Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వాతంత్య్రానికి అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ, దేశాభివృద్ధిలో కీలకమైన విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం... దేశంలో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ''మెకాలే'' విద్యా విధానం బానిసల(సేవకులు)నే తయారు చేస్తుందనే అపవాదును ఇలా అధిగమించాల్సే ఉంది. విద్యాలయాలను పట్టభద్రుల తయారీ ఖార్కానాల్లా మార్చకుండా, సమర్థ మానవ వనరులను అభివృద్ధి చేసే ఉన్నత ప్రమాణాలతో విద్యా విధానాన్ని రూపుదిద్దాల్సి ఉంది. ఏదేశ(జాతి) అభివృద్ధికైనా అత్యంత ప్రధానమైంది నాణ్యమైన విద్యా బోధన, సృజనాత్మక పరిశోధనలే. ప్రపంచ స్థాయిలో నాణ్యమైన మానవ వనరుల్ని అభివృద్ధి చేస్తున్న డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్లు ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తూ ముందంజలో ఉన్నాయి. కాని మనదేశంలో మౌలిక వసతుల కొరత, బోధనా సిబ్బంది కొరతతోపాటు రాజకీయ జోక్యం విద్యారంగాన్ని నీరుగారుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా, దేశీయ అవసరాలను తీర్చేలా ఉపాధి, ఉద్యోగాల కల్పనతో పాటు దేశం అభివృద్ధి జరగాలి. విద్యావేత్తల (నిపుణుల) సూచనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కాలానుగుణ మార్పులతో పాఠ్యప్రణాళికలు, బోధనా విధానాలను సమీక్షిస్తూ నైపుణ్యాలు కలిగిన రేపటి తరాన్ని సృష్టించాల్సి ఉంది.
మనదేశంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా కమిషన్లు వేస్తున్నారు. నివేదికలు సమర్పిస్తున్నప్పటికీ అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అలా హంటర్ కమిషన్ -1882, హార్టాగ్ కమిటి -1929, సార్జెంట్ నివేదిక-1944, రాధాకృష్ణన్ కమిషన్ (సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్)-1952, కొఠారి కమిషన్ (భారతీయ విద్యా కమిషన్)-1964-66, జాతీయ విద్యా విధానం-1986, నూతన జాతీయ విద్యా విధానం -2016-17, నూతన జాతీయ విద్యా విధానం -2020 లాంటి విద్యా కమిషన్లు వేసి... అమలు చేయకుండా చుట్టచుట్టి అటకెక్కించినవి కొన్నైతే, మరికొన్ని రాజకీయ రంగులు పులుము కుంటున్నాయని నిపుణులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. విద్యార్థుల జ్ఞానకేంద్రాలైన తరగతి గదులను, పాఠ్యప్రణాళికలను, పాఠ్యాంశాలను అంధవిశ్వాసాలకు, మత చాందసవాదాలకు కేంద్రాలుగా మార్చుతున్నారు. వాటిలో స్వాతంత్య్ర పోరాటంలో ధన, మాన, ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు స్థానం దక్కడం లేదు. రాజ్యాంగ రచనలో అసమాన ప్రతిభ కనబరిచిన అంబేద్కర్ పాత్రను కుదించుతున్నారు. ప్రగతిశీల భావాల రచయితల రచనలను పాఠ్యాంశాల్లోంచి తొలిగిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణమైన మార్పులకు ఎవరూ అభ్యంతర పెట్టరు. విద్యారంగ నిపుణులతో చర్చించి అవసరమైన సూచనలతో శాస్త్రీయ దృక్పథంతో పాఠాలు సవరిస్తే అందరూ ఆహ్వానిస్తారు. కానీ, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్విధానాలు అవలంభించడం, అశాస్త్రీయతకూ, వక్రీకరణలకూ పూనుకోవడం మంచిది కాదు. ఐక్యత, సామాజిక న్యాయం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాల్సిన చోట... పసిమెదల్లలో సంకుచిత భావాలు, వైషమ్యాల విత్తులు నాటడం జాతికి ఏమాత్రం క్షేమం కాదు! ఎవరు అధికారంలో ఉంటే? వారి సొంత ఎజెండాలు, సిద్ధాంతాలు చొప్పించుకుంటూపోతే ఈ దేశానికి చేటు కాలం దాపురించినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నవారి చిత్తానికి తగినట్లు చరిత్రలో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా! అభం శుభం తెలియని పిల్లలకు వాస్తవాలు తెలిసేదెలా? పాఠ్యాంశాల్లో అర్థసత్యాలు, అసత్యాలతో వ్యక్తిగత విశ్వాసాలకు, వాస్తవాలకు, మూఢవిశ్వాసాలకు, శాస్త్రీయ వైఖరులకు తేడా తెలియకుండా చేస్తే రేపటి సమాజం ఏమైపోవాలి? వైజ్ఞానిక దృక్పథం, మానవతా వాదం, జిజ్ఞాస, సంస్కరణాసక్తులను పెంపొందించుకోవడం భారతీయ పౌరుల ప్రాథమిక విధిగా రాజ్యాంగం నిర్ధేశిస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు దీనిని అమలు చేయబోమని కరాకండిగా చెప్పాయి. కేంద్ర ప్రభుత్వమేమో తమ పార్టీ అధికారం ఉన్న చోట దీని అమలుకు పూనుకుంటోంది. కలిసికట్టుగా విద్యా వ్యవస్థను, చదువులను ఉన్నతీకరించుకోవాల్సిన చోట వైషమ్యాలు చోటు చేసుకోవడం మన దేశానికి క్షేమం కాదు.
