Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్', సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీరేటును 8.5శాతం నుంచి 8.1శాతానికి తగ్గించాలని చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 3.6.2022న ఈ మేరకు ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం సుమారు ఆరు కోట్ల ఈపీఎఫ్ చందాదారుల మీద ప్రతికూల ప్రభావం చూపనున్నది. 45ఏండ్ల కనిష్ట స్థాయికి ఈపీఎఫ్‌పై వడ్డీరేటు కుదించబడటం వలన ఉద్యోగ, కార్మికుల భవిష్యత్ ప్రయోజనాలకి తీవ్ర భంగం వాటిల్లింది.
ఉద్యోగుల భవిష్య నిధి చట్టం - 1952, ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగుల, కార్మికుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి, ఉద్యోగ విరమణ అనంతరం వారి ప్రయోజనాల కోసం పీఎఫ్‌లో పొదుపుచేయడం తప్పనిసరి చేసిన అంశం విదితమే. పెన్షనర్ల జీవన సాఫల్యమే లక్ష్యంగా నిర్ధేశించుకున్న ఈపీఎఫ్ఓ, ప్రతినెలా కార్మికుల, ఉద్యోగుల మూల వేతనంలో 12శాతం ప్రావిడెంట్ ఫండ్‌ను మినహాయించంతో పాటు అదే మొత్తాన్ని యాజమాన్యం కూడా సంస్థ తరుపున జమచేసే ప్రక్రియను అమలుచేస్తోంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగికి భవిష్యత్తులో ఇచ్చే పెన్షన్ నిధికి సంబంధించిన అంశం. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాలో యాజమాన్యం ఖాతా, ఉద్యోగి ఖాతా, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఇమిడి ఉంటాయి. ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో జీతం నుంచి నిర్భంధంగా మినహాయించి చెల్లించే మొత్తంతో పాటు వాలంటరీగా, అదనంగా పెన్షన్ ఫండ్‌కు జమచేసేవి కూడా ఉంటాయి. యాజమాన్య వాటాలో ఈపీఎఫ్ చందా మినహాయించి మిగతా మొత్తాన్ని యాజమాన్య ఖాతా క్రింద చూపిస్తారు. ఉద్యోగి-యజమాని ఖాతాల్లోని మొత్తానికి కలిపి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ చెల్లింపులు చేస్తుంది.
ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' లక్ష్యాలు, వడ్డీ చెల్లింపు విధాన ప్రక్రియ, ఈపీఎఫ్ నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా ఉంచే పద్ధతులలో ఇప్పటికే వచ్చిన విధానపరమైన మార్పులకి అదనంగా, కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ఏప్రియల్ నుంచి అమలులోకి వచ్చే విధంగా పిఎఫ్ నిధులను పన్ను, పన్నేతర ఖాతాలుగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. పిఎఫ్ ఖాతాలో 2.5లక్షలకు మించి జమచేస్తే అటువంటి భవిష్యనిధి ఖాతాలను ఆదాయపు పన్ను పరిధిలోనికి తేనున్నారు. సీలింగ్‌ను దాటి జమ అయిన మొత్తంపై ఆదాయపు పన్నును ఆన్లైన్ పద్ధతిలో మినహాయించాలని నిర్ణయించారు.
