Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గత సంచిక తరువాయి)
ఉత్త మంచుకొండల మయమైన సియాచిన్ ప్రాంతం ఎందుకు కీలకం అయిందంటే పాకిస్థాన్ పెత్తనం కింద ఉన్న కాశ్మీరు ప్రాంతాన్ని చైనాతో కలిపే మార్గం అక్కడే ఉంది. భారత్, చైనా దేశాలు రెండూ ఇరుగు పొరుగున ఉన్న శతృదేశాలు గదా? చైనాకీ పాకిస్థాన్ కీ 'స్నేహ' సంబంధాలున్నాయి మరి. అందుకని, భారతదేశం, తన పెత్తనం కింద ఉన్న కాశ్మీరుకి 250కిలో మీటర్ల దూరం లోనే ఉన్న సియాచిన్ ప్రాంతం దగ్గిర తన సైనికుల్ని పెట్టింది.
పాకిస్థాన్‌కీ, భారత్‌కీ శతృ సంబంధా లున్నాయి. కాబట్టి రెండు దేశాలూ తమ సైనికుల్ని అక్కడ కాపలా పెట్టాయి. 1984 వరకూ ఆ ప్రాంతంలో ఏ దేశ సైన్యమూ అక్కడ కాపలా కాయలేదు. అంతకు ముందు 1978 తర్వాత పాకిస్థాన్ వేపు నుంచి, ఇతర దేశాల పర్వతాలు ఎక్కే బృందాలు సియాచిన్ ప్రాంతానికి రావడం జరిగేది. అది గమనించి భారత సైనికాధికారి ఒకరు పై అధికారుల్ని ఒప్పించి ఒక 70మందిని, సైనికుల్నీ మంచుపర్వతాల మీద సామాన్లు మోసే పోర్టర్లనీ వెంటేసుకుని అక్కడ కొన్ని రోజులు తిరిగి వెనక్కి వచ్చాడు. పాకిస్థాన్ కూడా తన సైనికుల్ని సియాచిన్ ప్రాంతానికి పంపే సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు భారత సైనికాధికారులకు తెలిసిందట! అదెలా తెలిసిందంటే... మంచు పర్వతాలున్న ప్రాంతంలో తిరగడానికి కావలిసిన భద్రతా సామగ్రి ('ఆర్కిటిక్ వెదర్ గేర్') కోసం పాకిస్థాన్, లండన్‌లో ఒక కంపెనీకి ఆర్డరు పెట్టింది. ఆ విషయం భారత సైన్యానికి తెలిసిపోయింది. అదెలా అంటే ఆ సామగ్రి సప్లై చేసే కంపెనీయే భారతదేశానికి కూడా సప్లై చేస్తుంది కాబట్టి. (రెండు శతృ దేశాలకూ ఒకే రకం సామగ్రి అమ్మే కంపెనీకి వ్యాపారం బాగా సాగాలంటే ఆ కంపెనీ ఒక దేశానికి అమ్మే సంగతుల్ని ఇంకో దేశానికి అందించి 'మీరు కూడా తొందరగా కొనండి వాళ్ళు కొంటున్నారు. ఆలసించిన ఆశాభంగం! బాబూ రండి, కొనండి' అని ఆకర్షించాలి మరి!). ఒకసారి పాకిస్థాన్ 150 సెట్లో ఏమో కొనబోతున్నదని తెలిసి భారత దేశం 300 సెట్లు కొనేసింది' అని ఒక పాకిస్థానీ సైనికాధికారి తర్వాత కాలంలో చెప్పాడు.
