Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్నించని చోట... ప్రగతి ఉండదు. ''బోధించు- సమీకరించు'' అన్న నినాదాన్ని, ఆ మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి. అజ్ఞానాన్ని పారద్రోలే విద్యను అందరికీ అందించాలి. వేరువేరుగా ఏరులై పారుతున్న వివిధ రకాల అణగారిన కులాలను, జాతులను ఒక తాటిపైకి తేవాలి. అసమానతలు లేని సమాజమే అంతిమ లక్ష్యం కావాలి. ఏండ్ల తరబడి అభివృద్ధికి అడ్డంగా ఉన్న వివక్షత బద్దలు కొట్టాలి. మేకతోలు కప్పుకున్న తోడేళ్ళ తరిమితరిమి కొట్టాలి. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అణగారిన వర్గాలు అధికారం చేపట్టాలి. అప్పుడే అంబేద్కర్ ఆశయాలు అక్షర సాక్షిగా నిలుస్తాయి.
మహనీయుల జయంతులు ఏప్రిల్ మాసంలో విరివిగా జరుపుకోవాల్సి వస్తుంది. అందులో ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ముఖ్యమైనది. ఈ రోజున ఖద్దరు బట్టలు ధరించి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాలుగు ఫొటోలకు ఫోజులు ఇచ్చి జై భీమ్ అనే నినాదం చేస్తారు. ఈ సంవత్సరమూ అదే జరిగింది. నిజానికి ఇది ఏటా ఓ తంతులా మారింది. కానీ, ఆయన కోరుకున్నది ఇదేనా...!? ఆయన ఆశయాలకు, ఆచరణ ఇంతేనా...!? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మన గుండెపై చేయి వేసుకుంటే అసలైన జవాబు మనకు లభిస్తుంది.
ఆధునికతను అందిపుచ్చుకుంటున్న ఈ కాలంలో కూడా అణగారిన వర్గాల బతుకుల్లో బాధలు కొంతవరకైనా తీరాయా..? కుల, మత, వర్గ, ఛాందసవాదులే నేటికీ ఈ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ''చాపకింద నీరులా'' మనువాద సిద్ధాంతాలను ఉధృతం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఆ విషయం బహిర్గతమవుతూనే వుంది. ఈ నిచ్చెనమెట్ల సమాజంలో అంటరానివారు, సబ్బండ వర్గాలవారు ''ఉత్పత్తి సాధనం''గా మాత్రమే పనిచేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి వ్యక్తిగత జీవితంను సమాజ శ్రేయస్సుకై అంకితం చేసి 'ఓటు హక్కు' అనే ఆయుధాన్ని మనకు అందించారు. కానీ ఆ ఓటు హక్కు దొరల జేబులో ఉన్న కరెన్సీ నోటుకు తాకట్టు పడుతోంది.
ఎన్ని చదువులు చదివిన, ఎన్ని కొలువులు ఏలినా... నీ స్థాయి గీడనే... అని రుజువు చేస్తున్నారు. అందరికీ చదువు, సమాన అవకాశాల కోసం ఏండ్ల తరబడి శ్రమించాడు అంబేద్కర్. అస్పృశ్యత, అంటరానితనాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి, అక్షర జ్ఞానంతో విశ్వాన్ని గెలిచి బడుగు బలహీన వర్గాల వారికి వెలుగు బాటలు వేశాడు. స్వాతంత్రం వచ్చి 75వసంతాలు గడుస్తున్నా, తాను కాంక్షించిన ఆశయాలు ఆచరణ లోనికి రాక పోవడం విడ్డూరంగా ఉంది. దానికి ప్రధాన కారణం ఎవరో... ఏయే శక్తులు సబ్బండ వర్గాల వారిని పావుగా వాడుకుంటున్నారో...? అందరికి తెలిసిన నగ సత్యం.
మూతికి ముంత నడుముకు చీపురు పట్టుకొని కట్టు రాజకీయ బానిసలుగా తయారు చేస్తున్నారు. పార్టీ జెండాలను భుజాన ఎత్తుకునే కూలీలుగా చూస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకోసం నాయకులు ఊసరవెల్లి వేషాలు వేస్తున్నారు. ''నోటితో నవ్వి నొసలుతో వెక్కిరించినట్టు'' మన బలాన్ని, బలగాన్ని వాడుకొని అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ రకమైన వికృత ధోరణి దేనికి సంకేతం...?
