Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి సంవత్సరం జూన్ 17న అంతర్జాతీయ ''ఎడారీకరణ - కరువు'' వ్యతిరేక దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 1994లో ప్రకటించింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఈ భూమిపై నిరుపయోగంలో ఉన్న భూమిని సస్యశ్యామలమైన భూమిగా మార్చి ఆధునీకరణలోకి తీసుకురావడం, ఆ భూమిని పునరుద్ధరించడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడటం, నూతన ఉద్యోగ కల్పన, ఆదాయ కల్పన, ఆహార భద్రతను కలిగిస్తుంది. అంతే కాక ఇది మానవ జీవన వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ చర్యల వలన భూమిపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. తద్వారా భూమిపై భవిష్యత్ తరాలవారు నివసించటానికి ఎంతో దోహదపడుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి లేదా భవిష్యత్తులో వచ్చే అలాంటి భయానక వైరస్ల ప్రభావం నుండి కూడా రక్షణ కల్పింస్తుంది. మూడొంతుల సముద్రాలు, మహా సముద్రాలు, మంచు ఖండం అంటార్కిటికా మినహా మిగిలిన భూమిపై వ్యవసాయం, రహదారులు, పరిశ్రమలు, గృహనిర్మాణాల కోసం మానవులచే నిరంతరం కొత్త కొత్తగా రూపాంతరం చెందుతున్నది. ఈ నూతన ఆవిష్కరణలకు అవసరమైన మేరకు తప్ప అనవసరంగా మాత్రం సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తే భవిష్యత్లో మానవాళితో పాటు ఈ భూ గ్రహం కూడా తీవ్ర నష్టాన్ని చూడాల్సివస్తుంది.
ప్రపంచంలో దాదాపు 100కు పైగా దేశాలు రాబోయే దశాబ్దంలో దాదాపు ఒక బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని ఐక్యరాజ్య సమితిలో పేర్కొవడం జరిగింది. అంటే దాదాపు ఈ పునరుద్ధరించాలన్న ప్రాంతం చైనా దేశ పరిమాణం. ఇన్ని హెక్టార్ల భూమిని పునరుద్ధరిస్తే మానవాళికి, పుడమికి భారీ ప్రయోజనాలను అందించగలమని పేర్కొనడం శుభపరిణామం.
అటవీ నిర్మూలన ద్వారా, ప్రకృతి విధ్వంసం ద్వారా, ప్రకృతి వైపరిత్యాలవలన, కొన్ని సందర్భాలలో మానవ తప్పిదాలైన యుద్ధాల వలన సారవంతమైన భూమి ఎడారిగా మారుతుంది. తద్వారా ఆ ప్రాంతం అసహజ ఎడారీకరణ అవుతుంది. దాని ఫలితమే ఆ ప్రాంతమంతటా తీవ్ర కరువు ఏర్పడుతుంది. ఈ కరువు, కాటకాలతో మానవాళి జీవనం అస్తవ్యస్తమవుతోంది.
ఈ అసహజ ఎడారీకరణ అనేది ప్రకృతి రీత్యా ఏర్పడిన సహజ ఎడారులను సూచించదు. ప్రపంచంలోని మూడింట ఒక వంతు భూభాగంలో విస్తరించి ఉన్న పర్యావరణ వ్యవస్థలు అతిగా దోపిడీకి గురవటం, నిలకడలేని వ్యవసాయ పద్ధతులు, అతిగా మైనింగ్ కార్యకలాపాలు, అటవీ నిర్మూలన, కలుషిత నీటిపారుదల వలన ఇవి సంభవిస్తాయి. ఈ ఎడారీకరణలో భూమి పూర్తిగా లేదా పాక్షికంగా ఎండిపోవటం జరుగుతుంది. ఇవి ముమ్మాటికీ మానవ తప్పిదాలవలన ఏర్పడతాయి. అనేక దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదాలలో మైఖ్యమైనది ఎడారీకరణ. ఇది భూమి స్థితిని, సాంద్రతను క్రమంగా క్షీణింపచేసే ప్రక్రియ. వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలోని గ్రామీణ పేదలలో చాలా ఎక్కువ భాగం ఈ భూములపైనే నివసిస్తున్నారు.
