Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశంలో అనేకమతాలు, కులాలు, భాషలున్నాయి. అందుకే మనదేశాన్ని ఉపఖండం అనిపిలుస్తారు. తరతరాలుగా భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం ఆధారంగా జీవిస్తున్నాము. భారత రాజ్యాంగంలో కూడా మతప్రస్తావనలేదు. మనకంటూ అధికార మతం ఏదీ లేదు. మనది లౌకిక రాజ్యం కాబట్టే పొరుగు దేశాలతో పోలిస్తే మనదేశంలో మత సామరస్యం ఇంకా వెల్లివిరుస్తుంది. క్షేత్ర స్థాయిలో హిందూ-ముస్లింలు ఐక్యంగానే ఉంటారు. మొహరం, రొట్టెల పండుగ వంటి వాటిని అందరూ కలిసిజరుపుకుంటారు. దర్గాలకి హిందూ ముస్లింలు వెళతారు. గుణదల (విజయవాడ) వంటి ప్రాంతాల్లో మేరీ మాత ఉత్సవాల్లో హిందువులు, క్రిస్టియన్లు అందరూ పాల్గొంటారు. దేశ ప్రజల్లో భాషా సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ, మనమంతా భారతీయులమనే భావ సమైక్యత ఉంది. సంగీతం, నాట్యం, చిత్ర లేఖనం వంటి కళలు భారతీయులని ఏక తాటిపై నడిపించాయి. చరిత్రలో అక్బర్, శివాజీ వంటి రాజులు పరమత సహనాన్ని పాటించారు. మన దేశంలో దేవాలయాలు, మసీదుల నిర్మాణాలలో కూడా సారూప్యత కన్పిస్తుంది. సూఫీ మతం హిందూ ముస్లింల ఐక్యతని చాటుతుంది. భారతదేశం అనే పూల దండలో వివిధ మతాలు, భాషలు అనే వివిధ రకాల పూలు ఇమిడి ఉన్నాయి.
స్వాతంత్రం వచ్చి 75ఏండ్లు అయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర అమత మహౌత్సవాలు ఘనంగాజరిగాయి. మనమంతా భారతీయులమనే బలమైన భావనతోనే ఇన్నాళ్లు కలసి మెలసి ఉన్నాం. స్వాతంత్య్ర పోరాటం ద్వారా ప్రజల్లో జాతీయభావం పెరిగింది. ఇందులో ప్రజలు కులమతాలతీకంగా పాల్గొన్నారు. వందేమాతరం వంటి ఎన్నో దేశ భక్తి గీతాలు ఆనాటి పౌరులలో చైతన్యం నింపాయి. ఆ ప్రభావం స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్ద కాలంలో కూడా బాగా ఉంది. నాటి నేతలు కూడా స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. ఇందులో భాగంగానే మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతం అయింది. దేశ వ్యాప్తంగా ఆయా నదులపై భారీ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఐ.ఐ.టి, ఐ.ఐ.యం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలని ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. భారత రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాల వారికి కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. దేశంలో అక్షరాస్యత పెరిగింది. ఎల్.ఐ.సి వంటి అనేక సంస్థలు ప్రభుత్వ రంగంలో విజయవంతంగా నడిచాయి.
అయితే 1962 నాటికి దేశంలో ఆర్థిక, సాంఘిక పరిస్థితులు క్రమేణా క్షీణించసాగాయి. 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో భారత దేశం యుద్ధం చేయాల్సి వచ్చింది. దీని వల్ల మూడవ పంచ వర్ష ప్రణాళిక అంచనాలు అందుకోలేక విఫలమైంది. ఇక 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ. రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి నిర్ణయాలు దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడ్డాయి. 1985లో దేశంలో కంప్యూటర్ విప్లవం, 1990నాటికి టెలికమ్యూనికేషన్ విప్లవం వచ్చాయి. 1990లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు భారతదేశంపై కూడా పెను ప్రభావం చూపాయి. ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఎగుమతులు, దిగుమతులు పెరిగాయి. అదే సమయంలో ప్రయివేటురంగం ఊపందుకుంది. సహజ వనరులన్నీ క్రమేణా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా పెరిగినప్పటికీ, ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ మొదలయింది. ఇప్పుడిది మరింత వేగవంతం అయ్యింది.
ఇంకోవైపు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భిన్నత్వంలో ఏకత్వం అనే భావన క్రమంగా బలహీన పడుతున్నది. ఒకప్పుడు పొరుగుదేశమైన బంగ్లాదేశ్ మన దేశంతో సన్నిహితంగా ఉండేది. భారతదేశ కృషి ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మనదేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. దేశంలో అసహన ధోరణులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారిపై దాడులు పెరుగుతున్నాయి. ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగింది. చట్ట సభల్లో నేరస్తుల సంఖ్య పెరిగింది. విద్యా, వైద్య రంగాలు వేగంగా కార్పొటీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. మతం ఒకరాజకీయ అంశంగా మారింది. చారిత్రక కట్టడాలని కూడా వివాదాస్పదం చేస్తున్నారు.
భిన్నత్వలో ఏకత్వం అనే సూత్రం మరింత బలపడాలంటే పాలకులు కొన్నిచర్యలు చేపట్టాలి. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలి. ప్రభుత్వం స్వయంగా మత సామరస్య సదస్సులు నిర్వహించాలి. కానీ ఎవరు ఏమి తినాలో కూడా కొందరు నిర్ణయిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత జీవితంలోకి పాలకులు ఎక్కువగా తొంగి చూడటం అంత మంచిది కాదు. దేశంలో ప్రజలు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలంటే ప్రభుత్వాల ఆలోచనలు మారాలి. విద్యార్థులకు సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా కనీసం డిగ్రీ వరకు ఉండాలి. భారత రాజ్యాంగ ప్రతులను ఛత్తీస్‌ఘడ్ తరహాలో విద్యార్థులకు ఉచితంగా అందించాలి. పాఠాలలో కూడా రాజ్యాంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మతం వ్యక్తిగత అంశం అని రాజ్యాంగం చెపుతుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలుసార్లు స్పష్టం చేసింది. మత విషయాలలో పాలకులు అతిగా జోక్యం చేసుకోవడం, మతాలని ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేయడం తదితర కారణాల వల్ల మతం ఒక సున్నితమైన విషయంగా మారింది. ఇందుకు తోడు దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు కూడా ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాయి. కరోనా పరిస్థితులు కూడా పేదరికాన్ని పెంచాయి. దేశంలో ఉన్న 90శాతం సంపద అంతా ధనికులచేతిలోనే ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగాయి. కరోనా కాలంలో వివిధ మతస్థులు పరస్పరం సహకరించుకున్నారు. హిందువుల మృతదేహాలకు ముస్లింలు అంత్యక్రియలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంబేద్కర్, జవహర్ లాల్‌నెహ్రూ వంటి నాటి దార్శనికులు దేశానికి దిశానిర్దేశం చేశారు. గురజాడ అన్నట్లు దేశమంటే మట్టికాదు - మనుషులు. పాలకులు వట్టి మాటలు కట్టి పెట్టి, ప్రజల మేలుకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఆకలిదప్పుల నుంచి పేదవారికి విముక్తి కల్పిస్తే అందరినోటా ఐక్యతా రాగం వినిపిస్తుంది. ఈ దిశగా పాలకులు ఆలోచించాలి.
- ఎం. రాం ప్రదీప్
సెల్: 9492712836