Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భగత్‌సింగ్... ఆ పేరు తల్చుకోగానే భారతీయులలో సాహస స్ఫూర్తి కదలాడుతుంది. తన 23వ ఏటనే దేశం కోసం జీవితాన్ని బలిదానం గావించి దేశభక్తికి, త్యాగానికి, లౌకిక విలువలకు, ఉత్తమ ఆదర్శాలకు ప్రతీకగా నిలిచాడు. తాను ఉరికంబమెక్కి ఆత్మ బలిదానం చేసే నాటికే దేశమంతా బాగా ఎరిగిన మహాత్మాగాంధీ అంతటి పేరు భగత్‌సింగ్‌కూ ఉన్నది. ఒక దశలోనైతే భగత్‌సింగ్ పేరు ప్రఖ్యాతులు మహాత్మాగాంధీని కూడా మించిపోయాయి. భగత్‌సింగ్ యొక్క త్యాగపూరిత చరిత్రనూ అచంచల దేశభక్తినీ శ్లాఘించకుండా ఎవరూ ఉండలేరు. భూస్వామ్య ధనిక వర్గాల ప్రయోజనాలకు నష్టం కలగని స్వాతంత్య్రాన్ని ఆశించిన నాయకులకు భిన్నంగా, స్వాతంత్య్రం అంటే కార్మిక-కర్షక రాజ్యంగా, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దోపిడీ చేసే అవకాశాలు లేని సోషలిజం లక్ష్యంగా ఉద్యమించాలని, అది విప్లవాత్మకమైన మార్పుగా ఉండాలని అత్యంత స్పష్టంగా ఒక శ్రామికవర్గ ప్రత్యామ్నాయాన్ని దేశం ముందు నిలిపిన క్రాంతిదర్శి కామ్రేడ్ భగత్‌సింగ్. నవజవాన్ భారతసభ ప్రధాన కార్యదర్శిగా విప్లవ ఆశయాన్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తి చైతన్యాన్ని ప్రజల్లోకి ప్రత్యేకించి యువకుల్లోకి వ్యాప్తి చేసేందుకు భగత్‌సింగ్ తీవ్రంగా కృషి చేశాడు. తనకంటే ముందు విప్లవకారులుగా కృషి చేసిన గదర్ వీరుల నుండి లౌకిక చింతనను, త్యాగ నిరతిని ఆయన అలవరచుకున్నాడు. 1928 నాటికి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ శాస్త్రీయ సోషలిజం తన సిద్ధాంతంగా ఎంచుకోవడం అందుకు నిదర్శనం. 1928 సెప్టెంబరులో ఢిల్లీ ఫిరోజ్ షా కోటలో రహస్యంగా జరిగిన సమావేశంలో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను, హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్‌గా మార్చి సిద్ధాంత కర్తగా ఎదిగాడు భగత్‌సింగ్. హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ రాజకీయ నాయకుడిగా భగత్‌సింగ్, సైనిక విభాగం అధిపతిగా ఆజాద్ ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత భగత్‌సింగ్ తమ రాజకీయ పంథాను వివరిస్తూ విప్లవమంటే రక్త పాతం, వ్యక్తిగత హింస, బాంబులు పిస్తోళ్ళు కాదని విప్లవమంటే ఈనాటి వ్యవస్థను, దాన్ని కాపాడే శాసనాలను, వాటి ఆధారంగా జరిపే అక్రమాలను అంతం చేయడమే అన్నారు. అలాగే ఒక దేశం మరొక దేశాన్ని, ఒక మనిషి మరొక మనిషిని దోపిడీ చేసే వ్యవస్థ పోవాలంటే అది కేవలం విప్లవం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. విప్లవం ద్వారా కార్మిక, కర్షక రాజ్యమేర్పడుతుంది. దాని ద్వారా పెట్టుబడిదారుల వర్గ దోపిడీ నుండి, యుద్ధాల మారణహౌమం నుండి ప్రపంచ మానవాళిని విముక్తి చేసి సమసమాజాన్ని స్థాపించడమే మా సిద్ధాంతం అన్నాడు. ఒకరిద్దరు వ్యక్తులను హతమార్చడం ద్వారా రాజ్యాధికారం మారదని చెబుతూ, తనను తాను మెరుగు పర్చుకుంటూ భగత్‌సింగ్ టెర్రరిజం నుండి మార్క్సిజం దాకా ఎదిగాడు. దేశంలో శ్రమజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే కార్మిక, కర్షకులు పునాదిగా సోషలిజం, సామ్యవాద వ్యవస్థ నిర్మాణం జరగాలని ఆశించిన సుందర స్వాప్నికుడు, ఆశాజీవి భగత్‌సింగ్. విదేశీ పాలకులతోనూ, వారి తొత్తులతోనూ, సమరశీల పోరాటాలు జరపడమే కాకుండా ఈ పోరాటాలతో పాటు గానే, నూతన సామాజిక వ్యవస్థ ద్వారా దేశాన్ని విముక్తి చేయాలన్నది కూడా వారి అవగాహన. పెట్టుబడిదారీ వర్గాలను, సామ్రాజ్యవాదుల ఆధిపత్యాన్ని పీకి పారేయడానికి భారతదేశంలో ఒకే ఒక్క ఆయుధం ఉందని, ఆ ఆయుధమే శ్రామికవర్గ విప్లవ మంటూ తన భగత్‌సింగ్ ధృడమైన విశ్వాసాన్ని ప్రకటించాడు.
