Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
ఇప్పుడు మారకం విలువని అర్ధం చేసుకోవడం, మొదటి విషయం. ఏ వస్తువుని తయారు చేయడానికైనా, ఎన్ని గంటలు లేదా ఎన్ని నెలలు శ్రమ చెయ్య వలిసి వచ్చిందో దాన్ని బట్టి ఆ వస్తువు తయారవడానికి అవసరమైన 'శ్రమ కాలం లెక్క' ఉంటుంది. వ్యవసాయ శ్రమలు నెలల కొద్దీ జరుగుతాయి. కుట్టు శ్రమలు కొన్ని రోజుల కొద్దీ. వంట శ్రమలు గంటల కొద్దీ. అలా జరిగిన శ్రమ కాలం కొలతే ఆ వస్తువుకి 'మారకం విలువ'.
తక్కువ శ్రమ కాలంలో తయారైన వస్తువుకి తక్కువ మారకం విలువ. ఎక్కువ శ్రమ కాలం అయితే ఎక్కువ మారకం విలువ. శ్రమ చెయ్యకుండా ఏ వస్తువూ తయారు కాదు - అని మళ్ళీ చెప్పుకోవాలి.
అడవిలో చెట్టుకి పండు వుంటే అది శ్రమ కాలం లేని సహజ ప్రకృతి పదార్ధమే. ఆ చెట్టు ఎక్కి పండుని కోస్తే, లేదా చెట్ల కింద వాటిని ఏరితే దాని కోసం ఒక పావుగంట కాలం అవసరం అయితే? - ఆ శ్రమ కాలమే ఆ పండుకి మారకం విలువ.
ఏ వస్తువుని చూసినా, ఏ పనిని చూసినా, ఆ వస్తువులో దాని 'మారకం విలువ' కనపడదు. ఎందుకంటే మారకం విలువ అనేది శ్రమ కాలం లెక్కే. శ్రమ కాలం భౌతిక పదార్ధం కాదు. కాబట్టి దాన్ని శ్రమ జరిగే కాలం లెక్కని బట్టి కొలవ వలిసిందే.
శ్రమ కాలానికి 'మారకం విలువ' అనే పేరు ఎందుకు వచ్చింది? ఇది తెలియాలంటే, 'మారకం' అంటే ఏమిటో తెలియాలి. వేల వేల సంవత్సరాల కిందటి ఆదిమ కాలంలో మనుషులు జీవించడానికి కనీసంగా అయినా అవసరమయ్యే వస్తువులేవేవో ప్రారంభమవుతూ వుండేవి అనుకోవాలి కాదా? నీళ్ళని నింపుకోడానికి మట్టి కుండలూ, పదార్ధాల్ని ఉడికించుకోడానికి మట్టి పాత్రలూ, తిండి కోసం కొన్ని రకాల ధాన్యాలూ, శరీరాన్ని కప్పుకోడానికి ఏదో రకపు బట్టలూ - అలా రక రకాల వస్తువులు సమాజంలో తయారవడం మొదలైంది. వేరు వేరు రకాల శ్రమలు తెలిసే కొద్దీ సమాజంలో కొత్త వస్తువులు పుడుతూనే వుంటాయి.
ప్రారంభ కాలంలో మానవులు వేరు వేరు తెగలుగా ఏర్పడి వుంటున్నారు - అనుకుందాం. ఒక తెగ తను తయారు చేసే వస్తువుల్ని ఇంకో తెగకి ఇచ్చి, ఇంకో తెగ నించి తనకు కావలసిన వస్తువుల్ని తను తీసుకుంటుంది. దీనిని ఇచ్చి దానికి బదులు ఇంకో దానిని తీసుకోవడం! ఈ వస్తువుకి బదులు ఆ వస్తువుని మార్చుకోవడమే వస్తువుల మారకం! ఈ మారకాల పద్ధతి లేకపోతే ఏ తెగకీ బ్రతుకు దెరువులు సాగవు. మానవ సమాజం బ్రతకడానికి, వస్తువుల మారకాలే అత్యవసరాలుగా పుట్టుకొచ్చాయి.
ప్రారంభంలో అయితే శ్రమల కొలతలూ ఆ శ్రమల విలువలూ - ఈ విషయాలేవీ ఏ మానవులకూ తెలియవు. అసలు 'శ్రమలు' అనే మాటలే నిన్న మొన్నటి దాకా లేవు!
