Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ పరిశ్రమ అయినా చేసేది ఏమిటి?
ఈ సమాజాల్లో 'పరిశ్రమ' అనేది ఏదైనా ఒక రకపు సరుకుల్ని శ్రామికులతో ఉత్పత్తి చేయించి, ఆ సరుకుల్ని వేరే శ్రామికులతో అమ్మించి, చివరికి ఆ పరిశ్రమదారులు, తమ స్వంత శ్రమలు లేకుండా, వడ్డీ - లాభాల్ని సంపాదించే విధానమే! ''భూమి కౌలు'' అనేది కూడా స్వంత శ్రమలు లేకుండా వచ్చేదే అయినా, దాన్ని ఇక్కడ చూడడం లేదు. తర్వాత, ఆ సందర్భం కూడా వస్తుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా రోగులకు వైద్య సదుపాయాలు దొరికినా, అవి, రోగులు కొనవలసిన సరుకులుగా లెక్కకు రావు. ప్రభుత్వ ఆస్పత్రి, ప్రభుత్వానికి పన్నుల ద్వారా దొరికే డబ్బుతో పని చేస్తుంది. ఇది వేరే చర్చ.
సరుకుల్ని అమ్మే ప్రభుత్వ పరిశ్రమలు అనేకం వుంటాయి. ఉదాహరణకి, ప్రభుత్వ కరెంటు పరిశ్రమ, కరెంటుని అమ్ముతుంది.
పరిశ్రమల్లో, పెద్దా - చిన్నా - మధ్యా - ఇలా అన్ని రకాలూ వుంటాయి. అలాగే, ఆస్పత్రుల్లో కూడా పెద్దా, చిన్నా, రకాలు ఉంటాయి.
ఆస్పత్రులు కూడా పరిశ్రమలే అయితే, ఈ పరిశ్రమలు ఉత్పత్తి చేయించే, అమ్మే 'సరుకులు', ఏమిటి? - రక రకాల రోగాల కోసం వైద్యాలకు అవసరమయ్యే వైద్య సదుపాయాలే, ఆ సరుకులు. ఆ సరుకుల్ని, ఉత్పత్తి చేయించడమూ, వాటిని అమ్మడమూ, ఆస్పత్రులు చేసే పరిశ్రమలు.
ఆస్పత్రులు అమ్మే సరుకుల్ని కొనేది, ఎవరు? - ఇంకెవరు? రోగులే కదా? తమ కోసం వైద్య సదుపాయాలు కావలిసినవారు వారే.
ఏ సరుకుకి అయినా పునాది ఏమిటి?
ఏ పరిశ్రమలో అయినా, ఏ రకం సరుకు తయారు కావడానికి అయినా, దానికి మొదట పునాదిగా కావలసినవి ఏమిటి? - ఆ ఉత్పత్తి తయారవడానికి అవసరమైన ''ఉత్పత్తి సాధనాలు'' మొదట కావాలి. కొత్త ఉత్పత్తి తయారవడానికి గానీ, లేదా కొత్త పని (శ్రమ) జరగడానికి గానీ, ఆ సాధనాలు కావాలి.
ఉత్పత్తి సాధనాలు ఎన్ని? ఏవేవి?
ఉత్పత్తి సాధనాలు, 3 రకాలుగా వుంటాయి. (1) ముడి పదార్ధాలూ, (2) పని ముట్లూ, (3) సహాయక పదార్ధాలూ - ఈ 3 రకాలూ కలిసినవి మాత్రమే 'ఉత్పత్తి సాధనాలు'.
పాఠకులకు తేలికగా అర్ధం కావడానికి, 'చొక్కా' అనే సరుకుకి కావలిసిన ముడిపదార్ధాలు బట్టా, దారం, గుండీలూ. పనిముట్లు అయితే సూదీ, కత్తెరా, కుట్టు మిషనూ కావచ్చు. సహాయక పదార్ధం అంటే మిషన్ని నడిపే కరెంటు కావచ్చు. ఇది, చొక్కా కోసం ఖర్చవుతుంది గానీ, చొక్కాలోకి గుండీలూ, దారమూ వెళ్ళినట్టుగా కరెంటు వెళ్ళదు. దాని పని సహాయమే.
