Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోత్రం అంటే మొదట్లో పశుశాల అని అర్థం. అంటే గోవులను కట్టివేసే కొట్టం లాంటిది. ఒక్కో గోత్రం వారు తమ పశువులు మారు పడకుండా ఒక్కొక్క రకం ముద్రలు పశువుల మీద కొట్టే వారు. ఆ విధంగా పశువుల పై ఉమ్మడి యాజమాన్యం నెరిపేవారు. ఆ తర్వాత కాలంలో ఈ ఉమ్మడి పశువుల సమూహం. భారత దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాలుగా మారాక, ''గోత్ర''అనే మాటకు ప్రాముఖ్యత అందుకు తగినట్లుగా మారిపోయింది. దానితో గోత్రం అంటే గృహం, లేదా ఒక ఇంటి పేరు గల వారు లేదా ఒక శాఖవారు అనే అర్థం వచ్చింది. కాలక్రమేణ వంశానికి మూల పురుషుడుని సూచించే పదంగా ఇది పరిణామం చెందింది. గోత్రాన్ని ఏదో ఒక రుషి పేరుతో పిలిచేవారు.
అశ్వలాయన శ్రౌత సూత్రాలలో అనేక గోత్రాలను ప్రస్తావించాడు. వత్స (దూడలు), శునక (కుక్కలు), రిక్క(ఎలుగులు), భారద్వాజ (ఒక రకం పక్షులు), ముద్గల (ఒక రకం చేపలు), కపి (కోతులు), అజా (మేకలు), వేణు (వెదుళ్ళు), కాశ్యప (తాబేలు), శాండీల్య (ఒక రకం పక్షులు), గౌతమ (గోవులు), కుశక (గుడ్లగూబ), మండూక (కప్ప), ధర్భా (గడ్డి), తిత్తిర(చిలుక) ఇలా అనేక గోత్రాలను ప్రస్తావించాడు. ఇలా గోత్రాలకు ఏదో ఒక జంతువో, పక్షి పేరు గోత్ర సంకేతంగా ఉంటుంది. సప్తరుషుల నుండి వచ్చామని చెప్పుకునే వారికి ఏడు గోత్రాలు ఉండాలి. కానీ గోత్రాల సంఖ్యను చూస్తే 50 నుంచి 73 వరకు ఉన్నాయి. మరి దీని అర్థం ఏమిటి? బహుశా ఆర్యేతర తెగల నుండి ఉన్న పురోహితులను వైదిక మతంలోకి చేర్చుకొని వారికి ఒక్కొక్క తెగకు ఒక్కొక్క గోత్రం చొప్పున అరువు ఇచ్చి ఉండవచ్చు. అందువల్లనే గోత్రాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోయింది. మా గోత్రాలు రుషుల నుండి వచ్చాయని దబాయించే వారు ఈ రుషులు ఒకప్పుడు అనాగరిక, ఆటవిక, బర్బర సమాజ వ్యవస్థకు చెందిన వారనే సంగతి విస్మరి స్తుంటారు. అసలు సప్తరుషుల జాబితాలే రెండు రకాలు ఉన్నాయి. ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. మన దేశ జనాభాలో ఎక్కువ మంది ఆర్యులు కాని జాతులకు చెందిన వారే. మనది మిశ్రమ సమాజం. మన ప్రజలు అనేక జాతుల తెగల కలగలుపు. ఆచారాలు జీవన విధానాలు కూడా అంతే.
అయితే ఈ గోత్రనామాలతో జంతువుల పేర్లు లేక మొక్కలు, ఫలాల పేర్లు ఎందుకు ఉంటున్నాయి అన్న విషయాన్ని సమగ్రంగా పరిశీలించాలి. వేదాంతర సాహిత్యమైన వేదాంతంలో ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల్లో ఒకటైన ఛాందోగ్యోపనిషత్తులో కొన్ని సునక మంత్రాలు కనిపిస్తాయి. ఈ ఉపనిషత్తు ప్రథమాధ్యాయంలో చాలా వినోదాన్ని కలిగించే సందర్భాన్ని వివరిస్తుంది.
సామవేదాన్ని గానం చేసే మంత్ర కర్తలను లేదా పురోహితులను పరిహసించే సన్నివేశం వర్ణితమైంది. ఆ రోజుల్లో ''బకదాల్భ్యుడు''అనే రుషి వేదాధ్యయనం కోసం ఏకాంతంలో ఉంటాడు. ఇతడికి మరొక పేరు ''గ్వాల్ మైత్రేయుడు'' అని కూడా అంటారు. ఒక రోజున ఒక తెల్ల కుక్క అతడు ఉంటున్న ప్రదేశానికి వచ్చింది. మరికొంతసేపటికి మరి కొన్ని కుక్కలు అక్కడకు చేరాయి. ఆ కుక్కలు తెల్ల కుక్కతో ఇలా అన్నా యి... నువ్వు సామగానం చెయ్యి,, మాకు ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అడుగుతాయి.
