Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచం మరో మహా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని, కొమ్ములు తిరిగిన కార్పొరేట్ సంస్థలు, మహా మహా బ్యాంకులు, బలహీనంగా ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని అంతరించిపోయే కాలం దాపురించిందని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆర్థికవేత్త నోరియల్ రొబినీ హెచ్చరించారు. ఇతను మామూలు వ్యక్తి కాదు. ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన 2008 అమెరికా ఆర్థిక మాంద్యాన్ని ముందుగానే అంచనావేసి హెచ్చరించిన దార్శనికుడు. ఈ ఏడాది చివరలో అమెరికాలో మరో మహా ఆర్థిక మాంద్యం ప్రారంభం కాబోతున్నదని తాజాగా మరో హెచ్చరిక చేశారు. ఈ మాంద్యం సామాన్యమైనది కాదని అత్యంత దారుణంగా, దీర్ఘకాలంపాటు ఉండబోతున్నదని వాదిస్తున్నాడు .
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరమైన ఆర్థిక మాంద్యం ముప్పు అంచుల్లో చిక్కుకుందని వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లతో ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ సంయుక్త సమావేశం సందర్భంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ కూడా హెచ్చరించారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో 2023లో ప్రపంచ వృద్ధి రేటు మూడుశాతం నుంచి 1.9శాతానికి తగ్గించారు. ప్రపంచలోని అన్ని దేశాలు అప్పులు అనే ఇంధనంతోనే నడుస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు పరిమితికి మించి చేస్తున్న అప్పులు సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి.
విభిన్నమైన ద్రవ్య విధానాలు
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య విధానాలు విభిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు కమొడిటీ ఉత్పత్తిదారులుగా ఉండగా మరికొన్ని దేశాలు కమొడిటీ కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు ఆయా దేశాలు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా వర్థమాన దేశాల్లో అధిక సంఖ్యలో ఉన్న పేదలను కాపాడేందుకు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.
స్థూల ఆర్థిక విధాన సూత్రాలను అనుసరించి కరెన్సీలు బలహీన పడటంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వడ్డీ రేట్లు పెంచడం వల్ల రుణ భారం పెరుగుతుంది. కరెన్సీ మారకం విలువ పతనం కూడా రుణ భారం పెరుగుదలకు కారణం. నేడు అభివద్ధి చెందుతున్న దేశాలన్నీ తీవ్రంగా రుణ భారాన్ని ఎదుర్కొంటున్నాయి.
నోబెల్ అవార్డు గ్రహీతలు చూపిన పరిష్కారమార్గాలు
ఆర్థిక సంక్షోభాల నివారణకు ప్రభుత్వ విధానాల పనితీరు, ఆర్థిక మార్కెట్లపై సమర్థ నియంత్రణలు సరిగా లేకుంటే ఆర్థిక సంక్షోభాలు, మాంద్యం లాంటి తీవ్ర పరిణామాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని 2022 అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన నోబెల్ అవార్డు గ్రహీతలు బెన్ షాలోమ్ బెర్నాంకె, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్ డ్రైవ్లు పేర్కొన్నారు.
ఆర్థికరంగంలో విప్లవాత్మక విధానాల పరికల్పనలు చేసి అనేకానేక అపరిష్కృత సమస్యలకు పరిష్కారం అందించిన వ్యక్తులకు, సంస్థలకు అర్థశాస్త్రంలో ప్రతి ఏటా నోబెల్ బహుమతి ఇవ్వబడుతుంది. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభంపై తమ పరిశోధనల ద్వారా విశేషమైన కృషి జరిపినందుకు రాయల్ స్వీడిష్ సంస్థకు నోబెల్ బహుమతిని ప్రకటించడం ఆసక్తిగా ఉంది. ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభాల అంచులో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వీరి పరిశోధన ఫలాలు ఎంత మేరకు అనువర్తనీయంగా ఉంటాయని ఎదురు చూస్తున్నారు. ఆ పరిశోధనల ఫలాలను ప్రభుత్వాలు తెలుసుకొని దాని వల్ల దెబ్బతినే ప్రజలకు, ముఖ్యంగా పేదలకు మద్దతుగా చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ఈ సంక్షోభ సమయంలో పెట్టుబడిదారులు, ప్రజలు సాహసాలకు పోకుండా సంపదను డబ్బు రూపంలో దాచుకోవాలన్నా వారి ప్రతిపాదనలు విస్తృతంగా ప్రచారం చేయాలి.
ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ పరిగణనలోకి తీసుకోని పరిష్కరించాలి. ద్రవ్యోల్బణం సమస్యతో వడ్డీరేట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్నా దేశాలకు పెట్టుబడులు తగ్గుతాయన్నా నోబెల్ ప్రతిపాదనలను గుర్తించాలి. లేదంటే పేదల పరిస్థితులు తీవ్రంగా దెబ్బ తింటాయి. పేదలను ఆదుకోవడమే ప్రభూత్వాలకు, బ్యాంకుకు పెద్ద సవాల్ అని సూచించిన సూత్రాలను ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో అమలుచేయాలి. వారి పరిశోధనలో ఆర్థిక సంక్షోభం వల్ల ఎదుర్కోబోయే ఆందోళనలతో ప్రజలు తమ సొమ్మును బ్యాంకుల నుంచి మూకుమ్మడిగా వెనక్కి తీసుకోవడం వల్ల బ్యాంకులు కుప్ప కూలడంతో గతంలో ఆర్థిక సంక్షోభం ఉధృతమైందని వారు గుర్తించారు. కాబట్టి ప్రజలందరికీ ఆర్థిక నియంత్రణపై అవగాహన కల్పించాలి. కొన్ని దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచాయని, కొన్ని దేశాలు సబ్సిడీ ఇస్తే, మరికొన్ని మరో తరహా రాయితీలు కల్పిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో బ్యాంకులు కుప్పకూలకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించిన వారి పరిశోధన ఫలాలను ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేయాలి.
మహామాంద్యంపై లోతైన అవగాహన
దాదాపు శతాబ్దం నుండి జరుగుతున్న ఆర్థిక సంక్షోభంపై విస్తృతమైన అవగాహన కలిగిన బెర్నాంకె 1930 నాటి మహా మాంద్యంపై లోతైన, విశేషమైన పరిశోధనలు చేశారు. మాంద్య పరిస్థితిలో తలెత్తే ఆర్థిక పరిణామాలకు సరియన పరిష్కారాలను సాంకేతికంగా గణాంక పద్ధతులను ఉపయోగించి 1983లో ఒక లోతైన, విశ్లేషణాత్మక పరిశోధన పత్రం ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఆ పత్రం ప్రపంచ ఆర్థిక సంక్షోభాల నివారణకు దిక్సూచిగా ఉంది. ఆర్థిక సంక్షోభాల మీద విశేషమైన అనుభవం కలిగిన బెర్నాంకే 2006నుండి 2014 వరకు అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు చైర్మన్గా కూడా పనిచేశారు. ఈ క్రమంలో 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ముంచెత్తినప్పుడు అమెరికాను ఆ ఆర్థిక సంక్షోభానికి గురికాకుండా ఆచరణాత్మక పరిశోధనలు ఉపయోగపడ్డాయి. అమెరికా ఆ సంక్షోభం నుండి గట్టెక్కింది.
సరిగ్గా ఆలాంటి పరిస్థితే నేడు ఆసన్నమవుతున్నది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు అనుసరిస్తే ఈ విపత్తును నివారించగలమో ప్రభుత్వాలు పరిశీలించాలి. 2019లో నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ అందించిన పేదరిక విముక్తి సూత్రం ప్రపంచ ఆర్థిక మేధావుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వాలు ఆ సూత్రాలను అనుసరించకపోవడం వల్ల పేదరిక నిర్మూలనపై ప్రభావం చూపలేదు. కాబట్టి ప్రభుత్వాలు లక్షిత వర్గాలను గుర్తించడం, అందులోను ఎవరి అవసరాలేమిటో సక్రమంగా మదింపు చేయడం, పరిమిత వనరులను గరిష్ట ప్రయోజనకరంగా వినియోగించే సంకల్పం కలిగి ఉన్నప్పుడే ప్రయోజనం కలుగుతుంది.
- డాక్టర్ అక్కేనపల్లి పున్నయ్య
సెల్:9948017934