Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
పరిశ్రమదారుడి వల్ల జరిగేది ఏమిటి?
కొత్త శ్రమకే సంబంధించిన చివరి 20లో నించి, పెట్టుబడికి 'వడ్డీ'గా కొంతా, పరిశ్రమ కింద వుండే 'భూమికి అద్దె'గా కొంతా, మిగతాది పరిశ్రమకి 'లాభం'గా కొంతా పోతాయి! అంటే, ఏ శ్రామికుడికైనా అతని శ్రమ విలువ అంతా అతనికి వెళ్ళదు. అసలు మొదట సరుకుని అమ్మేది పరిశ్రమదారుడు కాబట్టి, కొత్త శ్రమ విలువ అయిన 40, పరిశ్రమదారుడికే అందు తుంది. అందులోనించే జీతంగా కొంత మాత్రమే శ్రామికుడికి వెళ్తుంది. ఇది ఒక్క సరుకు విషయంలో జరిగిన సంగతి.
ఏ పని స్థలంలో అయినా తయారయ్యేది ఒక్క వస్తువే కాదు. పరిశ్రమలో అయితే ప్రతి రోజూ వేల వేల వస్తువులు తయారవుతూ ఒక్క నెలలో లక్షల వస్తువులు తయారవుతూ వుంటాయి. ఆసుపత్రు ల్లాంటి పనిస్తలాల్లో కూడా 'వైద్య సదుపాయాలు' అనే సరుకులు ప్రతీ రోజూ వందలూ, వేలూ తయారవుతూ వుంటాయి.
'పాత శ్రమ'గా చెప్పుకునే శ్రమలన్నీ జరిగేది వేరే వేరే పని స్థలాల్లో. అక్కడ శ్రమలు చేసిన శ్రామికులందరికీ కూడా, వాళ్ళ శ్రమ విలువలన్నీ పూర్తిగా వాళ్ళకి అందవు. అక్కడ కూడా జరిగేది, ఇక్కడ జరిగేదే! పాత శ్రమ అని ఇక్కడ అనుకున్నది ఎక్కడ జరిగిందో, అక్కడ అది జరిగిన చోట అది కొత్త శ్రమే! సాధనాలు తయారవడానికి కూడా, పాత శ్రమలూ, కొత్త శ్రమలూ - అనేవి జరగవలిసిందే కదా? అలా జరిగిన తర్వాతే సాధనాలు తయారై వస్తాయి.
పరిశ్రమదారులు, సాధనాల కోసం ఎంత ఖర్చు పెట్టినా, వాటిని వెనక్కి తీసేసుకోగలుగుతారు.
అసలు మార్క్సు ఆర్ధిక శాస్త్రం అంతా, ప్రధానంగా కొత్త శ్రమని వివరించేదే! ఈ శ్రామికులకు అందని విలువ పేరు, 'అదనపు విలువ' కదా?
మనిషి అనే వాడు, రోజూ 10, 12 గంటలు శ్రమలు చేస్తూ, రోజూ తన 40 శ్రమ విలువతో గంపల గంపల పదార్ధాలు కొంటే, తింటే, పట్టు బట్టలే కడితే, సుఖంగా జీవించగలడా? అంత డబ్బుతో జీవించగలగాలా? కాదు. పని కాలం తగ్గి పోవాలి. మితిమీరిన శ్రమ వల్ల వచ్చేది కూడా తగ్గి పోవాలి. జీవితంలో, ఆడంబరపు, అదనపు ఖర్చులన్నీ తగ్గిపోవాలి. అంటే, మనిషి చేసే శ్రమలోనించి 'అదనపు విలువ' గా పోయే విధానం ధ్వంసం కావాలి.
'అదనపు విలువే' లేకపోతే?