లండన్ కంపెనీ నించీ కొన్న సామగ్రితో పాకిస్థాను సైన్యం సియాచిన్ వచ్చేలోగానే, భారత ప్రభుత్వం అప్పటికే కొనిపెట్టుకున్న సామగ్రితో సియాచిన్ ప్రాంతానికి తన సైనికుల్ని పంపింది. అలా వేగంగా వేసిన సైనిక ఎత్తుగడకి 'ఆపరేషన్ మేఫ్‌ు దూత్' అని ముద్దుపేరు కూడా పెట్టారు. (సంస్కృత కవి కాళీదాసు రాసిన 'మేఘ సందేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పేరు పెట్టారని ఒక మిలిటరీ పరిశీలకుడు రాశాడు.) భారత సైనికులు చేరుకున్న సియాచిన్లోని ఆ స్థావరానికి 'కుమార్ స్థావరం' అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ సమాచారాన్ని సేకరించి చక చకా ఆ ప్రయత్నాలు చేసిన సైనికాధికారి పేరు కల్నల్ నరేంద్ర కుమార్. ఈయన ఇటీవలే తన 87వ యేట పోయాడని వార్తలు వచ్చాయి.
భారత సైన్యం ఆ ప్రాంతానికి 1984 ఏప్రిల్‌లో చేరి ఆ మంచుపర్వత ప్రాంతంలో తన స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంది. పాకిస్థాన్ సైన్యం కూడా వచ్చి, భారత సైన్యంతో తలపడి తనూ కొన్ని స్థావరాల్ని ఏర్పర్చుకుంది. అప్పటినించీ రెండు దేశాల సైన్యాల మధ్యా సాయుధ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ 1987లో భారత సైన్యం 'ఆపరేషన్ రాజీవ్' పేరుతోనూ, పాకిస్థాన్ సైన్యం 'ఆపరేషన్ ఖైద్' పేరుతోనూ, పరస్పరం యుద్ధాలు చేసుకున్నాయి. ఒకసారి పాకిస్థాన్ అధీనంలో ఉన్న కొన్ని స్థావరాల్ని భారత సైన్యం ఆక్రమించేసరికి, అప్పట్లో పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న బేనజీర్ భుట్టో పాకిస్థానీ సైనికాధికారుల్ని ఉద్దేశించి... 'మీరు సరిగా యుద్ధం చెయ్యలేకపోతే గాజులు తోడుక్కోండి' అందట. (నెట్లో కనపడ్డ బేనజీర్ పెళ్ళినాటి ఫొటోల్లో ఆమె కుడిచేతికి కనీసం పాతిక గాజుల్ని లెక్కపెట్టవచ్చు!) ఆ తర్వాత రక రకాల పేర్లు పెట్టుకుని 1992లోనూ, 1995లోనూ, 1999లోనూ రెండు దేశాలూ కొట్టుకున్నాయి. మొత్తం మీద భారత సైన్యాలదే పై చేయి అయినట్టు సమాచారం. దాదాపు వెయ్యి చదరపు మైళ్ళ ప్రాంతాన్ని పాకిస్థాన్ పోగొట్టుకుందని, జనరల్ ముషరఫ్ తన జ్ఞాపకాలలో రాసుకున్నాడట. సియాచిన్‌లో ఎక్కువ భాగం భారత సైన్యం చేతిలో ఉన్నా, పాకిస్థాన్ సైన్యం చేతిలో ఉన్న ప్రాంతం వల్ల పాకిస్థాన్‌కి సైనికపరంగా కొన్ని అనుకూలతలు ఉన్నాయని మిలిటరీ పరిశీలకుల అభిప్రాయం. భారత సైన్యం కదలికల్నీ, ఎయిర్ ఫోర్సు కదలికల్నీ పాకిస్థాన్ తన అధీనంలో ఉన్న చోటునించే ముందుగానే కనిపెట్టగలదట. అలా కనిపెట్టడం కోసం రాడార్లనీ ఇతర ఏర్పాట్లనీ పాకిస్థాన్ చేసుకుందట!
