Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా రెండు ప్రశ్నలకు పౌరులందరూ సమాధానాలు వెతకాలి. ఒకటి బాబా సాహెబ్ ఆశించిన ''దేశ ప్రగతి'' స్వతంత్య్ర భారత్ సాధించిందా లేదా? రెండవది ఆ బానిసత్వపు ''కుల వివక్ష'' ఇంకా భారత సమాజంలో ఉన్నదా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. వారి ఆశయాలూ- ప్రస్తుత పరిస్థితులపై కొంత పునఃపరిశీలన అవసరం. ఆర్థిక అసమానతల తొలగింపునకు విద్యావకాశాలు ఉపాధి అవకాశాల పట్ల అంబేద్కర్ స్పష్టమైన ప్రణాళిక ప్రకటించారు. 1970వ దశకం వరకు ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పడం, ఉపాధి కల్పనకు ప్రభుత్వమే ప్రణాలికలను రచించడం జరిగి చాలా వరకు పాటించబడినవి కూడా. ఆ తరువాత అది తగ్గుముఖం పట్టి, 90వ దశకం నుండి తిరోగమనం మొదలైంది. చివరికి రాజ్యాంగంలో పొందుపరచబడిన స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే నాలుగు ప్రధాన అంగాలకు ఈరోజు భంగం ఏర్పడుతుంటే చూస్తూ ఉండి పోవటమూ బానిసత్వమే. నిన్నటికినిన్న ఢిల్లీలో గోమాంసం పేరుతో పట్టపగలు సాటి మనిషిని కొట్టి చంపారు. హిజాబ్ వివాదంతో బాలికలను బడికి దూరం చేస్తున్నారు. ఏ మాంసం తినాలో, అది ఎవరు కోయాలో(హలాల్ మాంసమని, జట్కా మాంసమని కర్నాటకలో గొడవలు జరుపుతున్నారు), ఏ గుడి ముందు ఎవరు పండ్లు కూరగాయలు అమ్మాలో మతాల ఆధారంగా నిర్ణయిస్తున్న ఈ చాందస వాదులను ఎదుర్కోకపోతే బానిసత్వమే. ఈ రోజు ముస్లింలను దేవాలయాల దగ్గర వ్యాపారాలు చెయ్యొద్దన్న వీరు కులాల ప్రాతిపదికన ఎందరినో ఎన్నో పనుల నుండి నిషేధించడానికి సిద్దంగా ఉన్నారన్నది నిజం. ఇదా అంబేద్కర్ ఆశించిన దేశ ప్రగతి పథం?
అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం వారోత్సవాలు అంటూ ప్రయత్నాలు మొదలు పెట్టింది. యూపీ ప్రభుత్వం దళిత వాడలకెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని అధికారులను ఆదేశించింది. ఎబివిపి లాంటి విధ్యార్థి సంఘాలు కూడా అందుకు తీవ్ర కృషి చేస్తున్నాయి. మొన్నామధ్య నేతాజీ సుభాష్ చంద్రబోస్ హౌలోగ్రామ్ని ప్రధాని ఆవిష్కరించారు. అంతకుముందే వల్లభారు పటేల్, శివాజీల విగ్రహాల నెలకొల్పడం తెలిసిందే. మహనీయుల విగ్రాహలు నెలకొల్పడంపై ఉన్న శ్రద్ద వారి ఆశయ సాధనపై లేకపోగా ఆ మహనీయుల ఆలోచనా విధానాలకు కట్టు కథలు అల్లి ప్రచారంలో పెడుతున్నారు. భారత రాజ్యాంగ పుస్తకానికి కవర్ పేజీని భారతంలో అర్జునుడి యుద్ధానికి సంబంధించిన ఒక బొమ్మతో అంబేద్కరే ముద్రించారని, హిందూ జాతికి ప్రతీకయైన భారతాన్ని ఆయన ఇష్టపడే వారని, కొందరి వొత్తిడి వల్ల వారు దానిని తొలగించవలసి వచ్చిందని ఒక కట్టుకథ అల్లి సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టారు. ఇది ఎంతటి తప్పు! ఇతిహాసాలను, పురాణాలను చరిత్రగా ప్రకటిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కొందరు సంకుచిత స్వభావులు ఈ మహానుభావులకు కూడా లేని రంగులు అద్దజూస్తున్నారు. వివేకానందుణ్ణి హిందూ మతానికి ప్రతీకగా ప్రచారంలోపెట్టి సఫలమయ్యరు. నిజానికి ఆయనొక మానవతావాది(ఫిలాంత్రొపిస్ట్). ఒక సారి కొందరు మతస్తులు వెళ్ళి ''అయ్యా మనుషులు పశు సంపదను భుజించే సంప్రదాయాన్ని విడనాడమని చెప్పవలసినదిగా'' వేడుకొనగా వారు సమాధానమిస్తూ... ''నా మనిషి తాను జీవించడాని ఏదైనా భుజించవచ్చు'' అని సమాధానమిచ్చాడట. విప్లవానికి నాంది పలికిన భగత్సింగ్కూ మతం రంగు పులిమి తాము వారి వారసులుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవైపు గాంధీజీని పొగడ్తారు మరోవైపు వారి పరివారమంతా ఆయన్ని అవమానిస్తూ గాడ్సేని దేవుడంటారు! అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేస్తున్న వారి అల్లరి మూకను యధేచ్ఛగా వదిలేసి ఆయన విగ్రహాలకు దండలేసి దండం పెట్టజూస్తారు!!
