Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అయ్యారనే చేదు వాస్తవాన్ని 'నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2021' వెల్లడించింది. దేశవ్యాప్తంగా 720 జిల్లాల్లోని 1.18లక్షల పాఠశాలలకు చెందిన 34లక్షల మంది పట్టణ, గ్రామీణ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, 5.27లక్షల ఉపాధ్యాయులను సర్వేలో భాగం చేసి ఒకే రోజు (12 నవంబర్ 2021) సిబియస్‌ఈ నిర్వహించిన 'నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2021 (యన్‌ఏయస్-2021)' నివేదికను భారత ప్రభుత్వ పాఠశాల విద్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, ఏయిడెడ్, అన్ఏయిడెడ్ ప్రయివేటు పాఠశాలల విద్యార్థులను సర్వేలో భాగం చేశారు. గతంలో యన్‌ఏయస్ - 2017 సర్వే నివేదిక విడుదలైన తరువాత నేటి యన్‌ఏయస్ - 2021 సర్వే నివేదికకు 22 ప్రాంతీయ భాషల్లో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థుల మూడేండ్ల అభ్యాస వివరాలను పరిగణనలోకి తీసుకొన్నారు. 3, 5 తరగతులకు లాంగ్వేజ్, మాథ్స్, ఈవియస్ సబ్జెక్టులు, 8వ తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్, మాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్‌లను పరిగణనలోకి తీసుకోగా, 10వ తరగతిలో లాంగ్వేజ్, మాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్‌లను సర్వేలో పొందుపరిచారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్య ప్రమాణాలను తెలుసుకోవడమే ఉద్దేశంగా జరిగిన ఈ యన్‌ఏయస్-2021 సర్వేలో గ్రామీణ, పట్టణ విద్యార్థుల విషయ అవగాహనలను శాస్త్రీయంగా, స్పష్టంగా అధ్యయనం చేయడం జరిగింది.
ప్రధాన పరిశీలనలు
కరోనా విపత్తు కాలంలో ఆన్లైన్ బోధనల ప్రభావంతో విద్యా ప్రమాణాలు ఏ మేరకు ఫలితాలను ఇచ్చాయో తెలుసుకోవడానికి ఈ సర్వే నివేదిక ఉపకరిస్తుంది. ఆన్లైన్ బోధన సులభంగానే ఉందని 45శాతం, కష్టంగా ఉందని 38శాతం, ఏలాంటి అసౌకర్యం కలిగించ లేదని 50శాతం విద్యార్థులు తెలియజేశారు. ఆన్లైన్ విద్యా బోధన ఆసక్తిని కలిగించలేదని 78శాతం, స్మార్ట్ఫోన్లు లేవని 24శాతం, పాఠశాలలోని ఆఫ్‌లైన్ విద్య బోధనే బాగుంటుందని 80శాతం, ఆన్లైన్లో కొత్త విషయాలను జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుందని 70శాతం చిన్నారుల అభిప్రాయాలను సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థుల్లో లాంగ్వేజ్ పట్టు బాగుందని, మాథ్స్, సైన్స్ పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నారని తేలింది. ఈ సర్వేలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గ విద్యార్థులు చదువుల్లో వెనుకబడి ఉండడం గమనించారు.
కరోనా విపత్తు ప్రభావం
2017 సర్వే ఫలితాలతో పోల్చితే 2021 జాతీయ సగటు సర్వే వివరాలు కరోనా ప్రతికూల ప్రభావాన్ని రుజువు చేస్తున్నాయి. 2017 ప్రమాణాలతో పోల్చితే 2021లో మాథ్స్‌లో 32శాతం, సైన్స్‌లో 35శాతం, సోషల్ సైన్స్‌లో 37శాతం, ఇంగ్లీష్‌లో 43శాతం, మాడ్రన్ లాంగ్వేజ్‌లో 41శాతం మార్కులు, గ్రేడ్లు తగ్గడమనే విచారకర వాస్తవాన్ని గమనించారు.
