Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మినరల్ వాటర్ పేరిట సమాజంలో పెద్ద మొత్తంలో దోపిడీ వ్యాపారం జరుగుచున్నది. ఆర్.ఓ. పద్ధతిలో శుద్ధి చేసే నీటిలో మినరల్స్ ఎందుకు తొలగించబడతాయి, ఎంత మేర తొలగించబడతాయి, అసలు మినరల్స్లేని ఈ మినరల్ వాటర్ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలి.
నాలుగింట మూడు వంతుల భూమి నీటితో ఆవరించిపడి ఉంది. అందుకనే భూమి నీలిరంగులో కనబడుతుంది. కానీ ఈ నీరు 97శాతం సముద్రాలలో, 2శాతం ధ్రువాల వద్ద, కేవలం 1 శాతం నీరు మాత్రమే మానవుని వినియోగానికి అందుబాటులో ఉన్నది. మానవునికి తాగడానికి రోజూ కనీసం మూడు లీటర్ల నీరు అవసరం ఉంటుంది. నాణ్యతలేని నీటిని తాగడం ద్వారా టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు సంక్రమించి ప్రాణహాని కలగవచ్చు. కాబట్టి నాణ్యత గల నీరు తాగటం ఎంతో అవసరం. నీటి ద్వారా మన శరీరానికి అవసరమైన మినరల్స్ లభిస్తాయి. తగిన మోతాదులో మినరల్స్ శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఉదాహరణకు నీటిలో 1 పి.పి.యం. ఫ్లోరిన్ ఉండటం వలన దంత క్షయం నివారించబడుతుంది. అధిక మొత్తంలో ఫ్లోరిన్ నీటిలో ఉండడం వలన ఫ్లోరోసిస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. అధిక మోతాదులో లేదా తక్కువ మోతాదులో మినరల్స్ కలిగి ఉన్న నీటిని తాగడం ఆరోగ్యానికి హానికరం.
అధిక మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఇతర లవణాలు నీటిలో కరిగి ఉండడం వలన నీరు కఠిన జలంగా మారి తాగడానికి ఉపయోగపడదు. కఠిన జలాన్ని తాగునీరుగా మార్చటానికి తిరోగమన ద్రవాభిసరణం (ఆర్.ఓ) అనే పద్ధతిని ప్రస్తుతం మార్కెట్లో విరివిగా వాడుతున్నారు. ఆర్.ఓ పద్ధతి ద్వారా శుద్ధి చేసిన నీరు ఒక లీటరు, రెండు లీటర్లు, ఇరవై లీటర్ల క్యాన్‌లో మినరల్ వాటర్ పేరిట విరివిగా మార్కెట్లో లభ్యం అవుతుంది. ఆర్.ఓ పద్ధతి నీటిలో ఉన్న మినరల్స్‌ని తొలగిస్తుంది కాబట్టి ఆర్.ఓ పద్ధతిలో శుద్ధి చేసిన నీటిలో మినరల్స్ ఉండవలసిన దానికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉండి అనారోగ్యం సమస్యలు తలెత్తుతున్నాయి.
ద్రవాభిసరణం ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. ఈ పద్ధతి ద్వారా మొక్కలు భూమి నుండి నీటిని సంగ్రహిస్తాయి. ఈ పద్ధతిలో నీరు అల్పగాఢత గల ద్రావణం నుండి అధిక గాఢత గల ద్రావణం వైపునకు ఒక పలుచని పొర ద్వారా ప్రయాణిస్తుంది. మొక్కలో గల నీరు అధిక గాఢతను కలిగి ఉంటుంది. మొక్కను ఆవరించి ఉన్న మట్టిలోని నీటి ద్రావణం గాఢత మొక్కలోని నీటి ద్రావణం గాఢత కన్న తక్కువగా ఉండడం వల్ల నీరు మట్టి నుండి మొక్కలోనికి ప్రయాణిస్తుంది. ఈ పద్ధతిలో మినరల్స్ కోల్పోవడం జరగదు.
తిరోగమన ద్రవాభిసరణం (ఆర్.ఓ) పద్ధతిలో నీరు అధిక గాఢత గల ద్రావణం నుండి అల్ప గాఢత గల ద్రావణంలోకి ఒక పలుచని పొర ద్వారా ప్రయాణిస్తుంది. కఠినజలంలో అధికంగా లవణాలు కరిగి ఉండటం వలన కఠిన జలం అధిక గాఢతను కలిగి ఉంటుంది. మృదు జలం అంటే తాగే నీటిలో లవణాలు తగిన మోతాదులో కరిగి ఉండటం వలన మృదుజలం అల్ప గాఢతను కలిగి ఉంటుంది. బోర్ బావిలో లభించే నీరు సహజంగా కఠినజలంగా ఉంటుంది. ఆర్.ఓ పద్ధతిలో కఠిన జలం, మృదు జలం ఒక పలచని పొర ద్వారా వేరు చేయబడి ఉంటాయి. కఠిన జలం వైపున మోటారు సాయంతో అధిక ఒత్తిడి కలుగజేసినప్పుడు నీరు పలుచని పొర ద్వారా మృదు జలం వైపునకు ప్రయాణించి తాగునీరుగా మారుతుంది. నీరు పలుచని పొర ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ఈ పలుచని పొర నీటిలో గల ముఖ్యమైన మినరల్స్‌ను తొలగిస్తుంది. నీటిలో లభ్యమయ్యే మినరల్స్ పరిమాణంను టి.డి.ఎస్ మీటర్ (టోటల్ డిసాల్వ్ సాలిడ్స్) ద్వారా తెలుసుకొనవచ్చు. నీటి టి.డి.ఎస్ విలువ ఎక్కువ ఉన్నట్లయితే ఆ నీటిలో మినరల్స్ పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు, టి.డి.ఎస్ విలువ తక్కువగా ఉన్నట్లయితే ఆ నీటిలో మినరల్స్ పరిమాణం తక్కువగా ఉన్నట్లు భావించవలెను. టి.డి.ఎస్ మీటర్ మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుండి లభ్యమవుతుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.ఎస్) ప్రకారం తాగునీటి టి.డి.ఎస్ విలువలు:
80-300 పి.పి.ఎం. పూర్తిగా సరి అయిన టి.డి.ఎస్ విలువ.