సామాజిక అసమానతలకు కారణం కులం. ఆ కుల ప్రాతిపదికననే విద్యావకాశాలు, ఉపాది అవకాశాలు కొందరికే పరిమితం చేయబడినవని, దానివల్లనే వివక్ష ఏర్పడుతోంది అన్నది అంబేద్కర్ నిర్ధారణ. కుల నిర్మూలన జరగడమే అంతిమ పరిష్కారమని కూడా వారి ఆలోచన. కానీ నేడు కులమనే బండరాళ్లను దాటి ఈదలేక పోతున్న ప్రజలపై మతం అనే సునామీ విరుచుకుపడి ముంచేసింది. మత ప్రాభవానికి పెద్ద పీట వేయాలనుకునే వారెవరు కుల వివక్ష గురించి నోరు ఎత్తరు. మరి వీటిపై పోరాటం చేయవలసిన బాధ్యత అంబేద్కర్ వాదులదేగా! ''ఒక దళితుడు ఇంకొక దళితుడితో సహవాసం చేస్తున్నానని చెప్పుకోవడం కన్నా ఒక అగ్రవర్ణ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నానని చెప్పుకోవడానికి గర్వ పడతాడని, అలాంటి వాళ్ళ ఉదాహరణలు ఎన్నో ఉన్నాయ''ని ఒక మిత్రుడు నాతో వాపోయాడు. ఇలాంటి పోకడలే నిజమైతే అది భానిసత్వ ఆలోచన కాదా? కుల సంఘాలు వెల్ఫేర్ అసోసియేషన్లు ఒక అస్తిత్వ వాదానికి ఆనవాలుగా మారాయి తప్ప అంబేద్కర్ ఆశయ సాధనలో ఏమైనా ముందడుగు వేస్తున్నాయా? స్వీయ విమర్శ అవసరం. అంబేద్కర్ ఎప్పుడూ కుల సంఘాలను కోరుకోలేదు. కుల వివక్షపై పోరాటాన్ని, దానికోసం అన్ని కులాల నుండి స్పందన కావాలని కోరుకున్నాడు.
ఆయన గురించి చదువుతూ, వింటూ ఉంటే అయిన ఆశయాల కోసం పరితపించి, పని చేస్తూ ఉంటే వారి ఆలోచనా విధానంలోని అసలు కోణం అర్థమవుతుంది. బాబా సాహెబ్ వివక్షా రహిత సమాజాన్ని కోరుకున్నాడు తప్ప ఒక కులం మరొక కులంపై ఆధిపత్యం చెలాయించాలని గాని, ఒక మతం ఇంకో మతంపై అజమాయిషీ చేయాలని గానీ ఇంకా వివరంగా చెప్పాలంటే దళిత బహుజనులు ఉన్నత కులాలుగా భావింపబడుతున్న అగ్రవర్ణాలపై పెత్తనం చేయాలనికూడా ఏనాడూ కోరుకోలేదు. మనుషుల్లోని సామాజిక ఆర్థిక వ్యత్యాసాలకి కారణమైన కుల నిర్మూలన అవసరమని భావించాడు. దాని కోసం అనేక సంప్రధింపులు జరిపాడు, అణచివేతకు గురవుతున్న అనేక మందిని తమ బానిసత్వపు నీడ నుండి బయటపడేందుకు కుల రక్కసిపై పోరాడాలని పిలుపునిచ్చాడు. ఈ పిలుపులకు ఆశించిన ఫలితాలు కనపడలేదు కాబోలు, వారు ఎన్నో సందర్భాల్లో పలికిన ''నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మరణించను'' అన్న నినాదానికి కట్టుబడి బౌద్దాన్ని స్వీకరించాడు. హిందూ మతంలో కులాల మధ్య పాతుకుపోయిన వివక్షను ప్రక్షాళన చేయలేక పోయిన స్థితిలో అంబేద్కర్ అందించిన ఒక సందేశమిది. అయితే మతం మారడం వ్యక్తిగతం కానీ వివక్ష పాటించకపోవడం సామాజిక అవసరం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016