Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
నిజానికి, 'కాపిటల్'ని నేర్చుకోడం ఎంత తేలిక అంటే అంత తేలిక! ఏడెనిమిదేళ్ళ పిల్లలకి కూడా ''ఉపయోగపు విలువ'' అనే మాటతో ప్రారంభించి చెప్పడం అతి తేలిక.
'కాపిటల్'లో మొదటి సంపుటంలో మొదటి భాగం అలాగే ప్రారంభం అవుతుంది! ప్రతీ పేరా, ప్రతీ వాక్యం చదివే మన ఆలోచనల్ని ఆశ్చర్యపరిచే తర్కాలతో సాగుతూ వుంటుంది. మన తలలకు తర్కాలు పడక పోతే, ఇమడక పోతే అది మన మేధస్సుల తప్పు! అంతే గానీ, అది తర్కాల తప్పు కాదు.
''కాపిటల్ అర్ధం కాదే!'' అంటారు కొందరు, అర కొరగా చదివిన పాఠకులు!
అర్ధం కాక పోవడం కొన్ని పేరాల్లో, కొన్ని వాక్యాల్లో జరిగితే జరగవచ్చు. కాపిటల్ పుస్తకంలో 'డబ్బు పుటక'ని చెప్పడం మొదటి నించీ ప్రారంభ మవుతుంది. - ఇది అసలు, సమాజంలో కొత్త గ్రహింపు! ఈ కొత్త విషయాలు చెప్పడం, తను చదివిన వాక్యాలనే తిరిగి చెప్పడం కాదు. ఏ విషయంలో అయినా కొత్త వాక్యాల్ని రూపొందించడం చెప్పే వ్యక్తికీ కొత్తే! ఆ వాక్యాలూ, పేరాలూ ఏ స్పష్టమైన వరసల్లో రావాలో ప్రతీ చోటా ఏ వ్యక్తీ అలాగే రాయలేక పోవచ్చు. రెండో పేరా లోనే చెప్ప వలిసిన విషయాన్ని ఐదో పేరాలో చెప్తే పాఠకులు అప్పటికే కంగారు పడి పోతూ వుంటారు! కొత్త సైన్సుని, కొత్త కొత్త వాక్యాలతో రాయడం ప్రారంభించిన మనిషికి అది కొంతైనా గాభరా గానే సాగుతుంది.
ఉదాహరణకి, ఎంతో తెలిసిన విషయాల తోనే ఒక వ్యాసాన్ని రాయాలని నేను ప్రారంభిస్తే... ఒక సారి రాసిన దాన్ని మళ్ళీ చదివి, దిద్ది, మాటలు మార్చి, ఏదో చెయ్యడం రెండు సార్ల కన్నా ఎక్కువ సార్లే జరుగుతుంది. ఒక్కో పేరాలో ఐదు సార్లు కూడా జరుగుతుంది! ఎందుకు ఇలా? ఆ చెప్పదగిన విషయం తెలియక కాదు. రాయడం చేతకాక కాదు. రాసే దాని మీద ఆసక్తి లేక కాదు. ఆసక్తి పెరిగితేనే రాసి వున్న దానిలో సవరింపులు పెరుగుతాయి. అంటే ప్రారంభంలో ఆ ఆసక్తి లేకుండా రాసినట్టా? - కాదు.
మాట్లాడేటప్పుడు కూడా ఒక సారి మాట్లాడినదే కొంత మార్పుతో దానినే మళ్ళీ మాట్లాడతాం. ఇంకా వివరంగా చెప్పాలని అదే, రాత అయితే, ప్రతీ వాక్యాన్నీ సవరించ వలిసిన అవసరం ఉంటుందని కాదు. కొన్ని వాక్యాల్ని అయితే సరిదిద్దుకోవలిసిందే.
కొత్త సైన్సుని రాతలో చూపించాలని ప్రారంభిం చడంలో తప్పనిసరిగా కొంత గాభరా ఉంటుంది. మార్క్సు మొదటి రచనల్లో జీతం ఇవ్వడానికి కారణంగా కనపడే విషయాన్ని 'శ్రమ శక్తి' అనే మాటగా ప్రారంభించకుండా, 'శ్రమ' అనే రాసుకుంటూ కొంత వరకూ పోయాడు. దాన్ని దిద్దుకోకపోతే చాలా తప్పు అయ్యేదే.
