Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పరిశ్రమపై ఆధారపడి ఏడు లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. కుల వృత్తులు అవసాన దశలో ఉన్న సమయంలో ఆయా వర్గాల మహిళలకు బీడీల తయారీ ప్రత్యామ్నాయంగా తయారైంది. కరువు కాటకాల సమయంలో బీడీలు చుట్టే మహిళలే కుటుంబానికి ఆధారం అయ్యారు. బీడీ పరిశ్రమ ఒకప్పుడు ఓ వెలుగు వెలగడంతో కార్మికులకు భారీ ఎత్తున ఉపాధి లభించింది.
తెలంగాణలో ఏడు లక్షల మందికి పైగా జీవనోపాధిగా ఎంచుకున్న బీడీ పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎదుగు బొదుగు లేని జీవితాలు, చాలీచాలని సంపాదన, చేస్తున్న పనితో క్షీణిస్తున్న ఆరోగ్యాలు... ఇదీ ప్రస్తుత బీడీ కార్మికుల జీవన పరిస్థితి. ఒకవైపు బీడీ పరిశ్రమపై పొగాకు ఉత్పత్తి చట్టాల ఆంక్షలు, మరోవైపు జీఎస్టీ పెరుగుదలతో బీడీ కార్మికులకు నెలలో కనీసం పది రోజులు కూడా ఉపాధి లభించడం లేదు. పని తగ్గిపోయి ఆదాయం సరిపోక డబ్బులు ఏమో కానీ జబ్బులు మాత్రం వెనకేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి స్తున్నాయి. ఫలితంగా బీడీ కార్మికుల సంక్షేమం గాలిలో దీపంగా మారింది.
ఒకప్పుడు ఉపాధికి మూలాధారం..
తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో 1901లో బీడీ పరిశ్రమ ప్రారంభమైంది. ఆ తర్వాత అది క్రమేపీ పలు జిల్లాలకు విస్తరించింది. కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ పరిశ్రమపై ఆధారపడి ఏడు లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. కుల వృత్తులు అవసాన దశలో ఉన్న సమయంలో ఆయా వర్గాల మహిళలకు బీడీల తయారీ ప్రత్యామ్నాయంగా తయారైంది. కరువు కాటకాల సమయంలో బీడీలు చుట్టే మహిళలే కుటుంబానికి ఆధారం అయ్యారు. బీడీ పరిశ్రమ ఒకప్పుడు ఓ వెలుగు వెలగడంతో కార్మికులకు భారీ ఎత్తున ఉపాధి లభించింది. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం సాగే వలసలు కొంతమేర తగ్గాయి. ఒక దశలో గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన అనేకులు బీడీ పరిశ్రమలో చేరారు. అప్పులు, సూక్ష్మ రుణాలకు చెందిన ముఠాల బారిన పడకుండా మహిళలకు బీడీల తయారీ ద్వారా వచ్చే ఆదాయం చేయూతనిచ్చేది. స్వయం సహాయక సంఘాలు బీడీల పని వల్లనే బలోపేతమయ్యాయి. ఉత్పత్తిదారులు, తునికాకు సేకరించేవారు, బీడీలు చుట్టే వారు, ప్యాకర్లు, చాకర్లు, టేకేదార్లు, బీడీ కంపెనీల్లో సిబ్బంది, గంపలు, చాటల తయారీ దారులు, రవాణా దారులు తదితర 20 పైగా రంగాల వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీడీ పరిశ్రమ వల్ల ఉపాధి పొందేవారు. కానీ ప్రస్తుతం బీడీ పరిశ్రమ పాలకుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
చక్రబంధంలో బీడీ పరిశ్రమ
