Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
వడ్డీ లాభాలూ, భూమి అద్దెలూ, ఎక్కణ్ణించి వస్తాయి?
ఇప్పుడు అతి ముఖ్య విషయం: ఏ పరిశ్రమ అయినా తన సరుకుల అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం డబ్బులో నుంచి వడ్డీ లాభాలూ, భూమి అద్దె - ఈ మూడూ తీసుకోవాలంటే అవి ఎక్కణ్ణించి వస్తాయి? - (1) పరిశ్రమ, తను స్వయంగా పెట్టుకునే స్వంత శ్రామికుల శ్రమల విలువల ద్వారానూ; (2) బైటి కంపెనీల నుంచి పెట్టుకున్న శ్రామికుల శ్రమల విలువల ద్వారానూ - ఆ విలువల మొత్తం లోనించే, శ్రామికుల జీతాలు పోగా పరిశ్రమకి డబ్బు వస్తుంది.
పరిశ్రమల స్వంత శ్రామికుల విషయంలో గానీ, బైటి కంపెనీల శ్రామికుల విషయంలో గానీ, వారి శ్రమల విలువలు వారికి పూర్తిగా అందకుండా మిగిలే భాగాన్ని, ఆ శ్రామికుల శ్రమల వల్ల వచ్చిన 'అదనపు విలువే' అనాలి. 'అదనం' అంటే శ్రామికుల శ్రమల విలువల లోనించి వాళ్ళకి జీతాలుగా అందిన దానికన్నా అదనంగా వున్నదే. అది కూడా శ్రామికుల శ్రమ విలువలోదే.
పరిశ్రమనే చూస్తే, తన స్వంత శ్రామికుల శ్రమ విలువల లోనించి, వారికి ఇచ్చే జీతాలు పోగా, మిగిలేది వడ్డీ లాభాలూ, భూమి అద్దెలూ!
పరిశ్రమ కాంట్రాక్టు శ్రామికుల్ని పెట్టుకుంటే ఆ బైటి కంపెనీకే ఎక్కువ డబ్బు ఇస్తుంది కదా? మరి ఈ శ్రామికుల శ్రమల ద్వారా పరిశ్రమకి అదనం ఎలా వస్తుంది? పరిశ్రమ తన భాగాన్ని తను వుంచుకున్న తర్వాతే, బైటి కంపెనీకి కొంత అదనాన్ని ఇస్తుంది.
ఉత్పత్తి తయారీకి మూలం, పాత శ్రమా, కొత్త శ్రమా:
ఇంత వరకూ చెప్పుకున్న విషయాల లోనే అతి ముఖ్యంగా తెలుసు కోవలిసిన విషయం ఒకటి వుంది. అది ఏ సరుకుకి అయినా దాన్ని అమ్మడానికి 'ధర' ఎలా ఏర్పడుతుంది అనేది.
మార్క్సు రాసిన ''కాపిటల్'' పుస్తకంలో 'పాత శ్రమా - కొత్త శ్రమా' అనే విషయాలు తెలుసుకుంటే శ్రామికులకు కళ్ళు పూర్తిగా తెరుచుకుంటాయి.
సరుకుల్ని ఉత్పత్తి చేయడంలో, 'పాత శ్రమ' ఏది? 'కొత్త శ్రమ' ఏది?
పాత శ్రమ అంటే ఏమిటి?
ఏ సరుకు తయారవడాని కైనా, మొదట ఉత్పత్తి సాధనాలు కావాలని చూశాం. ఈ సాధనాలు వేరే వేరే పని స్తలాల్లో అప్పటికే తయారై, కొత్త సరుకు కోసం, అది తయారు కావలిసిన పని స్థలంలోకి వస్తాయి. ఆ కొత్త పని స్తలంలో సరుకు కోసం, తయారయ్యే సాధనాలు 3 రకాలూ గానీ లేదా 2 రకాలే అవసరం కావచ్చు. విద్యా బోధనా, వైద్యం - వంటి శ్రమల్లో 'పని ముట్ల' తోనే అవసరాలు జరుగుతాయి.