ఆస్పత్రి సరుకుల్లో ముడి పదార్ధాలు వుండవు. యంత్రాలన్నీ పని ముట్లే. కరెంటు వంటిది సహాయక పదార్ధమే.
కొన్ని రకాల సరుకుల తయారీ కోసం, 'సాధనాలు'గా 3 రకాలూ అవసరమే. కానీ, 'రవాణా' వంటి కొన్ని రకాల సరుకుల తయారీ విషయంలో, ముడి పదార్ధాలతో అవసరం వుండదు. ఇది, బస్సులూ, రైళ్ళూ వంటి రవాణా సాధనాల్ని చూస్తే తెలుస్తుంది.
కొన్ని రకాల సరుకుల కోసం, 'సహాయక పదార్ధాలతో' కూడా అవసరం వుండదు. ఉదాహరణకి, చేతికుట్టు శ్రమ ద్వారా దుస్తులు తయారయ్యే కాలం లో కరెంటుతో అవసరం లేదు.
అయితే, ఏ సరుకు తయారీ కోసం అయినా 'పని ముట్లు' అత్యవసరం. అవి లేకుండా అయితే ఆ పని జరగదు.
సరుకుల రకాల్ని బట్టి 3 రకాల సాధనాలూ కావాలా, 2 రకాలే కావాలా అనే తేడాలు వుంటాయి.
ఆస్పత్రి సరుకుల్ని చేసేది ఎవరు?
ఇక్కడ చూసేది ఆస్పత్రుల సంగతే. వీటిలో, పెద్ద రకం ఆస్పత్రులనే చూస్తే అన్ని రకాలూ అర్ధం అవుతాయి.
ఆస్పత్రుల పరిశ్రమలకు అవసరమైన వైద్య సదుపాయాల్ని అందించగలిగే శ్రామికులందరూ ఎవరెవరు? - ప్రధానంగా డాక్టర్ల రకాలతో ప్రారంభించ వలిసిందే. తర్వాత, నర్సింగ్ శ్రమలన్నీ చేసే శ్రామికులూ, ఆస్పత్రుల్ని పరిశుభ్రంగా వుంచే ఇతర రకాల శ్రమలన్నీ చేసే ఇతర శ్రామికులూ, వీరందరూ కలిస్తేనే, అది, ఆస్పత్రి పరిశ్రమ కోసం జరిగే శ్రామికుల శ్రమల మొత్తం. రోగుల మీద ఎక్సురేలు తీసే, రక్త పరీక్షల వంటివి చేసే టెక్నీషియన్ల వంటి వారు కూడా శ్రామికుల సంఖ్యలో భాగమే. డబ్బు లెక్కలు చూసే ఉద్యోగుల పనులేవీ, 'సరుకుల తయారీ'లోకి రావు.
'వాచ్మెన్'గా కాపలా కాసే వారి శ్రమలు కూడా, సరుకుల తయారీ కోసం అవసరమైనవి కావు.
సరుకుల తయారీ కోసం అవసరమైన అన్ని రకాల శ్రామికులూ, ''జీతాల శ్రామికులే' అవుతారు. సరుకుల తయారీతో సంబంధం లేని వారు కూడా జీతాల వారే అవుతారు. అది వేరే చర్చ.
శ్రామికుల పదవుల్లో తేడాలు:
శ్రామికులకు వుండే 'పదవుల' విషయం చూస్తే వీటిలో ప్రధానమైన తేడాలు 2, 3 వుంటాయి.
పరిశ్రమ శ్రామికుల్లో కొందరు, ఆ పరిశ్రమ తాలూకు ఉద్యోగులు గానే వుంటారు. వీరి పదవీ కాలాలూ, వీరి జీతాలూ కొంత కొంత పెద్దవిగా వుంటాయి. వీరికి ఆది వారాల్లో సెలవులు వంటి హక్కులు కూడా కొన్ని వుంటాయి.
