Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యావకాశాలకూ, అభివృద్ధికీ అందనంత దూరంలో దట్టమైన అడవులలో జీవిస్తున్న ఆదివాసీలు... ఓ వైపు అడవులను తమ పంచ ప్రాణాలుగా భావించే సంస్కృతిని గౌరవిస్తూనే, మరో వైపు తమ జీవనోపాధికి అనివార్యంగా పోడు వ్యవసాయానికి పూనుకోవడం న్యాయ సమ్మతంగా భావించాల్సిందే. భారత ప్రభుత్వం షెడ్యూల్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం 2006 ద్వారా రికగేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. అందులో భాగంగానే 2005 సంవత్సరం వరకు అటవీ భూములలో సేద్యం చేస్తున్న గిరిజనులు, గిరిజనేతర పేదలకు ఒక కుటుంబానికి 4 హెక్టార్లు అనగా 10 ఎకరాల భూములపై సేద్యపు హక్కులు (యాజమాన్యపు హక్కులు కాదు) ఇవ్వడానికి ప్రతి పాదించింది. అదే గిరిజనేతరులైతే మూడు తరాలుగా అనగా కనీసం 75ఏండ్లకు తగ్గకుండా సదరు అటవీ భూములలో సేద్యం చేస్తుంటే వారికి సదరు భూములపై సేద్యపు హక్కులను ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులను జారీచేయడం జరిగింది.
ప్రభుత్వం అడవిపై ఆధారపడి పోడు భూములలో సేద్యం చేసుకుంటున్న గిరిజనులపై ప్రేమతోనో, రాజకీయ లబ్ధి కోసమో, మరే ఇతర కారణంతోనో గాని పోడు చేసుకుంటున్న వారందరికీ సేద్యపు హక్కులను ఇస్తామని ప్రకటించడమే తరువాయిగా రాజకీయ నాయకులు వారి బినామీలు యధేచ్ఛగా అటవీ భూముల కబ్జాను కొనసాగిస్తూ పోడు రైతుల అవతారాలెత్తడం బాధాకరం. ఈనేపధ్యంలో ఒకవైపు లక్ష ఎకరాలకు మించిన అటవీ భూములపై అనర్హులైన వ్యక్తులే దొడ్డిదారిన అటవీ హక్కులను పొందగలుగుతుంటే, మరోవైపు వేలాది గిరిజనులు దశాబ్దాలుగా సేద్యం చేసుకుంటున్న తమ భూముల నుండి అత్యంత దౌర్జన్యంగా వెళ్ళగొట్టబడుతుండటం మహా విషాదం. సదరు పోడు భూముల హక్కుదారు లైన గిరిజనులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించగా పోడు హక్కులు, అటవీ హక్కులు కలిగి ఉండి అటవీ భూములలలో సేద్యం చేసుకుంటున్న గిరిజనులను తుది తీర్పు వచ్చేంత వరకు సేద్యం చేసుకోకుండా నిలిపి వేయరాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపధ్యంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో రిజర్వ్ అడవుల మధ్యలో రెవెన్యూ పట్టాల జారీతో రెవెన్యూశాఖ అటవీ హక్కుల వివాదాలకు ఆజ్యం పోస్తుంటే సదరు అడవులను ఎలా కాపాడాలో తెలియక ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 66లక్షల ఎకరాల విస్తీర్ణంలోనున్న అడవిలో ఇదివరకే 8లక్షల ఎకరాల అడవులు కబ్జాలతో కనుమరుగైతే ఇప్పుడు మరో 10లక్షల ఎకరాల అడవులు కబ్జా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత పోడు భూముల సమస్యపై ఎంతో సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సందర్భాలలో ఈ సమస్యను తానే నేరుగా క్షేత్ర స్థాయికి వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని పరిష్కరిస్తానని చెప్పారు. 2021 డిసెంబర్లో ఓ అత్యున్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర సర్వే ద్వార పోడు భూములను, హక్కు దారులను గుర్తించి అర్హులందరికీ పట్టాలను జారీచేస్తామని ప్రకటించారు. కానీ నేటికీ కమిటీల ఏర్పాటు మొదలు కాక పోవడం, సర్వేను సైతం చేపట్టక పోవడం, ఫలితంగా పోడు భూముల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే సామెతను గుర్తు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వేలాది ఎకరాల పోడు భూములకు నెలవుగా మారిన రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలలోని పోడు రైతులూ, అటవీశాఖాధికారుల మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. రెండేండ్ల క్రితం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సారసాలలో పతాక స్థాయికి చేరుకుని జాతీయ స్థాయి వార్తలలోకి ఎక్కిన ఈ పోడు వివాదం నేటికీ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో రావణ కాష్టంలా మండుతూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏండ్లకేండ్లుగా పోడు చేసుకుంటున్న గిరిజనులపై పీ.డీ.యాక్ట్‌ని విధిస్తూ కేసులు పెట్టడంతో పాటు, రకరకాల చిత్ర హింసలు పెట్టడం (మూత్రం తాగించడం) హేయమైన చర్యగా అభివర్ణించక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయలోపంతో రాజకీయ నాయకుల జోక్యంతో అనర్హులైన కబ్జాకోర్ల ఆక్రమణలతో ఓ వైపు అడవి అంతరించి పోతుంటే మరో వైపు వందల సంవత్సరాలుగా ఆ అడవిని కన్న తల్లిలా కాపాడుతున్న ఆదివాసీలు అక్రమంగా ఆ అడవుల నుండి తరిమివేయబడుతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సమస్య పరిష్కార మవుతుందనే ముక్తాయింపు నివ్వడం తప్ప కనుచూపుమేరలో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న దాఖలాలు కనపడడం లేదు.