'పాత శ్రమ' అంటే ఏమిటో చూడడానికి, అవసరమైన సాధనాల ఖర్చులకు సంబంధించే విషయాలే అతి ముఖ్యం. 100 గజాల ముడి పదార్ధం అయిన బట్ట వుందనుకుందాం. అందులో నించి, ఒక జాకెట్టుని కుట్టడానికి, ఒక్క అర గజం బట్టని తీసి జాకెట్టుని తయారు చేశారనుకుందాం. అలాగే, స్టోరులో దాచిన దారంలో నించి కొంత దారాన్నీ, గుండీలలో నించి కొన్ని గుండీలూ కూడా, కొత్త జాకెట్టు కోసం వెళ్తాయి.
ముడి పదార్ధాలుగా ఇంకా పని స్థలం లోకి రాకుండా స్టోరులో నిలిచి వున్న సాధనాలన్నీ 'ఫిక్సెడ్' విలువ భాగం. కొత్త జాకెట్టు కోసం ఖర్చయిన ముడి పదార్ధాల విలువ అంతా, కొత్త జాకెట్టు ద్వారా అమ్మకం లోకి వెళ్తుంది. కాబట్టి ఇది చలామణీలోకి పోయే విలువ భాగం.
కొత్త సరుకు కోసం అవసరమైన ఇతర సాధనాల సంగతీ అంతే.
ముడి పదార్ధానికీ, సహాయక పదార్ధానికీ సంబంధించి, చలామణీలోకి పోయే ఆ రెండు పదార్ధాల విలువల్నీ కొంత తేలిగ్గానే లెక్క కట్ట గలరు.
అయితే, సాధనాల్లో ఇంకో అంశం అయిన 'పని ముట్ల' విలువల్ని చూడాలంటే ఇది అంత తేలిక కాదు.
'పని ముట్టు' అనేది చిన్నా పెద్దా యంత్రాల వంటివి. యంత్రాల కన్నా అతి చిన్నవి కూడా.
'పని ముట్ల'లో అతి చిన్నది, సూది! దాని కన్నా కొంత పెద్దది, కత్తెర! ఇంకా పెద్దది యంత్రం.
ఈ పని ముట్లని ఒక్కసారి వాడగానే పూర్తిగా ఖర్చయి పోవు.
ఒక సూదితో ఒక జాకెట్టు కుట్టుని పూర్తి చేస్తే, సూదిలో ఎంత విలువ ఒక జాకెట్టు కోసం ఖర్చయిందో వెంటనే తెలిసే మార్గం వుండదు.
సూది తయారైనప్పుడు, దాని విలువ ఎంత వుంటుందో ఒక నిర్ణయం జరుగుతుంది.
100 సూదుల్ని కలిపి కొన్నప్పుడు 1 సూది విలువ 10 పైసలు అని తేలిందనుకుందాం. ఇటువంటి సూది 2 జాకెట్లని కుట్టే టప్పటికి విరిగి పోతుందనుకుందాం. 1 జాకెట్టుని కుట్టడానికి, పని ముట్టు అయినది సూది. దాని కోసం జరిగిన ఖర్చు 5 పైసలు. అప్పుడు, సూది లోనించి 5 పైసల విలువ ఒక జాకెట్ కోసం ఖర్చయి పోయినట్టు. సూది కొంత పాత బడినా, దానిలో ఇంకో 5 పైసల విలువ ఫిక్సెడ్గా నిలిచి వుంటుంది - అని.
ఆ సూదితో ఇంకో జాకెట్టుని కుట్టేటప్పటికి అది పూర్తిగా పాతదై పోయి విరిగి పోతుందనుకుందాం. అప్పటికి ఈ పని ముట్టు విలువ రెండు భాగాలుగా అయిందని అర్ధం. ఫిక్సెడ్ విలువా, చలామణీ విలువా ఏ పని ముట్టు అయినా ఎంత కాలం వరకూ పని చేస్తుందో మొదట తెలిస్తేనే దాని విలువలో ఎంత భాగం ఫిక్సెడ్గా నిలిచి పోయి వుంటుందో అందు లోనించి ఎంతెంత భాగం చలామణీగా మారుతూ వుంటుందో తెలుస్తుంది.
