Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
శ్రమల్లో, తక్కువ కాలంలో నేర్వగలిగే శారీరక శ్రమలూ; నేర్వడానికి ఎక్కువ కాలం అవసరమయ్యే మేధా శ్రమలూ, వాటిలోనే చిన్నా - పెద్దా రకాలూ, ఈ విధంగా శ్రమలు అనేక తేడాలుగా ఉంటాయి.
తక్కువ కాలంలో జరిగే శారీరక శ్రమలకు తక్కువ విలువా, ఎక్కువ కాలం వరకూ జరిగే మేధా శ్రమలకు ఎక్కువ విలువా సహజం గానే ఉంటాయి.
వైద్య సదుపాయాల్ని ఇచ్చే శ్రమల్లో శ్రమలకు ఎక్కువ విలువలూ, వుంటాయి.
శ్రమల్లో తేడాల్ని బట్టి, వాటి విలువలు తేడాలుగా జరిగే, ఆ శ్రమలు జరిగి, వాటి విలువల్ని బట్టే ఆ సరుకులకు ధరలు ఏర్పడతాయి.
ఒక ఆస్పత్రి ఫలానా కొంత కాలంలో అమ్మే వైద్య సదుపాయాల ధరల్ని బట్టే ఆ ఆస్పత్రికి ఆ కాలంలో రాబడి.
వైద్య సదుపాయల ధరలు:
ఆస్పత్రిలో వైద్య సదుపాయాలకు నిర్ణయమైన ధరలు - అన్నప్పుడు, ఆ ధరలు, న్యాయమైన ధరలు గానే, శ్రామికుల శ్రమల విలువల కన్నిటికీ తగిన ధరలుగానే వున్నాయా - అనే ప్రశ్నలు వస్తాయి, రావాలి.
'ధర' అన్నప్పుడు ఆ ధరని పెట్టిన వాళ్ళు, దాన్ని కొంత ఎక్కువ గానే పెట్టి వుండ వచ్చు. అది ఎలా వున్నా అది ఒక ధర! 'ధర' అనేది దేనిని చెప్పేదిగా వుంటుంది? దేనికి బదులుగా వుంటుంది? శ్రామికులందరి శ్రమల విలువలకు బదులుగా డబ్బు రూపంలో వుండేదే వాటి ధర! 'ధర'ని శ్రమల విలువలనే చూపించే సగటు ధరగా భావించాలి. ఆ ధరలో కొంత భాగం, శ్రమల విలువల్ని బట్టి మాత్రమే వుండేది అయితే, ధరలో వున్న మిగిలిన భాగం దేని కోసం? అది శ్రమ విలువలతో సంబంధం లేకుండా వూరికే ధర లోకి చేరినది - అవుతుందా?
ధరల్ని ఏర్పర్చిన వాళ్ళు ఎంత అస్తవ్యస్తంగా వాటిని ఏర్పర్చినా వాటిని పోటీల దృష్టితో ఏర్పర్చినా, ధరల పేరుతో వచ్చే డబ్బు అనేది శ్రమల విలువ కోసం వచ్చేదే అవుతుంది. అది శ్రమ విలువల కన్నా ఎక్కువగా వుందా, తక్కువగా వుందా - అనేది అనవసరం. ధర అనేది శ్రమల విలువల్ని డబ్బు రూపంతో చెప్పేదే! సమాజంలో వుండే అమ్మకాల ధరలన్నీ కలిసినది, సమాజంలో జరిగిన శ్రమల విలువల మొత్తం. ధరని తెలుసుకోడానికి ఇంకో మార్గం వుండదు.
ఏ ధర అయినా దేన్ని బట్టి వచ్చింది? - అనేదే అసలైన ప్రశ్న. 'ధర' అనేది శ్రమల విలువల్ని బట్టి వచ్చింది'- అనేదే సరైన జవాబు.
ఏ పరిశ్రమలో ధరల సంగతైనా ఇదే.
ఒక శ్రమ విలువకి 10 రూపాయల ధర వుండడమే న్యాయం - అనుకుంటే ఆ శ్రమ విలువకి 11 రూపాయల ధర ఏర్పడి, అది మార్కెట్లో అమ్మకం అవుతూ వుంటే ఆ ధర ఆ శ్రమ విలువకి బదులుగా ఆ విలువలని చూపించేదిగా వుందని అర్ధం. ఆ శ్రమ 10 రూపాయల ద్వారా అయితే కొంత తక్కువ విలువగానూ, 11 రూపాయల ద్వారా అయితే కొంత ఎక్కువ విలువగానూ కనపడుతోందని అర్ధం. - ధరల సంగతి ఇక ఆపుదాం.