అయితే, శ్రామికుల అదనపు విలువలతో మాత్రమే జీవించే వడ్డీ-లాభాల తప్పుడు ఆదాయాల వాళ్ళు ఎలా జీవిస్తారు? - ఎవరు జీవించడానికైనా, వాళ్ళ స్వంత శ్రమే వాళ్ళకి ఆధారం. ఇతరుల శ్రమల మీద ఆధారపడితే, అది, ఇతరులకు చేసే ద్రోహం! ఆ ద్రోహానికి గురి అయ్యే శ్రామికులు, దాన్ని గ్రహించి కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? ఏ మానవులకైనా స్వంత శ్రమే ఆనందం! అదే ఆత్మ గౌరవం!కానీ, దోపిడీదారులకు ఆ లక్షణాలు వుండవు. అర్ధం కావు!
ఇదంతా చెప్పింది మార్క్సు! మార్క్సు తన లెక్కల ద్వారా ఇదంతా చెపితేనే, ఇది బైట పడింది.
పరిశ్రమ ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా అక్కడ వుండే మానవ సంబంధాలు యజమానీ శ్రామిక సంబంధాలే! ఈనాడు ఆసుపత్రులతో సహా అన్ని పని స్తలాల్లోనూ ప్రతీ శ్రమా అయిష్టంగా, పరాయితనంతోనే జరుగుతుంది. ప్రతీ శ్రమా సహజంగానూ, భారంగా కాకుండానూ, అవసరమైన స్వంత శ్రమగా అనిపించే విధంగా సమాజంలో సంబంధాలు వుండాలి. దోపిడీయే లేకపోతే, సమాజం అలాగే అవుతుంది.
శ్రామిక వర్గం తెలుసు కోవలిసిన విషయాలు:
యజమానులూ, శ్రామికులూ, వేరు వేరు వర్గాలుగా వుంటారని! యజమాని వర్గం అంతా, శ్రామిక వర్గాన్ని దోచే వర్గంగా, వడ్డీ, లాభాలా తోనూ, భూమి అద్దెల తోనూ, జీవితాంతం జీవిస్తోందని!
ఆదిమ కాలపు బానిస యజమానుల వర్గమూ, ఆ తర్వాత కాలంలో భూస్వాముల వర్గమూ, ఇప్పుడు పెట్టుబడిదారుల వర్గమూ, ఏ యజమాని వర్గం అయినా, శ్రామికుల అదనపు శ్రమని తింటూ బ్రతికే వర్గమే! ఇవి అన్నీ ఒకటే.
లిలిలి
'సినిమా పరిశ్రమ'
ఆస్పత్రి పరిశ్రమ పేరుతో చెప్పుకున్న ఇన్ని వివరాలు, ఇతర రకాల పరిశ్రమలకన్నిటికీ దాదాపుగా వర్తిస్తాయి. అయినప్పటికీ, దాదాపుగా వర్తించడం లో కూడా కొన్ని చర్చలు తేడాగా జరగవలిసి వస్తుంది.
ఉదాహరణకి 'సినిమా పరిశ్రమ': దీనికి కూడా మొదట అవసరమయ్యే ఉత్పత్తి సాధనాల పాత శ్రమా తర్వాత అవసరమయ్యే కొత్త శ్రమా అన్నీ వుంటాయి. కానీ సినిమా తయారీకి అవసరం అయ్యే పెట్టుబడి ఖర్చు గురించీ ఈ సరుకుకి అమ్మకం వల్ల వచ్చే ఆదాయం గురించీ చర్చ వేరేఆ వుంటుంది.
సినిమా పరిశ్రమలో 'కొత్త శ్రమ' అనేది నటీనటులూ, డైరెక్టరూ, లైట్ బోయస్తో సహా ఇంకా అనేక రకాల 'కళల'కు (క్రాఫ్ట్స్) సంబంధించిన శ్రామికులూ చేసే శ్రమల మొత్తమే. అయితే, నటీ నటుల విషయంలో, వారి శ్రమ విలువకి, వారికి అందే దానికీ సంబంధాలు వుండొచ్చూ, వుండకపోవచ్చూ! ఈ ధరలు, శ్రమ విలువల్ని బట్టి గాక, ఆ వ్యక్తుల సప్లై డిమాండ్ల మీద ఆధారపడి వుంటాయి. ఒక నటికో, నటుడికో కొన్ని కోట్లు ఇవ్వవలిసి వస్తే, 'అవి వాళ్ళ శ్రమ విలువలే' అనగలమా? అనలేము. అందుకే, ఈ పరిశ్రమ గురించిన కొన్ని చర్చలు వేరుగా వుంటాయి.