ఈ భూమిపై 33శాతం అడవి ఆచ్ఛాదనతోనే ఈ సుందర, సుస్థిర మానవ మనుగడ సాధ్యమని పర్యావరణ వేత్తలు ఘోషిస్తున్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్రంలో 24శాతం అడవులున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే, సాటిలైట్ చిత్రాలు మాత్రం 13శాతానికి మించి అడవులు లేవని చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతరిస్తున్న అడవులను పునరుద్ధరిస్తూ, పునరుజ్జీవింప జేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా కోట్లాది మొక్కల పెంపకంతో అటవీ విస్తీర్ణతను పెంచాలనుకునే ప్రభుత్వ లక్ష్యం అభినందనీయమే. అయితే, వందల సంవత్సరాలుగా సదరు భూములలో పోడుతో పొట్ట గడుపుకుంటున్న గిరిజనులను దౌర్జన్యంగా వెళ్ళగొట్టి అందులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలనే ప్రయత్నం చేయడమే అమానవీయం. తెలంగాణ ప్రభుత్వం వీలైనంత తొందరగా శరవేగంగా అంతరిస్తున్న అడవిని కాపాడాలంటే పోడు భూములు, అటవీ హక్కుల సమస్యని పరిష్కరించాలి. నిజానికి అడవులను ఆనుకొని, అడవిలో భాగంగా కొనసాగుతున్న భూములు ప్రభుత్వ భూములా? అటవీ భూములా? అనేది తేల్చడానికి కృత్రిమ మేథస్సు ఆధారంగా అత్యంత ఆధునిక సాంకేతిక సాధనాలతో సమగ్ర సర్వే జరిపి ఈ రాష్ట్రంలో, రెవెన్యూ, రిజర్వ్ అటవీ భూముల రికార్డులను తయారుచేయాలి. ఆ తర్వాతనే సదరు అటవీ భూములలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అటవీశాఖాధికారులకు ఆదేశాలను జారీచేయాలి. అప్పుడే తెలంగాణ ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అయిన హరితహారం విజయవంతమై పర్యావరణ పరిరక్షణకోసం కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి అడవిని సృష్టించిన గొప్ప రాష్ట్రంగా చరిత్రలో నిలచిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారంపట్ల వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే. మానవ మనుగడకే కాదు సకల జీవ జాతుల మనుగడకూ అటవీ సంరక్షణ అనివార్యమనే సత్యాన్ని మరిచి పోకుండా అడవికీ అడవి బిడ్డలైన ఆదివాసీలకు మధ్య తరతరాలుగా కొనసాగుతున్న బంధాన్ని మరింత సుస్థిరం చేయాలి. అదే విధంగా గిరిజనేతరుల చేత జరుగుతున్న అటవీ ఆక్రమణలకు ప్రభుత్వాలు చరమగీతం పాడాలి. రాజకీయ ప్రయోజనాలకు అడవులు బలైపోకుండా కఠినమైన చట్టాలతో పాలకులు ముందుకు సాగాలి. అది జరిగినప్పుడే తెలంగాణ నేలమీద 33శాతం అడవి ఆచ్ఛాదన ఏర్పడి దానితో పాటు పర్యావరణ పరిరక్షణ జరిగి సుస్థిరతతో కూడిన అభివృద్ధితో మానవ జీవనం సుసంపన్నం మవుతుంది.
- నీలం సంపత్
సెల్ 9866767471