Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిమాలయ పర్వతాల దగ్గిర ఉన్న ఒక మంచు కొండల ప్రాంతాన్ని 'సియాచిన్' అంటారు. ఆ మంచు కొండల నుంచీ మంచు కరిగి అది ఒక పెద్ద నదిలా కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది కొన్ని చిన్న నదులుగా చీలుతుంది. సియాచిన్ భారత దేశానికీ-పాకిస్థాన్ దేశానికీ మధ్య ఉన్న ఒక నిర్జన సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతం, కాశ్మీరు రాజధాని అయిన శ్రీనగర్‌కి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సియాచిన్ ప్రాంతం పొడవు 48మైళ్ళు. మొత్తం వైశాల్యం 270చదరపు మైళ్ళు. అక్కడ ఒక వేపు భారత సైనికులూ, ఇంకో వేపు పాకిస్థాన్ సైనికులూ, సరిహద్దుల్ని కాపలా కాస్తూ ఉంటారు.
అక్కడ పంటపొలాలో, అడవులో, గనులో, ఫ్యాక్టరీలో ఇంకేవైనా ఉన్నాయా- అంటే అక్కడ అవేమీ లేవు. అదంతా సముద్ర మట్టానికి 16వేల అడుగుల ఎత్తున ఉండే మంచు కొండల ప్రాంతం. ఈ మంచు కొండల సరిహద్దుల దగ్గిర కాపలాలు కాసే సైనికులు, శారీరకంగా ధృఢంగా ఉంటే సరిపోదనీ, మానసికంగా కూడా చాలా గుండెదిటవుతో ఉంటేనే అక్కడ కొంత కాలం అన్నా నిలబడగలుగుతారనీ, మిలిటరీ విషయాలు తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు. ఆ సైనికులు, మొత్తం వొళ్ళంతా కప్పివేసే తొడుగులతో ఉండాల్సిందే. తొడుగు లేకుండా, సైనికులు తుపాకీ ట్రిగర్ని పట్టుకుంటే చాలు ఆ వేలుని మంచు తినేస్తుందట! ఎంత ట్రయినింగు అయ్యి వచ్చినా, కొత్త సైనికుడు ఎవరైనా పొరపాటున చేతులకీ, కాళ్ళకీ గట్టి తొడుగులు లేకపోతే, వేళ్ళని తీసెయాల్సివస్తుందట! ఒక్కోసారి వేళ్ళు ఆ ఘోరమైన చలికి, వేళ్ళంతట వేళ్ళే, అవే ఊడి కిందపడతాయట!
అక్కడ చలి ఎంత ఉండొచ్చో ఊహించండి! 'మైనస్ 60డిగ్రీలు' ఉంటుందట. (రాజస్థాన్ దాటాక భారతదేశానికీ, పాకిస్థాన్‌కీ ఉన్న సరిహద్దులో కాపలా కాసే సైనికులు ఎండాకాలం బొబ్బలెక్కేలాంటి 50డిగ్రీల వేడిలో గస్తీ తిరగాలి!)
16వేల అడుగుల ఎత్తున్న సియాచిన్‌లో ఎక్కువ కాలం పనిచేసే సైనికులకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తేలింది. ప్రాణవాయువు (ఆక్సిజన్) అందక, ఊపిరి సలపదు. శరీరంలో కనీసంగా ఉండాల్సిన వేడి ఉండదు. వేడి ఉండకపోవడంవల్ల, వొణుకూ ఊపిరి అతి కష్టంగా పీల్చుకోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, తొందరగా అలిసిపోవడం, రోజంతా మత్తుగా ఉండడం, అతి బలహీనమైన కంఠస్వరంతో మాట్లాడడం వంటి జబ్బులు అక్కడున్న సైనికులకు మొదలవుతాయి.
శతృ సైనికులు చొచ్చుకు రాకుండా, ఎప్పటికప్పుడు రెండు దేశాల సైనికులూ సరిహద్దు పొడవునా గస్తీ తిరగవలిసిందే. (రెండు దేశాల సైనికులూ కలిపి 5వేలమంది దాకా ఉండవచ్చని ఒక అంచనా). 128కిలో మీటర్ల దూరం గస్తీ తిరగాలంటే కొన్ని సార్లు దాదాపు 28రోజులు పడుతుందట!
ఆ గడ్డకట్టే చలి వాతావరణంలో చాలా సార్లు ఆరుగురు సైనికులు కలిసి ఫైబరు గ్లాసుతో చేసిన ఒక గుడారంలో ఇరుక్కుని ఉండాలి. ఆ గుడారం 6అడుగుల పొడవూ, 6అడుగుల వెడల్పూ ఉంటుం దట! దాంటోనే వెచ్చదనం కోసం కిరసనాయిలు స్టవ్వులు పెట్టుకుని ఉంటారు.
అప్పుడప్పుడూ మంచు తుఫానులు గంటకి 100కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి. ఆ తుఫానులు ఒక్కొక్క సారి 3 వారాల దాకా వీస్తూనే కురుస్తూనే ఉంటాయి! అలా తుఫానులు వచ్చినప్పుడు ఆ ప్రాంతం దాదాపు 40అడుగుల ఎత్తున మంచుతో కప్పడిపోతూ ఉంటుంది! అలాంటి సమయాల్లో సైనికులు గుడారం నించీ బైటికి వచ్చి చలిలో పొడవాటి పారలతో ఎప్పటికప్పుడు గుడారం మీద పడుతున్నమంచుని పడుతున్నట్టే తీసి పక్కకి తీసెయ్యాలి. లేకపోతే రెండు మంచు గడ్డలకే వాళ్ళ గుడారాలు కూలవలిసిందే. కూలితే కొత్త గుడారాల నిర్మాణాలూ మంచు గడ్డలతో పోరాటాలూ!