300-500 పి.పి.యం. కూడా ఆమోదకరమైన టి.డి.ఎస్ విలువ.
80 పి.పి.యం కన్న తక్కువ లేక 500 పి.పి.యం కన్నా ఎక్కువ టి.డి.ఎస్ విలువ కలిగిన నీరు తాగడానికి పనికిరాదు.
పి.పి.యం అనగా పార్ట్స్ ఫర్ మిలియన్. ఒక పి.పి.యం ఒక మిల్లిగ్రామ్/లీటరుకు సమానం.
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం ఇంటి ఇంటికి పంపిణీ చేసే నల్లా నీటి టి.డి.ఎస్ విలువ:
ఆర్.ఓ పద్ధతిలో నీటిని శుద్ధి చేయకముందు 250 పి.పి.ఎం. ఈ నీటిని ఆర్.ఓ పద్ధతిలో శుద్ధి చేసిన తర్వాత టి.డి.ఎస్ విలువ 30 పి.పి.ఎం. కు పడిపోయినది.
బోరు బావి నుండి సేకరించిన నీటి టి.డి.ఎస్ విలువ ఆర్.ఓ పద్ధతిలో శుద్ధి చేయకముందు 600 పి.పి.ఎం. ఈ నీటిని ఆర్. ఓ పద్ధతిలో శుద్ధి చేసిన తర్వాత టి.డి.ఎస్ విలువ 40 పి.పి.ఎం కు పడిపోయినది.
20 లీటర్ల క్యాన్లలో ఇంటింటికి పంపిణీ చేసే మినరల్ వాటర్ టి.డి.ఎస్ 20 పి.పి.యం.
మార్కెట్లో లభించే వివిధ కంపెనీల మినరల్ వాటర్ టి.డి.ఎస్ విలువలు. బిస్లేరి 50 పి.పి.ఎం, ఆక్వాఫినా 10 పి. పి.యం, కిన్లే 21 పి.పి.యం. ఆర్.ఓ పద్ధతి ద్వారా శుద్ధి చేసిన నీటిలో మినరల్స్ పరిమాణం తగ్గే కొలది నీరు తీపిగా మారి తాగటానికి రుచిగా ఉంటుంది.
ఆర్.ఓ పద్ధతిలో శుద్ధిచేసిన నీటిని తాగటం వలన కలిగే నష్టాలు:
ఆర్.ఓ పద్ధతి మానవునికి అతి ముఖ్యమైన క్యాల్షియం, మెగ్నీషియం సోడియం, పొటాషియం వంటి మినరల్స్లను నీటి నుండి తొలగిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్.ఓ నీరు శరీరంలో విటమిన్ డి కొరతకు కారణం అవుతుంది. సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో విటమిన్ డి అనేది తయారు అవుతుంది. కానీ ఆర్.ఓ నీటిలో మినరల్స్ కొరత ఉండటం వలన విటమిన్ డి ను శరీరం తయారు చేసుకొనలేక పోతుంది. 80శాతం భారతదేశ అర్బన్ జనాభాలో విటమిన్ డి లోపం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఆర్.ఓ నీటిని తాగడం వలన శరీరంలోని ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మూత్రం ద్వారా విసర్జింపబడి శరీరంలో విటమిన్లు, మినరల్స్ కొరత ఏర్పడుతుంది.
ఆర్.ఓ నీటి శుద్ధికరణ ప్రక్రియలో 75శాతం నీరు వృధా అవుతుంది కేవలం 25శాతం నీరు మాత్రమే తాగునీరుగా మార్చబడుతుంది. ఓడలలో ప్రయాణించేవారు సముద్రపు నీటిని తాగునీరుగా మార్చు కోవటం కోసం ఆర్.ఓ నీటి శుద్ధికరణ పద్ధతి కనుక్కోవడం జరిగింది. వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మనం ప్రతిరోజు తాగే నీటిని ఆర్.ఓ పద్ధతిలో శుద్ధి చేయడం, ఆ నీటిని తాగటం సరి అయినది కాదు.
పూర్వకాలంలో బావులలోని, చెరువుల లోని నీటిని ఎటువంటి శుద్ధి చేయకుండా తాగేవారు. అప్పుడు నీటితోపాటు అవసరం అయిన మినరల్స్ శరీరంలోనికి ప్రవేశించి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు. మనకు నాణ్యత గల తాగనీరు లభించాలంటే మొట్టమొదట చేయాల్సిన పని జల వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవటం. అప్పుడు నీటి సహజత్వాన్ని దెబ్బతీసి నిర్వీర్యంగా మార్చే నీటి శుద్ధీకరణ పద్ధతుల అవసరం ఉండదు. రెండవది ఆర్.ఓ నీటి శుద్ధికరణ పద్ధతిలో తొలగించబడిన మినరల్స్‌ను తిరిగి అదే నీటికి కలిపే పరిజ్ఞానం (టి.డి.ఎస్ కంట్రోలర్) ఇప్పుడు అందుబాటులో ఉన్నది. అటువంటి పరిజ్ఞానంతో శుద్ధి చేసిన ఆర్.ఓ నీటిని తాగటం వలన మినరల్స్ కొరత ఏర్పడదు.
- డాక్టర్ శ్రీధరాల రాము