మారకాలు పుట్టుకొచ్చిన ప్రారంభంలో కుండలకీ, ధాన్యానికీ మాత్రమే మారే సంబంధం ఏర్పడిందను కుందాం. అంటే ఆ రెండు వస్తువుల మధ్యే ఆ సంబంధం. ఇది ఇచ్చి అది తీసుకోవచ్చు. ఈ రెండు వస్తువులకీ వేరే ఏ వస్తువుల తోటీ ఆ మారక సంబంధాలు ఏర్పడలేదని అర్ధం. ఈ రెండు వస్తువుల సంబంధం ఇలా వుంటే వేరే రెండు వస్తువులకు కూడా అదే మారక సంబంధం ఉంటుంది.
రెండు వస్తువులకు మారకం జరిగినప్పుడు, ఆ రెంటికీ మారకం విలువలు వున్నట్టు బైట పడుతుంది. ఎలాగంటే, కుండని ఇచ్చేస్తే దానికి బదులుగా ఏదైనా రావాలా అక్కర లేదా? లేకపోతే ఆ కుండ మనిషికి ఇంకో వస్తువు రాకపోతే ఆ మనిషి ఎలా బ్రతుకుతాడు? కుండని ఇచ్చి కొంచెం ధాన్యం తీసుకుంటే, కుండకి బదులుగా వచ్చిన ధాన్యమే కుండకి మారకం విలువ. అలాగే ధాన్యానికి బదులుగా వచ్చిన కుండ ధాన్యానికి మారకం విలువ.
తయారై వున్న వస్తువుని చూస్తే, దాని ఉపయోగపు విలువ తెలుస్తుంది గానీ దాని మారకం విలువ కనపడదు. దానికి ఇంకో వస్తువుతో మారకం జరిగితేనే అది వెళ్ళి పోయినా దానికి బదులుగా ఇంకేదైనా వస్తువు వస్తేనే ఇచ్చిన వస్తువుకి మారకం విలువ తెలుస్తుంది.
అసలు ఈ 'మారకం విలువ' అనే మాటా శ్రమ కాలమే ఆ విలువగా వుంటుందనీ, రెండు వస్తువుల్నీ తయారు చేసిన శ్రమ కాలాలు సమానంగా వుంటేనే వాటికి మారకం జరుగుతుందనీ, ఈ విషయాలన్నీ మార్క్సు వివరించినవే. ఈ వివరాలు మార్క్సు కన్నా పూర్వం వున్న ఏ ఆర్ధిక వేత్తకీ ఇంత వివరాలతో తెలీవు.
ఈ మారకం విలువల గురించి మార్క్సు 3 దశలుగా చెప్పాడు.
1. మొదటి దశ: ఇది 'ప్రాధమిక విలువ రూపం'. రెండే రెండు ఫలానా ఫలానా వస్తువులకే మారకాలు జరగడం ప్రారంభమైతే మారకం విలువ కనపడే 'మొదటి దశ' ఇది. సమాజంలో మారకాల పద్ధతి ప్రారంభం అవడమూ; వస్తువుని ఇచ్చి వేస్తే, దానికి విలువ రావడమూ; - ఈ విషయాలు తెలిసే దశ ఇది.
2. రెండో దశ: ఇది, 'విస్తృత విలువ రూపం'. ఇది కూడా మారకాలు జరిగే దశే. అయితే, ఈ దశలో, కుండ అనే దానికి, ధాన్యంతో మాత్రమే మారక సంబంధం ఉంటుందని కాదు. కుండకి, సమాజంలో వున్న ఏ ఇతర రకం సరుకుతో అయినా, మారక సంబంధం ఏర్పడిన దశ ఇది. కుండల్ని చేసే వాళ్ళు, ఒక కుండని ఇచ్చి, దానికి బదులు కొంత ధాన్యాన్ని తీసుకోగలరు. ఇంకో కుండని ఇచ్చి, ఒక చెప్పుల జతని తీసుకో గలరు. మరో కుండని ఇచ్చి కొంత మాంసం తీసుకోగలరు. ఇలా ఏ వస్తువుని అయినా తీసుకునే పద్ధతి ఇది. మారకాల్లో ఈ మార్పు కుండలకి మాత్రమే కాదు, సమాజంలో వున్న ఏ వస్తువుకి అయినా జరిగినట్టే.
(ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