మనం ప్రతిరోజూ చూసే వార్తా నివేదికలను బట్టి చూస్తే, గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వాతావరణ విధానాలు మారుతున్నాయని సులభంగా గుర్తించవచ్చు. తరచుగా వర్షాలు కురిసే ప్రదేశాలలో కూడా కరువు అనేది ఒక సాధారణ సంఘటనగా కనిపిస్తున్నది. కొద్దిపాటి చినుకులు కూడా అరుదుగా పడే దేశాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వాతావరణ మార్పు నెమ్మదిగా మన ప్రపంచంపై అంటే మానవాళికున్న ఏకైక ఇల్లుపై ప్రభావం చూపుతుంది. ప్రతి సంవత్సరం, భూమి 12మిలియన్ హెక్టార్ల భూమిని కోల్పోతోంది. ప్రపంచ అటవీ విస్తీర్ణం 13 మిలియన్ హెక్టార్లు తగ్గిపోతోంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం కరువు, ఎడారీకరణ కారణంగా సుమారు 1.9 బిలియన్ హెక్టార్ల భూమి క్షీణిస్తోంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ప్రాంతలలో పొడి భూముల్లో దాదాపు మూడు వంతులు ఏడారీకరణకు గురయ్యాయి. ప్రపంచంలో వ్యవసాయం కోసం ఉపయోగించే పొడి భూముల్లో కూడా 70శాతం వివిధ రకాల కారణాలతో అంతరించిపోతున్నాయి. ఆఫ్రికా ఖండంలో భూమి ఎడారిగా మారడంతో గత ఐదేండ్లలో 60 మిలియన్ల మంది ప్రజలు వలసలు వెళుతున్నారు. వాస్తవానికి పెరుగుతున్న ఎడారీకరణ కారణంగా 2025 నాటికి ఆఫ్రికాలోని సారవంతమైన భూమిలో మూడింట రెండు వంతులు పూర్తిగా కోల్పోవచ్చు. ఇక భారతదేశంలో మొత్తం భౌగోళిక ప్రాంతం 328.72 మిలియన్ హెక్టార్లలో దాదాపు 97.85 మిలియన్ హెక్టార్ల (29.7శాతం) భూమి క్షీణతకు గురయింది. దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మొత్తంలో 28 రాష్ట్రాలలో భూమి ఎడారిగా మారింది. ఇందులో 23.79 శాతం రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, లడఖ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణలోనే ఎక్కువ ఉంది. ఎడారీకరణ వలన మరోపెనుముప్పు నీటి కొరత. ఇది పెద్ద సవాలుగా మారుతుంది. 2025 నాటికి 1.8 బిలియన్ల మంది ప్రజలు సంపూర్ణ నీటి కొరతను ఎదుర్కోవాల్సివస్తుంది. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల మంది నీరు అందని పరిస్థితులలో జీవిస్తారు. అయితే ఈ ఎడారికరణకు పరిష్కారం ఉందా? అంటే ఉందనే వాస్తవాన్ని గ్రహించాలి. ఆ పరిష్కారం అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించడం, ఉత్తమమైన వ్యవసాయం, కరువు నిరోధకత కలిగిన వివిధ పంటలు సాగుచేయటమే. ప్రపంచంలో చైనా ఒక బిలియన్ జనాభా కలిగిన దేశం అయినా వ్యవసాయం ద్వారా ఎడారీకరణకు వ్యతిరేకంగా ముందడుగు వేస్తోంది. అయినా శాస్త్రవేత్తలు ఎడారులలో సమృద్ధిగా కనిపించే రెండు విషయాలను పరిగణించారు. అవి ఒకటి సూర్యుడు (సోలార్ ప్యానెల్) ద్వారా రెండు గాలి (విండ్ టర్బైన్) ద్వారా. ఇందుకోసం సహారా ఎడారిలో భారీ సంఖ్యలో సోలార్ ప్యానెల్లు, విండ్ టర్బైన్లను నిర్మించడం ద్వారా వర్షపాతం, వృక్షసంపద, ఉష్ణోగ్రతలపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుందని ఒక కొత్త అధ్యయనాన్ని కనుగొన్నారు. విండ్ టర్బైన్లు ఈ ప్రాంతంలో కురిసే వర్షాన్ని రెట్టింపు చేస్తాయని వారు కనుగొన్నారు.
ఈ సమస్య ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాల ప్రధాన సమస్య. కాబట్టి అన్నీ దేశాలు సమష్టిగా పరిష్కారాలను కనుగొనాలి. సహారా తరహా సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ల వ్యవస్థాపన నిజంగా ఎడారీకరణను ఆపగలిగితే అన్నీ దేశాలు ఆవైపుగా పయనించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకే ఎడారీకరణ ముప్పు ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఎడారీకరణ ముప్పును అరికట్టడానికి మనం తక్షణమే వ్యవసాయాన్ని పరిరక్షించాలి, నీటి కాలుష్యాన్ని అరికట్టాలి, వాయు కాలుష్యాన్ని అదుపులో ఉంచాలి, సహజ ప్రకృతి సంపదను కాపాడుకోవాలి, అడవులను నిర్మూలించకుండా పరిరక్షించుకోవాలి, మైనింగ్ పేరుతో ప్రకృతిని దోచుకోవడం అరికట్టాలి, రసాయన క్షిపణులను వాడకం తగ్గించాలి, ముఖ్యంగా యుద్ధాలు జరగకుండా జాగర్తపడాలి. ఒకవిధంగా చెప్పాలంటే మన శరీరాన్ని ఏవిధంగా ప్రతిరోజు పరిరక్షించుకుంటామో అదే విధంగా మనకు ఉన్న ఏకైక నివాసం మన భూమిని కూడా ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలి. ఇందుకు ప్రపంచ దేశాల సహాయ, సహకారం మరియ వినూత్న పరిష్కారాల మిశ్రమం అవసరం. సెల్:9704444108
నూతలపాటి
రవికాంత్