ప్రస్తుతం తెలంగాణలో 8100 పైగా బీడీ పరిశ్రమలు ఉన్నాయి. బీడీ కార్మికుల పోరాటాల ఫలితంగా కనీస వేతనాల చట్టం 1948 అనుసరించి 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల ఉత్తర్వులు నెంబర్ 41ను విడుదల చేసింది. ప్రతి రెండేండ్లకోసారి కనీస వేతనాలు పెంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వు ప్రకారం ప్రస్తుతం వేయి బీడీలకు కరువు భత్యం వీడీఏ పాయింట్లతో కలిపి రు.273 వేతనంగా ఇవ్వాలి. కానీ బీడీ కార్మికులకు వేయి బీడీలకు రు. 200 కూడా అందడం లేదు. వర్ధి బీడీ కార్మికులకు రు. 174 మాత్రమే ఇస్తున్నారు. గతంలో నెలకు 25 రోజుల పని దొరికితే ప్రస్తుతం పది రోజుల పని కూడా లభించడం లేదు. అలాగే పొగాకు ఉత్పత్తి చట్టంలోని సెక్షన్ 3,6,7, 24లతో బీడీ పరిశ్రమ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఈ సవరించిన సెక్షన్ల ప్రకారం బీడీ ఉత్పత్తులపై ఎలాంటి బ్రాండ్ లేబుల్ ఉండకూడదు. బీడీ ఉత్పత్తి చేసే తేదీ అలాగే దాని విని యోగం తేదీని సైతం ముద్రించాలి. హెల్త్ వార్నింగ్ పేరిట బహిరంగ స్థలాలు, విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులను అమ్మిన వారికి 50 వేల రూపాయల జరిమానా విధించబడును. ఒక బీడీ కట్టలో 25 బీడీలు ఉండాలి. అలాగే 21 సంవత్సరాలలోపు వారికి బీడీలను అమ్మడాన్ని నిషేధించడం మొద లైన ఆంక్షల ఫలితంగా బీడీ పరిశ్రమ కుదేలైంది. 2017లో కేంద్ర ప్రభుత్వం 28శాతం జీఎస్టీ విధించడంతో బీడీ కార్మికుల పరిస్థితి అత్యంత దయ నీయంగా మారింది. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రణ చాలా రోజుల పాటు సంక్షోభాన్ని సృష్టించగా జీఎస్టీ విధింపుతో పరిస్థితి మరింత విషమించింది. ప్రతిరోజు 19 గంటలు బీడీలు చుట్టడం కోసం కష్టపడుతున్న బీడీ కార్మికులకు ప్రస్తుతం ఏ రోజు కూడా కడుపు నిండా తిండి లేని పరిస్థితి నెలకొంది. పొగాకు ఉత్పత్తులతో పనులవల్ల బీడీ కార్మికులు రక్తహీనత, నరాల బలహీనత, క్యాన్సర్, క్షయ, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.
బీడీ కార్మికులకు బ్రతుకు భరోసా కల్పించాలి
ఒక తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమ నుంచి ఏటా రు.100 కోట్లు సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది. కానీ కార్మికులు కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు ఎలాంటి పథకాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికుల కోసం ఇస్తున్న ఆసరా పెన్షన్లాగే కేంద్రం కూడా జీవన భృతి కల్పించాలి. బీడీలు చేస్తున్న కార్మికులందరికీ పీఎఫ్ కార్డులు ఇవ్వాలి. కనీస వేతన చట్టం అమలు చేసి బీడీ కార్మికుల వేతనాలు పెంచాలి. నెలలో 25 రోజులు బీడీ కార్మికులకు ఉపాధి లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద బీడీ కార్మికులందరికీ పక్కాగృహలు కట్టించాలి. వారి ఆరోగ్య సంక్షేమం కోసం ప్రతి మండలం వారిగా ఈఎస్ఐ ఆసుపత్రులను కట్టించాలి. బీడీ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి. నెలకోసారి ప్రతి బీడీ కార్ఖానాల్లో బీడీ కార్మికులందరికీ హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. బీడీలు చుట్టి చుట్టి చేతులు పడిపోతున్న బీడీ కార్మికుల బ్రతుకుల్లో సమగ్ర పథకాలు, సమర్ధ కార్యాచరణ ద్వారా పాలకులు బ్రతుకు భరోసా కల్పించాలి.
- అంకం నరేష్
సెల్: 6301650324