్వార్థపర శక్తులు, వ్యక్తులు కల్పించినది. 3. మనిషి తనకు తానే సృష్టించుకున్నది. ఆది మానవుడు అడవుల్లో నివసించేటప్పుడు క్రూర మృగాలు, విష కీటకాల బారిన పడి తన సహచరులు మరణంచటం కళ్ళారా చూశాడు. వాటి నుండి ఎట్లా తప్పించుకోవాలో, ఎదురుదాడి చేసి వాటినెట్లా చంపాలో క్రమ క్రమంగా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. కానీ, కారణం తెలియకుండా తమ గుంపులోనివారు, తమ ప్రాంతాల వారు మరణిస్తుండటం, ఒక్కో సందర్భంలో పదుల సంఖ్యలో మరణించటం వారిని ఆందోళనకు, అభద్రతా భావానికి గురిచేసింది. ప్రకృతి, వన దేవత ఆగ్రహించటం వల్లనే ఆ మరణాలు సంభవిస్తున్నాయని భావించి, చెట్టును, పుట్టను, రాయిని, సర్పాకృతిని పూజించి, వన దేవత అనుగ్రహాన్ని పొందాలనే ప్రయత్నాలు చేశారు. ఆది మానవుడు అలా మొదటిసారి దేవుణ్ణి సృష్టించాడు. పూజలు కొనసాగిస్తున్న క్రమంలో రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళకి, భయానికి లోనైన మానసిక అస్వస్థులకు మాత్రం కొంత ఉపశమనం కలిగింది తప్ప అత్యధిక మరణాలు ఆగిపోలేదు. ఇట్లా సుదీర్ఘ కాలం గడిచిన తర్వాత ఆ మరణాలకు దైవాగ్రహం కారణం కాకపోవచ్చునని, శరీరానికి కలిగిన ఏవో వ్యాధులు కారణం కావచ్చుననే ఆలోచనలు ప్రారంభమైనాయి. అందుబాటులో ఉన్న అకు పసరులతో, మూలికలతో, గాయాలు, వ్యాధుల నివారణకు ప్రయత్నాలు జరిగాయి. కొన్ని వందల వేల ప్రయత్నాల ఫలితంగా, కొన్ని వ్యాధులు తగ్గటం, మరణాలు తగ్గటం అనుభవంలోకి వచ్చింది. ఆ రకంగా వైద్య విజ్ఞానం ఆరంభమైంది. అంటే, అన్నిటికీ దేవుడే కారణమనే ఆలోచనను పక్కన పెట్టిన నాటి నుండే సైన్స్ ప్రారంభమ యిందన్నమాట. తన అభద్రతా భావం కారణంగా దేవుణ్ణి సృష్టించిన ఆది మానవుడే జ్ఞాన సముపార్జనా క్రమంలో ఆ దేవుణ్ణి తిరస్కరించటం కూడ ప్రారంభించాడు. ఈరోజు మనం నమ్మలేనంత అత్యున్నత స్థాయికి సైన్సు చేరుకున్నప్పటికీ, కరోనా, క్యాన్సర్ లాంటి అనేక సమస్యలకు ఒకస్థాయి మేరకు తప్ప తిరుగులేని పరిష్కారాలు చూపే స్థితిలో లేకపోవటం వల్ల కావచ్చు, ఇంతకు ముందు చెప్పుకున్న ఇతర కారణాల వల్ల కావచ్చు ఇప్పుడు కూడ అడుగడుగునా అభద్రతా భావం ఉంది. అందువల్ల దైవ భావన కూడ ఉన్నతస్థాయిలోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడైతే పాలకులు, రాజకీయ నాయకులు, మేధావులు ప్రజలకు భద్రతను ఇవ్వగలుగుతున్నారో, ఆ మేరకు అక్కడ దైవ భావన, మూఢ నమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా దేవుణ్ణి గురించిన సందేహాలు చాలా కాలం నుంచే ఉన్నాయి.