ఆ మొదటి రకానికి చెందని శ్రామికులు, పరిశ్రమలో రెండో రకం వారు. వీరు కూడా, పరిశ్రమ కోసం పెట్టుకున్న వారే. అయినా వీరు ఆ పరిశ్రమలో 'తాత్కాలిక ఉద్యోగులు' అనే పేరుతోనో; 'కాంట్రాక్టు ఉద్యోగులు' అనే పేరుతోనో; 'అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు' అనే పేరుతోనో వుంటారు.
ఏ పరిశ్రమ అయినా, శ్రామికుల్ని ఎప్పుడంటే అప్పుడు తన పనుల కోసం పెట్టుకుని, ఎప్పటికప్పుడు తీసివేసేలా జరగాలంటే, ఆ శ్రామికులు, ఆ పరిశ్రమకి ఎలా దొరుకుతారు? ఆ శ్రామికుల్ని పరిశ్రమలకు సప్లై చేసే కంపెనీలు చాలా వుంటాయి. ఆ కంపెనీలు కూడా మరో రకపు పరిశ్రమలే. ఇటువంటి కంపెనీలు, నిరుద్యోగుల్ని పట్టి, వారికి చిట్టి పొట్టి ఉద్యోగాలు చూపించి, బైటి వాళ్ళ పనుల కోసం పంపిస్తారు. ఈ పని వాళ్ళని పంపే కంపెనీ, పని వాళ్ళని తీసుకునే వారి నించీ అధికమైన ధరలే తీసుకుంటుంది. ఆ ధర లోనించే, ఆ శ్రామికులకు జీతాలు ఇచ్చి, మిగిలేదాన్ని తనకు ఆదాయంగా పొందుతుంది. ఈ కంపెనీలకు నిరుద్యోగ శ్రామికులే సరుకులు! ఆ సరుకుల్ని అమ్మితేనే కంపెనీలకు ఆదాయాలు. ఇటువంటి కంపెనీల వంటివన్నీ చేసేది ఇదే!
ఒక విషయం: ఏ పరిశ్రమ అయినా, బైటి నించీ పని వాళ్ళని తెచ్చుకుని, బైటికి అధిక ధరలు ఇచ్చి వేయవలసి వస్తే, అలా తెచ్చుకున్న శ్రామికుల వల్ల, వారిని తెచ్చుకున్న పరిశ్రమకి ఆదాయం ఏమిటి?
ఆదాయం రాకుండా, ఏ పరిశ్రమా, ఏ తాత్కాలిక శ్రామికుల్నీ పెట్టుకోదు. వీళ్ల ఆదాయాన్ని తర్వాత చెప్పుకోవచ్చు
ఒక పరిశ్రమ, బైటి కంపెనీల నించి ఏ స్తాయి శ్రామికుల్ని తీసుకున్నా, ఆ శ్రామికులు, బైటి కంపెనీల లోనే దాదాపుగా ట్రయినింగులైన వారై వుంటారు. కాంట్రాక్టు కంపెనీ నుంచి శ్రామికుల్ని తీసుకునే పరిశ్రమ, ఆ శ్రామికులకు శిక్షణ ఇవ్వక్కర్లేదు. కాంట్రాక్టు శ్రామికుల నించి పరిశ్రమకి ఆదాయానికి, ఇది కొంత కారణం అయినా, ఇదే పూర్తి కారణం కాదు. కాంట్రాక్టు శ్రామికులతో, పరిశ్రమలూ, బైటి కంపెనీలూ లాభపడతాయి.
డాక్టర్లలో కూడా కాంట్రాక్టు ఉద్యోగులు వుంటారు. (ఒక వింత! విద్యా సంస్తల్లో వుండే టీచర్లలో కూడా కాంట్రాక్టు టీచర్లు వుంటారు. ఇంతే కాదు. ప్రతీ చోటా!)
తాత్కాలికం గానూ, కాంట్రాక్టుల తోనూ వుండే ఉద్యోగులు, పరిశ్రమలో స్వంత ఉద్యోగులు కారు. అందుకే, వారు పరిశ్రమ లో ఎక్కువ భయ భక్తులతో వుంటారు, తమ ఉద్యోగాలు హఠాత్తుగా పోతాయని.
(ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