ప్రతి వ్యక్తినీ సమర్థ ప్రగతిశీల వనరుగా తీర్చి దిద్దేలా రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు సంఘటితంగా నిపుణుల, విద్యావేత్తల నేతృత్వంలో కృషి చేయాలి. ప్రగతి మార్గాన చదువులను చక్కపెట్టాలి. ఆధునిక నైపుణ్యాలు పరడవిల్లాలి.
ప్రస్తుత పరిస్థితి
రాజకీయాల్లో విద్యారంగంపై శ్రద్ధ లోపించడం, విద్యా రంగంలో రాజకీయాలు చొరబడటం విలువల పతనానికి ముఖ్య కారణంగా మారింది. అంతేకాదు, పాలకులకు మద్య విధానంపై ఉన్న శ్రద్ధ, ప్రాధాన్యత విద్య, పాఠశాలల నిర్వహణ మీద లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినప్పటికీ వాటి నిర్వహణకు అవసరమైన నిధులు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు ఏ ఒక్కటీ పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. కనీసం పాఠశాల పరిశుభ్రతకు స్కావెంజర్ల నియామకాలు, స్టేషనరీ ఖర్చులు, సుద్ధముక్కలు కొనడానికి కూడా డబ్బుల్లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ''సమగ్ర శిక్షా అభియాన్'' ద్వారా నిధులు ఇవ్వడంలో ఒకరిపై ఒకరు నెపాన్ని మోపుకుంటూ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. మన రాష్ట్రంలో సుమారు 25 వేల పాఠశాలలు ఉండగా వాటికి పాఠశాల విద్యాశాఖ నుండి రెండు విడతలుగా స్కూల్ గ్రాంట్ ఇస్తారు. 2020-21లో సగం నిధులనే ఇచ్చారు. అలాగే 2021-22 విద్యా సంవత్సరంలో చివరి విడత కింద 50శాతం నిధులను మార్చి నెలాఖరులో ఇచ్చి, ఆ వెంటనే ఏప్రిల్ నెలలోనే వెనక్కి తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు '0' బ్యాలన్సుగా ఉంది. 'బడిబాట' నిర్వహణకు కూడా ఒక్క పైసా ఇవ్వకుండా ఎజెండా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బ్యానర్లు, కరపత్రాలు, తరగతుల వారిగా హాజరు రిజిష్టర్లు, చాక్‌పీసులు, డస్టర్లు, చీపుర్లు, మూత్రశాలలు శుద్ధం చేయుటకు ఫినాయిల్, కరోనా జాగ్రత్తలో భాగంగా హ్యాండ్‌వాష్, శానిటైజర్లతోపాటు పారిశుద్ధ్య కార్మికులులేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలతో కాలం వెల్లదీస్తున్నారు. ''మన ఊరు-మన బడి'' కార్యక్రమం ప్రచార పటాటోపమే తప్ప పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. దీనికి కూడా నిధుల కొరతే కారణమని తెలుస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెపాన్ని ఒకరిపై ఒకరు తోసేస్తూ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నాయి. విద్య రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు. దీనిని సమకూర్చాల్సిన బాధ్యత పాలకులదేనని మరువరాదు.
- మేకిరి దామోదర్
సెల్: 9573666650