Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
శ్రామికుల శ్రమలు అన్నీ కలిసే వైద్య సదుపాయాలు:
ఆస్పత్రి శ్రామికుల్లో, ఎవరి 'పదవులు' ఎటువంటివి అయినా, పెద్దా చిన్నా డాక్టర్ల శ్రమలూ, ఇతర శ్రామికులందరి శ్రమలూ, అన్నీ కలిసే వైద్య సదుపాయాల్ని అమ్మకం సరుకులుగా ఏర్పర్చేవి అవుతాయి.
డాక్టర్లలో కొందరైనా, ఆ పరిశ్రమ ఉద్యోగులు గానే పెద్ద జీతాల శ్రామికులుగా కూడా వుంటూనే, పరిశ్రమలో కొంత కొంత పెట్టుబడులు పెట్టి, ఆ పరిశ్రమదారుల్లో భాగస్తులుగా కూడా వుంటే వుంటారు. అలా వుంటే వారి ఆదాయాల్లో కొన్ని భాగాలు, స్వంత శ్రమలు లేకుండానే వచ్చేవిగా వుంటాయని వేరే చెప్పక్కర్లేదు.
ఆస్పత్రికి ఆదాయం ఏమిటి?
ఆస్పత్రి పరిశ్రమలో, అది అమ్మే సరుకుల్ని కొనేది ఎవరో మళ్ళీ చెప్పుకుందాం. ఇంకెవరు? తమ రోగాల చికిత్స కోసం వచ్చే రోగులే.
ఆస్పత్రికి, ఎప్పటి కప్పుడు రోగులు చెల్లించే ఫీజులే, ఆస్పత్రికి ఆ నాటికి వచ్చే ఆదాయం. రోగుల ద్వారా, ఈ ఆదాయం రావడానికి కారణం, వైద్య సదుపాయాల ధరలు! రోగులు చెల్లించే ధరలన్నీ కలిసినవే, ఆస్పత్రికి 'వారపు రాబడి' గానీ, 'మాసపు రాబడి' గానీ!
సరుకులకు ధరలు ఎలా ఏర్పడతాయి?
ఏ రాబడిని చూడాలన్నా, 'శ్రమల విలువలు' అతి ముఖ్యం. వేరు వేరు శ్రమల విలువల్లో తక్కువలూ - ఎక్కువలూ వుండడం నిజమే. కానీ ఏ శ్రమ విలువ కన్నా, ఏ శ్రమ విలువ 'ఎంత' తక్కువో, 'ఎంత' ఎక్కువో, ఆ 'ఎంతల్ని' కచ్చితంగా లెక్క కట్టడం సాధ్యం కాదు. అయినా ఇక్కడ పరిశ్రమలకు ఆదాయాలు ఎలా వస్తాయో అదే చూడాలి.
పరిశ్రమలో అన్ని స్తాయిల శ్రామికుల పనులకూ 'ధరలు' నిర్ణయమవుతాయి. ఆ ధరలు, శ్రామికులకు ఇచ్చే జీతాల లెక్కల్ని బట్టి కాదు సుమా!
సరుకులకు 'ధరలు' అన్నప్పుడు, ఆ ధరలు ఎలా ఏర్పడతాయి?
పరిశ్రమ కోసం రక రకాల శ్రామికులందరూ చేసే శ్రమల విలువల్ని బట్టి ఏర్పడేవే ధరలు. కానీ, పరిశ్రమదారుల ధరల లెక్కలు శ్రమల్ని బట్టి వుండవు. వాళ్ళ లెక్కలు వేరేగా వుంటాయి. (1) పరిశ్రమ కోసం సాధనాల మీదా, శ్రామికులకిచ్చే జీతాల మీదా 'పెట్టుబడి'గా కొంత డబ్బు పెట్టాం. కాబట్టి దానికి 'వడ్డీ' రావాలనేది పరిశ్రమదారుల మొదటి లెక్క.
వడ్డీ రావాలని వాదించే వాళ్ళకి మన జవాబు: పెట్టుబడిగా పెట్టేది, సరుకు తయారీకి మొదట అవసరమయ్యే ఉత్పత్తి సాధనాల మీద మాత్రమే. శ్రామికుల జీతాల మీద కాదు. పెట్టుబడిగా కొంత డబ్బుతో కొన్ని ఉత్పత్తి సాధనాల్ని కొని, శ్రామికుల్ని పెట్టి, ఉత్పత్తి కార్యం మొదలు పెడితే, కొత్త ఉత్పత్తి వస్తుంది. దాన్ని అమ్మితే, సాధనాల మీద పెట్టిన పెట్టుబడి డబ్బే కాకుండా, శ్రామికుల శ్రమల విలువలకు సంబంధించిన డబ్బు కూడా వస్తుంది. మళ్ళీ కొత్త సరుకులు కావాలంటే, వెనక్కి వచ్చిన పెట్టుబడి డబ్బే, కొత్త పెట్టుబడిగా ఉండగలదు. పెట్టుబడి అనేది, అందులో నించి ఒక్క పైసా అయినా పోకుండా వెనక్కి వచ్చేస్తే, దాని కోసం వడ్డీ ఏమిటి? వడ్డీ అంటే కొంత డబ్బు! ఈ వడ్డీ, తయారై వున్న సరుకుల తయారీ కోసం ఏమైనా ఖర్చయిందా? పెట్టుబడి అయితే సరుకుల కోసమే ఖర్చయింది గానీ, వడ్డీగా వుండే డబ్బుకీ ఉత్పత్తి తయారీకీ సంబంధమే వుండదు. అయినా వడ్డీగా కొంత డబ్బు ఇవ్వాలంటే, ఎక్కణ్ణించి తీసి ఇవ్వాలి? - ఆ పరిశ్రమ, తను నిర్ణయించిన ధరల మొత్తంతో సరుకుల్ని అమ్ముతుంది కదా? - దానికి పెట్టుబడి కన్నా ఎక్కువ డబ్బు వస్తుంది. ఈ ఎక్కువ డబ్బు పరిశ్రమలో పని చేసిన శ్రామికులందరూ చేసిన శ్రమల విలువల వల్ల వచ్చేదే. ఆ డబ్బు లోనించి, 'వడ్డీ' పేరుతో కొంత డబ్బు తీసి ఇస్తే, అది ఏమిటి? అది, పెట్టుబడిలో నించి తీసేది కాదు. అది సాధ్యం కాదు. పెట్టుబడి, అలాగే వుండాలి. శ్రామికుల శ్రమల విలువలన్నీ కలిసి వచ్చే డబ్బే అది. వడ్డీగా వెళ్ళేది, శ్రామికుల శ్రమల విలువల్లోదే! శ్రామికుల శ్రమలో భాగాన్నే వడ్డీగా ఇచ్చినట్టు. ఇది సరుకుల ధరల్లో నించి జరిగే మొదటి ఘోరమైన తప్పు!