'కాపిటల్'ని నేను మొదట చదివేటప్పుడు అక్కడక్కడా ''అయ్యో! ఇంత కఠినంగానా? కార్మికులు చదివే దాన్ని, ఎంతో తేలిగ్గా రాయాలి కదా?'' అనుకున్న సందర్భాలు కొన్ని నిజమే. అలా అని స్పష్టంగా అర్ధం కాని పేరాల్ని కూడా చదవడం నేను మానలేదు. - చదువుతూ వెళ్తే అర్ధం అయ్యే వాక్యాలు దొరికేవి! అంటే చదవడంలో కొంత అర్ధం కాని సందర్భాల్లో సహనంతో చదవడం అవసరం - అని మళ్ళీ మళ్ళీ తెలిసేది. అర్ధం కానట్టు తోచే పేరాల దగ్గిర కూడా నిజమైన విషయాల్ని తెలుసుకోబోతున్నామనే ఆలోచనతో, ఆ సంతోషంతో నేర్చుకోవడం జరగాలి.
లిలిలి
'కాపిటల్' రచన ఒక 'వస్తువు'కి వుండే 2 ప్రధాన లక్షణాల్ని వివరించడంతో మొదలవు తుంది. ఆ లక్షణాలు: (1) వస్తువుకి వుండే 'ఉపయోగపు విలువ'. (2) అదే వస్తువుకి వుండే 'మారకం విలువ'.
అసలు, 'వస్తువు' అంటే? అది కుర్చీ, మంచం - వంటి గట్టి (ఘన) పదార్ధం కావచ్చు. నూనెలు, జావలు - వంటి పలచని (ద్రవ) పదార్ధం కావచ్చు. ఏ పదార్ధమూ కాకుండా 'బండిని తోలడం' వంటి కేవలం 'పని' మాత్రమే కావచ్చు. ఇవే కాదు, తయారు చేసే పదార్ధం 'వాయు' రూపంలో కూడా వుంటుంది. 'వంట గ్యాస్' అలాంటిదే. ఇంకా ఇలాంటివి చాలా వుంటాయి - అంటారు.
'ఘన, ద్రవ' (''వాయు''ని కూడా కలపవచ్చు.) పదార్ధాలు అయినా, కేవలం 'పనులు' మాత్రమే అయినా, వాటిలో ఏది జరగాలన్నా, రక రకాల శ్రమలు చెయ్య వలిసిందే!
ఈ రకంగా, నేను ఇక్కడ 'కాపిటల్'లో విషయాలన్నీ చెపుతానని కాదు. ఆ పుస్తకం ఇలా ప్రారంభమవుతుంది - అని చెప్పడానికి మాత్రమే ఈ రెండు మాటలూ చెప్పడం!
అసలు గ్రహించ వలిసిందంతా 'వస్తువు'కి వుండే ఆ 2 విలువల గురించీ!
ఒక కుర్చీ: దీని ఉపయోగం ఏమిటి? 'ఉపయోగం' అనేది, వస్తువు శరీరం లోనే కనపడుతుంది. కుర్చీ ఉపయోగం, కూర్చోడానికి పనికి రావడం. ఇదే, కుర్చీకి వున్న 'ఉపయోగపు విలువ'. కుర్చీ విరిగిపోతే, పాతదై పనికి రాకపోతే, దాని వల్ల ఉపయోగం పోతే, దాని ఉపయోగపు విలువ పోయినట్టే కదా?
కుర్చీకి, 'మారకం విలువ' అంటే? - వస్తువులో ఇది, ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు పోతుంది? 'ఆర్ధిక శాస్త్రం' అంతా ఈ మారకం విలువని అర్ధం చేయడం తోనే ప్రారంభమవుతుంది.
ఇక్కడ మనం చూసే ఆర్ధిక శాస్త్రంలో వివరాలన్నీ 'కాపిటల్' ద్వారా తెలిసే వివరాలు! పెట్టుబడిదారీ ఆర్ధిక శాస్త్రం చెప్పే వివరాలు, మర్మాల తోటీ, అబద్ధాల తోటీ వుంటాయి. మనం తెలుసు కోవలిసిందంతా నిజమైన ఆర్ధిక శాస్త్రాన్నే. మార్క్సు గ్రహించి వివరించి చెప్పిన శాస్త్రం ఇది. (ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