Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆందోళన వద్దు అవగాహన ముఖ్యం!
ఇటీవల దాకా ప్రపంచాన్ని వణికించి, తీవ్ర ప్రాణనష్టం కల్గించిన కరోనా వైరస్‌ను ప్రజలు మరువకముందే మంకీ పాక్స్ అనే మరో పాత వైరస్ కొత్తగా విస్తరిస్తున్నదనీ, అది ప్రాణాంతకమనీ వస్తున్న వార్తలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో మంకీపాక్స్ కేసులు నమోదయిన 20ఏండ్ల తర్వాత మరలా ఇప్పుడు తాజాగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. సాధారణంగా ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకునే మంకీ పాక్స్ ఇప్పుడు కొత్తగా అనేక దేశాలకు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. యూకే, అమెరికా, స్పెయిన్, ఇజ్రాయిల్‌తో సహా 12దేశాలలో సుమారు 90 నిర్ధారిత మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి.
మంకీ పాక్స్ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? మంకీ పాక్స్ అనే వైరస్ వైద్యశాస్త్ర పరిభాషలో Poxviridae అనే కుటుంబానికి చెందిన Orthopox అనే గ్రూపునకు చెందినది. కొన్ని దశాబ్దాల క్రితం ఈ వైరస్‌ను ఆఫ్రికన్ అడవుల్లోని కోతులు, ఎలుకలు, ఉడతలలో కనుగొన్నారు. 1950వ దశాబ్దంలో తొలుతగా కోతులలో ఈ వైరస్ కనుగొన్నందువల్ల దీనికి ''మంకీ పాక్స్'' అన్న పేరు వచ్చింది. జంతువుల నుండి మనిషికి వ్యాపించే ఇలాంటి వ్యాధిని Zoonotic Disease అంటారు. ఈ వైరస్ సోకిన జంతువులు కరిస్తే కానీ, వాటి రక్తం, శరీర ద్రవాలు తాకితే కానీ మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మసిలిన ఇతర వ్యక్తులకూ ఇది వ్యాపిస్తుంది. మంకీ పాక్స్ సోకిన వ్యక్తి చర్మంపై పొక్కులు తాకడం ద్వారా, వ్యాధికి గురైన వారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ అన్ని మార్గాలలో లాగానే స్వలింగ సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది. అంతేకానీ ఇది కేవలం స్వలింగ సంపర్కం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందనే అపోహ సరైనది కాదు. ఏ రకమైన లైంగిక సంపర్కమైనా, వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహిత స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది.
మంకీ పాక్స్ వ్యాధి లక్షణాలేమిటి ? మంకీ పాక్స్ వ్యాధి ప్రారంభంలో సాధారణంగా సీజనల్‌గా వచ్చే ''ఫ్లూ'' వ్యాధి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటుగా ఇతర కొన్ని ప్రత్యేక లక్షణాలు కనబడతాయి. వ్యాధి ప్రారంభంలో గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు, ముక్కుదిబ్బడ, ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. గొంతు దగ్గర మెడలో ఉండే శోషరస గ్రంధులు (Lymph Nodes) వాపునకు గురవుతాయి. సాధారణంగా జ్వరం వచ్చిన కొద్దిరోజుల తర్వాత చర్మంపైన పొక్కులు ఏర్పడి, పుండ్లుగా మారి, ఆ తర్వాత వాటిపై చెక్కులు కట్టి, చివరగా రాలిపోతాయి. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తం 2 నుండి 4 వారాల పాటు కొనసాగి వ్యాధి తగ్గిపోతుంది.
మంకీపాక్స్‌ను ఎలా నిర్థారిస్తారు? సాధారణంగా, వ్యాధి లక్షణాలున్న రోగి చర్మంపై పొక్కులనుండి శాంపిల్‌ను సేకరించి RT-PCR / PCR టెస్టుల ద్వారా నిర్ధారణ చేస్తారు. నోటిలోపల శాంపిల్ తీసి పరీక్షించే పద్ధతిలో ఈ వ్యాధి నిర్థారణకు ఖచ్చితత్వం తక్కువగా ఉంటుంది. దీనితోపాటు వైరస్ జీన్ సీక్వెన్సింగ్ కూడా చేసినట్లయితే వైరస్ వ్యాప్తి తీరు, మ్యుటేషన్ల ప్రభావం అర్థమవుతుంది.
వ్యాధికి చికిత్స ఏమిటి? : మంకీపాక్స్ వైరస్‌ను చంపే నిర్ధిష్టమైన మందు లేదు. జ్వరం, నొప్పులు, దగ్గు వంటి వ్యాధి లక్షణాల నుండి ఉపశమనానికై పారాసిటమాల్, సెట్రిజిన్ వంటి మాత్రలు ఇవ్వవచ్చు. చర్మంపైన పొక్కుల వలన ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా కొద్దిపాటి యాంటిబయాటిక్స్ అవసరమైతే వాడతారు. వ్యాధి నయమయ్యే దాకా అవసరమైనంత విశ్రాంతి, తరచుగా ద్రవపదార్ధాలు తీసుకుంటూ ఉండటం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం చేయాలి.