భారత విద్యా వ్యవస్థ సవాళ్లు
పాఠశాలల్లో సౌకర్యాల లేమి, అర్హతగల ఉపాధ్యాయుల కొరత, కాలం చెల్లిన సెలబస్, యూనివర్సిటీ-పరిశ్రమల అనుసంధానం లేకపోవడం, ఉపాధ్యాయులను ఇతర విధులకు అధిక సమయం వినియోగించుకోవడం లాంటి పలు తీవ్రమైన సమస్యలు నేటికీ మన పాఠశాల విద్యావ్యవస్థను వెన్నాడుతూనే ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు నోబెల్ బహుమతులను గెలుచుకునే స్థాయిలో ఉన్నప్పటికీ మన దేశ శాస్త్రజ్ఞులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని స్పష్టంగా అర్థం అవుతున్నది. విద్యావ్యవస్థలో పర్యవేక్షణ లోపించడం, ఉత్తమ ఉపాధ్యాయులకు గుర్తింపు, బోధనలో ఆసక్తిలేని వారితో పాటు వెనుకబడి ఉన్న ఉపాధ్యాయులకు కఠిన శిక్షలు కరువైనాయి. అధిక శాతం ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల వ్యాపార ధోరిణి లాంటి అవాంఛనీయ అంశాలు విద్యా ప్రమాణాలను వెక్కిరిస్తున్నాయి. బాలురతో పోల్చితే బాలికల డ్రాప్అవుట్లు అధికంగా ఉండడం, స్మార్ట్ఫోన్ల సౌకర్యం లేకపోవడం లాంటివి విద్య వ్యాప్తికి అవరోధాలుగా నిలిచాయి.
తెలంగాణ ఫలితాలు
తెలంగాణ 10వ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్ సగటు గ్రేడ్ 48శాతం ఉండగా, జాతీయ సగటు 43శాతంగా గమనించారు. తెలంగాణ 3వ తరగతి చిన్నారులు 50శాతం కన్న తక్కువ మంది చిన్న వాక్యాలు చదవలేక పోతున్నారని, 40శాతం పిల్లలు అంకెల పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని, 46శాతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్థితిలో ఉన్నారని తేలింది. 5వ తరగతి చిన్నారుల్లో 43శాతం వాక్యాలను చదువగలుగుతున్నారని, 48శాతం అంకెల జ్ఞానాన్ని కలిగి ఉన్నారని, 40శాతం కన్న తక్కువ పిల్లలు తమ సమీప బంధువులను గుర్తిస్తున్నారని తేలింది. 8వ తరగతి విద్యార్థుల్లో 17 శాతం మాత్రమే సాధారణ సమస్యలకు సమాధానాలు ఇవ్వగలిగారని, 30శాతం కన్న తక్కువ పిల్లలు చార్ట్స్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని, 38శాతం పర్యావరణ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని తేలింది. 10వ తరగతి విద్యార్థుల్లో 21శాతం జియోమెట్రీ పరిజ్ఞానం కలిగి ఉన్నారని, 36శాతం పిల్లలు సైన్స్‌ను జీవితానికి అన్వయించుకునే స్థాయిలో ఉన్నారని, 24శాతం మంది సోషల్ సైన్స్ అవగాహనను కలిగి ఉన్నట్లు తేలింది. 3, 5, 8, 10 తరగతి విద్యార్థుల్లో 95శాతం మంది పాఠశాల విద్యలో సంతోషంగా ఉన్నారని, 77శాతం మంది మాతృభాషలో మాట్లాడడానికి అలవాటు పడ్డారని, 96శాతం వరకు ఉపాధ్యాయుల బోధనలు అర్థం చేసుకుంటున్నారని తేలింది. ఉపాధ్యాయుల్లో 36శాతం మంది అధిక పని భారం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పేద రాష్ట్రాలైన బీహార్, యంపి, రాజస్థాన్, యూపీ (బిమారు) విద్యార్థులతో పోల్చితే తెలంగాణ విద్యార్థులు చదువుల్లో వెనకబడి ఉన్నారని తేలింది. దేశరాజధాని ఢిల్లీ విద్యార్థులతో పోల్చితే పంజాబ్ విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా ఉన్నారని తేలింది. కరోనా కల్లోలంలో సన్నగిల్లిన విద్యా ప్రమాణాలను నేడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెంచాల్సిన అగత్యం ఏర్పడింది. భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకొని, మేధో వలసను తగ్గించి దేశ సమగ్ర సుస్థిరాభింౠద్ధిలో పాలుపంచుకోవాలని ఆశిద్దాం. నేటి విద్యా పెట్టుబడులే రేపటి తరాల ఆదాయ మార్గాలని గుర్తిద్దాం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037