Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి ప్రసాధించిన వనరులతోనే ప్రాణికోటి మనుగడ సాగుతోంది. అందులో నీరు మనకు ప్రాణాధారమ య్యింది. నీటి వనరుల్లో సాగరాలు, సరస్సులు, చెరువులు, ఆనకట్టలు, భూగర్భ జలాలు, ఉపరితల జలాలు, మంచు కొండలు, గ్లేసియర్లు లాంటివి ప్రముఖంగా వస్తాయి. ఉపరితల జల నిధులు, భూగర్భ జల సంపదలతోనే సకల జీవరాశులు మనుగడను సాగిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భూఉపరితల జలాలతో పాటు భూగర్భ జల వనరులను కాపాడుకోవడానికి వేరు వేరు మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. ఉపరితల జల నిధులు పెరిగితే భూగర్భ జలాలు సమధిగా లభిస్తాయనే విషయం మనకు తెలుసు. ఊరి చెరువు మత్తడి దునికితే ఆ ఊరి వ్యవసాయ బావుల్లో భూగర్భ వనరులు పొంగి పొర్లుతాయి.
తరుగుతున్న భూగర్భ జలాలు
నానాటికీ తరిగి పోతున్న ఉపరితల జలరాశులను కాపాడుకోవడానికి మానవ సమాజం తగు ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పారిశుద్ధ్య వ్యవస్థలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణ మార్పులకు భూగర్భ, ఉపరితల జలాలే ఆధారమని తెలుసుకోవాలి. భూగర్భ జలనిధులు తరిగిన కొలది నీటి కొరత, నీటి నాణ్యతకు తూట్లు పడడం జరుగుతున్నది. మే-2022లో నిర్వహించనున్న 'గ్రౌండ్ వాటర్, కీ టు ది సస్టేనబుల్ డెవలప్మెంట్ గోల్స్' అనబడే అంతర్జాతీయ సదస్సుతో పాటు డిసెంబర్ 2022లో జరుగబోతున్న 'యూయన్ - వాటర్ సమ్మిట్ ఆన్ గ్రౌండ్ వాటర్' జరుగనున్న నేపథ్యంలో జల సంరక్షణ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ దేశాల్లో భూగర్భ జలాల మీద ఇండియా అత్యధికంగా ఆధారపడి ఉన్నది. 2017 ఏడాదిలో 248.69 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అందుబాటులో ఉండగా, ఇండియాలో వాడబడే భూగర్భ నీటి నిధుల్లో 89శాతం వ్యవసాయ రంగానికి, 9శాతం గృహ అవసరాలకు, 2శాతం పారిశ్రామిక అవసరాలకు వాడుతున్నాం.
భూగర్భ జలాలు తరిగితే!
'సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్' అంచనాల ప్రకారం వార్షికంగా అందుబాటులో ఉండే భూగర్భ జలాల్లో 70శాతం వరకు మాత్రమే వాడుకోవచ్చని నిర్ణయించారు. భారతదేశం 2004లో 58శాతం, 2017లో 63శాతం వరకు భూగర్భ జలాలను వినియోగించడం గమనించారు. దేశంలోని పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, చంఢఘీర్, హిమాచల్, తమిళనాడు, పుడుచ్చెరి రాష్ట్రాలు దాదాపు 70శాతం వరకు వాడడం జరిగింది. భారతంలోని 22 రాష్ట్రాలు, యూటిల్లోని 534జిల్లాల్లోని 202జిల్లాలు దాదాపు 71 నుంచి 385శాతం వరకు వినియోగించుకోవడం కొంత భయానికి కారణమవుతున్నది. 2030 నాటికి దేశంలోని అన్ని జిల్లాలు 70శాతం వరకు మాత్రమే వాడుకునేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. భూగర్భ జలాలను అధికంగా తోడినపుడు జలంలో ప్రమాదకర ఫ్లోరైడ్, ఐరన్, లవణ ధర్మం, నైట్రేట్స్, ఆర్సెనిక్ పరిమాణాలు పెరిగి ప్రజారోగ్యం సంక్షోభంలో పడవచ్చని హెచ్చరిస్తున్నారు. 2006లోనే 109 జిల్లాల్లో నైట్రేట్ సమస్యలను ఎదుర్కోగా నేడు 335 జిల్లాలు ప్రమాదపు అంచున నిలబడడం గమనించారు.
భూగర్భ జలాల వద్ధికి చర్యలు
ప్రస్తుత 'సెంట్రల్ వాటర్ కమిషన్'తో పాటు 'సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు'లను ఏకం చేస్తూ భూగర్భ, ఉపరితల జలాల నియంత్రణకు నడుం బిగించాలని 2016లోనే 'మిహిర్ షా కమిటీ' సిఫార్సు చేయడం కూడా గుర్తు చేసుకోవాలి. స్థానిక వనరులను దృష్టిలో ఉంచుకొని వర్షపు నీరు, ఉపరితల జలం, నేలలో నీరు (సాయిల్ వాటర్), భూగర్భ జల లభ్యతలను పరిగణనలోకి తీసుకొని అవసర ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. భూగర్భ జలాలతో ఉపరితల జలాలను అనుసంధానం చేయడానికి ప్రాంతాల వారీగా చొరవ తీసుకోవాలి. ఉపరితల, భూగర్భ జలాల లభ్యతల ఆధారంగానే వ్యవసాయ పంటలను, పంటల సాంద్రతలను నిర్ణయించుకోవాలి. నేడు లాభార్జనే ద్యేయంగా సాగుతున్న కార్పొరేటు శక్తులు, తమ పారిశ్రామికావసరాల కోసం విచక్షణారహితంగా భూగర్భ జలాలను తోడుకుంటుంటే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడనున్నాయని గమనించాలి. భూగర్భ జలాలతో నీటి ఎద్దడి, శుష్క భూములు, పాక్షిక శుష్క ప్రాంతాల అవసరాలు తీరడానికి ప్రభుత్వ చట్టాలకు మరింత మెరుగు పెట్టాల్సిన అగత్యం ఏర్పడుతున్నది. భూగర్భ జలాల లభ్యతతో సామాజిక-పర్యావరణ సవాళ్లు ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వాలు సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన, పాలనపరమైన మధ్యవర్తిత్వాలు సకాలంలో జరిగితే రాబోయే తరాలకు నీటి లభ్యత సమస్యలు ఉండవని గమనించాలి. జలంతో జీవనం, జీవనంతోనే ఆరోగ్యం లభిస్తుంది. భూగర్భ, ఉపరితల జల వనరులను అమూల్య జాతి సంపదగా గుర్తించి కాపాడుకుందాం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్:9949700037