Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''చరిత్ర కంటే కవిత్వం సత్యానికి దగ్గరగా ఉంటుందం టారు'' ప్రసిద్ధ తత్వవేత్త ప్లేటో. ఈ దారిలోనే లోకకళ్యాణమే ధ్యేయంగా సమాజ సౌజన్యమే లక్ష్యంగా కవుల కలాలు పయనిస్తుంటాయి. సాహిత్యం పట్ల సమ్యక్ దృష్టి కలిగిన కవి నేనొక్కడినే ఏం చేయగలనని ఎప్పుడూ అనుకోడు. ఏదో చేయాలని పరితపిస్తూనే ఉంటాడు. ఈ కోవలోని కవి ఏనుగు నరసింహారెడ్డి. వీరి తెలంగాణ రుబాయిలు ప్రసిద్దమైనవిగా ప్రజాదరణ పొందాయి.
రుబాయి పారసీ నుంచి ఉర్దూలోకి వచ్చింది. రుబా అంటే అరబ్బీలో నాలుగు అని అర్థం. నాలుగు పాదాల కవితారూపం కాబట్టి ఇది రుబాయి అయ్యింది. రుబాయి అంటే నాలుగు భాగాలు కలిగి ఉండటం అని కూడా అర్థం. తెలుగు పద్యంలా నాలుగు పాదాలు ఉండటం, మొదటి రెండు పాదాలు పాఠకుడి ఊహకు మార్గం చూపే విధంగా ఉండడం, మూడో పాదం ఆపై పాదాల్లోని వ్యాఖ్యను వివరించడం, నాలుగో పాదంతో కవిత ముగియడం, మూడో పాదానికి తప్ప తక్కిన మూడు పాదాలకు రదీఫ్, కాఫియా ఉండటం రుబాయి లక్షణం. మాత్రాఛందస్సులో ఉండే ప్రక్రియ రుబాయి. ఉర్దూలో మరల మరల వచ్చే పదాన్ని 'రదీఫ్' అంటారు. రుబాయిలో కొందరు కవులు తమ నామముద్రని లేదా కలం పేరుని ఉపయోగిస్తారు. ఈ ముద్రని ఉర్దూలో 'తఖల్లుస్' అంటారు. ఇది రుబాయికి తప్పనిసరి లక్షణం కాదు.
రుబాయి ప్రక్రియలో పర్షియన్ కవి ఉమర్ ఖయ్యాం, అంజద్ హైదరాబాది, మహమ్మద్ ఇక్బాల్ మొదలగు వారు ప్రసిద్ధులుగా చెప్పబడుతున్నారు. ''తెలుగులో తొలి గజళ్ళను, తొలి రుబాయీలను రాసినవారు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల వారు. దాశరథిగారి తర్వాత పట్టుదలతో తెలుగు రుబాయీలను రాసి అనేక సంపుటాలను ప్రచురించిన వారు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారు. దాశరథి, తిరుమల శ్రీనివాసాచార్యగార్ల తర్వాత అధిక సంఖ్యలో రుబాయీలు రాసిన వారు ఏనుగు నరసింహారెడ్డి గారే.
సాధారణంగా సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ఉంటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన తత్వం. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన ఆలోచనా సరళి. అటువంటి పరిస్థితుల్లో సరైన మూర్తిమత్వ వికాసం అనేది ప్రధానమైన అంశం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఎన్నైనా సంఘటనలు ఏవైనా మనిషి మనుగడ అనివార్యమైన అంశం. ఈ దిశగా వ్యక్తిత్వ వికాసానికి దారి దీపమై కొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తూ మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను స్పృశించింది 'తెలంగాణ రుబాయిలు'.
''వేదనేదీ లేకపోతే లోతు పెరుగదు తమ్ముడా
గాధలేవో గాయపరచక మనసు ఎదగదు తమ్ముడా
మంట ఏదొ ఉంటెనే కద లోహమన్నది సాగుబాగు'' అన్న రుబాయిలో జీవితానికి సరిపోయే అర్థం ఉందనిపిస్తుంది. చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోయే మనుషులకు బతుకుపై తీపిని, నమ్మకాన్ని కలిగించే రుబాయి ఇది. 'ఎంత చెట్టుకు అంతగాలి' అన్న సామెతను గుర్తుకు తెస్తుంది. వేదనలు రకరకాల గాథలు ప్రతి మనసుకూ సహజమే. మంట పెడితేనే కదా లోహం సాగేది, అనుకున్న రూపం దాల్చేది. మనసు కూడా అంతే. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ పోతేనే మనిషి రాటుదేలుతాడు.
''రాళ్ళు విసరడం సులభ విన్యాసం
దుమ్ము జల్లడం సరళ విన్యాసం
ఏదైనా నిర్మించి చూసావా
పడగొట్టడాలు చౌక విన్యాసం'' అంటాడు కవి.
ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, లేదా ఏదైనా వినూత్నంగా ప్రయత్నించినప్పుడు ఇలా పలు సందర్భాల్లో రాళ్లు విసిరే వాళ్ళు, దుమ్ముజల్లే వాళ్ళు లోకంలో లెక్కకు మిక్కిలి ఉంటారు. అలా రాళ్ళు విసిరేవాళ్లకు, దుమ్ము చల్లేవాళ్ళకు నిజంగా వారే ఏదైనా చేసినప్పుడు అది చేయడం ఎంత కష్టమో అర్థమవుతుంది. పడగొట్టడం చౌక విన్యాసమని తేటతెల్ల మవుతుంది.
''నలుగురితో కలవడమే నిజమౌ టానిక్
పలువురితో సంభాషణ నిజమౌ టానిక్
కొంటె దొరికేది కాని బలవర్ధకమూ
ఉత్సాహం, ప్రోత్సాహం నిజమౌ టానిక్''
అన్న రుబాయి మనిషి సంఘజీవిగా గమించాల్సిన ప్రాముఖ్యతను తెలుపుతుంది. కలిసిమెలగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెపుతుంది. మనసులోని సంవేదనలు, సంఘర్షణలు, ఒక్కసారి మనిషినే మింగేసే ఎన్నో చింతనలు ఆ నలుగురితో కలిసినప్పుడు, సంభాషించేటప్పుడు తీరిపోగలవు. తెలియకుండానే ఒక టానిక్‌లా మనసుకు బలాన్ని, ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కూడా పొందవచ్చు. యాంత్రికత ప్రాబల్యం పెరిగిపోతున్న నేటి రోజుల్లో మనిషికి, యంత్రానికి మధ్య దగ్గర సంబంధం పెరుగుతున్న పరిస్థితుల్లో నలుగురినీ కలవడం, సంభాషించడం చాలా మటుకు తరిగిపోతున్నదనే చెప్పక తప్పనిస్థితి. సామాజిక సంబంధాల గొప్పదనాన్ని ప్రకటించే ఈ రుబాయి ద్వారా సత్సంబంధాలను నెలకొల్పుకోవటం వ్యక్తి వికాసానికి ఎంతో అవసరమని స్పష్టంగా తెలుస్తుంది.
''ఒక రోజుకి మారదు లోకం
ఒక తీరున నడవదు లోకం
ఆచరణే గీటురాయిగా
అడుగిడుతే మారును లోకం'' అంటూ చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటిగా సాగే మనిషి జీవన యాత్రలో ఆచరణ ఎంతో గొప్పది. అందరూ చెప్పేవే ఆచరిస్తే లోకమే మారుతుందని తెలుపుతుంది.
''ఎదిగితే ఎదగాలి పీఠాలే కదిలి వచ్చేలా
ఎదిగితే ఎదగాలి రాజ్యాలే దిగి వచ్చేలా
నీకునీవే చెప్పుకొనియెడి దీనస్థాయిలొ ఉండకు
ఎదిగితే ఎదగాలి లోకాలే కదిలి వచ్చేలా'' అన్న కవి భావుకత ఎంత గొప్పది. వ్యక్తిత్వ లోపాలను తట్టి చూపుతూ అసలైన మూర్తిమత్వం ఏమిటో తెలియపరుస్తుంది.
536 రుబాయిలలో మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలు కనిపిస్తూ ఉంటాయి. సామాన్య పాఠకుడిని సైతం ఆకట్టుకునే అభివ్యక్తితో రాయడం నరసింహారెడ్డి ప్రత్యేకత. గాన యోగ్యత కలిగిన ఈ రుబాయిలను ఆలపించిన వారు ఎందరో. వివిధ మాధ్యమాలలో ప్రసారమైన వాటిని వింటున్నప్పుడు పారవశ్యంలో మునిగిపోక తప్పదు. గుండె గుండెలో చైతన్యం మొలకెత్తక తప్పదు. అందుకే 'తెలంగాణ రుబాయిలు' విశేష ప్రజాదరణ పొందాయి. ఇవి ఏనుగు నరసింహారెడ్డి లౌకిక దృష్టికి, అధ్యయనశీలతకు, రచనా పటిమకు, సాహిత్యం పట్ల సమ్యక్ దృష్టికి తార్కాణాలుగా నిలుస్తాయి. ప్రతి వ్యక్తిలోనూ సరికొత్త ఆలోచనలకు ఆయువు పోస్తూ సమగ్రమైన మూర్తిమత్వ నిర్మాణానికి కావలసినంత ప్రేరణను అందిస్తాయి.
(తెలంగాణ రుబాయిలకు తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారం లభించిన సందర్భంగా)
- ఉప్పల పద్మ
సెల్:9959126682