Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపై భారం తగ్గించుకోవాలి
ప్రపంచ హృదయ దినోత్సవం 2022క థీమ్ 'ప్రతి హృదయానికి హృదయాన్ని ఉపయోగించండి.' కార్డియోవాస్కులర్ డిసీజ్ (సీవీడీ) గురించి అవగాహన కల్పించేందుకు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఒత్తిడి... పాము కాటు కంటే ప్రమాదం... ప్రస్తుతం సమస్త రోగాలకు ఇదే కారణం.. మూడేండ్ల వయసున్న చిన్నారుల దగ్గర నుంచి నూరేండ్ల వృద్ధుల వరకు అందరూ అన్ని వయసుల వారు ఒత్తిడి బారీన పడుతూనే ఉన్నారు. అసలు ఒత్తిడి అనేది ఎక్కడ మొదలవు తుందంటే..? నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒత్తిడి మనిషిని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. పొద్దున్నే నిద్రలో ఉండగానే అమ్మో..! నిన్నటి వర్క్ అంతా పెండింగ్ ఉంది. ఇవాళైనా ఆ వర్క్ పూర్తి చేయకపోతే బాస్ ఏమంటాడో..? తొందరగా వర్క్ కంప్లీట్ చేయాలి..? పిల్లలకు స్కూల్లో ఫీజు కట్టాలి..కారుకి ఈఎమ్ఐ పే చేయాలి... వచ్చేనెలలో ఊరికెళ్ళాలి..? మనస్సులో ప్రతిక్షణం మెదిలేవి... ఇలాంటివే..! ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే... ఇలాంటి సమయాల్లోనే గుండె వేగంగా కొట్టుకోవటం, మూడ్ మారిపోవటం వంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ ఒత్తిడి, ఆందోళన లక్షణాలు.. ఇవి రక్తపోటును విపరీతంగా పెంచేస్తాయి.
కొత్త విషయాలపై దృష్టి పెట్టండి..
గుండె జబ్బులతో బాధపడే యువకులు, స్టెంట్స్ వేయించుకోవడం, లేదా బైపాస్ సర్జరీలు చేయించుకున్నప్పటికీ గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇతర వ్యక్తులపై కేకలు వేయడంవల్ల కోపం, చికాకు, ప్రతికూల భావాలు, భావోద్వేగాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని కార్డియాలజిస్టులు వెల్లడిస్తున్నారు. అయితే కోపాన్ని ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవడం ద్వారా కొంతమేర గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొంతమంది సంగీతం వింటూ ఉంటారు. ఇంకొంత మంది పాటలు పాడుతారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వీటన్నిటికంటే కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రయోగాలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం ఉంటుంది.
మెడిటేషన్‌తో మేలు...
తక్షణ ఒత్తిడి అయినా, దీర్ఘకాల ఒత్తిడి అయినా... రెండింటి నుంచీ బయటపడటానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఆందోళన సైతం తగ్గుతుంది. కాబట్టి రోజూ కాసేపు మనసును కుదురుగా నిలిపే మెడిటేషన్ చేయటం మంచిది. ప్రశాంతంగా, స్థిరంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస నిలిపినా చాలు. మనసు తేలికపడుతుంది. ఒత్తిడి, ఆందోళనల కారణంగా రక్తపోటు, గుండెజబ్బులూ తలెత్తు తున్నాయి. ఒత్తిడి రెండురకాలు.. అప్పటికప్పుడు ఒక్కసారిగా వచ్చే ఒత్తిడి ఒకటైతే. మరొకటి దీర్ఘకాల ఒత్తిడి. ఇవి రెండూ బ్లడ్ ప్రజర్ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. దీని కారణంగా గుండెకు ముప్పు కలుగుతుంది. ఏ వ్యాయామమైనా నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. అయితే కొంతమంది వారికి నచ్చిన సమయంలో వ్యాయామాలు చేస్తున్నారు. ఆ సమయంలో గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడి ధమనులలో ఆకస్మిక అడ్డంకి ఏర్పడుతుంది.
ఆరోగ్య కరమైన అలవాట్లు...
ధూమపానం మానేయండి
గుండె జబ్బులకు నియంత్రించలేని కారకాల్లో ధూమపానం ఒకటి. దీని వల్ల మీ ప్రక్క వారికి కూడా ప్రమాదమే. ఇది రక్తపోటును పెంచుతుంది. గుండెకు మాత్రమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం మానేయండి.
ఉప్పు, చక్కెరను తగ్గించండి
ఉప్పు, చక్కెర రెండూ రక్తపోటును పెంచడానికి ప్రధాన కారణాలలో ఒకటి. అధిక రక్తపోటు గుండె జబ్బులు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, మీరు తీసుకునే ప్యాక్ చేసిన ఆహారాల లేబుళ్లను ఎల్లప్పుడూ గమనించండి.
హాయిగా నవ్వండి
నవ్వడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి శారీరక మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. బిగ్గరగా నవ్వండి... ఆరోగ్యం ఉండండి.
పండ్లు, కూరగాయలు తినండి
విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో సహా పోషకాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడవచ్చు. కొన్ని పండ్లు, కూరగాయలలో కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని అనేక గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
వ్యాయామాలు చేయండి
వ్యాయామాలు చేయడం వల్ల చురుకుగా ఉండగలరు. 20 నిమిషాలు నడవండి లేదా కొన్ని వ్యాయామాలు చేయండి. ఆరోగ్యకరమైన గుండెకు ఇది చాలా ముఖ్యం. ఎక్కువ చురుగ్గాలేని వారికే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్రలేమి
నిద్ర సరిగా ఉంటే శరీరం, మనసు రిలాక్స్‌గా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మీరు సుదీర్ఘమైన,సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటే హాయిగా నిద్ర పొండి.
జంక్ ఫుడ్స్
జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల యువతలో గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. వాటిని మితంగా తీసుకోవాలి. గుండె శరీరానికి సర్క్యూట్ హౌస్. మానవ శరీరం అన్ని విధులు గుండెపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల, మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన హృదయాన్ని కలిగి ఉండటానికి ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించండి. అందరికీ ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు .
- డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్
సెల్ 9390044031