Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కాపిటల్'' అంటే, 'పెట్టుబడి'!
ఈ పుస్తకంలో, 'మానవ సమాజం'లోని నిన్నా - నేడూ - రేపూ దశలన్నీ కనపడతాయి.
'పెట్టుబడిదారీ వుత్పత్తి విధానం'లో 'జీతం పద్ధతి' డబ్బు ద్వారా ప్రారంభం కావడం వల్లనే మానవ సమాజంలో నిన్న సాగిన, ఈనాడు సాగుతూ వున్న, రేపు సాగబోయే మానవ సంబంధాలన్నీ అర్ధమవుతాయి.
ఈ 'కాపిటల్' అనేది, ఒక్క సంపుటమే కాదు. 4 సంపుటాలుగా వున్న పెద్ద పుస్తకం! (4వ సంపుటం 3 విడి పుస్తకాలుగా వుంటుంది.) ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి? ఈ 4 సంపుటాలన్నీ చదవగలమా? - ప్రతి ఒక్కరూ చదవగలరని కాదు. చదవగలిగిన వాళ్ళు చదువుతారు. అలా చదివిన వాళ్ళు వాటిలో విషయాల్నీ, వాటి సారాంశాల్నీ వివరిస్తూ రాస్తారు.
ఆ సారాంశం అంతా ఏమిటి?
మానవ సమాజంలో వెనకటి కాలంలో ఉత్పత్తి సంబంధాల్లో బానిసలకు డబ్బు జీతాలు లేని కాలంలో చాలీ చాలని తిండి పదార్ధాలు ఏ లెక్కలూ లేకుండా మాత్రమే అందే కాలంలో యజమానుల ద్వారా 'శ్రమ దోపిడీ విధానం' ప్రారంభమైంది. ఆ విధానం ఈ నాటికీ ఈ పెట్టుబడిదారీ విధానంలో కూడా 'డబ్బు లెక్కల జీతాల' రూపంలో కూడా సాగుతూనే ఉంది. ఇది 'కాపిటల్' సారాంశం ద్వారా తెలిసే మొదటి విషయం.
'శ్రమ దోపిడీ'కి వ్యతిరేకమైన 'సమానత్వ సంబంధాల్ని' వివరించడం ఆ సారాంశంలో రెండో విషయం.
ఈ విషయాల వల్ల మానవ సమాజంలో 'నిన్నా - నేడూ - రేపూ' ఎటువంటివో అర్ధం అవుతాయి.
ఈ విషయాలన్నిటినీ గ్రహించి సమాజంలో విషయాల్ని హేతుబద్ధంగా చెప్పినది మార్క్సే కాబట్టి ఈ సిద్ధాంతానికి ''మార్క్సిజం'' అనే పేరు ఉంటుంది.
మార్క్సు కన్నా పూర్వం కూడా మానవుల సమానత్వాన్ని కోరిన వారు చెప్పిన 'సోషలిజం, కమ్యూనిజం' అనే భావనలూ, ఆ మాటలూ, ఉన్నాయి. కానీ, ఆ భావనలు సంస్కరణల స్తాయి కన్నా కూడా తక్కువ స్తాయిలోనే అర కొరగా సాగి ఆగిపోతూ వుండేవి.
నాస్తిక వాదం, హేతువాదం, నవ్య మానవ వాదం - వంటి వాదాలు, 'ప్రకృతి శాస్త్రాలకు' మాత్రమే పరిమితమైన వాదాలు.
'హేతువాదం' అనే భావన గల వారిలో కొందరు ప్రకృతినీ, మానవ సమాజాన్నీ కూడా, సవ్యంగానే, హేతు దృష్టితోనే చూస్తారు. కానీ కొందరి హేతువాదం కేవలం ప్రకృతి సైన్సులకు మాత్రమే పరిమిత మైనదిగా ఉంటుంది. ఈ నాస్తిక - వగైరా వాదాలు ప్రకృతి సైన్సుల దృష్టితో అయితే హేతు బద్ధం గానే సాగుతాయి. కానీ, వీరు ప్రకృతికి శాస్త్రాలు ఉన్నట్టే మానవ సమాజానికి కూడా శాస్త్రాలు ఉన్నట్టు భావించరు. మానవ సమాజంలో జరిగే ఉత్పత్తి సంబంధాల్లో సాగుతోన్న 'శ్రమ దోపిడీ'యే 'మౌలిక సమస్య' (మూల సమస్య) అని నాస్తిక - వగైరా వాదాల వారు భావించరు. మానవ సమాజంలో గత కాలం నించీ ఈ నాటికీ సాగుతోన్న ప్రభుత్వాల్ని 'శ్రమ దోపిడీ'కి అనుకూలమైన చట్టాలతోనే సాగే ప్రభుత్వాలుగా ఈ వాదాలు గ్రహించవు. ఈ ప్రభుత్వ పాలనల్ని వ్యతిరేకించే మార్గం ఈ వాదాలకు ఉండదు. ఈ మార్గాన్ని ఈ వాదాలు సమర్ధించవు.