గతంలో మశూచి (Smallpox) వ్యాధి చికిత్సలో ఉపయోగించబడ్డ Tecovirimat అనే యాంటీవైరల్ మందును యూరోపియన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా 2022లో వ్యాపిస్తున్న మంకీపాక్స్ చికిత్సకు కూడా వాడేందుకు లైసెన్సు జారీ చేసింది. దీనిపై ఇతర దేశాలలో వైద్యని పుణులు ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోవాల్సివున్నది.
మంకీపాక్స్ వైరస్ ప్రాణాంతకమా?: సాధారణంగా మంకీపాక్స్ వ్యాధి స్వల్ప లక్షణాలు మాత్రమే కలిగివుండి 2 నుండి 4 వారాలలో తగ్గిపోతుంది. కానీ ఆఫ్రికన్ దేశాల్లో గుర్తించబడ్డ కొన్ని కేసుల్లో ఇది 10శాతం మరణాల రేటును కలిగివున్నదని వార్తలు వస్తున్నాయి. జంతువుల నుండి మనుషులకు వ్యాపించే ఏ వైరస్ అయినా మ్యుటేషన్లకు గురికావడం సహజం. మ్యుటేషన్ల ఫలితంగా వ్యాప్తి తీరు, వ్యాధి తీవ్రతలో మార్పులు జరుగుతాయి. కానీ ప్రస్తుతం విస్తరిస్తున్న మంకీపాక్స్ వ్యాప్తి తీరు, వ్యాధి లక్షణాల తీవ్రతలో కలిగే మార్పులు వంటి అంశాలు భవిష్యత్తులో తేటతెల్లమయిన తర్వాత కానీ శాస్త్రీయంగా ఖచ్చితమైన నిర్థారణకు రావడం సాధ్యం కాదు. అశాస్త్రీయ అంచనాలతో, పుకార్లతో భయాందోళనలకు గురి కావల్సిన అవసరం లేదు.
మంకీపాక్స్‌కు వేక్సిన్ ఉన్నదా? గతంలో 1980కు ముందు మశూచి (small pox) నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడ్డ మశూచి వేక్సిన్ వలన ఏర్పడ్డ రోగనిరోధక శక్తి కొంతమేరకు అప్పట్లో మంకీ పాక్స్‌ను కూడా నివారించగల్గింది. 2019లో అమెరికన్ వైద్య నియంత్రణ సంస్థ అయిన యు.ఎస్.ఎఫ్.డి.ఏ (USFDA) Smallpox, Monkeypox వ్యాధుల నివారణకై ఆమోదించిన JYNNEOS (MVA-BN) అనే వేక్సిన్‌ను ప్రస్తుతం మంకీపాక్స్ నివారణలో విస్త్రతంగా సిఫారసు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది.
ప్రభుత్వ స్ధాయిలో నివారణ చర్యలు : అంతర్జాతీయ ప్రయాణీకులలో వ్యాధి లక్షణాలను గుర్తించి ఐసోలేట్ చేసి చికిత్స అందించడం, శాంపిల్స్‌ను వైరాలజీ ల్యాబ్‌కు పంపి నిర్థారించడం, వ్యాప్తితీరు, వ్యాధితీవ్రతలో మార్పుల గురించి అధ్యయనాలు నిర్వహించి, వ్యాధి నివారణ గురించి ప్రజలలో పెద్దఎత్తున అవగాహన కలిగించడం చేయాలి.
వ్యక్తి స్థాయిలో పాటించాల్సిన నివారణా చర్యలు: ఇతరులనుండి వ్యాధి సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు పాటించాలి. అనుమానిత లక్షణాలున్న పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువుల స్పర్శకు దూరంగా ఉండటం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలున్న వ్యక్తులకు దూరం పాటించడం, సభలు, జాతరలు, షాపింగ్ మాల్స్ వంటి హై రిస్క్ ప్రాంతాలలో మాస్క్ ధరించడం, రెగ్యులర్‌గా చేతుల పరిశుభ్రత పాటించడం, అనుమానిత లక్షణాలు కనబడ్డ వెంటనే తగిన వైద్యసలహా తీసుకోవడం, వ్యాధి లక్షణాలు తగ్గేదాకా ఐసోలేషన్ పాటించడం వంటివి పాటించాలి. వ్యాధి గురించి ఆందోళన పడకుండా అవగాహనతో మెలగాలి.
- డాక్టర్ కె. శివబాబు
జనవిజ్ఞానవేదిక గౌరవాధ్యక్షులు
సంగారెడ్డి జిల్లా, తెలంగాణ