Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యామిలీ డాక్టరు ఎవరు? ఫ్యామిలీ మెడిసిన్ ప్రాముఖ్యత ఏమిటి?
ఏ వయసువారినైనా, ఏ రుగ్మత ఉన్నవారినైనా, ఒకే రీతిలో చూడలిగిన నైపుణ్యం గలిగినవారు ఫ్యామిలీ డాక్టర్లు. గర్భిణీ స్త్రీ ఆరోగ్యం, ఆమె ప్రసవం, నవజాత శిశువు ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల, టీకాలు, తల్లి ఆరోగ్యం, ఆహారం, ఇతర కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, వారికి అన్ని రకాల అనారోగ్యాల గురించి అవగాహన కల్పించి, వ్యాధి ముదరకముందే సంరక్షించడం, ఆసుపత్రిలో చేరే అవసరాన్ని తగ్గించడం, ప్రాణాలు రక్షించడం వంటివి ఫ్యామిలీ డాక్టర్ల పరిధిలోకి వస్తాయి. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ, అవసరమైనప్పుడు ఉన్నత వైద్యానికి వారిని పంపగల నేర్పు ఈ ప్రాథమిక ఆరోగ్య సంరక్షకుల బాధ్యత. వారు ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తారు.
మే 19 ప్రాధాన్యత ఏమిటి?
మే 19ని ప్రపంచ ఫ్యామిలీ డాక్టర్స్ రోజుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 'హౌంకా' సంస్థ, మన దేశంలో అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఎఎఫ్పీఐ)వారు ఈ రోజున అనేక కార్యక్రమాలు చేపడతారు. తమ తమ క్లినిక్లలో, ఆసుపత్రుల్లో, సమూహాల్లో, మీడియాలో ఈ రోజుకున్న ప్రాముఖ్యతని వివరిస్తారు. ఈ సంవత్సరం ''ఫ్యామిలీ డాక్టర్స్ - ఆల్వేస్ దేర్ టు కేర్'' అనే నినాదంతో ఈ రోజుని జరుపుకుంటున్నారు.
'ఆల్వేస్ దేర్' అంటే ఎప్పటికీ అందుబాటులో ఉండేవారు ఫ్యామిటీ డాక్టర్లు. వారు తమ పేషెంట్లకి ఎల్లప్పుడూ, అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. ఆయా కుటుంబాలన్నిటికీ అందుబాటులో ఉంటారు. కరోనా వంటి మహమ్మారి కాలంలో సైతం ఫ్యామిలీ డాక్టర్లు తమ పేషెంట్ల వెన్నంటి ఉన్నారు. ఎప్పటికప్పుడు సలహాలిస్తూ, పరిస్థితి విషమించే ప్రమాదాన్ని ముందే గుర్తించి వారిని ఆసుపత్రికి తరలిస్తూ ఎంతో సేవ చేశారు.