మానవ సమాజంలో సాగుతోన్న 'శతృ వర్గ భేదాల' వల్ల తలలెత్తే సమస్యల్ని ఏ వాదం అయినా, కేవలం ప్రకృతి సైన్సుల గ్న్యానాల తోనే ఎలా పరిష్కరించ గలదు?
'మార్క్సిజం' అనేది ప్రకృతి సైన్సులనే గాక, సమాజపు సైన్సుని కూడా గ్రహించింది! ఈ దృష్టితో ఈ మార్గంలో 'శతృ వర్గ భేదాల' సమాజాన్ని 'సమానత్వ సంబంధాల సమాజం'గా మార్చ గలిగే పరిష్కారాన్ని చూపించింది. ఈ పరిష్కారాన్ని సాధించే బాధ్యత ఎవరిది? వేలాది సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి గురి అవుతూ వున్న శ్రామిక వర్గపు బాధ్యత ఇది! ఈ శ్రామిక వర్గాన్ని విప్లవ మార్గాన నడపడం, ఇదే వర్గపు కమ్యూనిస్టుల కర్తవ్యం!
నాస్తిక, హేతుబద్ధ, నవ్య మానవ వాదనల్లో, చివరి దానిలో అయినా ఏ విప్లవాంశమూ దొరకదు. మానవ సమాజంలో శ్రమలు చేస్తూ కూడా తమ శ్రమ విలువల్లో నించి అత్యధిక భాగాన్ని పోగొట్టుకునే వారు శ్రామిక మానవులు. ఈ శ్రామిక మానవుల శ్రమల విలువలలో భాగాలను దోచుకుంటూ శ్రామికుల యజమానులు తమ స్వంత శ్రమలు లేకుండానే విలాసాలతో, విరామాలతో జీవిస్తారు. ఇతరుల శ్రమలనే దోచుకుంటూ జీవించేవారు యజమాని వర్గ మానవులు. ఈ వేరు వేరు శతృ వర్గ మానవులను సమానులు గానే భావిస్తూ మానవ సమస్యల్ని చూసేది ఈ నవ్య మానవ వాదం. ఈ వాదం మానవ సమస్యలకు ప్రకృతి సైన్సు మార్గాన్నే పరిష్కారంగా చూపుతూ సమాజంలో వున్న అసమాన 'శ్రమ విభజన' మాట ఎత్తకుండా, సమాజంలోనే వున్న 'శ్రమ దోపిడీ' సమస్యని ఎలా పరిష్కరించ గలదు? - ఇదే ప్రశ్న, ఏ సమాజపు సైన్సునీ చూడని ఏ వాదానికైనా వర్తిస్తుంది.
'కాపిటల్' పుస్తకాన్ని ఎందుకు చదవాలి? - ఇందుకే! సమాజంలో వున్న సమస్యలు తెలియడానికే చదవాలి. స్వయంగా చదవ లేకపోతే చదివించుకుని వినాలి. వినడం అయినా చెయ్యలేని శ్రామిక వర్గ స్త్రీ పురుషులు, అమాయకులై, అగ్న్యానులై, ఆత్మాభిమాన రహితులై దారీ తెన్నూ తెలియక తర తరాలుగా కృశించి పోయే వారవుతారు.
లిలిలి
''కాపిటల్ అనే పుస్తకం ఉంది'' - అని - మనకి ఆ పేరే, ఆ విషయమే తెలియక పోతే అప్పుడు మనం నిజంగా అమాయకులం! నిర్దోషులం!
ఆ పుస్తకం పేరు ఎవరి ద్వారానో విని, అందులో ఏ విషయాలు ముఖ్యంగా ఉంటాయో కూడా ఎంతో కొంత విని, మరి కొంత చెప్పగల వారు ఉంటే కూడా అటు మనం మొహాలు తిప్పక పోతే, అప్పుడు మనం నిజంగా అజ్ఞానులం! నిజంగా దోషులం!
యజమానులైన తల్లి తండ్రుల పాదాల కింద పెరుగుతూ పెద్దలై అదే భావనలలో మునిగి వున్న వారు కూడా అజ్ఞానులే!
'కాపిటల్' పుస్తకంలో దొరికే సమాచారం మనకి స్కూళ్ళల్లో దొరకదు. ఆ స్కూలు ఎంత స్కూలైనా! ఎంత 'యూనివర్శిటీ' అయినా! ఆ పైన మనం డాక్టరేట్లం అయినా, అప్పటికీ మనం 'కాపిటల్'ని తాకలేదంటే ఇక అప్పుడు మనం నిజమైన మూర్ఖా గ్రేశ్వరులం! పచ్చి స్వార్ధ పరులైన దోషులం! మహా మహా అజ్ఞానులం!
మనం 'రచయితలం' అయితే? 'కవులం' అయితే? 'గాయకులం' అయితే? 'చిత్రకారులు' అయితే? -
ఆహా! 'గొప్ప కళాకారులు'గా మనకి పేర్లు! కానీ, నిజానికి అప్పుడు మనం మూర్ఖ కళాకారులం! మూర్ఖ స్వార్ధ పరులం! మూర్ఖ మేధావి మానవులం! బహుశా, ఉద్యోగాలు దొరికితే, మూర్ఖ శ్రామికులం! ఎలా ఉండదలుస్తామో, అలా ఉంటాం!
(ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