ఇంకా ఎన్ని ఏండ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారి మీద ఆధిపత్యం..? అంబేద్కర్ కలలుగన్న ఆశయాలు, ఆలోచన, ఆచరణ ఇవేనా....!? స్వాతంత్య్ర భారతదేశంలో కూడా రోజూ ఏదో ఒక చోట వివక్షతను ఎదుర్కొంటున్నాం. ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు అయితేనేమి...? రాజకీయ నాయకులు అయితేనేమి..? వ్యవస్థలో పనిచేస్తున్న వారే అయితే నేమి...? ప్రతి ఒక్కరు మినహాయింపు లేకుండా వివక్ష సంకెళ్ళతో నలిగిపోతున్నారు.
దళిత స్త్రీలపై అత్యాచారాలు అరాచకాలు రోజురోజుకీ పెట్రేగిపోతున్నాయి. అధికార మదంతో కుల దుహంకారంతో వికృత చేష్టలు చేస్తూ సమాజాన్ని అంధకారంలోకి తీసుకెళ్తున్నారు. చట్టం న్యాయం సామాన్యులకు ఆమడ దూరం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు జాతుల వారికి కూడా అందినప్పుడే నిజమైన దేశాభివృద్ధి కాదా? చరిత్రను వక్రీకరించడం మనువాదులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ చరిత్రను ఖచ్చితంగా రాసే ధైర్యం నిబద్ధత కలిగిన ప్రజా పక్షానికే ఉంటుంది. ఈ ఆధునిక కాలంలో రిజర్వేషన్లకు అర్థం మారిపోతోంది. సమాజంలో అట్టడుగున ఉన్న కులాల వారికి అందించిన చేయూత ఈ రిజర్వేషన్లు. ఇప్పుడు ఎందుకు బహురూపులను సంతరించుకుంటుంది. దీని వెనక ఎంతో రాజకీయకుట్ర దాగి ఉంది. ఇందులో దాగి ఉన్న మతలబు దేశ మూలవాసీలు ఆలోచించాలి. ఇక్కడే అంబేద్కర్ అందరివాడా...? కొందరి వాడా...? అని అన్వేషించాలి.
బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలి. ఉచిత పథకాలు కాదు... రాబోయే తరాలకు మూలస్తంభాలుగా నిలిచే ''యువతీ యువకులకు'' ఉపాధి కల్పించాలి. పాలించడం అంటే వనరులను దోచుకోవడం, దాచుకోవడం కాదు సమీకతం చేయటం.
సమ సమాజాన్ని స్థాపనకై చరిత్ర మరువని మహనీయుల అడుగుజాడల్లో నడవడం, నడిపించటం ఇప్పుడు అవసరం. నిరుడు ఎంతో మంది రాజకీయ నాయకులు నిస్వార్థ పాలన చేసిన గుమ్మడి నర్సయ్య, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో మరెందరో మనకు ఆదర్శప్రాయం. ఏ సిద్ధాంతాలు అయినా ప్రజలకు మంచి చేయమనే చెబుతాయి. ఇప్పుడు దేశ తలరాతను మార్చి రాసే ఎందరో అంబేద్కర్లు కావాలీ, రావాలీ. ఆయన ఆశయాలను, ఆచరణ బద్దం చేస్తే చాలు, దేశ గతి ప్రగతి బాట పడుతుంది.
మొన్నటికి మొన్న కర్నాటకలో మాజీ మంత్రిని కూడా ఆలయ గర్భగుడిలోకి రానివ్వలేదు. అంతెందుకు మన దేశ మొదటి పౌరుడికి కూడా మినహాయింపు కాని సందర్భాలు కోకొల్లలు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి కూడా అస్పృశ్యత, అంటరానితనం, వివక్షతలు పోట్రాయిలా తగులుతూనే ఉన్నాయి. ఇలా అయితే దళితులు, వెనుకబడిన వర్గాల వారికి ఈ వ్యవస్థలోని అవస్థలు నిత్యకృత్యమే. వాటిని వివరించుటకు బహుశా నా కలానికి ఇంకా పదును పెట్టాలేమో...?
ప్రశ్నించని చోట... ప్రగతి ఉండదు. ''బోధించు- సమీకరించు'' అన్న నినాదాన్ని, ఆ మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి. అజ్ఞానాన్ని పారద్రోలే విద్యను అందరికీ అందించాలి. వేరువేరుగా ఏరులై పారుతున్న వివిధ రకాల అణగారిన కులాలను, జాతులను ఒక తాటిపైకి తేవాలి. అసమానతలు లేని సమాజమే అంతిమ లక్ష్యం కావాలి. ఏండ్ల తరబడి అభివృద్ధికి అడ్డంగా ఉన్న వివక్షత బద్దలు కొట్టాలి. మేకతోలు కప్పుకున్న తోడేళ్ళ తరిమితరిమి కొట్టాలి. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అణగారిన వర్గాలు అధికారం చేపట్టాలి. అప్పుడే అంబేద్కర్ ఆశయాలు అక్షర సాక్షిగా నిలుస్తాయి.
సెల్:9912965549