''ఇంక్విలాబ్ జిందాబాద్'' అనే నినాదం ప్రాచుర్యం పొందేలా ప్రచారంలోకి తెచ్చే నాటికే దాని పట్ల భగత్‌సింగ్‌కి ఒక స్పష్టత ఉంది. ఆనాటికి ప్రపంచవ్యాపితంగా పెట్టుబడిదారీ విధానం భయంకరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి ఉంది. అయితే సామ్రాజ్యవాదం నుండి పూర్తి విముక్తి పొందాలని భావించే దేశభక్తి గల జాతీయ శక్తులన్నింటికీ సోవియట్ యూనియన్‌లోని శ్రామికుల రాజ్యం ఆర్ధిక సంక్షోభ రహితంగా అభివృద్ధి పథంలో ఉండటం కూడా ఆనాడు గొప్ప స్ఫూర్తినిచ్చింది. దూరదృష్టి గల రాజకీయ నాయకునిగా ''ఇంక్విలాబ్ జిందాబాద్'' అనే బలమైన నినాదాన్ని దేశానికి అందించిన ఘనత భగత్‌సింగ్‌దే. తాను అనుభవించిన జైళ్ళను, కోర్టులను కూడా పోరాట వేదికలుగా మార్చటమే గాక భగత్‌సింగ్ వాటిని ఒక అధ్యయన కేంద్రాలుగా తయారు చేసుకున్నాడు. క్రూరమైన నిర్బంధ వాతావరణం మధ్య కూడా ప్రపంచ చరిత్రనూ, దేశీయ చరిత్రనూ, సాహిత్యాన్ని, విప్లవ సిద్ధాంత అన్వయాలనూ అధ్యయనం చేశాడు. భగత్‌సింగ్ రాజకీయ జీవితం సుమారు ఏడు సంవత్సరాలే. కేవలం ఏడు సంవత్సరాల రాజకీయ జీవిత కాలంలో విప్లవ దార్శనికతనీ, సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ చైతన్యాన్నీ, విస్పష్టమైన సోషలిస్టు లక్ష్యాన్ని చాటడంతో పాటు వాటిని సాధించటానికి అవసరమైన అంకుఠిత దీక్షాతత్వాన్నీ, త్యాగ నిరతిని ప్రదర్శించిన భగత్ సింగ్‌ను ఈ దేశ పాలకులు నేటికీ సాధ్యమయినంత వరకు విస్మరించే పనిలోనే ఉన్నారు. తన ప్రతి రాజకీయ దశలోనూ నిజమైన లౌకికవాదిగా జీవించిన భగత్‌సింగ్‌ను లౌకికవాదిగా స్మరించని భారతీయ జనతా పార్టీ పాలకులు సావర్కర్‌ని ఒక వీరునిగా ప్రదర్శిస్తున్నారు. తన జీవితకాలంలో మూడు సార్లు బ్రిటిషు పాలకులకు, రెండు సార్లు కాంగ్రెస్ వారికి లొంగుబాట్లు యిచ్చి జైలు నుండి బయటపడాలని చూసిన సావర్కర్, త్యాగజీవి భగత్‌సింగ్‌కు సాటిగా ఎలా నిలవగలుగుతాడు? రాజకీయాలలో మతానికి స్థానం లేదన్న భగత్‌సింగ్‌ది, నేడు మత ద్వేష రాజకీయా లతో అధికారం చెలాయించాలని ప్రయత్నించే హిందుత్వ వాదులది పరస్పర విరుద్ధ చరిత్ర. అందుకే కామ్రేడ్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ను బ్రిటిషు ముష్కరులు ఉరితీసిన మార్చి 23ను లౌకిక ప్రజాస్వామ్య దినంగా ప్రకటించాలి. భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చడానికి బదులు భగత్‌సింగ్ రచనలన్నింటినీ, ప్రధాన భారతీయ భాషల్లోకి అనువాదాలు చేయించి ముద్రించాలి. భగత్‌సింగ్ వీలునామాను విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయిం చాలి. ఉరికంబంపై నిలబడి దిక్కులు పిక్కటిల్లేలా యిచ్చిన నినాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయంటే వారి ఆశయాలు, లక్ష్యాలు ఇంకా సాధించ వలసిన కర్తవ్యాలుగానే మిగిలి ఉన్నాయని గుర్తించాలి. వాటి సాదనకు ముందుకు సాగాలి.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్:9676407140