Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రగతి చక్రం పరిగెడుతోంది మా ప్రభుత్వం వచ్చాక'' ... ఎక్కడి నుంచో ఈ మాట వినపడగానే వినరు నిద్ర నుండి కళ్ళు తెరిచి పల్లె వెలుగు బస్సు కిటికీలో నుండి బయటకు చూశాడు. వినరుతో పాటు పట్నంలో చరిత్ర, అర్థశాస్త్రం ఇతర సబ్జెక్టులలో కోచింగ్ తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్న రాజు ''ఏం జరిగింది'' వినరు అని అడిగాడు. దానికి వినరు ''మా తాత ఇదే మాట విన్నాడు, మా నాన్న ఇదే మాట విన్నాడు, ఇప్పుడు నేను కూడా ఇదే మాట వింటున్నాను. వాస్తవానికి బస్సు చక్రం తప్ప ప్రగతి చక్రం మన దగ్గరకు రాలేదు'' అంటే ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో ప్రక్కనే ఉన్న పెద్దమనిషి ''ప్రపంచమే ప్రగతి బాటలో పరుగెడుతుంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దవోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో ఆక్స్‌ఫామ్ వారు ప్రవేశపెట్టిన నివేదికను పరిశీలించండి. ప్రపంచం ఆర్థికంగా ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది. మీ జేబులో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా ఒకసారి చెక్ చేయండి'' అంటూ బస్ దిగి వెళ్ళిపోయాడు. వినరు, రాజు ఇద్దరూ ఆ రిపోర్టును తీవ్రంగా పరిశీలించారు. పరస్పరం చర్చించుకున్నారు. వారిద్దరి చర్చల సారాంశంలో నుండి ఓ నిర్ధారణకు వచ్చారు. బస్సు వారి గ్రామంలో అడుగుపెట్టడానికి పది నిమిషాలు ముందు గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ''ఒక సెకన్‌కు వెయ్యి డాలర్లు సంపాదించడం ఎలా?'' అని ఒక పోస్ట్ పెట్టారు. గ్రామంలో పద్ధతిగా ఉండే మంచి తెలివైన పిల్లలు వినరు, రాజు. పైగా పట్నంలో కోచింగ్ తీసుకుని వస్తున్నారు. వారు ఈ పోస్ట్ పెట్టడం అంటే దీనికి ఏదో అర్థం ఉంది అని మిత్రులందరూ సాయంత్రం 6 గంటల తరువాత రచ్చ బండ దగ్గర గుమిగూడి ప్రశ్నల వర్షం కురిపించారు. స్నేహితులందరూ డిగ్రీలు, పీజీలు చదివి ఆర్థిక స్తోమత లేక కోచింగులకు వెళ్లలేదు. ఓ స్నేహితుడు ఆత్రుత ఆపుకోలేక ''ఒక సెకనుకు ఒక వెయ్యి డాలర్లు (1000×75.5=75500?)...! అంటే మా కుటుంబం సంవత్సరకాలం కష్టార్జితం...!! కళ్ళు మూసి తెరిచేలోపు ఎలా సాధ్యమవుతుంది? అని ఆత్రుతగా ప్రశ్నించాడు. మరో స్నేహితుడు ''పది ఎకరాల భూమి ఉన్న మేము అన్ని ఖర్చులు పోను సంవత్సరానికి రెండు లక్షలు అప్పుల్లో కూరుకుపోయాము, ఆటో డ్రైవర్ కొడుకు మా అబ్బాజన్ ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి ఆటో నడిపితే ఖర్చులు పోను 500 కూడా మిగలడం లేదు. అంటే 12 గంటలు కష్టపడితే ఐదు వందలు మాత్రమే సంపాదించ గలుగుతున్నాం. మరి ఇది ఎలా సాధ్యం?'' అన్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానంగా వినరు మాట్లాడుతూ.. ''మేము పెట్టిన పోస్ట్ నిజమే... మేము బస్సు ప్రయాణంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి, భారత దేశ ఆర్థిక పరిస్థితి, మన గ్రామంలోని ఆర్థిక పరిస్థితుల్ని అనుభవం ద్వారా తెలుసుకున్నాము. కరోనా సమయంలో ప్రతి 30 గంటలకు ఒక బిలినియర్ (7750 కోట్లకు అధిపతి) చొప్పున పుట్టు కొచ్చారు. ఈ ఘనత చూసి సంతోష పడాలా? లేక పని లేక తినటానికి తిండి లేక అల్లాడిపోయిన మన వరుణ్ గాడి లాంటి కుటుంబాలను చూసి బాధపడాలా? వైద్యం చేయించుకునే స్తోమత లేక తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకూ, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకూ సజీవ సాక్ష్యం మన గ్రామం. ఈ సందర్భంలోనే మన గ్రామస్తులు వైద్యం కోసం తిండి కోసం తమ ఆస్తులను తెగ నమ్ముకొని నలిగిపోయారు. అదే ఆక్స్ ఫామ్ రిపోర్ట్‌లో ప్రతి 33 గంటలకు 10లక్షలు మంది కడు పేదరికం (తినటానికి తిండి, కట్టుకోడానికి బట్టలు కూడా లేని దీనస్థితి)లోకి నెట్టి వేయబడ్డారని పేర్కొన్నారు. బిలియనీర్లలో మన గ్రామస్తులు ఒక్కరూ లేరు కానీ ఆర్థిక స్థితి దిగజారిన