Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భవిష్యత్ అవసరాలకు తగిన విద్యను బలోపేతం చేయడంలో పిల్లలు, యువత, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, క్రియాశీలురు, ఉద్యోగులు, సాంస్కృతిక మత పెద్దలు, పౌరసమాజాలు తమ వంతు కర్తవ్యాలను నిర్వహించాలి. యునెస్కో నివేదికను ఆచరణలో పెడుతూ, మన రాబోయే తరాల భవిష్యత్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించగల సామాజిక ఒప్పందంగా నాణ్యమైన విద్యను మార్చుకుంటూనే, విభేదాలు, విధ్వంసాలు, కాలుష్యాలు, అసమానతలు, అవిద్యలేని మానవాళిని నిర్మించుకుందాం, సమసమాజ స్థాపనకు సుస్థిర అడుగులు వేద్దాం.
గత 75ఏండ్లుగా ఐక్యరాజ్యసమితి ముఖ్యశాఖగా యునిస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. మానవ హక్కుల పరిరక్షణ, ప్రపంచ శాంతి, అసమానతల లేని సుస్థిరాభివృద్ధి లాంటివి విద్యతోనే సుసాధ్యం అవుతాయని భావించి 2019లో యునెస్కో స్థాపించిన 'ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్' కమిటీ రెండేండ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేసి 'విద్య ఒక నూతన సామాజిక ఒప్పందం (ఏ న్యూ సోషియల్ కాంట్రాక్ట్ ఫర్ ఎడ్యుకేషన్)' పేరుతో నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక తయారీలో దాదాపు ఒక మిలియన్ పౌరులు, పలు దేశాల ప్రభుత్వాలు, సంస్థలు, సంఘాలు, పౌర సమాజాల అభిప్రాయాలను సేకరించి విశ్లేషించారు. భవిష్యత్ తరాలకు జరుగబోయే సామాజిక అన్యాయాలకు సరైన సమాధానాలను విద్య మాత్రమే ఇవ్యగలదని, 'విద్య సమాజ సర్వరోగ నివారిణి' అని నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచ మానవాళితో పాటు భూగ్రహానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. కరోనా మహమ్మారి మన బలహీనతలను, పరస్పర అనుసంధానాల పరిమితులను బహిర్గతపరిచింది. కరోనా అకాలంలో విశ్వవ్యాప్తంగా 1.6బిలియన్ల విద్యార్థులు బడులకు దూరమైనారు. గత చరిత్ర గుణపాఠాల పునాదులుగా భవిష్యత్ విద్యా విధానాలను సత్వరమే మార్చుకుంటూ ముందడుగు వేయాలి. ఇప్పటి వరకు నెరవేరని వాగ్దానాలను సాకారం చేసుకుంటూ పిల్లలు, యువత, పెద్దలకు జీవితకాలం విద్య అందుబాటులో ఉండేలా, సుస్థిరాభివృద్ధి దిశగా మానవాళి సమన్వయంతో సాగాలి. నేడు నెలకొన్న అన్యాయాలకు సరైన సత్వర మరమ్మత్తులు చేస్తూ భవిష్యత్ తరాల నిర్మాణం జరగేలా 'విద్య ఒక సామాజిక ఒప్పందం'గా రూపాంతరం చెందాలని నివేదిక ప్రధానంగా విశ్లేషించింది.
ప్రపంచం నేడు అతి ముఖ్య మలుపులో నిలబడింది. డిజిటల్ యుగం భూమిని కుగ్రామంగా మార్చేసింది. దేశ సరిహద్దులు కేవలం గీతలుగానే మిగిలి పోతున్నాయి. విద్య అంతర్జాతీయ విహంగ వాహనం అయ్యింది. మానవ సమాజంతో పాటు భూగ్రహం కూడా సంక్షోభపు అంచున నిలబడింది. మానవాళి ఆనాదిగా పలు సమస్యలతో సంసారాలు చేస్తున్నది. మన విద్యా విధానం ఈ ప్రధాన సమస్యలకు నేటికి పూర్తిగా సమాధానాలు చూపలేక పోయింది. వర్తమాన, భవిష్యత్తు తరాల సుఖజీవన బాధ్యత మనందరి మీద ఉంది. సమస్యల సాధనలో మానవ అపార శక్తి, వనరులు పరిపూర్ణంగా వినియోగపడడం లేదు. 2050 నాటికి మానవాళి శాంతియుత జీవనానికి నూతన విద్య మార్గదర్శనం చేయాలి. మానవ సమాజ పరివర్తనానికి విద్య ప్రధాన సామాజిక ఒప్పంద సాధనం కావాలి. సామాజిక న్యాయం, పరస్పర మర్యాద, మానవ గౌరవం, సాంస్కృతిక వైవిధ్య విలక్షణతలతో పాటు వివక్ష లేని సమాజ స్థాపనకు విద్య ఒక సామాజిక ఒప్పందంగా ఉపకరించాలి. నీతి పరిరక్షణ, మానవాళి అన్యోన్యత, సంఘీభావాలను విద్య సృజించాలి. అందరం కలిసి భూమిని నందనవనంగా మార్చగలిగే శక్తియుక్తులను విద్య అందించాలి. గురువులు సమాజ మేథో నిర్మాతలుగా విజ్ఞానం, వివేకం, ఆవిష్కరణ, సుస్థిరాభివృద్ధి మార్గాలను చూపిస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ న్యాయాలను అందించాలి. 'మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ హుమన్ రైట్స్)'లోని ఆర్టికిల్-26 ప్రకారం అందరికి 'విద్య హక్కు' కల్పించబడిందని గుర్తు చేసిన నివేదిక నేడు 'జీవితకాలపు నాణ్యమైన విద్య హక్కు' కావాలని, విద్య ఒక సామాజిక ఒప్పందంగా అన్ని సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఉండాలని భావించింది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సమాచార, సంస్కృతిక, వైజ్ఞానికశాస్త్ర హక్కులతో కూడిన నవ్య విద్యావిధానం కావాలని కాంక్షిస్తున్నది. ప్రజా ప్రయత్నం, క్షేమ సమాజ స్థాపనకు విద్య బలోపేతం కావాలి. సామాజిక ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య విధ్వంసం లాంటివి ఇలాగే కొనసాగితే ప్రాణికోటితో పాటు ధరణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని గమనిస్తూ నాణ్యమైన విద్య అందేలా సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి. ఏ ఆధునిక పోకడా శాశ్వతంకాదని (నో ట్రెండ్ ఈజ్ ఫైనల్), మార్పు అనివార్యమని తలచి విద్యా విధానాలను సత్యమనంగా మార్చుకోవాలి. కర్బన ఉద్గారకాలను తగ్గించుకుంటూ హరిత ఆర్థిక విధానాలను నేర్చుకోవాలి. వివక్ష, అన్యాయ అరాచకాలులేని భూవాతావరణాలను నెలకొల్పాలి. నేటి అత్యాధునిక డిజిటల్ విప్లవాలను సుస్థిర మార్పుల దిశగా వినియోగించుకోగలిగే విద్య కావాలి. సమస్త మానవాళికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించగలిగే నాణ్యమైన విద్యను ప్రోత్సహించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విజ్ఞానం, ప్రపంచాల మధ్య అవినాభావ సంబంధాలు, వినూత్న ఆలోచనలను ఇవ్యగలిగే సామాజిక ఒప్పందంగా విద్య రూపాంతరం చెందాలి.
సమన్వయం, సహకారం, సంఘీభావం అనబడే సూత్రాలకు బోధనాశాస్త్రం కట్టుబడి ఉండాలి. పక్షపాతం, హాని, విభజన భావాలను పాతరేయాలి. పాఠ్యాంశాల్లో పర్యావరణ సంబంధమైన, అంతర్ సాంస్కృతిక, బహుశాఖల (మల్టీడిసిప్లెనరీ) విద్యాంశాలకు ప్రాధాన్యం కల్పించాలి. సామాజిక, విద్యా పరివర్తనాల బోధనలకు ఉపాధ్యాయున్ని కేంద్ర బిందువును చేయాలి. అసమానతలను పాతరేస్తూ అన్నివర్గాల ప్రజలకు సహకారం, సమన్వయం, సమన్యాయం, సుస్థిరాభివృద్ధి, సమాన అవకాశాలను అందించే కేంద్రాలుగా విద్యా సంస్థలు నిలబడాలి. విద్య జీవితకాలం సన్మార్గంలో నడిపించగలిగే ఉత్తమ సాధనం కావాలి. కాలానుగుణంగా పరిశోధనలు, ఆవిష్కరణలు కొనసాగాలి. ప్రపంచ సంఘీభావం, అంతర్జాతీయ సమన్వయాలను బలపరిచే విద్య కావాలి. నూతన సామాజిక ఒప్పందమైన విద్యను అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు చురుకుగా బోధించే బాధ్యతను తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలకు తగిన విద్యను బలోపేతం చేయడంలో పిల్లలు, యువత, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, క్రియాశీలురు, ఉద్యోగులు, సాంస్కృతిక మత పెద్దలు, పౌరసమాజాలు తమ వంతు కర్తవ్యాలను నిర్వహించాలి. యునెస్కో నివేదికను ఆచరణలో పెడుతూ, మన రాబోయే తరాల భవిష్యత్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించగల సామాజిక ఒప్పందంగా నాణ్యమైన విద్యను మార్చుకుంటూనే, విభేదాలు, విధ్వంసాలు, కాలుష్యాలు, అసమానతలు, అవిద్యలేని మానవాళిని నిర్మించుకుందాం, సమసమాజ స్థాపనకు సుస్థిర అడుగులు వేద్దాం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్:9949700037
(యునెస్కో సౌజన్యంతో 'ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ది
ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్' సమర్పించిన నివేదిక ఆధారంగా)