'ధర' గురించి అసలైన ముఖ్య విషయం ఆ ధర ఏయే శ్రమల విలువల వల్ల ఏర్పడింది - అనేదే.
కొత్త సరుకు కోసం ఎన్ని సాధనాలైతే అవసరమయ్యాయో ఆ సాధనాల్ని తయారు చేసినది పాత శ్రమ కదా? ఆ సాధనాల మీద, ఆ సాధనాల్ని వాడుతూ చేసే శ్రమ కొత్త శ్రమ.
ఈ రెండు రకాల శ్రమల్నీ వాటికి పాతా - కొత్తా అనే కారణాల్నీ ఇంతకు ముందే చూశాం.
ఏ సరుకుకి అయినా, అది పాతా, కొత్తా శ్రమలతో తయారవుతుందని తెలిస్తేనే ఇంత వరకూ చూడని విషయం తెలుస్తుంది. స్వంత శ్రమ లేకుండానే డబ్బుని సంపాదించడం ఎలాగా? ఇతరులు చేసిన శ్రమల్ని దోచడం ద్వారా అది చేయవచ్చు. యజమానుల పరిశ్రమల్లో నిత్యం జరిగే 'శ్రమ దోపిడీ' విధానాన్ని కొత్తగా చూసి తెల్లబోతాం. తెల్లబోయే వాళ్ళు దోపిడీ మార్గం చూసి దానితోనే సంతృప్తి పడతారా, లేకపోతే శ్రమ దోపిడీ మార్గం మీద క్రమంగా ఆగ్రహ పడతారా?
ఆసుపత్రిలో జరిగే పాత శ్రమలూ, కొత్త శ్రమలూ:
ఒక నర్సింగ్ శ్రామికుడు ఒక రోగికి ఫలానా పని ముట్టు సాధనంతో ఇంజక్షన్ చేస్తే ఆ శ్రామికుడి శ్రమ కొత్త శ్రమే అవుతుంది.
ఒక 'ఆపరేషన్' జరిగే చర్యనే చూస్తే ఆ చర్యకి అవసరమైన సాధనాల ఖర్చుల పాత శ్రమలూ డాక్టర్ల కొత్త శ్రమలూ రెండూ ఖర్చవుతూ వుంటాయి.
ఆస్పత్రిలో రోగులు పడుకుని వుండే మంచాలన్నీ, మంచాల మీద పరుపులూ, దుప్పట్లూ అన్నీ పని ముట్లే. అక్కడ వుండే కుర్చీలూ, బెంచీలూ, అలమార్లూ వంటి సామాన్లన్నీ అటు వంటివే. వాటి విలువల్లో ప్రతి రోజూ రోగుల కోసం కొంత భాగం ఖర్చయ్యే చలామణీ విలువ. సాధనాల్లో ఖర్చవకుండా మిగిలి వుండే విలువ ఫిక్సెడ్ విలువ. సాధనాల్లో ఏ ఖర్చు అయినా అది పాత శ్రమగా అయ్యేదే. డాక్టర్ల తోటీ, ఇతర శ్రామికుల తోటీ కలిసి వారు చేసే పనులన్నీ కొత్తశ్రమ లోకే వెళ్తాయి.
సరుకుల్ని తయారు చేయించే పరిశ్రమదారులు సాధనాల్ని స్వయంగా కొంటారు. కాబట్టి 'పాత శ్రమ ధర' ఎంత వుంటుందో వారికి స్పష్టంగానే తెలుస్తుంది. వేరు వేరు పని స్తలాల్లో సాధనాలన్నీ చేసే శ్రామికులు కూడా కొత్త శ్రామికుల వంటి వారే. వారు పనిచేసే స్థలాల్లో వారు కొత్తే. ఆ సాధనాల్ని ఉపయోగించే స్థలాల్లో సాధనాలు చేసిన వారి శ్రమలు పాత శ్రమలు.
కొత్త విలువ ఎంత వుందో ఎలా తెలుస్తుంది?
తయారైన కొత్త సరుకుని ఇంకా అమ్మక ముందు, దాని ధర ఎలా తెలుస్తుంది? తెలీదు. సరుకుని అమ్మితేనే కొత్త శ్రమ విలువ తెలుస్తుంది.
ఆసుపత్రిలో 'కొత్త శ్రమ' ఎవరిది? ఆస్పత్రి నిండా రకరకాల శ్రమలు చేసిన శ్రామికులది! డాక్టర్లు ఆ శ్రామికుల్లో భాగమే. ఆస్పత్రి యజమానులు స్వయంగా పెట్టుకున్న స్వంత శ్రామికులూ బైటి కంపెనీల నించి తెచ్చుకున్న బైటి శ్రామికులూ-ఆ శ్రామికులందరి శ్రమల మొత్తమే 'కొత్త శ్రమ'.