తెల్లకుక్క ఆకలిగొన్న కుక్కలను మర్నాడు రమ్మన్నది. ఇది విని దాల్బ్యుడు ఆశ్చర్యపడ్డాడు. కుక్క ఎలా సామగానం చేస్తుందో వినాలని, ఆ రుషి అనుకున్నాడు. మర్నాడు ఆ కుక్కలన్నీ అక్కడికి చేరాయి. ఒక దాని తోకను ఇంకొకటి నోటితో పట్టుకొని, వెనుక కాళ్ళ మీద కూర్చొని సామగానం చేయసాగాయి. ''ఓం మాకు ఆహారం లభించుగాక! ఓం మాకు నీరు లభించుగాక! ఓం అన్న దేవుడా! మాకు అన్నాన్ని పెట్టు! అది పెట్టు! ఇది పెట్టు!'' అని మొరగటం ప్రారంభించాయి
పైన చెప్పిన పరిహసొక్తిలో యజ్ఞసమయంలో సామ గాయకులను కుక్కలతో పోల్చి అనుకరించటం జరిగింది. పొట్టకూటి కోసం ఒకరి వెనుక మరొకరు కూర్చుని, ఒకరి వస్త్రాన్ని మరొకరు పట్టుకుని, సామగానాన్ని గావించే పురోహితులను పరిహ సించటంగా కనపడుతుంది. ఆదిశంకరుని భాష్యం ప్రకారం శ్వేత (తెల్లని) శునకం, శునక రూపంలో ఉన్న రుషి అని, ఆయన వద్దకు చేరిన మిగతా శునకాలు కూడా రుషులేనని శంకరుడు అంటాడు. పైన చిత్రించబడింది ఎంత పరిహాసంగా కనిపించినప్పటికీ శునకజాతి ప్రజల సమూహం ఒకటి ఉన్నది అన్నది వాస్తవం. ఒక్క శునక జాతి ప్రజలు మాత్రమే కాదు, అనేక జంతు, మొక్కల నామాలతో ఉన్న ప్రజలు కూడా ఉన్నారనడానికి వేద సాహిత్యంలో అనేక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన సమాజ అవశేషాల్లో, ప్రపంచ మంతటా, సర్వత్రా కనిపించే విశేషమేమంటే ఆ ప్రజలంతా తమ పేర్లను వృక్ష ప్రపంచం నుంచో, జంతు ప్రపంచం నుంచో ఎరువు తెచ్చుకున్నవారే. ఆయా సమూహాలకు లేదా ఆయా కుదుర్లకు, లేదా ఆయా వంశాలకు అవి చిహ్నాలు అన్నమాట. కుదురు చిహ్నాలు అంటే ఏమిటో, ఆ చిహ్నాలు మానవ సమూహాలకు ఎలా గుర్తులుగా అనుసంధానించబడ్డాయో నిశితంగా పరిశీలించాలి.
ఒక ప్రాంతంలో సంచార నివాసం చేస్తూ ఆహారాన్ని సేకరణ ద్వారా పొంది జీవనం సాగించే గుంపు లేదా ఒక కుదురు ప్రజల సమూహం, ఒక దుంపను గాని, అడవి ధాన్యాన్ని గాని, లేక ఒక జంతువును గాని సేకరించడంలో, లేదా వేటాడటంలో ప్రత్యేకమైన నైపుణ్యాన్ని సాధిస్తుంది. అలా ఆ కుదురు తమ ప్రత్యేకతగా ఎంచుకున్న ఆహారపదార్థం చెట్టుగాని, మొక్క గాని, దుంప గాని, లేదా ఏదైనా జంతువు, పక్షిగాని ఆ కుదురుకు చిహ్నం అవుతుంది. ఆ కుదురుకు వారి కుదురు చిహ్నమైన ఆహార పదార్థంతో కేవలం భోజన - భోక్త సంబంధమే కాక అంతకుమించిన ఆధ్యాత్మిక సంబంధం ఉందని భావిస్తారు. అలా అది ఆ కుదురుకు ఆరాధ్యం అవుతుంది. దాని నుండి తాము వచ్చామని భావిస్తారు.
ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఒక తెగకు చెందిన ప్రతి వంశము ఒక జంతువు లేదా మొక్కతో చెలిమి లేదా కలయికను చేస్తుంది. దానినే చిహ్నం అంటారు. ఆ వంశం వారు ఆ జంతు వర్గానికి చెందిన వారుగా భావిస్తారు. ఆ జంతువు లేదా మొక్క నుండి ఆవిర్భవించినట్లుగా తల పోస్తారు. ''సునక'' వంశానికి చెందిన వారు తమను శునకాలు అనుకుంటారు. శునకాల నుండి వచ్చాము అనుకుంటారు. అందువల్ల ఈ శునకానికి చెందిన వారు శునకాన్ని తినటం నిషిద్ధం. ఎందుకంటే వారు ఆ చిహ్న (సునక) జాతి వారు కనుక.
అపారమైన వేదసాహిత్యంలో వేర్వేరు మానవ సమూహాలకు కూడా జంతు నామాలతో పిలిచే సంప్రదాయం ఉన్నది. ''ఆజులు'' అనే పేరు గల మనుషులు మనకు రుగ్వేదంలో తగులు తారు. అజ అంటే మేక. అలాగే మరో సమూహం ప్రజలను ''సిగ్రులు'' అని పిలిచారు. అంటే ములగ చెట్టు. అలాగే మత్స్య దేశం, మత్స్యలు అంటే చేపలు అనబడే ప్రజలు అదే రుగ్వేదంలో కనపడతారు. శతపథ బ్రాహ్మణం సృష్టికర్త ''కూర్మ'' రూపంలో కనపడ్డాడు అని ఉన్నది. అయిత రేయ బ్రాహ్మణంలో అలాగే అధర్వ వేదంలో కూడా ''కశ్యప'' గోత్రీకులు అయిన పురోహితులు కనపడ తారు. కశ్యప అంటే ''కూర్మ'' మే. అంటే తాబేలు.
అలాగే కౌటిల్యుని అర్థశాస్త్రం ''శునకాల''ని పేరు ఉన్న మనుషుల గురించి చెబుతుంది. ''హరివంశంలో'' ఒక అధ్యాయానికి అధ్యాయమే ఒక ప్రసిద్ధ వంశ వృక్షాన్ని వర్ణిస్తుంది. ఆ వంశం పేరు ''శునకవంశం''. మహా భారతం కూడా మానవ సమూహాలకు జంతువుల పేర్లున్నట్లుగా పేర్కొంటుంది. ఉదాహరణ కు ఉలుక, వృచ్చిక, వాయస, జంబూక, గార్దభ, కుక్కుట, గజ, శశ, కూర్మ, వరాహ, మేష, వ్యాఘ్ర, హంస, మత్స్య, అశ్వ. ఇవన్నీ ఆయా సమూహాల కుదురు చిహ్నాలే. ఈ చిహ్న పద్ధతి, జంతు వృక్ష నామాలు ఉన్నవారు ఒక్క మానవ సమూహాలకే పరిమితమై లేదు. విస్తారంగా ఉన్న వేద సాహిత్య భాగాలకు, శాఖలకు కూడా బాగా పరిచితమైన జంతు నామాలున్నాయి. ఉదాహరణకు రుగ్వేద సంహితలో నాలుగు ''శాఖలు'' ఉన్నాయి. అశ్వలాయన, వాస్కల, సాంఖ్యాయన, మాండూక్య. ఈ చివరి పేరు మాండూక్య అంటే కప్ప. మిగతా మూడు కూడా ఇదేవిధంగా జంతువు లేదా వృక్ష మూలము నుండి వచ్చినవే. కొన్ని ప్రధానమైన ఉపనిషత్తులకు కూడా జంతు నామాలున్నాయి. ఉదాహరణకు శ్వేతాశ్వతర ఉపనిషత్ (అశ్వం లేదా గుర్రం), మాండూక్యోపనిషత్ (మండూక అంటే కప్ప), కౌశితకి ఉపనిషత్ (కౌశితకీ అంటే గుడ్లగూబ), తైత్తిరీయ ఉపనిషత్తు (తైత్తరీయ అంటే తీత్తిరి పక్షి. చాగలేయ అంటే మేక. ఇలా మేక జంతు వృక్ష నామాలు మానవ సమూహాలకే కాక వేద సాహిత్యం శాఖలకు కూడా అలాంటి పేర్లు ఉండటాన్ని బట్టి ఇవన్నీ కుదురు చిహ్నాలని గుర్తించవచ్చు.
- పి.బి. చారి
సెల్:9704934614