Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కులనిర్మూలనే ధ్యేయంగా తన యావజ్జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతి నేడు. సామాజిక, ఆర్థిక అసమానతలులేని సమాజం దిశగా భారతదేశాన్ని నిర్మించాలనుకొన్న అతి కొద్దిమంది జాతీయ నాయకుల్లో ఆయనొకరు. స్వాతంత్య్రం సంపన్నులకు, అగ్రకులాల ఆధిపత్యానికి కాకుండా సర్వమానవాళికీ రావాలని, నూటికి 25మందిగా ఉన్న దళితులు, ఆదివాసీలకూ, సగభాగంగా ఉన్న మహిళలకూ స్వేచ్ఛలేని సమాజంలో స్వాతంత్య్రానికి అర్థం ఉండదని ఆయన ఆనాడే తెగేసి చెప్పారు. సామాజిక అసమానతలతో కూడిన మతమే హిందూయిజమని, దాని నుండి బయటకొస్తేనే దళితులకు విముక్తి లభిస్తుందని ఆయన చాటి చెప్పారు. కుల వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాలను అధ్యయనం చేసిన ఆయన దానికి వ్యతిరేకంగా పలు గ్రంధాలు, వ్యాసాలు రాశారు. ఎన్నో ఉపన్యాసాలు చేశారు. వాటిలో కుల నిర్మూలన అనే రచన అగ్రభాగాన ఉంది. 1936లో లాహౌర్‌లోని జాట్పాత్ తోడక్ మండలి సమావేశంలో ఆయన్ను ఉపన్యాసిం చాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఆ ఉపన్యాస పాఠాన్ని చదివిన నిర్వాహకులు ఉపన్యాస పాఠంలో ఎన్నో మార్పులు సూచించారు. అందులో ఒక్క కామా కూడా మార్చనని అంబేద్కర్ పట్టుబట్టడంతో ఆయన ఉపన్యాసం రద్దయింది. అంబేద్కర్ తన అభిప్రాయాలతో ఎప్పుడూ, ఎక్కడా రాజీపడలేదు. ప్రత్యేక నియోజకవర్గాల రిజర్వేషన్ల విషయంలో గాంధీతోనే ఘర్షణకు దిగారు. వేల మందిని సమీకరించి మహద్ చెరువు నీళ్లను చేతిలోకి తీసుకొని అంటరానితనాన్ని బహిరంగంగా సవాల్ చేశారు. 1930లోనే నాసిక్ జిల్లాలోని కలారం దేవాలయ ప్రవేశం కోసం 15వేల మంది కార్యకర్తలను సమీకరించి అగ్రకుల అహంకారానికి సమాధి కట్టారు. సామాజిక అసమానతలకు మూలమైన మనుస్మృతిని 1927 డిశంబర్ 25న వేలాది మంది సమక్షంలో బహిరంగంగా తగులబెట్టారు. ఇలా స్వాతంత్రోద్యమంలో అంతర్భాగంగానే కులవివక్షపై దండయాత్ర చేశారు. అంబేద్కర్ ఒక్క దళితుల సమస్యలే కాదు అణగారిన వర్గాల తరపున కూడా పోరాడుతూ 1936లో స్వతంత్ర కార్మిక సంఘాన్ని స్థాపించి, బట్టల మిల్లు కార్మికుల హక్కుల కోసం సమ్మె చేశారు. హిందూ మతంలో స్త్రీలు దారుణ అవమానాలకు, హింసకు గురవడాన్ని ఆయన గుర్తించారు. మనువాదం నుండి హిందూ మహిళలకు విముక్తి కావాలని ఆయన కోరుకున్నారు. దాని కోసమే ఆయన తన మంత్రి పదవిని సైతం విడిచిపెట్టి పదవుల కన్నా తనకు మానవ హక్కులే మిన్న అని చాటి చెప్పారు.
