Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: గురువుగారూ... గురువుగారూ... రాజమార్గానికీ కర్తవ్యమార్గానికీ గల బేధమేదో కాస్త వివరిస్తారా..!
గురువు: రాజమార్గం అంటే విశాలమైన రహదారి. కర్తవ్య మార్గం అంటే బాధ్యతగా నడుచుకునే జీవన రహదారి.
శిష్యుడు: మరికొందరు మరోలా పేర్కొంటున్నారే?
గురువు: ఏమని?
శిష్యుడు: ఒకప్పుడు రాజ్యాధికారానికీ, ఆధిపత్యానికీ కేంద్రంగా ఉన్న రాజపథ్ను కర్తవ్య పథ్‌గా మార్చడమే ఎంతో గొప్ప ప్రగతిశీలమని, బానిస భావజాలాన్ని బద్దలు కొట్టేందుకే ప్రధాని మోడీ ఈ విధంగా పేరు మార్చారని చెపుతున్నారు.
గురువు: శిష్యా... మోడీ భజనలో భాగం ఇది.. బ్రిటిష్‌వారి కాలంలో మన దేశ రాజధాని తొలుత కలకత్తాలో ఉండేది. ఆ తర్వాత కలకత్తా నుండి ఢిల్లీకి మారింది. ఆ సందర్భంగా అప్పటి అక్కడి పాలనా ప్రాంతాన్ని కింగ్స్‌వేగా నామకరణం చేసారు. స్వాతంత్య్రానంతరం దానినే రాజపథ్ అన్నారు.
శిష్యుడు: అలానా... అయినా ఇప్పుడు రాజుల కాలం లేదుగా..!
గురువు: అవును. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ఐదేండ్లకు ఓసారి ఎన్నికల రూపంలో ఏర్పడే ప్రభుత్వ ప్రతినిధులే పాలన చేస్తారు. ప్రధాని మోడీనే ప్రధాన పాలకుడు.
శిష్యుడు: పాలకుడు అంటే రాజులాంటి వాడేగా..!
గురువు: ఒక కోణంలో నిజమే. కాని మనది గణతంత్ర రాజ్యం. రిపబ్లిక్‌గా పిలుచుకునే ప్రజారాజ్యం. ప్రజలే ప్రభువులు, 'భారత దేశ ప్రజలమైన మేము - భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యావాద, లౌకిక, గణతంత్ర రాజ్యాంగా నిర్మించుకోవడానికి... సత్య నిష్టాపూర్వకముగా తీర్మానించుకున్నట్టు'' మన రాజ్యాంగ ప్రవేశిక నిర్దేశిస్తున్నది.
ఒక్కమాటలో చెప్పాలంటే... మన భారత రాజ్యాంగమే మన పాలకులకు నిజమైన పాలనా కర్తవ్య రహదారి.
శిష్యుడు: అంటే మోడీగారు తన పని గురించి తానే చెప్పుకున్నారా... లేక 'తమరు శుద్ధం - తడికకు బెజ్జం' అన్న రీతిలో భజన పరులు వ్యాఖ్యానిస్తున్నారా..? నాకు అర్థం కావడం లేదు.
గురువు: అలా డీలా పడకు. ప్రభువును మించిన ప్రభు భక్తిని చూపే అడ్డదారులు ఎప్పుడూ ఉంటాయి నాయనా. మారాల్సింది పాలనా విధానాలు - చర్యలు తప్ప పేర్లు కాదు.
శిష్యుడు: బాగా చెప్పారండి. ప్రధాని మోడీ ఇటీవల ఢిల్లీలో కింగ్‌జార్జ్-5 విగ్రహ స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారండి. అదిగో అప్పుడే రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు ఉండే రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్గా మార్చారండి. రాజపథ్ మార్పుతో బానిస గుర్తులను చరిత్రలో కలిపేస్తున్నట్టు ప్రకటించారండి. మీరన్నట్టు పేరు మారిస్తే అన్నీ మారిపోతాయంటండి మరీ విడ్డూరంగానూ...
గురువు: మనం ఒక విషయం పరిశీలించాలి. నేతాజీ ఆశయాలు వేరు, బీజేపీ ఆలోచనలు వేరు.
శిష్యుడు: ఎలా ఎలా ఎలా..?
గురువు: స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ కాంగ్రెస్‌లోని వామపక్ష భావజాలానికి ప్రతినిధిగా గుర్తింపు పొందాడు. కారల్ మార్క్స్, లెనిన్ రచనలతో, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అంశాలతో సంతృప్తి చెందానని, ప్రాపంచిక దృక్పథంలో భాగంగా వాటిని గుర్తించానని నేతాజీ తన రచనల్లో పేర్కొన్నాడు. మరి బీజేపీ, ఆర్సెసెస్లకు సోషలిజం అంటేనే గిట్టదు. అందరూ సమానమే అన్న సమతావాదమే జీర్ణం కాదు.
శిష్యుడు: అమ్మా! మరి ఇంత బాగోతం ఎందుకు నడుపుతున్నారు.
గురువు: చరిత్రను వక్రీకరించడానికి... స్వాతంత్య్రోద్యమ వారసులుగా చలామణి కావడానికి... తప్పులను కప్పిపుచ్చుకోవడానికీ ఇలానే ప్రవర్తిస్తుంటారు. ప్రజలను గందరగోళ పరుస్తుంటారు.
శిష్యుడు: మరి ఈ కపట నాటకానికి తెరపడదా..?
గురువు: ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చేతలనే గమనంలోకి తీసుకోవాలి. మాటలు వేరు చేతలు వేరు. అధికారంలోకి మోడీ వచ్చి ఎనిమిదేండ్లు గావస్తున్నా పాలన అడుగంటుతూనే ఉన్నది.
ఐక్యరాజ్యసమితి తెలిపిన మానవాభివృద్ధి సూచికలో మన భారత్ గత ఏడాది 131వ స్థానంలో ఉంటే, ఈ ఏడు 132వ స్థానంలోకి దిగజారింది. మనకంటే మన పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కూడా మెరుగైన స్థితిలో ఉన్నాయి. నాలుగుశాతం వృద్ధిరేటుతో యువతలోని 4.2శాతం నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపుతారని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
కాగా, పేదరికం, నిరుద్యోగం కారణాన ఆధునిక బానిసత్వంలోకి త్వరితగతిన దిగజారి పోతున్న దేశాల్లో భారతదేశం ముందువరుసలో నిలుస్తున్నదని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. బలవంతపు వివాహాలు, వెట్టిచాకిరి, వివక్ష, నిర్భంద పని మొదలైనవి ఆధునిక బానిసత్వ చిహ్నాలుగా పేర్కొన్నది. పర్యావరణ ప్రమాద ముప్పును, యుద్ధ ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో... ఈ బానిసత్వ ప్రమాదాలనూ అలానే ఎదుర్కొవాలని తెలిపింది.
శిష్యుడు: అంటే ఏమిటి గురువుగారూ... బానిసత్వానికి బలం చేకూర్చే విధానాలను ఒక ప్రక్క పాటిస్తూనే బానిసత్వాన్ని బద్దలు కొట్టడానికి పాటుపడుతున్నానని ప్రకటిస్తున్నారా..?
గురువు: వేరే చెప్పాలా శిష్యా! భారత రాజ్యాంగ విలువలు పాటించకుండా బానిసత్వం పోతుందంటే అంతకన్నా పెద్ద భ్రమ ఉండదు.
- కె. శాంతారావు
సెల్: 9959745723