సినిమా అనే సరుకు 100 కోట్లు ఖర్చుతో తయారైతే, దాని అమ్మకం వల్ల, ఆ ఖర్చు అంతా వెనక్కి రావచ్చూ, రాకపోవచ్చూ! తక్కువే రావచ్చు, ఎక్కువైనా రావచ్చు. అసలే రాకపోవచ్చు.
కానీ, ఉత్పత్తి సాధనాలూ, పాత శ్రమా, కొత్త శ్రమా మాత్రం ఏ పరిశ్రమకైనా వుండవలిసిందే!
ఆసుపత్రికైనా అదనపు విలువే లక్షం!
ఆస్పత్రుల్ని, పరిశ్రమలే - అని చెప్పుకున్నాం. ఈ నాటి సమాజంలో, ప్రతీ ఆస్పత్రి నిర్వహణా డబ్బుని (అదనపు విలువని) సంపాదించే లక్ష్యంతో సాగే పరిశ్రమే. శ్రామికుల అదనపు విలువల్ని పొందే దానికి 'శ్రమ దోపిడీ' అనే పేరు వస్తుంది.
'శ్రమ దోపిడీ' అంటే, స్వంత శ్రమతో కాకుండా ఇతరుల శ్రమలతో జీవించడం! వడ్డీ లాభాలూ, భూమి అద్దెలూ వాడే వాళ్ళు, ఈ రకమే.
శ్రామికుల్నీ, ప్రకృతినీ పట్టించుకునే 'శ్రమ దోపిడీ' లేని సమాజాన్ని ఊహిస్తే మానవులకూ, జంతువులకూ అన్ని రకాల ఆస్పత్రులూ అత్యవసరాలే! పరిశ్రమల లక్ష్యాలు నాశనం కావాలి గానీ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలన్నీ నాశనం కావడం కాదు. దోపిడీ దృష్టి లేని పరిశ్రమలు అవసరాలే!
ఆ దృష్టిని నేర్పేది సరైన ఆర్ధిక శాస్త్రమే. కానీ, ఈ నాటి కాలేజీల్లో చదివే ఆర్ధిక శాస్త్రం వేరు. ఇది శ్రమ దోపిడీని నేర్పే ఆర్ధిక శాస్త్రమే.
మార్క్సు నేర్పిన ఆర్ధిక శాస్త్రం గురించి ఇంకా చెప్పుకోవాలా?
మార్క్సు ఆర్ధిక శాస్త్రం చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు:
(1) ఏ సరుకు కోసం అయినా మొదట అవసరమయ్యేవి 'ఉత్పత్తి సాధనాలు'.
(2) 'ఉత్పత్తి' తయారీకి అత్యవసరమైన పాత శ్రమలూ, కొత్త శ్రమలూ.
(3) మానవ దేహానికీ, ఆరోగ్యానికీ, ప్రకృతి సహజంగా ఎంత పొడవు గల పని దినం అవసరమో, అంత మాత్రమే వుండాలి.
(4) 'పని దినం'లో మూడు షిఫ్టులు నీచమైన విషయం. అత్యవసర వైద్యాల విషయంలో మాత్రమే రాత్రి ఏర్పాట్లు కొన్ని అవసరం.
(5) పని స్థలంలో మానసిక ఒత్తిడిని తొలగించడం. అవసరమైన సమన్వయ (కోఆర్డినేషన్) శ్రమను మాత్రమే వుంచి, అనవసరమైన పెత్తనం శ్రమని తీసివెయ్యడం.
(6) శ్రామికుల మధ్య అనవసరపు పోటీని తీసి వెయ్యడం. పని స్తలంలో వారికి సరైన వసతులు కల్పించడం.
ఇవన్నీ చెప్పాలా? 'శ్రమ దోపిడీ వుండరాదు!' అంటే చాలదా?
ఈ విషయాలు తెలుసుకుంటే, సమానత్వ మానవ సంబంధాలు అర్ధమవుతాయి.
(అయిపోయింది)
- రంగనాయకమ్మ