ఆయన తన జీవితంలో ఎక్కడా హిందూ మతంతో గానీ, మతోన్మాదులతో గానీ రాజీపడకుండా తుది శ్వాస విడిచే వరకూ పోరాడుతూనే వచ్చారు. కానీ ఆర్ఎస్ఎస్ వారు మాత్రం తన హిందూ మత ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, అంబేద్కర్‌ను అన్యాయంగా అడ్డం పెట్టుకొని హిందూ ధర్మకర్తల జాబితాలో చేర్చేశారు. కొంత మంది దళిత మేధావులు అంబేద్కరిస్టులమని చెప్పుకుంటూ బీజేపీ పంచన చేరి అంబేద్కర్‌కు కళంకం తెస్తున్నారు. 1946లో అంబేద్కర్‌ను రాజ్యాంగ పరిషత్‌కు చైర్మన్‌గా నియమించిన రోజు ఆర్ఎస్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించడానికి అంబేద్కర్ ఎవరంటూ విమర్శల వర్షం కురిపించింది. ఇది పశ్చిమదేశాల ప్రజాస్వామ్యమని, ఇలాంటి ప్రజాస్వామ్యం మన దేశానికి సరిపోదని, దాని స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టాలని ఆనాడు వారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే తూలనాడారు. గాంధీని హత్య చేసిన గాడ్సేకి జన్మనిచ్చిన ఆర్ఎస్ఎస్ 2002 దాకా జాతీయ పతాకాన్ని సైతం గుర్తించలేదు. జాతీయ సమైక్యతను బోధించే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం జనగణమన కూడా వీరికి అస్సలు రుచించదు. జైహింద్ అన్న సుభాష్ చంద్రబోస్, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్‌సింగ్ వీరి దృష్టిలో అసలు జాతీయ నాయకులే కారు. నేడు ఆర్ఎస్ఎస్ కీర్తిస్తున్న సర్దార్ వల్లభారు పటేల్ నాడు గాంధీ హత్యానంతరం ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. ఇలా అంబేద్కర్ సహా అనేక మంది జాతీయ నాయకులు ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకులే. కులం అనేది హిందూ మతానికి రాచపుండుగా ఉందని వివేకానందుడే వర్ణించారు. కానీ ఆర్ఎస్ఎస్ ఏనాడూ కుల వ్యవస్థను వ్యతిరేకించి పోరాడిన చరిత్ర అసలే లేదు. ఇప్పటికీ మనుస్మృతినే ఆధునిక రాజ్యాంగంగా వాళ్ళు భావిస్తుంటారు. ఇలాంటి వారికి అంబేద్కర్ పేరు చెప్పుకొనే అర్హత కూడా లేదు. ఒకవైపు అంబేద్కర్ పేరు వాడుకుంటూనే, మరోవైపు అన్ని కులాలను అణచివేసి హిందుత్వలో కలిపి వేయాలన్నదే సంఫ్‌ుపరివార్ వ్యూహం. అంబేద్కర్ వ్యతిరేకించి పోరాడిన అసమాన హిందూ సమాజాన్నే దళితుల నెత్తిన రుద్దాలనే కుట్ర వారిది. దళితులపై జరిగే దాడుల్లో ఆర్ఎస్ఎస్ అగ్రభాగాన ఉంటుంది. ఎక్కడా దళితుల పక్షాన నిలబడిన చరిత్ర ఆర్ఎస్ఎస్కు లేదు. కేంద్రంలో ప్రభుత్వ నిర్వహణలోనూ ఇదే వివక్ష పాటిస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సమాధి కట్టారు. దానికి చట్టబద్దత కల్పించడానికి బదులుగా ఉన్న హక్కును కూడా లాగేసి దాన్నొక పనికిరాని పథకం కింద మార్చేశారు. సగానికి సగం నిధులు కోతపెట్టారు.
మోడీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి. అందులోనూ దళిత మహిళలపై అత్యాచారాలు దారుణంగా పెరిగాయి. దేశంలో ఉన్న తెలుగు, మళయాళీ, తమిళ, బెంగాలీ, పంజాబీ, కాశ్మీరీ వంటి జాతులన్నింటినీ అణచివేసి, వాటి గుర్తింపును రద్దుచేసి, ఒక్కటే జాతి అంటూ ఉన్నత కులాల ఆర్య సంస్కృతిని దేశంపై రుద్దే ప్రమాదక విధానాన్ని అనుసరిస్తోంది బీజేపీ. ఇది జాతి ఉనికినే దెబ్బతీస్తుంది. ఇలాంటి విషబీజాలు నాటుతూ దానికి అంబేద్కర్ పేరును వాడుకోవడం దుర్మార్గం. దళితులకు భూమి, ఉపాధి, న్యాయమైన వేతనాలు, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ నిధులు, అత్యాచారాలు, దాడుల నుండి రక్షణ, మహిళలకు మానవ హక్కులు వంటి అనేక సమస్యలపై సమైక్యంగా ఉద్యమించడం ద్వారానే ఈ మతోన్మాదాన్ని ఓడించగలం. అంబేద్కర్ ఆశించినట్టు కులనిర్మూలన జరగాలంటే దానికి ఆటంకంగా ఉన్న మనువాదాన్ని ఓడించాలి. ఆ మనువాదానికి నిలువెత్తు ప్రతినిధిగా ఉన్న సంఫ్‌ు పరివార్ నేడు దళితులకు, సామాజిక ఉద్యమాలకు ప్రధాన ఆటంకం. ఈ శక్తులపై పోరాటమే అంబేద్కర్‌కు మనం అందించే నివాళి. వర్గ ఉద్యమాలతో సామాజిక ఉద్యమాలను అంతర్భాగం చేసి సమైక్యంగా సకల పీడిత జనంతో ముందుకు నడవడమే సామాజిక, ప్రజాతంత్ర శక్తుల ముందున్న కర్తవ్యం.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140