Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే విద్యారంగం బాగుపడుతుందని, అందరికీ సమాన విద్య, నాణ్యమైన విద్య, కామన్ స్కూల్ ద్వారా లభిస్తుందని ఆశపడ్డ ఉపాధ్యాయుల ఆకాంక్షలు నీటి బుడగలు అయ్యాయి. కామన్ స్కూల్ ఏమోగానీ విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులో కూడా వివక్షను కొనసాగించడం దారుణం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా 2018 మే 16న 150 సంఘాలతో సమావేశమై ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి నాలుగేండ్లు అయిపోయినా నేటి వరకూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టకపోవడం వల్ల విద్యారంగం తీవ్రంగా నష్టపోతున్నది. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు సర్కార్ బడులలో చదువులు కొనసాగించక డ్రాప్ అయ్యే పరిస్థితి కనబడుతున్నది. ఉపాధ్యాయులుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటమార్గాన్ని ఎన్నుకొని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా అనేకమార్లు ఉద్యమాలు చేపట్టినప్పటికీ నేటి వరకు హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపడతామని హామీఇచ్చింది. విద్యాశాఖ మంత్రి అనేకసార్లు త్వరలో బదిలీలు ప్రమోషన్లు చేపడతామని తెలియజేశారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు బదిలీలు ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల కాలేదు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడేంత మంది ఉపాధ్యాయులు లేరు. పైగా వర్క్ అడ్జస్‌మెంట్ పేరిట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకు డిప్యూషన్పై పంపడం వలన ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత పెరిగింది. కోవిడ్‌కి ముందు దాదాపు 15 వేల మంది విద్యావాలంటీర్లు పాఠశాలల్లో పనిచేసేవారు. ప్రస్తుతం విద్యా వాలంటీర్లను పునర్ నియమించలేదు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు మనబడి, ఇంగ్లీష్ మీడియం పథకాలు సక్రమంగా అమలు కావాలంటే పాఠశాలల్లో ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల, పర్యవేక్షణ అధికారుల కొరత తీర్చాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకు వెంటనే బదిలీల, ప్రమోషన్ల షెడ్యూలు విడుదల చేయాలి. ఖాళీ అయిన పోస్టుల్లో ప్రత్యక్షంగా ఉపాధ్యాయ నియామకం చేపట్టాలి. 2020 ఏప్రిల్ నుండి పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించలేకపోవడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉన్నది. గ్రామపంచాయతీలకు, మునిసిపాలిటీలకు పారిశుద్ధ్య బాధ్యత అప్పగించినప్పటికీ ఎక్కడ సక్రమంగా అమలు కావడం లేదు. కాబట్టి వెంటనే స్కావెంజర్ల నియామకం చేపట్టి పరిశుభ్రత పాఠశాలలో ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కస్తూర్బా విద్యాలయాలు, సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయక పోవడం వలన శ్రమ దోపిడీకి గురవుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాల్సిన ప్రభుత్వం నేటి వరకు వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. కస్తూర్బా పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్లకు ఏమాత్రం సంబంధంలేని మోడల్ స్కూల్ వసతి గృహ నిర్వహణ బాధ్యతలను బలవంతంగా అప్పగించారు. ఒకవేళ బాధ్యతలను తీసుకోనట్లయితే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడడం అన్యాయం.
మోడల్ స్కూల్స్ ప్రారంభమై 9ఏండ్లు అయింది. నేటి వరకు ఆ విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బదిలీలు లేవు ప్రమోషన్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియంతో అత్యంత విజయవంతంగా పాఠశాలలు నడుస్తున్నాయి. ఖాళీలు ఉన్న మూడో వంతు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం నేటి వరకు పట్టించుకోవడం లేదు. గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలలు తీవ్రమైన వివక్షతకు గురవుతున్నాయి. ఆశ్రమ పాఠశాలలకు 1192 నూతన పోస్టులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఏడేండ్లుగా సచివాలయంలో మూలన పడ్డాయి. ముట్టుకున్న నాథుడేలేడు. వాటిని తక్షణమే మంజూరు చేసి భర్తీ చేయాలి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అందాల్సిన పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థినీ, విద్యార్థులకు అందడంలేదు. ప్రధానంగా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతున్నది. వెంటనే అందించే ప్రయత్నం చేయాలి. 317 జీవో ద్వారా నష్టపోయిన బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఏకపక్షంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజన కారణంగా అనేకమంది జూనియర్ ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారు. స్థానికంగా పుట్టి పెరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారిన సమస్యను ప్రభుత్వం పట్టించుకోవాలి. మూడు, నాలుగు సంవత్సరాలలో తిరిగి సొంత జిల్లాలకు వచ్చే విధంగా భరోసా కల్పించాలి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని అనేకమార్లు బాధిత ఉపాధ్యాయులు ముట్టడించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయ దంపతులు మమ్మల్ని విడగొట్టద్దని పిల్లా పాపలతో డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తే అరెస్ట్‌చేసి లోపల వేయడం ఎంత వరకు సమంజసం?
2004 సెప్టెంబర్ తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రతగా ఉండాల్సిన పాత పెన్షన్‌ను రద్దుచేసి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని తీసుకురావడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వెంటనే పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. రాజస్థాన్, చత్తీఘడ్ రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా ఆలోచించాలి. సమస్యల పరిష్కారం కోసం అనేక దఫాలుగా వివిధ సంఘాలు ఉద్యమాలు చేశాయి. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రికి గత నెల 26వ తేదీన బహిరంగ లేక విడుదల చేశాయి. పలుమార్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిని, రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ని, కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఎలాంటి చర్యలు లేవు. అందుకే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మే 18న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో వేలాది మంది ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసింది. జూన్ 6న పదవ తరగతి మూల్యాంకన కేంద్రాలలో నిరసన వ్యక్తం చేసింది. జూలై 7న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల మహాధర్నా నిర్వహించింది. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున ఈనెల 4న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్ష చేపట్టింది. అయినప్పటికీ స్పందనలేని కారణంగా ఈనెల 11 నుండి నిరసన దీక్షలు చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నిరసిస్తూ, కనుక దీనికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులోకానికి పోరాటమే ఏకైక మార్గం.
- జి. తిరుపతి రెడ్డి
సెల్: 9866306366