కత్తెర కూడా ఒక పని ముట్టే కదా? ఇది, 1, 2, బట్టల్ని కత్తిరించడంతో నాశనం కాదు. కత్తెర కొన్ని సంవత్సరాల వరకూ కూడా నిలిచి వుంటుంది. ఎటొచ్చీ దానికి మధ్య మధ్య చిన్న చిన్న రిపేర్లు అవసర మవుతాయి.
సూదీ, కత్తెరా వంటి చిట్టి పొట్టి పని ముట్లని గాక, భారీ యంత్రాల్ని చూస్తే, అవి అనేక సంవత్సరాల పాటు నిలిచి వుంటాయి. ఈ యంత్రాల్ని ఉపయోగిస్తూ వుంటే, వాటి విలువల్లో నించి కొంత కొంత భాగం చలామణీ భాగాలుగా మారిపోతూ వుంటే, యంత్రాల విలువల్లో అధిక భాగం ఫిక్సెడ్గా నిలిచి పోతూ వుంటుంది.
'పాత శ్రమ' అంటే ఏమిటో చూస్తూ సాధనాల నించి కొత్త సరుకుకి చేరే విలువల భాగాల్ని చెప్పుకున్నాం. కొత్త సరుకు కోసం సాధనాల నించీ ఖర్చయిన భాగాలన్నీ కలిసినది పాత శ్రమ. దీన్ని 'పాత శ్రమ' అని ఎందుకు అంటాం? ఇది కొత్త సరుకు కన్నా ముందే జరిగిపోయి వుంటుంది. ఈ తయారై వున్న సాధనాలు వస్తేనే వాటితో కొత్త సరుకు తయారవుతుంది.
సాధనాలన్నిటినీ వేరు వేరు పని స్థలాల్లో వేరు వేరు శ్రామికులు చేస్తారు. ఈ శ్రామికులు కూడా తమ 'అదనపు శ్రమ విలువ'ని పోగొట్టుకునే వారే.
శ్రమలు చేసే వారినే 'శ్రామికులు' అనుకుంటే, వీరు తమ కోసం తాము చేసుకునే స్వతంత్ర పని వారూ కావచ్చు, ఇతరుల దగ్గిర పనులు చేసే కార్మికులూ కావచ్చు. ఎటువంటి వారైనా, శ్రమలు చేస్తేనే ఉత్పత్తులు తయారవుతాయి.
కొత్త సరుకు కోసం, సాధనాల ఖర్చు ఎంత అవుతుందో, అది, అప్పటికే జరిగి పోయిన శ్రమల ఖర్చు.
'కొత్త శ్రమ' అంటే ఏమిటి?
సాధనాల్ని ఉపయోగిస్తూ కొత్త ఉత్పత్తిని తయారు చేసే శ్రమే, కొత్త శ్రమ.
ముడి పదార్ధం అయిన బట్ట మీద, సూదీ దారాలతో, ఒక గంట సేపు కుట్టు కుడితే, కుట్టు శ్రమ ఎంత సేపు జరిగిందో ఇదే 'కొత్త శ్రమ'.
కుట్టు శ్రమ కూడా ముగిసి కొత్త జాకెట్టు తయారైతే దాని మొత్తం విలువ ఏది? - జాకెట్టుగా మారిన ముడి బట్ట విలువా, దాని కోసమే అవసరమైన ముడి దారం విలువా, ముడి గుండీల విలువా - ఇంత వరకూ కలిసి పాత శ్రమ విలువ అయితే; దీనికి కుట్టు శ్రమ కొత్తగా జరిగి పాతా - కొత్తా శ్రమల విలువలు కలిసినది ఆ జాకెట్టుకి, మొత్తం విలువ. (ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