ఈపీఎఫ్ఓలో జమచేసిన చందా మొత్తాలను వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెట్టి, వాటిపై వచ్చే లాభాల నుంచి చందాదారులకు వడ్డీ చెల్లించడం జరుగుతోంది. 85శాతం ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు తదితర రుణ సాధనలోను, 15శాతం స్టాక్ మార్కెట్లలోనూ పెట్టుబడులుగా ఉంచుతారు. వీటిలో 45శాతం నుంచి 65శాతం ప్రభుత్వ సెక్యూరిటీలుగానూ, 20శాతం నుంచి 50శాతం కార్పొరేట్ సంస్థలు జారీ చేసిన రుణ పత్రాలలోనూ, స్టాక్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)లో నమోదు అయిన ఎ1 రేటింగ్‌తో ఉన్న రుణ పత్రాలలో 5శాతం మేరకు నిధులు పెట్టే విధంగా కాలానుగుణంగా మార్పులు చేసారు. ఈక్విటీ పెట్టుబడుల అంశానికి సంబంధించి సెన్సెక్స్, నిఫ్టీలను అనుసరించే, సెబీలో నమోదు అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లలో, అధిక పెట్టుబడులున్న కంపెనీ షేర్లలోనూ ఈక్విటీల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. 2015 నుంచి మార్చి 2021 వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈక్విటీ లింక్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో 1,37,895.95 కోట్ల నిధులను పెట్టుబడులుగా పెట్టింది. ఈ మొత్తంలో కేవలం 2021 ఆర్థిక సంవత్సరంలోనే 32,070 కోట్లు ఈ విధమైన ఫండ్స్ నందు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. పెట్టుబడులమీద వడ్డీ రూపంలో 2021 ఆర్థిక సంవత్సరంలో 72,811 కోట్లు వడ్డీని సముపార్జించింది. 2020-21 డిసెంబరు నాటికి అడ్వాన్స్ సౌకర్యం క్రింద చందా దారులకు 14,310.21 కోట్లు మంజూరు చేయడంతో పాటు 56.79 లక్షల క్లైయిములను పరిష్కరించింది. ఈపీఎఫ్ వద్ద మొత్తం కార్పస్ ఫండ్ 9.42 లక్షల కోట్లుగా ఉంది.
2015 నుంచి ఈపీఎఫ్ నిధులను 15శాతం మేరకు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లోనే జాతీయ కార్మిక సంఘాలు, అనేక స్వతంత్ర ఫెడరేషన్లు, యూనియన్లు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఈపీఎఫ్ పొదుపుపై చందాదారులకు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ అందించటానికే పీఎఫ్ నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనుమతించా మని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నది.
మార్కెట్లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను, అంతర్జాతీయ పరిస్థితులను సమీక్షించి 8.1శాతంగా వడ్డీరేటును నిర్ణయించా మని కేంద్ర కార్మికశాఖా మంత్రి ప్రకటించారు. కానీ క్రమానుగతంగా తగ్గుతున్న వడ్డీరేటు ప్రభుత్వ నిర్ణయాలలో డొల్లతనాన్ని స్పష్టం చేసింది. 8.5శాతం నుంచి 8.1శాతంనకు అంటే 40 బేస్ పాయింట్స్ తగ్గించటం వలన ప్రతి లక్షకు సుమారు 430 రూపాయల మేరకు చందాదారులకు ఆదాయం తగ్గనున్నది. ఈపీఎఫ్ కార్పస్ మొత్తం పరిమాణంగా పరిగణనలోకి తీసుకున్నపుడు ఈ నష్ట ప్రభావం అధిక మొత్తంలో ఉంటుంది.
ఈపీఎఫ్ఓలో 450కోట్లు మిగులు నిధులు ఉన్నప్పటికీ, వడ్డీరేటును 8.1శాతానికి కుదించటం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరచటంతో పాటు, ఈ మేరకు ఆర్థిక మంత్రికి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వడ్డీరేటు తగ్గింపు చర్యను పున:సమీక్షించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది. రిటైర్మెంట్ అనంతరం ప్రయోజనాల కోసం భవిష్యనిధి సంస్థలో చేసే పొదుపును ఒక సామాజిక బాధ్యతతో కూడిన కర్తవ్యంగా భావించవలసిన ప్రభుత్వం, ఉద్యోగుల కష్టార్జితాన్ని స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో అనుసంధానం చేయడం ఆమోదయోగ్యం కాని చర్య. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం ఇస్తున్న వడ్డీరేటుకు సమాంతరంగా ఉద్యోగుల భవిష్యనిధిపై ఇచ్చే వడ్డీరేటును నియంత్రించాలనే అంతర్లీనమైన కేంద్ర ప్రభుత్వ లక్ష్యం, ఈపీఎఫ్ వడ్డీరేటు తగ్గింపు చర్యతో మరోసారి బహిర్గతమయింది.
70ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిధులను ఆర్థిక సంస్కరణల బారినుండి, కార్పొరేట్ కనుసన్నలలో అమలవుతున్న ప్రభుత్వ నిర్ణయాల నుండి కాపాడుకోవడం ఉద్యోగుల, కార్మికుల తక్షణ కర్తవ్యం.
- జి. కిషోర్‌కుమార్
సెల్: 9440905501