Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి ప్రధానమైన సమస్య ఉపాధిలేమి, నిరుద్యోగం. ఈ సమస్య ఆయా దేశాలకు ఆర్థిక, సామాజిక, జీవనోపాధి సమస్యగా మారి వర్తమానాన్ని వణికిస్తున్నది. భవిష్యత్తును భగం చేస్తున్నది. మానవ వనరులను, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోలేని పాలకుల విధానాలతో దేశాలు, రాష్ట్రాలు అస్తవ్యస్తమవుతున్నాయి. సుమారు 15ఏండ్ల వయస్సు నుండి 60ఏండ్ల మధ్య వయస్సులోని వారికి పని దొరకక పోవడాన్నే నిరుద్యోగం అంటారు. పాలకుల వ్యవస్థీకృత అశ్రద్ధ మూలంగా విద్యకూ ఉపాధికీ ఏనాడో లంకె తెగిపోయింది. దేశంలో విద్యావంతులైన యువతలో 90శాతం మేర ఆధునిక ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యాలు కొరవడ్డాయని అనేక అధ్యయనాలు తేల్చిచెపుతున్నాయి. అందువలన పట్టాలు వస్తున్నా వారి జీవనానికి భరోసా కల్పించలేకపోతున్నాయి. ఉద్యోగాల వేటలో విఫలమై అంతిమంగా ఏదో పనిలో చేరిపోతున్నారు. చదివిన చదువులకు సరిపడే ఉద్యోగాలు రాకపోవడం, భర్తీ చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వెరసి, నిరుద్యోగ భారంతో యువశక్తి నిర్వీర్యమవుతోంది. కొవిడ్, ప్రపంచంలో ఇతర యుద్ధ పరిణామాల మూలంగా ద్రవ్యోల్బణం పెరిగి వినియోగ వస్తువుల గిరాకి తగ్గడంతో ఉత్పత్తి, ఉపాధి రంగాలలో కోతపడి తీవ్రమైన నిరుద్యోగం, ఉపాధి లేమి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నది. పాలకుల ముందుచూపులేని విధానాలు, ఓటు బ్యాంక్ పథకాలు, అవినీతి, నల్లధనం అరికట్టలేక పోవడం, కార్పొరేట్ వ్యాపార రంగాలకు రాయితీలు మొదలగు చర్యలతో దేశంలో, రాష్ట్రాల్లో అనిశ్చితి ఏర్పడి ఉపాధి లేమి నిరుద్యోగం లాంటి సమస్యలతో పాటు జీవనం గడవడానికి కష్టంగా మారిపోతున్నది.
ఎన్నికలు మరో 20నెలల గడువుకు చేరువలో ఉండడంతో ఎనిమిదేండ్ల పాలనలో నిరుద్యోగులను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా సర్కారి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇస్తామనడం చూస్తున్నాం. ఇన్నాళ్లూ ఖాళీలకు తోడు నూతన విస్తరణ అవసరాలకు సరిపడే ఉద్యోగాలు సృష్టించకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై (ఒత్తిడి) పనిభారాన్ని మోపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు రెండులక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు పే రివిజన్ కమిషన్ నిర్థారించింది. కానీ ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు కేంద్రం ఏడాదిన్నర కాలంలో దాదాపు 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రధాని ప్రకటన చేశారు. మరి 2014 ఎన్నికల్లో ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట ఏమైనట్టు? ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసి, నేడు ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రచార హౌరు, ప్రకటనల జోరుతో నిరుద్యోగులపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్నారని బాధిత నిరుద్యోగులు భావిస్తున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలని గుర్తు చేస్తున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎమ్ఐఇ) 2022, మే-15న వెల్లడించిన నివేదిక ప్రకారం భారతదేశంలోని నిరుద్యోగిత రేటు -7.3శాతం. గ్రామీణ నిరుద్యోగిత రేటు - 6.8శాతం, పట్టణ నిరుద్యోగిత రేటు - 8.5శాతం, అలాగే తెలంగాణలో నిరుద్యోగిత రేటు 9.9శాతం, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగిత రేటు 5.3 శాతంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోనే సుమారు 60శాతం యువశక్తి గల మన భారతదేశంలో వారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యతను మరుస్తూ, గత పాలకుల నుండి నేటి పాలకుల వరకు అందరు ఒకే తానుముక్కల్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 'ఉప్పొంగుతున్న నది లాంటిది యువశక్తి'ని నిర్వీర్యం చేస్తే ఉప్పుసంద్రం పాలే అవుతుంది. యువకుల అర్హతల స్థాయికి అనుగుణంగా ఉపాధి, ఉద్యోగాలు కల్పించి దేశాన్ని ప్రగతి పథం పట్టించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతలతో ప్రపంచ స్థాయి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తూ, పేదరిక నిర్మూలనకు, సంపద సృష్టికి పాలకులు చిత్తశుద్ధితో సంకల్ప దీక్షబూనితే సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధించి, ప్రపంచంలో నైపుణ్యాల యువ భారత్‌గా పేరొందగలదు.
అందరికీ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఉదాసీనత వీడాలి. జరిగిన జాప్యాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పటికైనా ప్రణాళికబద్ధ విధానాల (టైంబాండ్)తో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలి. ప్రతి ఐదేండ్లకు ఎన్నికలు, రాజకీయ నిరుద్యోగాన్ని పూడ్చడానికి పదవుల భర్తీ ఎంత శ్రద్ధతో చేపడుతారో! అంతకన్నా వేగంగా నిరుద్యోగాన్ని రూపుమాపాలి. నాటి హామీల ప్రమాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాకారం చేయాలి. ''నిరుద్యోగ పెనుభూతాన్ని'' దేశం నుండి కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. రాజకీయాల్లోకి నాయకులు బతకడానికి, ధనం పోగుచేసుకోవడానికి రావద్దు. ఎందుకంటే? రాజకీయం ఉద్యోగమో, వ్యాపారమో కాదు? ఇది ఒక సామాజిక సేవ, బాధ్యతనేది విస్మరించరాదు. దేశ ప్రజల (పేదల) నుండి ఓట్లు, ధనవంతులు, కార్పొరేటు శక్తులనుంచి పార్టీల (ప్రచారాని)కి నోట్లు పొందుతూ ఒకరి నుంచి ఒకరిని కాపాడుతామనే (అద్భుతమైన) హామీ కల్పించే నేర్పు ఆధునిక రాజకీయ ''కళ''గా మారింది. ఇన్నాళ్ల నిరీక్షణ తరువాత కూడా నిరుద్యోగుల జీవితాల్లో పాలకులు రాజకీయ జిమ్మిక్కులు చేస్తూ ఆకాంక్షలు నెరవేర్చకపోతే? తేల్చుకోవడానికి సంఘటితంగా చైతన్యంతో పిడికిలెత్తక తప్పదు.
- మేకిరి దామోదర్
సెల్:9573666650