Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. ఇందులో 20,000 మంది వారసత్వ వీఆర్ఏలు, 3000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందారు. ఇందులో 50శాతం మహిళలు ఉన్నారు. నైజాం సర్కారు నుంచి నేటి వరకు వీఆర్ఏలు గ్రామాల్లో అనేక సేవలు అందించారు. గతంలో వీరిని మస్కూరీలుగా, షేక్ సిందులుగా, నీరటీలుగా, సుంకరిగా అనేక పేర్లతో పిలిచారు. ప్రస్తుతం వీరిని గ్రామ రెవెన్యూ సహాయకులుగా పిలుస్తున్నారు. గ్రామాల్లో చెరువులను కాపాడటం, చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్న భూములను పరిరక్షించడం, వరదలు వచ్చినప్పుడు ముందుగా ప్రభుత్వానికి నష్టం తాలూకు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజెప్పడం వంటి బాధ్యతలనేకం ఉంటాయి. ఆ గ్రామానికి 36 విభాగాలకు సంబంధించిన ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా మొదట ఆ అధికారిని రిసీవ్ చేసుకునేది వీరే.
నీటిపారుదల విభాగానికి చెరువు గురించి, చెరువు ఆయకట్టు గురించి, కట్ట నాణ్యత గురించి, లోపాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు శాంతి స్థాపనకు ఎప్పటికప్పుడు పోలీసుకు సమాచారం అందించే గ్రామ రక్షకులూ వీళ్లే. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కాపాడతారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం బాధ్యత తీసుకుంటూ, గ్రామంలో లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించడం, వారికి దరఖాస్తుకు సంబంధించిన వివరాలు తెలియజెప్పడం, అర్హులను గుర్తించడం పై అధికారులకు సమాచారం అందించడం, గ్రామంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఇలా అనేక రకమైన సమస్యల పరిష్కారంలో విలేజ్ రెవెన్యూ సహాయకులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు.
వైద్య విధానా పరిషత్ విభాగానికి కూడా వీఆర్ఏలు తమవంతుగా సహాయపడతారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగునీటి కాలువలో కిరోసిన్ చల్లడం, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలను చెపుతూ, ఆశా కార్యకర్తలతో కలిసి తిరుగుతూ గ్రామాన్ని అనారోగ్యాల బారినుండి రక్షించుకోవడానికి వీఆర్ఏలు కృషిచేస్తున్నారు. వ్యవసాయ అధికారి గ్రామానికి వచ్చినప్పుడు సాగుబడి వివరాలు, రైతుబంధు, రైతు బీమా లాంటి కీలకమైన రైతు పథకాలకు ఆధార్ సీడింగులు అందిస్తారు. గ్రామానికి సరిహద్దు వివాదాలు, పట్టాదారుల సరిహద్దు వివాదాలు వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులకు వాస్తవాలను చెప్పి సమస్యకు పరిష్కారం చూపుతారు. ఆసరా పింఛన్ మొదలు అనేక రకాల పింఛన్లకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తు తీసుకోవడం, దరఖాస్తు అప్లయి నమూనాను తెలియజెప్పడం, అధికారులకు ఆ సమాచారాన్ని తీసుకెళ్లడం, లబ్ధిదారులను గుర్తించే విషయంలో తన వంతుగా తన బాధ్యతను నిర్వర్తించడం ఇలా గ్రామంలో ఒక వ్యక్తి పుట్టుక నుండి చనిపోయే వరకు పుట్టిన దృవీకరణ పత్రం నుంచి కుల దృవీకరణ పత్రం ఆదాయ దృవీకరణ పత్రం ఆ బిడ్డ చదువుకుంటే స్కాలర్షిప్ లాంటి సమాచారాన్ని తెలియచెప్పడం, ఆ బిడ్డకు పెళ్లయితే కళ్యాణ్ లక్ష్మి లాంటి సమాచారాన్ని తెలియజెప్పడం, ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో వీఆర్ఏలది కీలకమైన పాత్ర. గ్రామంలో ప్రభుత్వ సహజ వనరులు ఇసుక, వృక్షాలు, కొండలు గుట్టలు మొదలైన సంపదలను కాపాడడం వంటి కీలకమైన విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. నిజాంబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు బోధన్ డివిజన్లో ఒక వీఆర్ఏను చంపారు. అనేక మంది మీద ఇసుక మాఫియా దాడులు చేసినా కూడా వెనక్కి తగ్గకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి కీలకమైన పాత్రను పోషిస్తున్న వీఆర్ఏలకు ప్రభుత్వం గౌరవ వేతనంగా ఇచ్చేది రూ.10,500 మాత్రమే. ఇప్పటికీ ఈ విలేజ్ రెవెన్యూ సహాయకులు గౌరవ వేతనం మాత్రమే పొందుతున్నారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కూడాలేదు. నూటికి 95శాతం మంది వీఆర్ఏల్లో అణగారిన కుటుంబాలకి నుంచి వచ్చిన వారే. కామారెడ్డి జిల్లాలో ఆరు మాసాల కిందట జీతం సరిపోక రమేష్ అనే వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్న విషయం రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిన విషయమే. అనేక విజ్ఞప్తులు అనేక వినతులు పోరాటాల ఫలితంగా 2017లో ప్రగతి భవన్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వీఆర్ఏ ప్రతినిధులను పిలుచుకొని వీఆర్ఏలకు పేస్కేలు చేస్తామని చెప్పారు.
2020 సంవత్సరం నూతన రెవెన్యూ చట్టం తీసుకు వస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏలను తక్షణం పేస్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పారు. కానీ, సంవత్సరాలు గడుస్తున్నా వీఆర్ఏలకు పేస్కేలు రాలేదు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉంటే, వీఆర్ఏల జీతం కుటుంబ అవసరాలకు సరిపోక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం ఖర్చులు, కుటుంబ అవసరాలు, ఇంటి అద్దెలకూ నానాఇబ్బందులు పడుతున్నారు. సకల జనుల సమ్మెలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో 23,000 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీఆర్ఏలకు పేస్కేలు రాలేదు, తెలంగాణ ఏర్పడ్డాక కూడా వీఆర్ఏలకు భంగపాటు తప్పలేదు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ ప్రభుత్వం వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ప్రమోషన్లు కల్పించింది.
అందుకే వీఆర్ఏలు హక్కుల సాధనకై ఉద్యమ బాటపట్టారు. తెలంగాణ ప్రభుత్వ భూ పరిపాలనశాఖ అధికారికి జూన్ నెల 8న తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఈనెల 25న తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని తెలియజేశారు. దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాసిల్దార్కి వినతిపత్రాలు, కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో హైదరాబాద్ సిసిఐఎల్ఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జూలై నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు రిలేనిరాహార దీక్షలు, 23న కలెక్టరేట్ల ముట్టడి చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో జూలై 25 నుంచి వీఆర్ఏలు సమ్మెలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న విఆర్వోలు కూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. వీఆర్ఏల సమ్మె కారణంగా మాకు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పని ఒత్తిడి పెరిగిందని రాష్ట్రంలో ఉన్న మొత్తం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కలెక్టర్లకు నివేదికలిచ్చారు. వీఆర్ఏల సమ్మెకు రాష్ట్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు సామాజిక సంఘాలు కూడా మద్దతును తెలియ జేశాయి. సమ్మె ప్రారంభమై నేటికి నెల రోజులు. ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏలకు తామిచ్చిన హామీ నెరవేర్చాలనీ, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుందాం.
- మల్లారం అర్జున్
సెల్:8500272043