Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
సమాజంలో 10 వస్తువులు ఉన్నాయి - అనుకుంటే, వాటిల్లో ఒక వస్తువు కుండ అయితే, కుండల్ని తయారు చేసే వాళ్ళు కుండని ఇచ్చి దానికి బైట వున్న 9 వస్తువుల్లో ఏ వస్తువుని అయినా తీసుకోగలరు. కుండని ఇచ్చి ధాన్యాన్ని గాక, బెల్లాన్ని తీసుకుంటే అప్పుడు బెల్లమే కుండకి వున్న మారకం విలువని చూపించే వస్తువు అవుతుంది. ఇప్పుడు కుండ మారకం విలువ బెల్లం రూపంతో కనపడుతుంది. 10 కుండల్లో ఒక్కొక్క దానితో వేరే వేరే వస్తువుల్ని తీసుకుంటే కుండ మారకం విలువ ఆ 10 వస్తువులు గానూ కనపడుతుంది. అంటే మారకం విలువ కనపడేది ఒక్క ఇతర వస్తువు రూపం తోనే కాదు, వేరు వేరు వస్తువుల రూపాలతో.
ఈ దశలో ఏ వస్తువు అయినా ఇతర అన్ని వస్తువుల తోనూ మారగలదు. కాబట్టి ఏ వస్తువు మారకం విలువ అయినా ఒకే వస్తువు రూపంతో గాక అనేక వస్తువుల రూపాలతో కనపడుతుంది. మారక విలువ రూపం అనేది అనేక రూపాలతో కనపడే దశ ''విస్తరించిన విలువ రూపం'' దశ. కుండ మారకాల్లో ఒక కుండ విలువ ధాన్యం గానూ, ఇంకో కుండ విలువ బెల్లం గానూ, మరో కుండ విలువ జొన్నలు గానూ - ఇలా వేరు వేరు రూపాలతో కుండ మారకం విలువ ఏ రూపంతో వుంటుంది? - అంటే, అనేక రూపాలతో!
ఈ విస్తృత విలువ రూపం దశలో, మారకం విలువ కనపడే రూపంలో 2 మార్పులు జరిగినట్టు అర్ధం.
మొదటి మార్పు: ప్రధమ విలువ రూపం విస్తరించిన విలువ రూపంగా మారడం!
ఈ విస్తరించిన విలువ దశ లోనే ఇంకో మార్పు కూడా కనపడుతుంది. ఇది ఏమిటంటే... సమాజంలో వున్న ఏ వస్తువు అయినా సమాజంలోనే వున్న ఇతర అన్ని వస్తువుల తోటీ మారగలదంటే ఆ ఇతర వస్తువులన్నీ కూడా ఇటు వున్న మొదటి వస్తువుతో మారగలవని అర్ధమే కదా? కుండ ఇతర 9 వస్తువులతో మారే పద్ధతి వుందంటే ఆ ఇతర 9 వస్తువుల్లో ఏ వస్తువు అయినా కుండతో మారగలదని అర్ధమే!
అనేక వస్తువుల మారకం విలువలు, ఏదో 'ఒకే వస్తువు రూపంతో' కనపడేది, మారకం విలువ రూపాల్లో చివరి దశ. ఇది విస్తరించే దశగా వున్నప్పటికీ ఈ దశలో ఇంకో దశ కూడా కలిసి వుంటుంది. ఈ మారకాల్లో ఈ దశల వరసలో ఇది మూడో దశ.
3. మూడో దశ: 'జనరల్ విలువ రూపం'.. 'జనరల్' అంటే ఒక్క వస్తువు రూపమే అన్ని వస్తువుల మారకాలకూ సంబంధించే రూపంగా వుంటుంది - అని!
ఈ మారకాల దశల్లో చివరికి ఏర్పడే తార్కిక నియమం ఇది. ఒక వస్తువు అన్ని వస్తువుల తోనూ మారడం! ఈ వింత ఏమిటో ఇప్పటికే ఊహించారా? ఇప్పటికే సమాజంలో 100 వస్తువులు ఉన్నాయి - అనుకుందాం. వాటిల్లో ఒకటి కుండ! కుండని ఇచ్చి ఇతర 99 వస్తువుల్లో ఏ వస్తువుని అయినా తెచ్చుకోగలరా?
