Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతవారంలో మన ఆర్ధిక రంగానికి చెందిన వివరాలు కొన్ని ప్రముఖంగా వార్తలకు ఎక్కాయి. రోజు వారీ పనులతో తీరిక లేనివారికి అవి ఒక పట్టాన అర్ధంగావు. నిత్య జీవితాలతో పరోక్షంగా సంబంధం కలిగినవే అయినా నేరుగా జనాన్ని తాకేవి కాదు గనుక అంతగా పట్టించుకోరు. దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయనేతలు, అందునా అధికారంలో ఉన్నవారు అంకెలతో గారడీలు చేస్తూ జనాలను ఆడుకుంటున్నారు.
బ్రిటన్ను వెనక్కు నెట్టి మన దేశం జీడీపీలో ప్రపంచంలో ఐదవ స్థానానికి వచ్చిందని కొంత మంది సంతోషం ప్రకటిస్తున్నారు, మంచిదే. వెనుకటికి ఎవరో మాది 101 అరకల వ్యవసాయం తెలుసా అని మీసాలు మెలివేశాడట. మాది అంటున్నావు ఎవరెవరిది అని అడిగితే మా భూస్వామిది వంద, నాది ఒకటి అన్నాడట. అలాగే మరొకడు మా ఇంటి పక్కనే ముకేష్ అంబానీ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పాడట. ఆ చెప్పిన వాడి ఇల్లు చిరిగిన ప్లాస్టిక్ కవర్లతో కూడిన గుడారం వంటిది కాగా అంబానీ ఇల్లు 27అంతస్తులు, మూడు హెలిపాడ్లు కలిగి ఉంది. కరోనాకు ముందు కేవలం పది బిలియన్ డాలర్ల సంపద కలిగిన అదానీ ఇప్పుడు 141 బి.డాలర్లకు చేరాడని తాజా వార్త. పేద వాడి ప్లాస్టిక్ పాక, వీధుల్లో అడుక్కొనే బిచ్చగాండ్ల రాబడి అంబానీ ఇల్లు, అదానీ సంపదలు అన్నింటినీ కలిపే దేశ జీడీపీగా పరిగణిస్తారు. దీన్ని నరేంద్రమోడీ సాధించిన ఘన విజయాల్లో ఒకటిగా కొందరు వర్ణిస్తున్నారు. అంకెలను ఎవరూ తారు మారు చేయలేరు గానీ ఎవరి భాష్యం వారు చెప్పవచ్చు. నాలుగు ఎలా వచ్చిందంటే నాలుగు ఒకట్లను కలిపితే అని, రెండును రెండుతో హెచ్చవేస్తేఅని, కాదు కలిపితే అనీ చెప్పవచ్చు. ఏప్రిల్-జూన్ మూడు మాసాల జీడీపీని లెక్కలోకి తీసుకుంటే మన దేశానిది 823 బిలియన్ డాలర్లుండగా బ్రిటన్‌లో 763బి.డాలర్లని ఐఎంఎఫ్ ప్రకటించింది. అదే సంస్థ జనవరి-మార్చి మాసాల్లో మనది 864, బ్రిటన్‌లో 813 బి.డాలర్లు ఉన్నట్లు కూడా పేర్కొన్నది. అంటే గడచిన మూడు నెలల్లో మన జీడీపీ 41బి.డాలర్లు తగ్గింది. బ్రిటన్‌తో పోల్చుకొని సంతోష పడాలా మన తీరు తెన్నులను చూసి విచారపడాలా? ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.
ఇవన్నీ డాలరు లెక్కల్లో చెబుతున్న అంకెలు. ఈ కాలంలో మన కరెన్సీ, బ్రిటన్ పౌండ్ విలువ కూడా డాలరుతో పోలిస్తే తగ్గింది కనుక రెండు దేశాల జీడీపీ తగ్గినట్లు ఐఎంఎఫ్ పేర్కొన్నది. కనుక ఈ అంకెలను చూపి విరగబాటును ప్రదర్శించాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో మన కరెన్సీ విలువ మరింత తగ్గి, బ్రిటన్ పౌండ్ విలువ పెరిగినా లేక తారుమారైనా భౌతిక సంపదలతో నిమిత్తం లేకుండానే విలువలు మారతాయి. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2022 చివరినాటికి బ్రిటన్ జీడీపీ 3.38 లక్షల కోట్ల డాలర్లుగా, మనది 3.54లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. ఈ మాత్రానికే సంబరాలు చేసుకుంటే ఎలా! అదే ఐఎంఎఫ్, దాని కవల సోదరి ప్రపంచబాంక్ మన దేశం గురించి చెప్పిన ఇతర అంకెల గురించి ఇలాంటి సంబరాలు చేసుకున్నామా? ఐదో స్థానానికి చేరినందుకు సంతోషపడితే తలసరి జీడీపీలో మనం 159వ స్థానంలో ఉన్నామని, పక్కనే ఉన్న శ్రీలంక 148లో ఉందని ఎంత మందికి తెలుసు.
- సత్య