Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో మానసిక ఆరోగ్యశక్తి అంతగా లేదని, మానసిక సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్యతో పోల్చితే దేశంలో మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తల కొరత తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారతదేశంలో పదిలక్షల జనాభాకు ముగ్గురు మనోరోగ వైద్యులు, పన్నెండు మంది నర్సులు, ఏడుగురు మనస్తత్వవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్నారని డబ్ల్యహెచ్ఓ పేర్కొంది. అయితే లక్ష జనాభాకు ముప్పై మంది మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తలు ఉండాలి కానీ చాలా తక్కువగా ఉన్నారు, 7.5శాతం మంది భారతీయులు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని డబ్ల్యుహెచ్ఓ అంచనా వేసింది.
ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే 56 మిలియన్ల భారతీయులు నిరాశతో బాధ పడుతున్నారు. 38 మిలియన్ల మంది భారతీయులు ఆందోళన రుగ్మతతో బాధ పడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆరోగ్యం, సామాజిక, మానవ హక్కులు, ఆర్థిక పరిణామాలపై గణనీయమైన ప్రభావాలతో మానసిక రుగ్మతల భారం పెరుగుతూనే ఉంది. మానసిక రుగ్మతలతో ప్రపంచవ్యాప్తంగా 264మిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు దీని బారిన పడుతున్నారు. నిరాశ, నిస్పృహ, బాధ, ఆనందం కోల్పోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నిద్ర లేమి, ఆకలి, అలసట, ఏకాగ్రత లేకపోవడం వంటివి ఈ మానసిక రుగ్మతలు కారణాలు. వీటి ప్రభావం వల్లే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
మానసిక రుగ్మతలు
మానసిక ఆరోగ్యం వ్యక్తి జన్యువులతో, అనుభవంతో ముడిపడి ఉండవచ్చు. మొత్తం మీద మానసిక రుగ్మత మారుతూ ఉంటుందని భావించాలి. మానసిక ఆందోళన లక్షణం-మన ముందున్న పరిస్థితి మనకు కష్టంగా ఉండడం. ఈ కష్టం నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడం. అది ఆర్థికపరమైన కష్టం కావచ్చు. వృత్తిపరమైన కష్టం కావచ్చు. రిలేషన్షిప్స్కు సంబంధించిన కష్టం కావచ్చు. శారీరక సమస్యలు కూడా అయి ఉండవచ్చు. మనిషి ఆలోచన, జ్ఞాపక శక్తులలో మార్పులు రావటం, ఉద్వేగాలు, భావాలలో తేడా రావటమే మానసిక వ్యాధి. ఈ వ్యాధికి గురైన రోగుల దినచర్యల్లో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. దీని మూలంగా రోగి తన చుట్టుపక్కల వారందరికీ అసౌకర్యంగా తయారవుతాడు. మానసిక వ్యాధి కారణాలు ముఖ్యంగా మెదడులో రసాయన మార్పులు కలగటం, అనువంశికతకు గురవటం, బాధాకరమైన బాల్య అనుభవాలు, కుటుంబ వాతావరణం, లైంగిక పరమైన కారణాలు, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు వంటి కారణాలు మానసిక వ్యాధులకు దారి తీస్తుంటాయి. తీవ్రమైన మానసిక రుగ్మతలను (స్కిజోఫ్రీ˜నియా, డిప్రెషన్, మానియా) సైకోసిస్ అంటారు. తీవ్రతరం కానటువంటి మానిసిక వ్యాధులనే (ఆంగ్జయిటీ న్యూరోసిస్, డిప్రెషన్ న్యూరోసిస్, హిస్టీరియా, అబ్ససివ్, కంపల్సివ్ న్యూరోసిస్, ఫోబియా) న్యూరోసిస్ అంటారు.
సరిపడినంత నిద్ర, వ్యాయామం, యోగా, మంచి ఆరోగ్య అలవాట్లు, కుటుంబం, స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఒత్తిడి, కుంగుబాటు, భయం లేదా మరేదైనా మానసిక సమస్యలు ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులను కలిసి సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు.
చికిత్సా విధానాలు
మానసిక సమస్యలకు సకాలంలో పరిష్కారం పొందాలి. అవసరమైతే చికిత్స చేయించుకోవాలి. లేదంటే నిద్ర లేమితో ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఒత్తిడికి దూరం కావాలి. ప్రశాంత జీవనాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం, యోగా అలవాటు చేసుకోవాలి. మందులు, కరెంటు చికిత్స (షాక్ ట్రీట్మెంట్), సైకో థెరపీ, రిహాబిలిటేషన్ విధానాల ద్వారా నయం చేయవచ్చు.
దేశంలో ప్రముఖ వైద్య విద్యాలయాలలో మానసిక వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ప్రముఖంగా ఉన్న కేంద్ర ఆరోగ్య విద్యాలయాలలో యాభై శాతానికిపైగా ఖాళీలు ఉన్నాయి. రెసిడెంట్ డాక్టర్లు ప్రతి రోజు మూడు వందలకు పైగా రోగులను చూస్తున్నారు. పనిభారం ఎక్కువగా ఉంటుంది. కొత్త నియామకాలు జరిగి దశాబ్దం పైగా అవుతున్నది. మానసిక ఆరోగ్యం పట్ల ఇంతటి ఉదాసీనత పనికిరాదు. తక్షణమే ప్రతి జిల్లాలో రెండు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, మానసిక ఆరోగ్య బోర్డును ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
- డా. యం. సురేష్‌బాబు