Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం హెచ్చరికలు జారీ చేస్తుండగా, ఇప్పుడు రూపాయి విలువ కూడా జీవితకాల కనిష్టానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడగుంటుతున్నాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మరో వైపు నిరుద్యోగం పెరిగిపోతోంది. ధరల మోత మోగిపోతోంది. కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న సంకేతాలు వినిపించినా అది నిజం కాదని తేలిపోయింది. ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు న్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పతనం కావడం చిన్న విషయం కాదు. దీని ప్రభావం పలురంగాలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్యుడి జీవన చక్రానికి కీలకమైన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా పెరగడం ఖాయం. పెట్రోల్ రేటు పెరిగితే అనివార్యంగా వస్తువుల రవాణ భారమవుతుంది. దీంతో నిత్యవసరాల ధరలూ మరింత పెరుగుతాయి. ఇప్పటికే ఆహారం, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, దుస్తులు, పాదరక్షలు మొదలుకొని గృహౌపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటి ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ కొండెక్కి కూర్చుంటోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ తీసుకున్న రెపో రేటు పెంపు నిర్ణయం కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్నది నిపుణుల మాట. కాబట్టి ప్రభుత్వం ఇంధనంపై పన్నులతో పాటు జీఎస్టీని తగ్గించి, పేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించి, ఎంఎస్ఎంఈ రంగా నికి నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి ఊపునివ్వాలి. దాని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయినా కేంద్రం ఇంత వరకూ ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. నిజానికి కోవిడ్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. కోవిడ్ కాలంలో కుదేలైన పరిశ్రమలు, వ్యాపారాలు ఇంకా గాడిన పడలేదు. ఉద్యోగాలు కోల్పో యిన కోట్లాది మంది మళ్లీ పనిలో కుదురుకోలేదు. ఈ లోగానే ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవు తుండటం ప్రమాద ఘంటికల్ని మోగి స్తోంది. దేశంలో ఇప్పటికీ లేబర్ ఫోర్స్‌లో 40శాతం మంది మాత్రమే యాక్టివ్ అయ్యారు. ఇంకా 60శాతం మంది ఏం చేస్తున్నారో లెక్కల్లేవు. ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ముందు నాటికి చేరుకోవాలంటే పుష్కర కాలం పడుతుందని అంచనా. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకూ పెరిగి పోతు న్నాయి. రాష్ట్రాల తలసరి ఆదాయం లోనూ విపరీతమైన తేడాలున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే ఆర్థిక సర్వే రూపొందించడం కూడా చాలా కష్టమైపోతుంది. దేశంలో రాజకీయంగా పెరుగుతున్న సంక్లిష్టతలు కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. చాలా విషయాల్లో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలేవీ ఫలితాన్నివ్వడం లేదు. మరో పక్క దేశంలో విద్యుత్ సంక్షోభం కూడా తరుముకొస్తోంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయం చూడకుండా హడావుడిగా పునరుత్పాదక ఇంధనాల నుంచి వచ్చే విద్యుత్ వైపు మళ్లాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎదురుతన్నింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బొగ్గు సంక్షోభంలో కూరుకు పోయాయి. బొగ్గు గనులు లేని రాష్ట్రాలే కాదు, ఉన్న రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా తలా తోకాలేని నిర్ణయాలతోనే కేంద్రం కొంపముంచుతోంది. అసలు కోవిడ్ ముందు నుంచీ మన ఆర్థిక వ్యవస్థ స్తబ్ధుగానే ఉంది. సజావుగా సాగుతున్న ఆర్థిక రథానికి పెద్దనోట్ల రద్దే పెద్ద కుదుపు ఇచ్చింది.
అప్పటి నుంచీ ఆర్థిక వ్యవస్థ నేలచూపులే చూస్తోంది. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణ యాలు ఆర్థిక తిరోగ మనానికే దారితీస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నా ఫలితం కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వం లో ఆర్థిక నిపుణులు ఎవరూ లేకపోవడం, నెలల వ్యవధిలోనే ఆర్బీఐ గవర్నర్లు మారడం, ఆర్థిక సలహాదారుల వరుస రాజీనామాలు అన్నీ ఆందోళనకర పరిణామాలుగానే కనపడు తున్నాయి. పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మన ఆర్థిక వ్యవస్థ మేడిపండేనన్న నిజం ఎవరికీ జీర్ణం కావడం లేదు. మనదేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతుల పరిమాణం చాలా పెద్దది. ఏ దేశానికైనా దిగుమతుల బిల్లే జీడీపీని నిర్దేశిస్తుంది. దిగుమతుల భారం పెరిగేకొద్దీ ఆర్థిక సూచీలన్నీ పతనమవుతాయి. సంక్షోభం ముదురుతున్న కొద్దీ దాన్ని చక్కదిద్దటం కూడా కష్టసాధ్యమే అవుతుంది. వివేకంతో ముందే మేలు కోవాల్సిన ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఒక దాని తర్వాత మరొకటిగా సంక్షోభాలు ముంచు కొస్తున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. ఇప్పటికే ధరాఘాతంతో అల్లాడుతున్న సామాన్యులకు ముందుంది మొసళ్లపండగ అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్ ప్రభావంతో చాలా నష్ట పోయిందని, ఆ లోటు పూడ్చుకోవడానికి కనీసం పన్నెండేండ్లు పడుతుందని ఆర్బీఐ నివేదిక తేల్చింది. అదే నివేదిక ప్రకారం కోవిడ్ కారణంగా రూ.52 లక్షల కోట్లు ఉత్పత్తి నష్టం వాటిల్లింది. 2020-21 తొలి త్రైమాసికంలో భారీ క్షీణత నమోదు చేసిన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండగా 2021-22 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సెకండ్ వేవ్ కొవిడ్ పరిణామాలు మళ్లీ దెబ్బతీశాయని నివేదిక వివరించింది. 2022 జనవరిలో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం చూపినా, మొదటి రెండు దశలతో పోలిస్తే తక్కువని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా అంత ర్జాతీయ, దేశీయ వృద్ధి కూడా తగ్గుతోంది. కమొడిటీ ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరా చైన్‌లో అంత రాయాలు ఇందుకు కారణమని వివరించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంక బాటలో ఉందంటూ గణాంకాల ఆధారంగా అనేక మంది అంచనా వేస్తున్నారు. 2023లో 14శాతం వృద్ధిరేటు సాధిస్తే తప్ప ఆర్థికరథం పరుగు మొదలు పెట్టదు. అది పరుగు పెట్టాలంటే ధరలను నియంత్రించడం దానికి తొలి మెట్టు కావాలి. ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవని గుర్తించాలి.
ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్లో సరకు లకు గిరాకీ పెరగాలి. గిరాకీ పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించ డానికి బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని భారాలు మోపుతూ వారి నడ్డి విరుస్తున్నాయి. పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే నిర్ణయాలు తీసుకుంటేనే ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. లేకపోతే సంక్షోభంలో మునగక తప్పదు.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140