ఒక అమెరికా పరిశీలకుడైతే సియాచిన్ మంచుకొండల కోసం భారత్, పాకిస్థాన్‌లు చేసుకునే యుద్ధం ఎలాంటిదంటే... 'ఒక దువ్వెన కోసం, ఇద్దరు బట్ట తలల వాళ్ళు వేసుకునే పోట్లాట లాంటిది' అన్నాడట! ఇంతకీ ఆ అవసరంలేని దువ్వెన కోసం భారతదేశం 300మిలియన్ డాలర్లూ, పాకిస్థాన్ 200 మిలియన్ డాలర్లూ ఖర్చు పెట్టాయని ఒక అంచనా. ఈ సొమ్ము అంతా రెండు దేశాల శ్రామిక ప్రజల అదనపు విలువలో నించే అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
ఇప్పటికీ భారత్, పాకిస్థాన్ సైనికులు సియాచిన్ మంచుకొండల్లో తమ దేశాల పాలకవర్గాల కోసం పరస్పరం శతృవుల్లా నిలబడి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. 'విలువైన' అని ఎందుకు అనాలో ఎంగెల్సు సైనికుల గురించి రాసిన మాటలు చూస్తే తెలుస్తుంది.
యుద్ధాల గురించి ఎంగెల్స్ మాటలు
''ప్రస్తుత సమాజం విసర్జించలేనట్టి అత్యంత వ్యయపూరితమ్కెన సంస్థలలో ఒకటి యేమిటంటే... స్థాయీ సైన్యాలు స్టాండింగ్ ఆర్మీ ఎప్పుడూ సిద్ధంగా ఉండే సైన్యం. ఆయుధాలు ఉపయోగించడంలో ట్రయినింగ్తో నేల మీదా, గాలిలోనూ, నీటి మీదా, ఎప్పుడు యుద్ధం వచ్చినా సిద్ధంగా ఉండే లక్షలాది అనుత్పాదక కార్మికులే సైనికులు. వీళ్ళ పని ప్రధానంగా యుద్ధాల్లో పాల్గొనడమే.) ఈ స్తాయీ సైన్యాల ద్వారా ప్రజానీకంలో అత్యంత చురుకైన ఉపయోగకరమైన మానవుల భాగం జాతికి నష్టమ్కెపోతుంది. ఆ భాగం నిరుద్పాదకమయింది గనుక, దానిని జాతే పోషించవలసి వస్తుంది. స్థాయీ సైన్యానికి యెంత ఖర్చయ్యేదీ మనం (జర్మనీ) బడ్జెట్‌ద్వారా మనకు తెలుస్తున్నది. యేడాదికి ఇరవై నాలుగు మిలియన్ల డబ్బూ, (ఇదంతా 1845 నాటి లెక్క!) బాగా కండలు గలిగిన రెండు లక్షలమంది యువకులూ, ఉత్పత్తి నుండి ఉపసంహరింపబడడమూ! స్థాయీ సైన్యం ఉండాలని కమ్యూనిస్టు సమాజంలో అయితే యెవరికీ ఆలోచన రాదు.
అయినా సైన్యం దేని కోసం? దేశంలో శాంతిని కాపాడడానికా? ఆంతరంగిక శాంతికి భంగం కలిగించాలని యెవరికీ ఆలోచన రాదు. 'విప్లవాల' భయం సహజంగానే వర్గాల ప్రయోజనాల వైరుధ్యం యొక్క ఫలితం మాత్రమే. ప్రయోజనాలు సమవసించే చోట అలాంటి భయాల వూసే వుండదు.
దురాక్రమణ యుద్ధాల కొరకా? కానీ కమ్యూనిస్టు సమాజానికి, ఇతర దేశాల మీద దురాక్రమణ యుద్ధం చేయాలనే ఊహ యెలా ఎందుకు రాగలదు? యుద్ధంలో తన దేశంలో జనమూ పెట్టుబడీ నష్టం కావడం మాత్రమే జరుగుతుందనీ, మహా అయితే తనకు వచ్చే లాభం విధేయంగా ఉండని రెండు రాష్ట్రాలనీ, తత్పర్యవసానంగా అవి సామాజిక శాంతికి భంగకరంగా ఉంటాయనీ, బాగా యెరిగిన కమ్యూనిస్టు సమాజానికి దురాక్రమణ ఊహ యెలా రాగలదు?