ఒక ఉదాహరణలో సాధనాల పాత శ్రమ ధరని 80 అనుకుందాం. ఆ సాధనాలతో కొత్త శ్రమ చేసిన శ్రామికుల కొత్త శ్రమ ధర ఏమిటి? - తయారై వున్న సరుకుని అమ్మినప్పుడు మాత్రమే కొత్త శ్రమ విలువ కూడా తెలుస్తుంది.
సాధనాల ఒక ఉదాహరణలో సాధనాల పాత శ్రమ ధరని 80 అనుకున్నాం. కొత్త సరుకుకి అమ్మకం ధరని 120 అనుకుందాం. సరుకుకి అమ్మకం జరిగి పరిశ్రమకు 120 డబ్బు వస్తే, అందులో ఏది ఎంత? వీటిని మనం తర్వాత లెక్క కడదాం.
సరుకు ఎలా ఏర్పడింది? పాతా, కొత్తా శ్రమల తోనే! సరుకుకి కొంత ధర (డబ్బు) వస్తే, అది ఆ రెండు రకాల శ్రమల విలువల్ని బట్టి వచ్చినదే అవుతుంది.
120 ధరలో పాత శ్రమ విలువ 80 అయితే మిగిలిన విలువ దేనిది? అసలు మిగిలినది ఎంత? 120 - 80 = 40. ఈ 40ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఇది, కొత్త శ్రమ తాలూకు విలువే.
పాతా కొత్తా శ్రమలు జరగడం వల్లే సరుకు తయారవుతుంది. ఆ సరుకు ధర, ఆ రెండు శ్రమలదే అవుతుంది కదా?
అయితే, కొత్త శ్రమ చేసింది ఒక ఉదాహరణలో కొందరు శ్రామికులు కావచ్చు. ఇంకో ఉదాహరణలో ఒక్క శ్రామికుడే కావచ్చు.
కొత్త సరుకుని అమ్మి 120 ధరని తీసుకున్న పరిశ్రమదారుడు, సాధనాల పాత శ్రమ కోసం పెట్టిన 80 డబ్బుని, 120 ధరలో నించి వెనక్కి తీసేసుకుంటాడు. ఇదే, పెట్టుబడి డబ్బుని వెనక్కి తీసుకోవడం! పెట్టుబడి అంటే సాధనాల కోసం పెట్టేదే కదా?
సరుకుని అమ్మగా వచ్చిన 120 లోనించి సాధనాల 80 పోగా ఇంకా మిగిలిన 40 సంగతి ఏమిటి?
పరిశ్రమదారుడికి కొత్త సరుకు ద్వారా సాధనాల 80 ఖర్చు, ఒక్క పైసా అయినా తగ్గకుండా వెనక్కి వచ్చాక మిగిలే 40 డబ్బుతో అతడు ఏం చేస్తాడో చూడాలి. ఇది ఒకే ఒక్క సరుకు సంగతి.
ఈ ఉదాహరణలో కొత్త శ్రమ చేసినది ఒక్క శ్రామికుడే అనుకుంటే, ఆ శ్రామికుడికి కొంత జీతం ఇవ్వాలి కదా? ఆ జీతాన్ని 20 అనుకుందాం.
నిజానికి ఆ 40 డబ్బు అంతా కొత్త శ్రమ విలువ వల్ల వచ్చిన భాగమే. అది అంతా కొత్త శ్రమ చేసిన మనిషికి చెందవలిసిందే. ఆ వ్యక్తి, 10, 12 గంటల కాలం శ్రమ చేస్తేనే 40 విలువ గల డబ్బు వచ్చింది. ఆ వ్యక్తి తన స్వంతం కోసం చేసుకునే వాడైతే రోజుకి 10, 12 గంటలు శ్రమ చేసుకోవలిసిన అవసరం వుండదు. కొంత తక్కువ కాలం చేసే శ్రమకి 40 విలువ వుండదు.
యజమాని దగ్గిర పని చేసే ఏ శ్రామికుడైనా అలాగే, ఒక్క పనిదినం లోనే ఎక్కువ గంటలసేపు చేస్తాడు.
యజమాని నించి అతనికి అందే జీతం 20 అనుకున్నాం. అతను చేసిన శ్రమ విలువ 40 అయితే అందులో నించి అతనికి అందేది 20 అయితే అతనికి అందనిది ఇంకో 20 కదా? ఈ చివరి 20ని పరిశ్రమదారుడే తీసుకుంటాడా? అంతే మరీ! (ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