సమాజంలో వున్న అన్ని వస్తువుల తోనూ మారగల హక్కు గల ఒకే ఒక వస్తువుగా 'కుండ'ని అయితే అనుకోకూడదు. కుండకి మారకం విలువ అతి తక్కువ. కుండని ఇచ్చి ఒక బంగారపు వస్తువుని తీసుకోడానికి వాటి మారకం విలువలు సమానంగా వుండవు.
మారకాల మూడో దశగా జనరల్ దశని కొంచెం వివరంగా చూడాలి. అంటే అన్ని వస్తువుల తోటీ మారే ఒకే వస్తువు వుండే పద్ధతి ప్రారంభమైంది. 'వెండి' అనే లోహమే ఆ ఒకే వస్తువుగా సమాజంలో అందరి దృష్టిలోనూ ఏర్పడిందనుకుందాం. కుండ వాళ్ళకి జొన్నలు కావాలి. వాళ్ళు కుండని తీసుకుని జొన్నల వాళ్ళ దగ్గిరికి వెళ్ళవచ్చు. వీళ్ళు జొన్నలు కావాలని అడిగితే జొన్నల వాళ్ళకి కుండ అక్కర్లేదనుకుందాం. కుండ వాళ్ళేం చెయ్యాలి? జొన్నల వాళ్ళకి ఏం కావాలో అడిగి, అది దొరికే చోటుకి వెళ్ళి వాళ్ళకి కుండని ఇచ్చి, ఆ వస్తువుని తెచ్చి, దాన్ని జొన్నల వాళ్ళకి ఇచ్చి అప్పుడు జొన్నలు తీసుకోవాలి. అయితే ఆ బైటి వాళ్ళకి కూడా కుండ అక్కర లేకపోతే? కుండ మనిషి మళ్ళీ తిరగాలా? కుండ వాళ్ళు ఇన్ని తిరుగుళ్ళు చెయ్యకుండా జొన్నలు కావాలంటే ఏం చెయ్యాలి? ఏ వస్తువుతో అయినా మారే ఒక వస్తువు ఏర్పడి పోయి వుందని ఊహించండి! కుండ వాళ్ళకి జొన్నలు కావాలన్నా మొదటే జొన్నల దగ్గిరికి వెళ్ళకుండా అన్ని వస్తువుల తోటీ మారే వస్తువు దగ్గిరికే మొదట దగ్గిరికే వెళ్ళాలి.
'వెండి'ని అన్ని వస్తువుల తోటీ మారే రకం వస్తువుగా అనుకుందాం. కుండ వాళ్ళు మొదట వెండి దగ్గిరికి వెళ్ళి కుండని ఇచ్చి, సన్న సూది అంత వెండిని తీసుకుంటారు. తర్వాత ఆ వెండిని జొన్నల వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెండిని సంతోషంగా తీసుకుని కొన్ని జొన్నలు ఇస్తారు.
అయితే జొన్నల వాళ్ళు, వెండిని ఎందుకు తీసుకుంటారు? ఎందుకా? అది ఎటువంటి వస్తువు? ఏ వస్తువుతో అయినా మారగల వస్తువుగా సమాజంలో నిర్ణయమై వున్న వస్తువు కదా? అందుకే వెండి కుండతో మారింది! తర్వాత జొన్నలతో కూడా మారింది! జొన్నల వాళ్ళకి బెల్లం కావాలంటే, వెండిని ఇచ్చి బెల్లం తెచ్చుకోగలరు. బెల్లం వాళ్ళు కూడా అలాగే వెండితో ఏది కావాలంటే అది తెచ్చుకోగలరు. వెండిని తీసుకోడానికి ఎవ్వరూ వ్యతిరేకించరు. పైగా సంతోషిస్తారు. అన్ని వస్తువుల తోటీ మారే వస్తువుకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఆ పేరు 'డబ్బు'!
(ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