ఆత్మరక్షణ యుద్ధం కొరకా? దాని కొరకు స్థాయీ సైన్యం అవసరం లేదు. యెందుకంటే, సమాజంలోని ఆరోగ్యవంతులైన ప్రతి సభ్యునికీ - ప్రతీ స్త్రీకీ, పురుషుడికీ- అతడి యితర వృత్తులకు తోడుగా, దేశ రక్షణకు అవసరమైన స్థాయిలో బారకాసు పద్ధతిలో వేరే పనులు లేకుండా ఎప్పుడూ సైనిక స్థావరాలలోనే ఉండే పద్ధతిలో కాక, నిజమైన పద్ధతిలో ఆయుధాలు ఉపయోగించే తర్ఫీదు యివ్వడం సులభం.
ఇక, మిత్రులారా ఈ విషయం ఆలోచించండి... కమ్యూనిస్టు సమాజానికి యుద్ధంతో అవసరం వస్తే - యేమైనప్పటికీ అది కమ్యూనిస్టు వ్యతిరేక జాతులతో మాత్రమే జరగగలదు - ఆ సమాజంలోని సభ్యునికి నిజమైన మాతృదేశం ఉంటుంది. రక్షించు కోడానికి నిజమైన యిల్లూ వాకిలీ ఉంటాయి. అందువలన అతడు ఉత్సాహంతో, ఓర్పుతో, ధైర్యంతో పోరాడుతాడు, ఆ గుణాలముందు యాంత్రికంగా తర్ఫీదు పొందిన ఆధునిక సైన్యపు సైనికులు పొట్టులాగ చెదరిపోతారు. 1792 నుండి 1799 వరకు విప్లవ సైన్యాల ఉత్సాహం సాధించిన అద్భుతాలను పరిగణించండి.... ఆ సైన్యాలు ఒక భ్రమ కోసం, మాతృదేశ భ్రాంతి కోసం మాత్రమే పోరాడాయి. అది పరిగణిస్తే, భ్రమ కోసం కాక ప్రత్యక్ష వాస్తవం కోసం పోరాడే సైన్యం యెంత శక్తివంతంగా వుండేదీ మీరు గుర్తించక తప్పదు. ఈ అపారమైన శ్రమశక్తి రాసుల, సైన్యాల మూలంగా నాగరిక జాతులకు నష్టమై పోతున్నట్టివి కమ్యూనిస్టు సమాజంలో తిరిగి శ్రమ చేస్తాయి. అప్పటిదాకా కేవలం సైనికులుగా ఉన్న లక్షల మంది ఉత్పత్తి పనులలోకి వస్తారు. అవి తాము ఖర్చుచేసేటంత ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, తమ పోషణకు అవసరమ్కెన వాటికంటే ఎంతో యెక్కువ సరుకులను సామాజిక గిడ్డంగులకు సరఫరా చేయగలుగుతాయి.'' ళిఇక్కడ రద్దు ఏదీ? భ్రమలతో జరిగే యుద్ధాల రద్ధు! సైన్యాల రద్దు! (ఎల్బెర్ ఫెల్డ్ ఉపన్యాసాలు,1845. కమ్యూనిస్టు సమాజం గురించి, పేజీ: 13)
ఎంగెల్స్ మాటల్ని బట్టి మనకు అర్ధం అయ్యేదేమిటంటే... ప్రపంచంలోని శ్రామిక ప్రజలందరూ యుద్ధాల వల్ల జరిగే నష్టాలు ఏమిటో గ్రహించి యుద్ధాలకు వ్యతిరేకమైన చైతన్యాన్ని పొంది, వాళ్ళ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. (అయిపోయింది)
- రంగనాయకమ్మ