తరచుగా పైనించి మంచు పెద్ద పెద్ద గడ్డలుగా వేగంగా ప్రవహించే నీరుగా పడిపోతూ ఉంటుంది ఒక పెద్ద తుఫాను లాగా. అలాంటప్పుడు సైనికులు ఆ మంచుకింద కప్పడిపోయి, వాళ్ళ మృతదేహాలు కూడా మాయం! దొరకవు. ఉదాహరణకి 38ఏళ్ళ కిందట అలాంటి మంచుతుఫానులో చిక్కుకు పోయిన 18మంది సైనికుల్లో చంద్రశేఖర్ హర్బోల్ అనే ఒక్క సైనికుడి శరీర భాగాలు మొన్న 2022 ఆగస్టు15న దొరికాయట! ఈ వార్తని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' పత్రిక ఆగస్టు 17న ప్రచురించింది. ఒక శరీరం దొరికి మిగతా 17మంది శరీరాల ఆచూకీ తెలియలేదు. ఇలా తరచుగా సైనికులు చచ్చిపోయిన వార్తలు వస్తూనే ఉంటాయి. అక్కడ తాజాగా వండిన తిండికి అవకాశమే లేదు. అనేక రోజుల పాటు అక్కడ తాజా తిండి లేకుండా సైనికులు ఎలా ఉంటారో ఊహకి అందని విషయం. యాపిల్ లాంటి పండుని కొన్ని క్షణాలు బైట పెడితే అది ఒక రాయిలాగా తయారవుతుందట!
సైనికుల్ని సియాచిన్ ప్రాంతంలో డ్యూటీకి పంపే ముందు వాళ్ళకి చాలా కాలం ట్రయినింగ్ ఇస్తారు. అక్కడి సైనిక కార్యాలయం బైట ఇలా రాసి ఉంటుందట... ''కష్టతరమైన దానిని చేయడం మా దినచర్య. అసాధ్యమైనదానిని సాధ్యం చేయడానికి కొంచెం ఎక్కువ కాలమే పడుతుంది'' - సైనికులకు చావమని బోధ ఇది! సియాచిన్ ప్రాంతంలో ఉన్న సైనికులకు, ఆహార పదార్థాలూ, అవసరమైన అన్ని వస్తువులూ ఎలా అందుతాయి? అన్ని వేల అడుగుల ఎత్తున ఎగిరే సైనిక హెలికాప్టర్ల లోనించీ వాటిని కిందకి పడేస్తారు. అక్కడ ఒక్క నిమిషంలోనే వస్తువులు జారవిడిచే పని జరగాలట! ఎందుకంటే అక్కడికి కొన్ని వందల మీటర్ల దూరంలోనే శతృదేశం వారి సైనిక శిబిరాలు ఉంటాయి. సైనికులు వాడిపారేసిన వస్తువులతో ఆ ప్రాంతం అంతా కాలుష్యం అయిపోతూ ఉందని విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. కేవలం ఈ ఒక్క సియాచిన్ ప్రాంతంలోని సైనికులపోషణ కోసం భారత దేశానికి రోజుకి 5 కోట్ల డబ్బు ఖర్చవుతుందని ఒక లెక్క. రెండేళ్ళనాటి ఒక వార్త ప్రకారం భారత దేశం అప్పటికి సియాచిన్ సరిహద్దు గస్తీ కోసం 7వేల 5వందల కోట్లు ఖర్చు చేసింది. పాకిస్థాన్ లెక్కలు మనకి తెలియవు. భారత సైనికులు ఆ గస్తీ పనిలో ఆ మంచు తుఫానుల వాతావరణానికి దాదాపు 9వందల మంది చనిపోగా, పాకిస్థాన్ సైనికులు 2 వేల దాకా చనిపోయారని భారత సైన్యం చెప్పిన లెక్క. దేశాల మధ్య శతృత్వాలున్నప్పుడు ఒక దేశం లెక్కలు ఇతర దేశాల గురించి ఇలాగే ఉంటాయి!
ఇంత దుర్భరమైన వాతావరణంలో పనిచేసే సైనికుల్ని మభ్యపెట్టడానికి 'మీరు మీ స్వార్థం కోసం ఇంత కష్టపడడం లేదు. నిస్వార్థంగా దేశం కోసం, దేశ ప్రజల భద్రత కోసం త్యాగం చేస్తున్నారు' అని ప్రకటనలు గుప్పిస్తుంది ప్రతీ ప్రభుత్వమూ. ప్రధాన మంత్రులు అక్కడికి విహార యాత్రలాగా వెళ్ళి సైనికుల్ని పొగడ్తలతో ముంచెత్తి వారితో మిఠాయిలు తినిపించి వస్తారు. 2005లో మన్మోహన్ సింగ్, 2014లో మోడీ వెళ్ళివచ్చారు. ప్రధాన మంత్రులు సైనికులు గస్తీ తిరిగే ఆ ఎత్తైన ప్రదేశానికి కాక సియాచిన్ పర్వత పాదం ('బేస్') దగ్గిరికి మాత్రమే వెళ్తారు. (ఇంకా ఉంది)
- రంగనాయకమ్మ