అలానే వారు చిన్ననాటి నుంచి వైద్యం అందిస్తున్న పాప పెద్దదై, తానే ఒక తల్లి అవుతుంటే, ఆ గర్భిణీ స్త్రీ బాగోగులు చూస్తూ ఆమె సురక్షితంగా ప్రసవించేలా జాగ్రత్తలు చెపుతూ, కాన్పు సమయానికి చేదోడువాదోడుగా ఉంటూ, ఆ నవజాత శిశువు పరిరక్షణకి తోడ్పడుతూ, సమయానికి టీకాలు వేయించి, ఆ బిడ్డ ఆహారాన్ని, తల్లిపాల ఆవశ్యకతని నొక్కిచెపుతూ, ఎదుగుదల లోపాలని గుర్తిస్తూ, సలహాలిస్తూ, అడుగడుగునా వ్యాధులను నివారిస్తూ, తగిన సలహాలిస్తూ, వ్యాధులు సంభవించినప్పుడు వైద్యం చేస్తూ, తమ పేషెంట్ల మానసిక వత్తిడులను తగ్గిస్తూ, యావత్తు కుటుంబానికి తలలో నాలుకలా మెలుగుతూ అండదండలందిస్తూ, వ్యక్తిగతంగానే కాక సామూహికంగా ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా సలహాలందిస్తూ, అన్ని వయస్సుల వారికి, అన్ని స్థాయిలవారికి, అన్ని వ్యాధులవారికి, అన్ని మానసిక స్థితులవారికి సేవలందించగల ప్రాథమిక ఆరోగ్య సూత్రధారే 'ఫ్యామిలీ డాక్టర్'. అవసరమైనప్పుడు ప్రాథమిక ఆరోగ్యానికి తదుపరి మెట్టుగా ఉండే సెకండరీ, టర్షరీ ఆరోగ్య వ్యవస్థలను ఉపయోగించుకోగల దిట్టగా కూడా ఫ్యామిలీ డాక్టర్కి గుర్తింపు ఉంది. చేతులు కాలకముందే ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, అవసరమైతే ఆసుపత్రులకి తరలించగల నేర్పు, సకాలంలో స్పెషలిస్టులకి కేసుని అప్పగించగలిగిన విజ్ఞత గలవారే ఫ్యామిలీ డాక్టర్లు.
'టు కేర్' అంటే 'సదా మీ సేవలో' అంటూ ఆరోగ్యాన్ని సామాజిక పరమైన దృష్టితో చూడగల నేర్పరి ఫ్యామిలీ డాక్టరు. తన సలహా కోసం వచ్చిన రోగినే కాక అతని కుటుంబ సభ్యులకి కూడా అండగా నిలబడగలరు ఈ ఫ్యామిలీ డాక్టర్లు. భర్త చేతిలో చావుదెబ్బలు తిన్న భార్యని ఓదార్చి వైద్యం అందించడమే గాక, సదరు భర్తని, అత్తమామలని కూడా నేర్పుగా అదుపు చేయగల వైద్యశిల్పి ఫ్యామిలీ డాక్టరు. అలానే రోగాలకు వెనక గల మౌలిక కారణాలైన ఆకలి, దారిద్య్రం, పారిశుధ్య లోపం, మంచినీటి సౌకర్యం లేకపోవడం, సకాలంలో స్పందించగల వైద్యవ్యవస్థ లేకపోవడం వంటి వాటిపై వీరు అవగాహన కలిగివుంటారు.
ఆరోగ్యాన్ని పరిరక్షించగల సామాజిక ప్రమాణాలైన కూడు, గూడు, గుడ్డ తదితరాలు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వాలు, ఆరోగ్య వ్యవస్థలు చిత్తశుద్ధితో ముందుకురావాలి. వారి కర్తవ్యాన్ని గుర్తెరిగించే పాత్రని కూడా ఫ్యామిలీ డాక్టర్లు పోషిస్తారు. ఉదాహరణకు తల్లుల్లో ఇనుముశాతం లోపాన్ని గుర్తిస్తే.. మాతాశిశు సంరక్షణ వ్యవస్థని పటిష్టం చేయవలసిన అవసరాన్ని వీరే విధాన రచయితలకి విజ్ఞప్తి చేస్తారు. సమాజంలో వివక్షకి గురవుతున్న పిల్లలు, స్త్రీలు, వయసుమళ్ళినవారు, వికలాంగులపై కేంద్రీకరించి ఆరోగ్య పథకాలు రచించవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణించేదీ ఫ్యామిలీ డాక్టర్లే. అప్పుడే ''అందరికీ ఆరోగ్యం'' అనే సుందరమైన కల సాకారం కాగలదు. సమాజానికి, ఆరోగ్యానికి మధ్య గల సంబంధం బలపడగలదు.
(మే 19 అంతర్జాతీయ ఫ్యామిలీ డాక్టర్స్డే సందర్భంగా)
- డాక్టర్ నళిని
సెల్: 9441426452