Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నేషనల్ హెల్త్ అకౌంట్స్ 2018-19'' నివేదిక ప్రకారం ప్రపంచంలోనే వైద్యం కోసం ఎక్కువగా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్న వారు భారతీయులే. 189 దేశాలను సర్వే చేయగా... 53.2శాతం భారతీయులు తమ సొంత డబ్బులు వైద్యం కోసం ఖర్చు చేస్తూ తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు అని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యం కోసం తమ బడ్జెట్లో కేవలం సగటున 3.1శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. నిజానికి ''నేషనల్ హెల్త్ పాలసీ 2017'' ప్రకారం భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో కనీసం 8శాతం నిధులు మంజూరు చేసి ఖర్చు చేయాలి. అయితే నేటికీ ఆ దిశగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలూ లక్ష్యం చేరలేదు. కేరళ తన బడ్జెట్లో 7.4శాతం వైద్యం కోసం ఖర్చు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నది. ఇక మన తెలుగు రాష్ట్రాలు అయితే, ఆంధ్రప్రదేశ్ 5.5శాతం నిధులు, తెలంగాణ 5.2శాతం నిధులు మాత్రమే ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తున్నాయి.
నార్డిక్ దేశాలు మానవ అభివృద్ధి సూచికల్లో ముందు వరుసలో ఉండటానికి ప్రధాన కారణం విద్య, వైద్యం కోసం తమ బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువగా చేస్తూ, ప్రజల జీవితాలు ఉన్నతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మనదేశంలో దీనికి విరుద్ధంగా ఉండుట వలన ప్రజల జీవితాలు దుర్భరం అవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ శాతం విద్య వైద్యం కోసం చేయుటయే. కోవిడ్ కాలంలో మనదేశంలో ప్రభుత్వ వైద్య రంగం ఏవిధంగా ఉందో మన అందరికీ తెలిసివచ్చింది. ''మేడిపండు చూడ మేలిమై ఉండు'' అనే చందంగా తయారయింది. ఎందరో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు తమ తమ ఆస్తులను అమ్ముకొని లక్షల రూపాయలు ఖర్చు చేసారు. అప్పుల ఊబిలో కూరుకు పోయి జీవితాలు దుర్భరం చేసుకున్నారు. నేటికీ చాలా కుటుంబాల్లో అస్తవ్యస్త మైన పరిస్థితి నెలకొన్నది. దీనికి అంతటికీ కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో వైద్య రంగాలకు తగినన్ని నిధులు కేటాయించక పోవడమే. ఇకనైనా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలి. నేటికీ మన దేశంలో 17 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రతి వ్యక్తిపై వైద్యంపై ఖర్చు పెడుతున్న సగటు వ్యయం కేవలం రూ.2000 మాత్రమే. తొమ్మిది రాష్ట్రాల్లో 50శాతం మించి తమ ఆదాయాన్ని ప్రజలు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు అని నివేదిక పేర్కొంది. వైద్య ద్రవ్యోల్బణం పడగవిప్పి నాట్యం చేస్తున్నది. ఈ కరోనా కాలంలో ప్రయివేటు కంపెనీలు, కొంతమంది డాక్టర్లు ప్రజల జీవితాలతో ఏవిధంగా చెలగాటం ఆడినారో మనం కళ్ళారా చూసాం. కేవలం ''డోలో-650'' మాత్రల ద్వారానే కంపెనీలు, డాక్టర్లు ఏవిధంగా కోట్ల రూపాయలు గడించారో తాజాగా తెలియవచ్చింది. ఇప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి రావడానికి మాత్రమే ఆయుస్మాన్ భవ, కేసీఆర్ కిట్, ఆరోగ్య శ్రీ వంటి వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. వీటి వలన కొంతమంది లబ్ధి పొందుతున్న మాట వాస్తవమే. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్త వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయటం, వైద్యులను నియమించటం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం, నర్సులు, డాక్టర్లు, ఆసుపత్రుల సంఖ్య పెంచటం, అవసరానికి తగినట్టుగా బెడ్స్ సంఖ్య పెంచటం చేపట్టాలి. ఆధునిక పరిక్షా పరికరాలు, లేబరేటర్లు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య సీట్ల సంఖ్య పెంచడం, మారుమూల గ్రామాల్లోని ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మన దేశంలో సామాన్య మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నది అనేది ప్రధానంగా విశ్లేషణ చేసుకుంటూ ప్రభుత్వాలు ముందుకు సాగాలి. ఇంకా, నేటికీ మన దేశ ప్రజల వైద్య అవసరాలు తీర్చడానికి ఐదు లక్షల డాక్టర్లు అవసరం అనే అంశం మరువరాదు. అప్పుడు మాత్రమే మానవ అభివృద్ధి సూచికల్లో మనదేశం ముందు వరుసలో ఉంటుందని గ్రహించాలి.
- ఐ. ప్రసాదరావు
సెల్:6305682733