వారిలో మన గ్రామస్తులు ఉన్నారని గుండెల్లో తెలియని బాధ'' అన్నాడు. ఇంతలో రాజు కలగజేసుకుని, ''అక్కడ అ కుబేరులుకు లక్షల కోట్ల రూపాయలు లాభాలు రావాలి అంటే ఇక్కడ మనం లక్షల కోట్ల రూపాయలు నష్టం పోవాల్సిందే అన్న విషయం అర్థమైంది'' అని చెపుతుండగానే, సుధీర్ లేచి ''అవును... కొందరు నష్టపోతేనే కదా మరి కొందరికి లాభం వచ్చేది'' అన్నాడు. ఇంతలో వెంకటేష్ లేచి ''ప్రపంచంలో ఎక్కడో జరిగిన సంఘటనలు మన దేశానికి అన్వయించుకుని బాధపడటం సబబు కాదు'' అన్నాడు. ''మన దేశంలో కూడా సంపన్నులు ఉండవచ్చు... వాళ్ల సంపద పెరగడానికీ గ్రామాల్లో మనం పేదరికంలోకి వెళ్లడానికి సంబంధం ఏమిటి?'' అని ప్రశ్నించాడు. అందరూ వినరు సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ''అవును... వెంకటేష్ అన్నది నిజమే. మనదేశంలో పెట్టుబడిదారులకూ ప్రజలకూ మధ్య ప్రత్యక్ష సంబంధాలు కనపడవు. ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి. ఉదాహరణకు భారతదేశంలో నూతన శ్రీమంతుడుగా ఎదిగిన ఆదాని గురించి తెలుసుకుంటే... కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు ఆయన వ్యాపారాలు గుజరాత్ రాష్ట్రానికే పరిమితమై ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ద్వారా చట్టాలు చేయించి, ప్రజల సొమ్మును బ్యాంకుల నుండి రుణాలుగా తీసుకుని, ప్రభుత్వ ఆస్తుల్ని కొనుగోలు చేసి ప్రయివేట్ ఆస్తులుగా మార్చి వాటికి యజమాని అయ్యాడు. తన ఆస్తులు పెరగడానికి ఎలాంటి చట్టాలు అవసరమో అలాంటి చట్టాలు చేయించడం ద్వారా ప్రపంచస్థాయి కుబేరుడయ్యాడు. అదాని గ్రూప్ ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు కొనుగోలు చేయుటకు ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తుంది. ఆ బొగ్గును భారతదేశంలో అమ్ముకునేందుకు భారతదేశంలోని పవర్ ఉత్పత్తి కేంద్రాలను నిర్వీర్యం చేసి, బొగ్గు ఉత్పత్తి ఆపివేసి, ఆస్ట్రేలియా నుండి అధిక రేట్లకు బొగ్గు కొనుగోలు చేయించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. దీనివల్ల అదాని గ్రూప్ ఆస్తులు రెట్టింపు అవుతాయి. ఆస్ట్రేలియా బొగ్గు వినియోగించి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వాడిన భారత దేశ ప్రజలు పెద్ద మొత్తంలో విద్యుత్ ఛార్జీలు చెల్లించి నష్టపోవాల్సి వస్తుంది. ఇలా ప్రజలు నష్టపోయిన మొత్తం అదానీ పవర్ కంపెనీకి వచ్చే లాభాలతో సమానంగా ఉంటుంది. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రజలకూ పెట్టుబడిదారులకూ మధ్య ప్రభుత్వం, పాలకులు ఉంటారు.''
''ఆక్స్ ఫామ్ రిపోర్టులో మరో కీలకమైన అంశం ఇంధన, ఆహార, ఫార్మా రంగాలలో గుత్తాధిపత్యం. ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ముడిచమురు లాంటి నిత్య అవసరాలపై అధిక మొత్తంలో టాక్స్‌లు మోపి ప్రజల నడ్డి విరుస్తూ, ప్రయివేటు కంపెనీలకు లాభాలు చేకూరు స్తున్నాయి. ఇక ఫార్మా రంగంలో, అంటే వైద్యరంగంలో సాధారణ ప్రజలు కొనుగోలు చేసే మందులను జనరిక్ మందులు ఒక్క రూపాయి కి ఉత్పత్తి చేస్తే దానిని కంపెనీ మెడిసిన్ పేరుతో 24రెట్లు అధికంగా అమ్ముకుంటూ ప్రజల నుండి దోచుకుంటున్నారు. దీనితో ప్రజలు వాస్తవ ధర కంటే ఇరవై నాలుగు రెట్లు నష్టపోతున్నారు. ఫలితంగా ఫార్మా కంపెనీలు ఒక సెకన్‌కు 75 వేల ఐదు వందల రూపాయల లాభాలను పోగేసుకుంటున్నాయి. రానున్న కాలంలో కార్పొరేట్ కంపెనీల లాభాల దాహానికి ప్రజల ఉసురు తీసేందుకు ప్రభుత్వాలు మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి'' అని ముగించాడు. మళ్లీ వెంకటేష్ మాట్లాడుతూ... ''ఇవన్నీ ఎప్పటినుంచో జరుగు తున్నాయి. కానీ కారణం ఈరోజు బోధపడింది. ఏదేమైనా ఆక్స్ ఫామ్ రిపోర్టు అందరూ అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలి అనే అవగాహన వస్తుందని నా అభి ప్రాయం'' అంటూ ఇంత మంచి విషయాలను వివరంగా చెప్పిన వినరుకి అందరి తరపునా అభినందనలు తెలియజేశాడు.
- మందా సైదులు
సెల్:9704874247