దేవుడు దీనులయెడ ఉన్నట్లయితే ప్రపంచంలో 'దీనులు' అనే వారసలుండేవారా? దేవుడికైనా, రాజకీయ పార్టీకైనా, ధార్మిక సంస్థకైనా దీన జనోద్ధరణే గీటురాయి. ఆ పని చేయకపోతే దేవుడితో సహా ఆ సంస్థలన్నీ వ్యర్థమే. ''మ్రొక్కిన వరమీని వేల్పును గ్రక్కున విడువంగవలయు'' నని సుమతీ శతక కర్త ఏనాడో చెప్పలేదా? ఇక పరమయోగి గణముల సంగతి. వీరిలో ఖచ్చితంగా దేవుడులేడు. దేవుడి పట్ల వారికి నమ్మకం కూడ లేదు. జబ్బు చేస్తే దేవుడి మీద భారమేసి ఊరకుండరు. డాక్టర్లతో అత్యాధునిక వైద్యం చేయించుకుంటారు. అవసరమైతే విదేశీ వైద్యం. సాక్షాత్తూ దైవ స్వరూపులు, భగవాన్ బిరుదాంకితులైన వీరు కరోనా సమయంలో అందరిలాగే వాక్సినేషన్ వేయించుకున్నారు. మాస్కులను, ఫేస్ షీల్డులను పెట్టుకున్నారు. కొందరు అధికార పీఠాల నధిరోహించి అమాయక ప్రజలపై దమనకాండను ప్రయోగిస్తున్నారు. వారిలో ఉన్న దేవుడే ఈ పనులన్నీ చేయిస్తున్నాడనుకోవాలా? లక్షల కిలోల నెయ్యి, పాలు, తేనె, యాగాలు, అభిషేకాలు చేస్తారు. వారు ఆవాహన చేసుకున్న దేవుడు ఇవన్నీ అడిగాడా? ఈ మహాయాగ సంరంభాలలో గంజి నీళ్ళకు గతిలేక, ఎండిన డొక్కలతో, మానవాకృతిలో నడయాడుతున్న అస్తిపంజరాలకు స్థానమెక్కడ. దీన జనోద్ధరణ పేరుతో ఈ స్వాములు సేకరిస్తున్నదెంతో, పేదలకిస్తున్నదెంతో, తాము మిగుల్చు కుంటున్నదెంతో నిజాయితీగా లెక్కలు చెప్పగలరా? వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్లను కూడ దేవుడే సృష్టించాడు కదా! వాటి నిర్మూలనకు యజ్ఞాలు, పూజలు చెయ్యటం భగవదేచ్ఛకు విరుద్ధం కాదా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని దేవుడికో పెద్ద బిరుదు. ఆయనా పనిచేస్తే కోట్లాది దుష్టులెలా వర్థిల్లుతున్నారు? లక్షల కోట్ల సంపదను కూడబెట్టుకుంటున్న తిరుపతి వెంకన్న దగ్గర నెలకు నాలుగైదు వేలు కూడ పొందలేని కాంట్రాక్టు కార్మికుల ఆర్తనాదాలు ఆ జగద్రక్షకుడికి ఎందుకు వినిపించటంలేదో తెలియదు. దైవ దర్శనం చేసుకొని తరిద్దామనుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు గాని, తిరిగి వచ్చేటప్పుడు గాని ప్రమాదాలకు గురై కొందరు భక్తులు విగతజీవులు కావటం దేవుడి లీల అనుకోవాలా, మానవ తప్పిదాలనుకోవాలా? జీవితమంతా దైవారాధనలోనే వెచ్చిస్తున్న అర్చకులకు కూడ ఈతి బాధలెందుకు తప్పటం లేదు? మనుషులకు సుఖ దుఃఖాలు గత జన్మల సుకృత, దుష్కృతాల వల్ల కలుగుతాయి. దేవుడేమీ చేయడంటారు. అట్లాంటప్పుడు దేవుడి కోసం పరుగులు పెట్టేబదులు పదిమంది మేలు కోసం పాటుపడటం మంచిది కాదా! దేవుడి వెంటే మతాలు, మతోన్మాదాలు, మారణహౌమాలు, మూఢ నమ్మకాలు వస్తుండటం చూస్తున్నాం. అవన్నీ అవాంఛనీయాలేగా? దేవుడు పదార్థం కాదు. ఒక అనుభూతి. ఒక విశ్వాసం. ఒక ఆలోచన అంటారు. కమ్యూనిజం కూడ ఒక ఆలోచనే. కానీ అది శాస్త్రీయమైన ఆలోచన. దాన్ని ఆచరణలోనికి తెచ్చి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలను, దేవుడితో పని లేకుండా, పేదరికం నుంచి, అనారోగ్యం నుంచి, అసమానతల నుంచి విముక్తి చేసి, మానవత్వాన్ని, సమానత్వాన్ని పరిమళింపజేసిన చరిత్ర దానికుంది. దైవ భావన ప్రపంచంలో ఎక్కడైన అలా చేసిందా? చేసిన నిదర్శనలుంటే, ఆ మార్గాన్ననుసరించటానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండనవసరం లేదు. ఎన్ని అడ్డంకులొచ్చినా అభద్రతా భావాన్ని జయించి, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోవటమే మన కర్తవ్యం. సెల్:9246901149
కె. శ్రీనివాసులు