పరిశ్రమ, తను స్వయంగా పెట్టుకున్న శ్రామికులకు జీతాలు, ఆ శ్రామికుల శ్రమ విలువల నించే వస్తాయి.
(2) ధరల వల్ల వచ్చిన డబ్బులో నించి, బైటి కంపెనీల నించి వచ్చిన శ్రామికుల 'జీతాల' గురించి: బైటి కంపెనీల నించీ తీసుకున్న శ్రామికులకు జీతాలు ఎవరు ఇస్తారు? పరిశ్రమే ఇస్తుందా, ఆ శ్రామికుల్ని పంపిన బైటి కంపెనీయే ఇస్తుందా? బైటి కంపెనీయే ఇస్తుంది. అయితే బైటి శ్రామికులు పని చేసింది ఈ పరిశ్రమ కోసం కదా? వీరికి బైటి కంపెనీ ఎలా ఇస్తుంది?
ఈ బైటి కంపెనీకి పరిశ్రమే తన సరుకుల డబ్బులో నించీ శ్రామికులకు జీతాలకన్నా ఎక్కువే ఇస్తుంది. ఆ డబ్బులోనించీ, బైటి కంపెనీ, తను పంపిన శ్రామికులకు జీతాలు ఇవ్వగా కూడా, ఆ కంపెనీకి కూడా కొంత డబ్బు మిగలాలి. మిగులుతుంది. ఆ కంపెనీ కోరేది, ఆ మిగిలేదాన్నే.
పరిశ్రమ పెట్టుకున్న స్వంత శ్రామికుల విషయం లోగానీ, బైటి శ్రామికుల విషయంలో గానీ, వారి శ్రమల విలువలు వారికే పూర్తిగా అందకుండా అందులో చాలా బాగం యజమానులకు పోతుంది. ఇలా పోవడం అంటే ఇది ధరల్లో నించి జరిగే రెండో ఘోరమైన తప్పు.
(3) పరిశ్రమ, పెట్టుబడికి వడ్డీనీ తన శ్రామికులకు జీతాల్నీ, బైటి నించి శ్రామికుల్ని పంపే కంపెనీలకు ఇచ్చేదాన్నీ- వీటిని చెల్లించిన తర్వాత ఇక మిగిలే భాగాన్ని తనకు 'లాభం'గా స్వాధీనం చేసుకుంటుంది! పరిశ్రమ సాగుతూ, ఉత్పత్తి క్రమాల ద్వారా సరుకులు తయారవడానికి పరిశ్రమలో కొన్ని 'నిర్వహణ శ్రమలు' అవసరమే. ఈ నిర్వహణ శ్రమల కోసం పరిశ్రమదారులు పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూనే వుంటారు. అయినా ఈ పెద్ద జీతాలు కాకుండానే లాభాల స్వాధీనాలు కూడా జరుగుతాయి. సరుకుల్ని అమ్మగా వచ్చే డబ్బులో నించి ఇది మరొక ఘోరమైన తప్పు!
(4) ఇక్కడ 'భూమి కౌలు'ని కూడా చెప్పుకోవచ్చు. భూస్వాములకు పోయే 'భూమి కౌలు'కీ, ఇక్కడ చూడవలిసిన దానికీ, పేర్లలో తేడాలే తప్ప, సారాంశంలో తేడా ఏదీ వుండదు. ఏ పరిశ్రమ అయినా, భూమి మీదే వుంటుంది, ఆకాశంలో వుండదు. 'భూమి' అనేది మానవుల శ్రమలతో తయారు కాని, ప్రకృతి సహజ పదార్ధం. కాబట్టి, భూమికి విలువ వుండదు. కానీ, భూస్వాములకు లాగే, పరిశ్రమదారులకు కూడా ఈ అవగాహనేమీ వుండదు. వీళ్ళ దృష్టిలో, భూమికి విలువ వుంటుంది! వాళ్ళ అవగాహన ప్రకారం, భూమికి విలువ ఇంకా ఇంకా పెరిగి పోతూ కూడా వుంటుంది. పరిశ్రమ జరిగే భూమి, పరిశ్రమదారుడి స్వంతమే అయినా, ఆ పరిశ్రమదారుడు, తన భూమికి 'అద్దె' పేరుతో కొంత డబ్బుని తీసుకోవలిసిందే. లేదా, ఆ భూమి ఏ బైటి వ్యక్తిదైనా అయితే, వాళ్ళకి భూమి అద్దె చెల్లించ వలిసిందే. (ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